యారాడ, రేవుపోలవరం బీచ్‌లు ఇకపై కళకళ

Written by

విశాఖ బీచ్‌లకు నూతన కళ సంతరించే దిశగా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. ఇప్పటికే విశాఖనగరంలోని బీచ్‌ల సుందరీకరణ, నూతన ప్రాజెక్టుల ఏర్పాటుకు పెద్ద ఎత్తున చర్యలు చేపట్టిన ప్రభుత్వం తాజాగా విశాఖనగరానికి చేరువలోని యారాడ, జిల్లాలోని రేవుపోలవరం బీచ్‌ల వద్ద మౌలిక సదుపాయాల కల్పనకు నిధులు విడుదల చేసింది. మొత్తంగా రాష్ట్రంలోని పర్యాటక ప్రాజెక్ట్‌ల వద్ద మౌలిక సదుపాయాల కల్పనకు 39.25 కోట్లు విడుదల చేసింది. ఇందులో భాగంగా రాష్ట్ర పర్యాటక శాఖ విశాఖ నగరం, జిల్లా లోని యారాడ, రేవుపోలవరం వద్దగల బీచ్‌ల వద్ద మౌలిక సౌకర్యాల కోసం మూడు కోట్లను మంజూరుచేసింది. రాష్ట్రంలోనే సుందరమైన బీచ్‌లు, కొండ కోనలు కలిగిన జిల్లాగా విశాఖకు ఇప్పటికే పేరుంది. విశాఖలో ఒకవైపు సముద్ర తీరం, మరోవైపు కొండ కలిగిన యారాడ ఇప్పటికే పర్యాటక కేంద్రంగా ఎంతో ప్రత్యేకత సంతరించుకుని ఉంది. ముఖ్యంగా పెద్దగా ఆటుపోట్లు లేని సముద్ర తీరంగా పేరుండడంతో, ఈ బీచ్‌లో పర్యాటకుల సందడి ఎంతో ఎక్కువగా ఉంటుంది.

విశాఖ నగరంలో ప్రత్యేక పిక్నిక్‌ స్పాట్‌గా కూడా యారాడకు గుర్తింపు ఉంది. విశాఖ నగరానికి 15 కిలో మీటర్ల దూరంలో కొండ వాలుకు ఆనుకొని యారాడ సముద్ర తీరం ఉంటుంది. గంగవరం, డాల్ఫిన్స్‌ నోస్‌కు మధ్యలో ఉన్న ఈ బీచ్‌ సుందరమైన దృశ్యాలకు ఆలవాలంగా గుర్తిస్తారు. ఈ బీచ్‌కు చేరుకోవాలంటే రోడ్డు మార్గంలో పోర్టు ఫ్లైఓవర్‌పైనుంచి సింధియా చేరుకొని వెళ్లాల్సివుంటుంది. ఇక సముద్ర మార్గంలో వెళ్లాలంటే బోట్‌పై ఫిషింగ్‌ హార్బర్‌ నుంచి హార్బర్‌ చానల్‌ను చేరుకొని, సాగరమాత దేవాలయం మీదుగా యారాడ చేరుకోవచ్చు. చాలా ఎత్తునుంచి కిందకు రోడ్డు మార్గంలో దిగాల్సివుండడంతో యారాడకు కొద్ది బస్సులు మాత్రమే అందుబాటులో ఉంటాయి. అదే విధంగా ఇక్కడకు బోట్‌ ద్వారా అన్ని సమయాల్లో వెళ్లే వీలుండదు.

పోర్టు కార్యకలాపాలను అనుసరించి ఈ మార్గం ద్వారా ప్రయాణం చేయాల్సివుంటుంది. ఇక ఈ ప్రాంతంలో మంచి రెస్టారెంట్‌లు, వాహన సదుపాయాలు, కాటేజిలు వంటివి ఏర్పాటుచేస్తే పర్యాటకులకు ఎంతో సౌకర్యంగా ఉంటుంది. ఇక విశాఖ జిల్లాలోని ఎస్‌.రాయవరం మండలంలో ఉన్న రేవుపోలవరం ఎంతో ఆకర్షణీయమైన సముద్రతీరం. సముద్ర మట్టానికి 26 మీటర్ల ఎత్తులో ఉన్న ఇక్కడి బీచ్‌ పర్యాటకులకు మంచి సందర్శనా స్ధలమే కాకుండా, జిల్లా వాసులకు మంచి పిక్‌నిక్‌ స్పాట్‌గా ఉంటుంది. విశాఖపట్నం నుంచి 66 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ బీచ్‌కు నేరుగా రోడ్డు మార్గంలో వెళ్లవచ్చు. ఈ బీచ్‌ మరోవైపు తూర్పు గోదావరి జిల్లా సరిహద్దుకు కూడా చేరువలో ఉండడంతో ఇక్కడి హంసవరం రైల్వే స్టేషన్‌ నుంచైనా చేరుకునే అవకాశం ఉంటుంది. రేవుపోలవరంబీచ్‌ ఎన్నో ప్రకృతి సోయగాలకు ఆలవాలమైనప్పటికీ, ఇక్కడ రెస్టారెంట్లు, రిసార్ట్‌లు వంటివి ఇంకా ఏర్పాటు కావాల్సివుంది. ఈ రెండు బీచ్‌ల్లో మౌలిక సదుపాయాలు మెరుగుపరిస్తే, విశాఖ జిల్లా పర్యాటక ఆదాయం కూడా మరింతగా పెరిగే అవకాశం ఉంటుంది.

Article Tags:
·
Article Categories:
My City · Vizag
Copy Protected by Chetan's WP-Copyprotect.
Menu Title