రేవంత్ అంటే ఏపీ ప్రజలకి ఎందుకంత లవ్వు ?

Written by

సరిగ్గా తొమ్మిదేళ్లక్రితం. హర్యానా కురుక్షేత్రలో ప్రిన్స్ అనే ఐదేళ్ల పిల్లాడు బోరు బావిలో పడిపోయాడు. 60 అడుగుల లోతు. 36గంటల పోరాటం.దేశమంతా ఉత్కంఠతో చూసింది. ప్రిన్స్ పైకి రావాలి. బతకాలి అని. జనం ఎంత కనెక్ట్ అయ్యారంటే… ప్రిన్స్ బతికి బైటపడగానే అమాంతం కోటీశ్వరుడైపోయాడు జనం చేసిన సాయంతో ! ఎందుకని ? ఎమోషన్. ప్రిన్స్ అంటే అందరిలాగే ఓ పిల్లాడు. కానీ అనుకోని ప్రమాదంలో పడ్డాడు. అందులో… తల్లిదండ్రుల నిర్లక్ష్యం ఉండొచ్చు. చెప్పినా.. ప్రిన్సే మాట విని ఉండడు ! కానీ ఆ పిల్లాణ్ని పైకి తేవాలి… ఆదుకోవాలన్న స్మృహ మాత్రం దేశవ్యాప్తంగా సంచలనంలా వచ్చింది. ఆ తర్వాతే బోరుబావుల మీద సుప్రీం తీర్పు… దేశం కళ్లు తెరవడం అన్నీను.

రేవంత్ విషయంలోనూ ఇంతే ! రాజకీయానికి అతీతంగా జాతి గురించి ఆలోచిస్తే ఇదో ఎమోషన్ అంతే ! తెలంగాణలో ఏం జరిగితే మనకేంటి అనుకోదు ఏపీ ఎప్పటికీ ! ఎందుకంటే మన బంధువులు, స్నేహితులు … ఆప్తులు అందరూ ఆ పక్కనున్నారు. గీత గీసినంత మాత్రాన మనసులో ఫీలింగ్ చెరిగిపోదుగా ! ఇదే ఎదుటి వాళ్లకి ఆయుధం అవుతోంది ఏళ్లుగా. దోపిడీ గాళ్లు… మన సొమ్ము తింటున్నోళ్లు… బాగుపడతరా… వలస వాదులు, ఆంధ్రా కేడీలు.. ఇలా పేర్లు పెట్టి విషం కక్కుతూనే ఉన్నారు. అది వేరే విషయం. సాధిస్తున్నదేంటి ? ఒక్క పార్టీకీ లాభంతప్ప ! ప్రశ్నిస్తే ఆంధ్రా ఏజెంట్. కాల్మొక్కితే తెలంగాణ లెజండ్. ఇదో నినాదం అయ్యాక… ఒక్క వాయిస్ రైజ్ అవుతోంది. నిలదీస్తోంది..వెంటాడుతోంది. ఆ గొంతే రేవంత్. అందుకే ఆంధ్రా కి అంత ఇంట్రెస్ట్.

చలిమంటల మీద వంటలు చేసి… కూడు పెడతారనుకోవడం ఎంత అమాయకత్వమో… కేసీఆర్ తీరుతో తెలంగాణకి మేలు జరుగుతుంది అనే ఫీలింగ్ కూడా అంతే ! ఈ విషయం అర్థంకావడానికి ఇంకాస్త సమయం పడుతుంది. ముందుగా లేచే గొంతు లీడర్ అవుతుంది. ఇబ్బందులు కూడా తెస్తుంది. రేవంత్ విషయంలో జరుగుతున్నదంతా ఇదే ! కేసు…ఎందుకు జరిగింది…ఏంటి ? ఇదంతా సాంకేతిక పరమైన వ్యవహారం. ఓ ఎమ్మెల్యేకి డబ్బు ఇవ్వాలనుకోవడం మహానేరం. కచ్చితంగా ! అలాంటిది పాతిక మంది ఎమ్మెల్యేలకిస్తే ఎంత ఘోరం ? ఓ నలభై యాభై మంది ఎమ్మల్యేలతో మంతనాలు చేసి… దీక్షలంటూ స్టేజ్ డ్రామాలు నడపడం ఎంత దగుల్బాజీతనం ! అన్నీ ఉంటాయ్. చర్చ అటు వెళ్తే రేవంత్ – ఆంధ్రా లింక్ కూడా డైవర్ట్ అవుతుంది. రేవంత్ విషయంలో ఏపీ ఎందుకు కనెక్ట్ అవుతోందనేందుకు చాలా సమాధానాలున్నాయ్.

ఏపీ జనం ఎప్పుడూ ఎవరినీ ద్వేషించలేరు. ద్వేషించరు. నిజామాబాద్ అయినా బళ్లారైనా ఆఖరికి అట్లాంటా అయినా… మనం స్నేహితులం అందరికీ ! మన పని మనం చేసుకుపోతాం. అది బై బర్త్ వచ్చిన వర్క్ హాలిక్ నేచర్. దాన్ని కూడా దుర్మార్గంగా చిత్రీకరించి మూలల మీద దెబ్బకొట్టే ప్రయత్నం చేసింది కేసీఆర్ లాంటి పిడికెడుమంది నాయకులు. మన ఉద్యోగాలు కొట్టేస్తున్నారు. మనకంచంలో బువ్వ తింటున్నారంటూ పబ్బం గడుపుకున్నారు ఇంత వరకూ ! రెండు కళ్లన్న చంద్రబాబు కూడా చెప్పని వాస్తవాలు.. అడగని ప్రశ్నలు రేవంత్ నోటి వెంట వస్తున్నాయ్. అందుకే సంబరం. అందుకే సపోర్ట్. నేను 3 రాష్ట్రాల్లో పాపులర్. రేవంత్ సరదాగా కొట్టే డైలాగ్ ఇది. ఒకటి తెలంగాణ, రెండు ఏపీ, మూడు కర్ణాటక. కొడంగల్ కర్ణాటక బోర్డర్ లో ఉంటుంది మరి ! ఇపుడు ఆ పాపులారిటీ గ్రాఫ్ మరింత పెరుగుతుందంటే… కాదు అనేందుకు కారణం లేదు.

కేసీఆర్ ఒంటి చేత్తో బుల్డోజర్ డ్రైవ్ చేస్తూ తెలుగు ప్రజల ఆశల సౌధాలు కూల్చేస్తున్న రోజులివి. ఇలాంటప్పుడు బ్రేకులు వేసేందుకు ఎవరో ఒకరు ముందుకు రావాలి. కాంగ్రెస్ ఎప్పుడూ ఆ పని చేయదు. కొరివితో చుట్టపీక అంటించుకునే రకం. బీజేపీకి అందరూ చుట్టాలే ! కత్తి దూస్తున్న ఒకే ఒక్కడు రేవంత్. అందుకే ఇపుడు రేవంత్ మాట్లాడుతున్న తీరు… అడుగుతున్న ప్రశ్నలు అన్నీ ఇపుడు తెలుగు జాతికి చేస్తున్న ట్రీట్ మెంట్. ఎస్. బీటలు వారిన సంబంధాలకి రాస్తున్న ఆయింట్ మెంట్ రేవంత్ నడుస్తున్న దారి. ఇప్పటికీ ఆంధ్రోళ్లు దోస్తున్నరు మనని అంటూ జనం దృష్టి మళ్లించి పక్క దారిలో పండగ చేసుకుంటున్న నాయకుల్ని నిలేయడం… దా… తేల్చుకుందాం అంటూ కాలు దువ్వడం ఓ రకంగా చారిత్రక అవసరం. అడిగే నాథుడు లేకపోతే ప్రశ్నించే పరిస్థితి లేకపోతే ఏమైపోతాం ! అందరూ జగన్ లా దొంగచాటు కాల్పులు జరిపేందుకు కుమ్మక్కు అయితేనో..చంద్రబాబులా ఎందుకులే సర్దుకుపోదామని చప్పగా వెళ్లిపోతేనో సరిపోదు కదా ? ఇదే ఇపుడు భావోద్వేగాన్ని మండిస్తున్న ఇంథనం.

రేవంత్ ను చూసి ఆంధ్రా మాత్రమే సంతోషపడుతోందా ? రేవంత్ ఆంధ్రాకి మాత్రమే ఇష్టుడా ? కానే కాదు. అందరి బంధువు. తెలంగాణ లోనే విభజన తెచ్చి… కొన్ని వర్గాల్ని తొక్కిపట్టి… విద్యావంతులు నోరున్న వాళ్లని డిఫెన్స్ లోకి నెట్టి… ఊరేగుతున్న రాజకీయానికి కొరడా కొడంగల్ ఎమ్మెల్యే.
చారిత్రక పోరాటానికి సారధి రేవంత్. ఇక్కడ మాట్లాడుతున్నది కేసుల గురించి కాదు… జాతి ప్రయోజనాల గురించి. ఇక్కడ వినిపిస్తున్నది ఏపీ వాయిస్ మాత్రమే కాదు తెలుగు గొంతుక.

హైద్రాబాద్ కి వీసా తీసుకెళ్లాల్సివస్తుందంటూ ఓసారి… ప్లకార్డులు ప్రదర్శించి మరోసారి… విడిపోతే ఏలుకుందాం అంటూ దొడ్డి దారి ఒప్పందం తో ఇంకోసారి… అటు తర్వాత ప్రత్యర్థితో కలిసి సొంత రాష్ట్రాన్ని తొక్కి అందలం ఎక్కేద్దామని ఇపుడు నడుపుతున్నారు గోతికాడ కేటుగాళ్లు. ఊరు పట్టనంత అవినీతి కేసులున్న నాయకుడికి అరవై పైచిలుకు సీట్లిచ్చి ఊరేగించే మనం… ఉచ్చులో పడిన మరో నాయకుణ్ని వేలెత్తి చూపించడం వింతగా ఉంటుంది. ఆలోచిస్తే ! అందుకే రేపటిని మనసులో పెట్టుకుంటే… తెలుగు జాతి కోసం హృదయంతో ఆలోచిస్తే పోరాటం ఇప్పుడు జరిగితీరాలి. అది రాజకీయంగా… సామాజికంగా ! తెలంగాణ కాదు తెలుగు జాతి కోరుకుంటున్నది ఇదే !

– అభి

Article Categories:
Anything Everything

Comments

Copy Protected by Chetan's WP-Copyprotect.
Menu Title