రధసప్తమి నాడు నిజరూపం లో దర్శనమిచ్చే అరసవిల్లి_సూర్యనారాయణస్వామి

Written by

ఆంధ్రప్రదేశ్ లో ఉన్న ప్రసిద్ధమైన పుణ్యక్షేత్రాలలో అరసవిల్లి సూర్యదేవాలయం ఒకటి.ఎంతో మహిమ కల అరసవిల్లి సూర్యనారాయణుడి విశేషాలను ఈ రధసప్తమి సందర్భం గా అందిస్తోంది మీ కోస్తా లైఫ్.
శ్రీకాకుళం పట్టణానికి మూడు కిలోమీటర్ల దూరంలో ఉన్న అరసవిల్లి అనే గ్రామంలో ఈ అతి పురాతన సూర్యదేవాలయం ఉంది.భారతదేశం లో ఉన్న కొద్ది సూర్యదేవాలయాలలో ఇది ఒకటి.ఈ క్షేత్రం లో ఉన్న సూర్యనారాయణుడి విగ్రహ ప్రతిష్ట వెనుక ఒక కధ ప్రచారం లో ఉంది.

ఇక్కడ విగ్రహాన్ని ఆ దేవేంద్రుడే ప్రతిష్టించాడని చెప్తున్నవిశేషాలని ఒకసారి చూద్దాం.

నిజానికి అరసవిల్లి లో సూర్యనారాయణుడి దేవాలయానికి,ఇక్కడ దగ్గర లోని ఉమారుద్ర కోటేశ్వరస్వామి వారి దేవాలయానికి సంబంధం ఉంది.ఎలా అంటే!ఈ రుద్రకోటేశ్వరాలయం లో లింగ మూర్తిని బలరాముడు ప్రతిష్టించి,ఈ మూర్తిలో రుద్రకోటి గణము కనిపించడం వలన రుద్రకోటేశ్వరుడు అని నామకరణము కూడా చేసాడు.ఉమారుద్ర కోటేశ్వరస్వామి వారిని మహాశివరాత్రి రోజు దర్శించిన జన్మరాహిత్యం ఉండదని ఒక నమ్మకం కూడా ఉంది.

అయితే ఈ ప్రతిష్ట పూర్తి అయిన తరువాత దేవతలంతా శివుడ్ని దర్శించుకోవడానికి వెళ్ళారు,ఇంద్రుడు ఆలస్యంగా వెళ్ళేసరికి,నందీశ్వరుడు తర్వాత రమ్మని చెప్తే వినని ఇంద్రుడు,నందీశ్వరుడి తో గొడవకి దిగాడు.కోపం తో నందీశ్వరుడు,ఇంద్రుడిని దూరంగా విసిరేసాడు.అలా ఇంద్రుడు పడిన ప్రాంతం అరసవిల్లి లో ఇంద్ర పుష్కరిణిగా ఏర్పడింది.
ఇంద్రుడు,నందీశ్వరుడి ధాటికి సర్వశక్తులు కోల్పోయి పడిఉన్నసమయం లో అప్పుడే ఉదయిస్తున్న సూర్య భగవానుడు కనిపించేసరికి కాపాడమని ప్రార్ధించాడు.

అప్పుడు సూర్యుడు ప్రత్యక్షమై,నువ్వు పడిన చోట వజ్రాయుధంతో భూమిని పెకలించు అని చెప్పాడు,వెంటనే ఇంద్రుడు భూమిని త్రవ్వగా అక్కడ సూర్యభగవానుని విగ్రహం బయటపడింది.ఆ విగ్రహాన్ని తీసి ,ప్రతిష్టించి కొలిస్తే నీ శక్తి నీకు తిరిగి వస్తుందని సూర్యభగవానుడు చెప్పడం తో,అక్కడ మూర్తిని ప్రతిష్టించి పూజించి,తనశక్తులను తిరిగి పొందాడు దేవేంద్రుడు అని భక్తుల విశ్వాసం.

ఈ అరసవిల్లి ప్రాంతం 17 వ శతాబ్దంలో నిజాం నవాబు పాలన క్రిందికి వచ్చినప్పుడు,ఔరంగజేబు ద్వారా నియమించిన సుబేదార్ షేర్ మహమ్మద్ ఖాన్,ఈప్రాంతం లోని చాలా దేవాలయాలను ధ్వంసం చేసాడు ఇదే విషయాన్ని అదేదో గొప్ప పనిలా అతనే పర్షియన్ లిపిలో ఒక శిలాశాసనం ద్వారా ప్రకటించుకున్నాడు కూడా.

అలా నాశనం చేయబడిన అనేక దేవాలయాలలో అరసవిల్లి కూడా ఉంది.కానీ ఈ షేర్ మహమ్మద్ ఖాన్ కి,హిందువుల న్యాయశాస్త్రం గురుంచి వివరించడానికి నియమించబడిన పండితుడు సీతారామశాస్త్రి,అరసవిల్లి దేవాలయంపై జరగనున్న దాడిని గురించి ముందుగా తెలుసుకొని, స్వామి మూలవిరాట్టును పెకలించి అక్కడే ఉన్న ఒక బావిలో పడవేయించారు.
అలా బావిలో పడేసిన విగ్రహాన్ని తిరిగి 150 సంవత్సరాల తర్వాత ఎలమంచి పుల్లాజీ పంతులు అనే ఆయన ఆ బావిలోనుంచి ఆ విగ్రహాన్ని తీయించారని,ఆదిత్యవిష్ణుశర్మ,భానుశర్మవార్ల వంశస్తుల ద్వారా నిర్మించబడిన ఇప్పటి దేవాలయం లో తిరిగి విగ్రహాన్ని ప్రతిష్ఠించాడని కధనం ప్రచారం లో ఉంది.

ఈ దేవాలయం నిర్మాణం లో ఒక విశేషం ఉంది,సంవత్సరంలో రెండు సార్లు (ఉత్తరాయణం మరియు దక్షిణాయణంలో) అంటే దాదాపు మార్చి మరియు సెప్టెంబర్ నెలలలో తొమ్మిదో తారీకు నుండి పన్నెండో తారీకు మధ్యలో ఉదయం సమయం లో సూర్య కిరణాలు నేరుగా మూల విరాట్టును తాకుతాయి.

అన్ని హిందూ పర్వదినాలని సంప్రదాయబద్దంగా ఇక్కడ నిర్వహిస్తారు.ఉదయం ఆరుగంటల నుండి మధ్యాన్నం పన్నెండు వరకు తిరిగి సాయంత్రం మూడు గంటల నుండి రాత్రి ఎనిమిది వరకూ ఈ ఆలయం తెరచి ఉంటుంది.అరసవల్లి ఆలయంలో “రధసప్తమి” ని వైభవం గా జరుపుతారు,ఈరోజు భక్తులకు స్వామి నిజ రూప దర్శన భాగ్యం లభిస్తుంది.
ఆరోగ్య సమస్యలనుండి బయటపడడానికి సూర్యనారాయణ స్వామిని కొలిచేభక్తులు ఆయన పేరుమీదుగా ఆదిత్య హృదయాన్ని పఠిస్తారు.స్వామిని దర్శిస్తే శరీర ఆరోగ్య సమస్యలు,నేత్ర సంబంధవ్యాధులు దరికి చేరవని భక్తులు విశ్వసిస్తారు.వందల ఏళ్ళ చరిత్ర ఉన్న అరసవిల్లి సూర్యదేవాలయం ఎంతో మహిమాన్విత క్షేత్రం.

Article Categories:
Anything Everything
Copy Protected by Chetan's WP-Copyprotect.
Menu Title