గుంటూరు లో కూరలోంచి కోడి లేచి వచ్చింది !

Written by

ఓ మనిషి సాయంత్రం అయితే చాలు కావిడి వేసుకొని ఓ పక్కన గులక రాళ్లు… మరోపక్కన పాత గుడ్డలు వేసుకొని వీధుల్లో తిరుగుతుండేవాడు. తనలో తాను మాట్లాడుకునేవాడు. పలకరించేవాళ్లు లేరు. పట్టించుకునేవాళ్లూ లేరు అప్పటికి ! ఓ కుక్క… ఓ మేక… ఓ కోడి మాత్రం ఆయన్ను అనుసరిస్తూ ఉండేవి. కొన్నాళ్లు తిరుగుతూ తిరుగుతూ ఉన్నాక… ఊళ్లో అందరూ మాట్లాడుకోవడం మొదలు పెట్టారు ఆయన గురించి ! ఎందుకిలా తిరుగుతున్నాడు… అంటూ ఎవరికి తోచింది వాళ్లు చెప్పుకున్నారు కానీ, ఎవరికీ తెలియదు ఆయన ఎవరో ఏంటో ! పగలంతా చెట్టుకింద సేదతీరడం.. సాయంత్రానికి వీధుల్లో కలియతిరగడం ఆయన దినచర్య అయిపోయింది. ఓసారి… ఆయన వెంట తిరిగే కోడిని ఆ ఊరివాళ్లు కొందరు పట్టి కోసి… కూర వండేశారు. అప్పుడే ఓ అద్భుతం జరిగింది.

వీధుల్లో తిరిగే వేళకి వెంట కోడి రాలేదు. కొకొరొక్కో… అంటూ ఆయన పిలిచిడంతే ! కూర గిన్నెలోంచి కోడి లేచి నడిచొచ్చింది. అది చూసి… ఆ ఊరు మొత్తం ఆశ్చర్యపోయింది.

నీళ్లతో దీపాలు వెలిగించడం… స్పర్శతో పాపాలు తొలగించడం లాంటివన్నీఅప్పటికి ఇంకా చూడలేదు ఎక్కడా ! అందుకే ఆశ్చర్యం ! ఎక్కడో కథల్లో చదివినట్టు… పుణాల్లో చెప్పినట్టు ఏంటీ వింత ? అని నిశ్చేష్టపోయారు ఆ మనిషిని ఓ అవదూతగా భావించారు. కొలిచారు. దేవుడంటూ నెత్తినపెట్టుకున్నారు. ఇది ఇప్పటి గుంటూరుకి కూతవేటు దూరంలో జరిగిన యదార్ధ గాథ. కాలే మస్తాన్ షా వలియా దర్గా వాస్తవ కథ.

భక్తితో పిలిస్తే మస్తాన్ షా కూడా… కోడి లేచివచ్చినట్టే సమాధి నుంచి కరుణిస్తాడని కోరిన కోరికలు తీరుస్తాడని చాలామంది నమ్మకం. అందుకే గుంటూరు చుట్టుపక్కల చాలా మందికి మస్తానయ్య, మస్తానమ్మ అని పేర్లు పెట్టుకుంటారు. ఇప్పటికే షా వలియా దర్గాకి ఇక్కడ హిందువులే ధర్మకర్తలు. ఏటా జరిగే ఉరుసు నిర్వహించేది కూడా హిందువులే ! చుట్టుపక్కల జిల్లాల నుంచి భారీగా భక్తులొచ్చే ఈ ఉరుసులో… సందల్ గుర్రం పేరుతో ఊరేగింపు చేస్తారు. ఆ గుర్రం మస్తానయ్య ప్రతిరూపమని విశ్వాసం. ఊరేగింపులో ధర్మకర్త ముందు నడుస్తూ చందనాన్ని భక్తులకు పంచుతారు. మస్తానయ్య వాడిన కుర్చీ కన్నావారి తోటలో ఇప్పటికీ ఉంటుంది. అక్కడి నుంచి వేడుక మొదలై… సంగడి కుంటలో ఆయన పడుకున్న మంచం వరకూ సాగుతుంది. గుంటూరు మస్తాన్ ల వెనక ఇంత కథ ఉందన్నమాట. నూట పాతికేళ్ల కిందటే హిందూ ముస్లిం సంప్రదాయానికి మన గుంటూరు పునాదులు వేసిందన్నమాట అనిపిస్తుంది షా వలియా గాధ వింటుంటే !

Article Categories:
More
Copy Protected by Chetan's WP-Copyprotect.
Menu Title