దిమ్మదిరిగే బాహుబలికి దిష్టి పిడత రివ్యూలా ?

Written by
baahubali-

చ్ఛ.. అంత అందరమైన హీరోయిన్ ని అనవసరంగా చంపేశారు..టైటానిక్ ని ఓ చేత్తో.. హీరోయిన్ని ఇంకో చెత్తో పట్టుకొని హీరో ఒడ్డుకొచ్చినట్టు చూపించాల్సింది ! అవతార్ తోక కత్తిరించి… కాస్త హైటు తగ్గించి రెండు మూడు రొమాంటిక్ సీన్లు పెడితే అదిరిపోయేది. పర్షియన్ యుద్ధం సగంలో వదిలేశాడు. గుర్రమెక్కి లీడ్ కేరక్టర్ ఆ నౌక మీంచి ఈ నౌక మీదకి దూకింది సరే.. అలా పూర్తిఅయ్యీ కాకుండా ఆపేశాడు త్రీ హండ్రెడ్ పార్ట్ టూ. అయినా యాక్షన్ సీన్లన్నీ తర్వాత పార్ట్ కోసం ఆపేసినట్టున్నాడు. ఇంకా బాగా చేయొచ్చు. – హాలీవుడ్ బ్లాక్ బస్టర్స్ ని రివ్యూ చేసే ఛాన్స్ ఇస్తే మనోళ్లు ఇలాగే రెచ్చిపోతారు. వాళ్ల రాత బావుండి వీళ్లు ఇక్కడుండిపోయారు కానీ లేదంటే ఈ రోత అక్కడికి కూడా పాకేసుండేది !

బాహుబలి రివ్యూలు చూస్తే ఓమాట గుర్తొస్తోంది. ఇదేం చందమామ వంకరటింకరగా ఉందన్నాట్ట ఒకడు. చందమామ వంకరగానే ఉంటుంది. అదే దాని అందం. వంకపెట్టలేం. అందుకే నెల వంక అన్నారేమో కూడా ! అయినా ఏదో ఒకటి అననిదే తెల్లారని పొద్దుపోని వాళ్లకి ఇలాంటి వంకరమాటలు కామన్ గా వచ్చేస్తాయ్. బాహుబలి తెలుగు రివ్యూలు చూస్తే ఇలాంటి ఫీలింగే వస్తోంది. కపుడులో కెలికినంత వికారమేస్తోంది ఒక్కో రివ్యూ చూస్తుంటే! ఇలా తీస్తే బావుండేది.. అలా చేసుంటే ఇంకా బాగా వచ్చేది అంటూ సూచనలు చేసేవాళ్లు కొందరు. చెలరేగిపోయేవాళ్లు ఇంకొందరు.

రివ్యూలా… రింగ్ రింబోలా…

రివ్యూలో,ఊసుపోని కామెంట్లో ఏ పేరు పెట్టుకున్నా వాటిలో కొన్ని మైండ్ బ్లోయింగ్ కామెంట్లు కనిపించాయ్. అవిచూస్తే ఆశ్చర్యమేసింది. అదేదో సినిమాలో డైలాగ్ గుర్తొచ్చింది. మేంమిమ్మల్ని ఎక్కడికో తీసుకెళ్లాలనుకుంటాం. మీరు అక్కడికి రారు ఇక్కడే ఉంటారు – అని ! ఆడియెన్స్ స్థాయి పెంచే సినిమాలు అప్పుడప్పుడూ వస్తాయ్. అవతార్ లాగా ! అదేంటి నీలంగా ఉన్నారంతా…? అయినా సుబ్బరంగా మనుషుల్ని మషులుగా చూపిస్తే బావుండేది ఎందుకీ మోషన్ కేప్చర్ అంటే ఏం చెబుతాం ? ఇలాగే ఉన్నాయ్… బాహుబలి విషయంలో కూడా కొందరి తెలివితేటలు.

సాగదీత ఎక్కువైంది…కామెడీ లేదు… సెంటిమెంట్ ఇంకా పండించి ఉంటే బావుండేది… పాటలు ఎక్కేలా లేవు… అబ్రాప్ట్ గా ఎండ్ అయినట్టుంది.. చెప్పుకుంటూ పోతే చాంతాడవుతుందిక్కడ ! ఇలాంటి మాటలు మాట్లాడేముందు రాసే ముందు ఏం సినిమా చూస్తున్నాం… ఇంతకు ముందు ఏం చూశాం… ఎక్కడ తీశారన్న విషయాలు దృష్టిలో పెట్టుకోవాలి. ఇవే స్థలకాల పరిణామాలు. ఎంతసేపూ పంచ్ డైలాగులు, మూస స్టోరీ లైన్ లు సెంటిమెంట్ని క్యాష్ చేసుకునే కథలు. తెలుగులో తప్ప ఇంకెక్కడా కనిపించదనిపించే హీరోయిజం. వీటికే ఎడిక్ట్ అయిపోతే ఇంకెప్పుడు ఎదగాలి ?

రివ్యూలపై ఓ వ్యూ…

పిజ్జాలో నంజుకోడానికి ఆవకాయ్ ఉంటే అదిరిపోయేది. బర్గర్ లోకి పెరుగు చట్నీ మర్చిపోయారు. పాస్తాలో పెసరపప్పు ఉడకబెట్టి కలపాల్సింది. ఇంకా టేస్ట్ వచ్చేది అంటే వెంటనే అర్థమైపోతుంది మనకి. పిజ్జా అంటే తెలీదని. బర్గర్ ఎప్పుడూ టేస్ట్చేచేయలేదని…పాస్తా మన నాస్తాలోకి కొచ్చి ఎన్నాళ్లో కాలేదని ! బాహుబలి లాంటి సినిమాలో అసలు పాటలు పెట్టడమే ఓ పెద్ద లిమిటేషన్. హాలీవుడ్ రేంజ్ లో సినిమా తీయాలనుకున్నాం… అలాగని పాటలు పెట్టకపోతే సాహసం అవుతుందేమోనన్న సందేహంలో తప్పనిసరైపెట్టిన పాటలవి. ఇలాంటి సినిమాలకి అసలు ప్రాణం బ్యాక్ గ్రౌండ్ స్కోర్. అదిసరిగ్గా ఉంటే స్కోర్ చేసినట్టే. ఆ విషయం వదిలేసి పాటల గురించి పంచాయతీ పెడతారు. పంచ్ డైలాగులు కావాలంటూ చికెన్ షాపు ముందుకొచ్చి తొడగొట్టాలంటే ఎప్పుడూ అయ్యేపనేనా ? అబ్రాప్ట్ గా ముగిసిందంటారు ఇంకొందరు. క్లైమాక్స్ అలా లేకపోతే.. మరి ఇంకెలా ఉంటుంది. ఫస్ట్ పార్ట్ క్లైమాక్స్ చూపించేసి… సెకండ్ పార్ట్ ఫ్రెష్ గా మొదలు పెడతారా మళ్లీ ? ఇంకొందరైతే అద్భుతాలన్నీ రెండో పార్ట్ లో పెట్టాలనుకొని దెబ్బతిన్నారంటూ దెప్పిపొడుస్తారు. అసలు అద్భుతాలు రెండో పార్ట్ లోనే ఉన్నాయో లేదో తెలియాలి అంటే ముందు అద్భుతాలు ఎలా ఉంటాయో మనకి తెలియాలి. అదే తెలిస్తే ఫస్ట్ పార్ట్ లో అద్భుతాలు లేవన్నట్టుగా మాట్లాడం కదా ! ఇవన్నీ కాలక్షేపం కోసం చేసే అరుగు మీద పంచాయతీల్లా కనిపిస్తాయ్. టైంపాస్ కావాలి. ఏదో ఒకటి మాట్లాడాలి. నెగెటివ్ కామెంట్స్ చేసి హీరోలైపోవాలనుకునే పిచ్చి ప్రేలాపనలు ఇవి.

సినిమా చూడ్డం నేర్చుకుందామా ?

30%కామెడీ ట్రాక్…20% సెంటిమెంట్… 20% రొమాన్స్… హఠాత్తుగా లాకులెత్తేసినట్టు వచ్చేసే పాటలు… అడ్డూఅదుపూలేని పంచ్ డైలాగ్ లు. ఇలా కొలతలు తీసుకొని… కూడికలు వేసుకొని వండితే అది కిచిడి అవుతుంది కానీ బాహుబలి ఎందుకవుతుంది బ్రదరూ ? కామెడీయే కావాలంటే పక్కా తెలుగు సినిమా ఏదైనా చూసుకుందాం… సెంటిమెంట్ కావాలంటే సీరియళ్లలో స్టాక్ పెట్టుకునేంత దొరుకుతోంది ఫాలో అవుదాం ! నేల బారుగా ఉన్న మనం తలెత్తి చూసే అవకాశం ఇచ్చే సినిమాలు నూటికో కోటికో వస్తాయ్. వచ్చినపుడు అవకాశం అందుకుందాం. వాటి స్థాయికి పెరిగేందుకు ప్రయత్నిస్తే మంచిది. వాటిని మన రేంజ్ కి లాగేసి నోటికొచ్చినట్టు మాట్లాడతాం అంటే మన అమయాకత్వమే బైటపడుతుందని తెలుసుకోవాలి. పెసరట్టు సినిమాలు తీసినోళ్లు…ఉలవచారులో ఇంగువపోపు పెట్టాలనేవాళ్లు కామెంట్లు చేస్తే..అవి ఏ హిందీ ఇంగ్లీష్ మీడియాకో అర్థమైతే పోయేది మన పరువే. బ్రహ్మాండమైన సినిమా తీస్తే… చూడ్డం చేతగాదు వీళ్లకి అంటే సిగ్గుపోయేది మనదే ! ఓ పక్క ప్రపంచం ఆశ్చర్యపోతోంది. బీబీసీ స్పెషల్ స్టోరీలు వేస్తోంది ఇండియన్ వండర్ అని. తెలుగు సినిమా ఈ రేంజ్ లో ఉంటుందా అని హాలీవుడ్ బుగ్గలు నొక్కుకుంటోంది. బాలీవుడ్ అసూయతో కుళ్లుకుంటోంది. ఇలాంటప్పుడు పండగ చేసుకోవాలి మనం. సంబరపడాలి. అది వదిలేసి లేని కంతలకి అతుకులు వేస్తాం అంటే అంతకు మించిన శాడిజం మరోటి లేదు.

అంటే అన్నారు అంటారు గానీ…

బావున్నాయని చెప్పినప్పుడు మెచ్చుకోరు. బాగాలేదంటే ఓర్చుకోలేరంటూ కొందరు రివ్యూగాళ్లు (సారీ… కడుపుమండి గౌరవం తగ్గిందేమో కాస్త) కౌంటర్లు వేస్తారు. ఇవన్నీ స్టాక్ డైలాగులు. అయినా అద్భుతం జరుగుతున్నప్పుడు కొంతమందే గుర్తించగలుగుతారు. జరిగిపోయాక ఇక మన గుర్తింపు, వర్తింపు అవసరం లేదు. ఈ రివ్యూలు కూడా అలాంటివే ! ఇలాంటి వాటికే ఎఫెక్ట్ ఉంటే… ఇంత ప్రభంజనం వచ్చేసిి కాదు కచ్చితంగా !

ఫైనల్ గా ఒక్కమాట… సినిమాల్లో పుట్టి పెరిగాం… సినిమా తిని, సినిమా పీల్చి బతుకుతాం అని చెప్పుకునే మనకి ఇపుడు తళతళలాడే ఉతుకు తప్పనిసరి అనిపిస్తోంది. ఇది రాజమౌళి కోసమో… బాహుబలి కోసమో కాదు. తెలివికి సలహా అక్కర్లేదు… టాలెంట్ పొగడ్త కోరుకోదు – ఇదీ సినిమా డైలాగే ! ఇదంతా చెప్తున్నది మనకోసమే. మన తెలివితేటలు ఒలకబోసుకోవడం కోసం… అద్భుతాన్ని అరకొరగా చిత్రీకరించే ప్రయత్నం చేయకండి. మన చూపు సరిగా లేకపోతే… మనకి అవగాహన లేకపోతే ప్రపంచానిది కాదు తప్పు. అతితెలివికి పోయి ఆకాశం మీద ఉమ్మేద్దామనుకుంటే ఆ తర్వాత ఏం అవుతుందో తెలుసుగా ! చెత్త రివ్యూలు రాసినోళ్లు వెర్రిపప్పలని ప్రూవ్ చేస్తూ బాహుబలి వందల కోట్ల దండయాత్ర చేస్తున్నాడు. కళ్లుతెరిచి చూడండి !

– అభి

Article Categories:
Entertainment

Comments

Copy Protected by Chetan's WP-Copyprotect.
Menu Title