ఏం… కోస్తా వాళ్లకెందుకంత టెక్కు ?

Written by

కోస్తా ఏమైనా స్పెషలా ?

కోస్తా వాళ్లు దిగొచ్చారా ?

విటమిన్ డి ఎక్కువైన పొగరు కోస్తా వాళ్లకి …!

ఎహ్… ఏముంది రా కోస్తాలో… కోస్తా కోస్తా అంటారు ?

ఇలా ఎవరైనా అంటే… యస్… అవునందాం…కొట్టొచ్చినట్టు చెప్పుకుందాం కోస్తా వాళ్లమని ! అవును బాస్ మనం స్పెషల్. అవును గురూ… మన గిఫ్టెడ్. అవును. అలలు తడితే తెరుచుకున్న తలుపు లాంటి జీవితాలు మనవి. ఆలోచనల దిగంతం… ఎల్లలులేని ప్రపంచం… ఏ మూలకైనా ఏ కోన కైనా అలవోకగా వెళ్లి నెగ్గుకొచ్చే సత్తా మన సొంతం. ఆల్ బికాజ్ ఆఫ్ కోస్తా… బికాజ్ ఆఫ్ సంద్రం. నీకు తెలియకుండానే… నీకు చెప్పకుండానే.. నువ్ అడక్కుండానే సముద్రం నీకు నేర్పుతోంది .. తీర్చిదిద్దుతోంది… కోస్తా. యస్… కోస్తా ఈజ్ అవర్ రాస్తా !

కళాకారులం మనం…

కవులం మనం…

స్పందించే హృదయులం మనం…

సంగీత జ్ఞానులం మనం…

అభిరుచి గల రసజ్ఞులం మనం…

సంఘర్షణల అలలని ఆలోచనల తెరచాపతో దాటే సైలర్స్ మనం…

పడ్డావెందుకురా అంటే… లేచేందుకేరా అని చెప్పే స్పిరిటెడ్ స్పీషెస్ మనం…!!

నువ్వున్నదెక్కడో తెలుసా ?

ఆశల తీరం… కలల తీరం… కల్లోల తీరం… తుఫానుల తీరం… సూర్యుడు ఉదయించే తీరం… ఎడతెగని పొడువాటి తీరం… అవకాశాల తీరం !

చూస్తున్న ఒక్కో కంటికి ఒక్కోలా కనిపిస్తోంది ఏపీ తీరం. ఇది మన సాహసాల సారం. సాగరానికే హారం. ఎన్ని రకాలుగా అయినా చెప్పొచ్చు… ఏమనైనా పొగడొచ్చు. ఇంతకీ…తీరంతో మనకేంటి ? మనకే మిచ్చింది ?

తీరమంటే ఇసుక తిన్నెలు.. సాయం సమయంలో సముద్రం వన్నెలే కాదు. అంతకు మించిన జీవన వేదం. ఓ వైవిధ్యం. తరతరాలను తీర్చిదిద్దిన ఒరవడి. తీరం నా భావోద్వేగాన్ని రగిలించి…రక్తాన్ని మరిగించి శక్తిని కరిగించిందంటారు శ్రీశ్రీ. ఎగసిపడే భావాలకి ప్రతీకల్లాంటి అలలు కల్లోల సంకేతాలు కాదు…కలల సంతకాలు. అందుకే తీరం ఉన్న జాతికి… తీరంలేని భూ పరీవేష్టిత భావజాలానికీ ఎంతో వైరుధ్యం. గ్లాసు సగం ఖాళీగా ఉందనడం నిరాశావాదం. సగం నీళ్లున్నాయనడం ఆశావాదం అని చెప్పారే చిన్నప్పుడు…. అలా చెప్పిందెవడో తెలుసా? నీలాగా… నాలాగా తీరాన ఉన్నవాడే. నీళ్లతో సహవాసం కాబట్టి నీళ్లున్నాయ్ సగం అన్నాడు. ఎందుకంటే వాడి మనసులో కాన్ఫిడెన్స్ ఉంది. కసిఉంది..అన్నిటికీ మించిహోప్ ఉంది.

నీకు తెలుసా డియర్… నదులు సముద్రాల ఒడ్డునే మహా నగరాలు ఎందుకు మెులుస్తాయో..నాగరికతలు ఎందుకు వెలుస్తాయో..! అదీ తీరం తీర్చి దిద్దిన తీరు. తీరంలో ఉన్నవాడు రెక్కలు విదిల్చిన పక్షిలా ఎగిరేందుకు సిద్ధంగా ఉంటాడు… తీరాన్ని చూడని వాడు నిరంతరం అభద్రతతో సహ జీవనం సాగిస్తాడు. ఇది నేను చెప్పిన మాట కాదు..జాతి పరిణామాల్ని లెక్కగట్టి చెప్పే నామ్ చోమ్ స్కీ ఓ చోట చేసిన అనాలిసిస్! నామ్ తో నాకు పరిచయం లేదు. అందుకే ఇదంతా నేను చెప్పించే అవకాశమే లేదు.

తీరం నీకేమిచ్చింది ?

రుషికొండ బీచ్ లోనో… మంగినపూడిలోనో సూర్యలంక దగ్గరో అహ్లాదం పంచిందని చెబితే అమాయకత్వం. అమ్ముకోజానికి నమ్మకమైన షిప్పింగ్ రూట్ అంటే వ్యాపారం. చేపల వేట అంటే అది కేవలం బతుకుబాట. పొరుగు దేశాలతో కొట్టుకుచచ్చేందుకు నాటికల్ మైళ్లు కొలిచిమరీ పెట్టుకున్నాం అంటే అది పొగరు మాట. అంతేనా సముద్రం అంటే ? ఇంతేనా ? ఇసకలో కాలు దిగుతుండగా సముద్రం అల… అలా వచ్చి పలకరించి పోతుండగా పరవశించిన ప్రతి కోస్తా వాసీ… ఆలోచిస్తే అర్థమవుతుంది. మన తీరం మనకి బతుకునిచ్చింది. మన తీరం మనల్ని ఇలా బతకనిచ్చింది.

ఇంగ్లిష్ నీ దగ్గరకెలా వచ్చింది ?

కాలేజీలు కట్టి వందల ఏళ్లనాడే రాత మార్చే గీత గీయించిందెవరు ?

బర్మింగ్ హోమ్ బుడాపెస్ట్ లను నీకు పరిచయం చేసిందెవరు ?

పశ్చిమానికి వంతెన కట్టి ఫ్యాషన్ చిత్రాన్ని చూపించిందెవరు ?

పరిపాలన ఇలా అంటూ కొత్త పద్ధతి నేర్పిందెవరు ?

ప్రపంచంతో చేయి కలిపించిందెవరు ?

ఎక్కడైనా జెండా ఎగరేయమనే తెగువ నీకిచ్చిందెవరు ?

చుక్కుల ముగ్గేసినట్టు జిల్లాకో పట్టణం కట్టాలని చెప్పిందెవరు ?

తీరం. తీరం. తీరం. అన్నిటికీ అదొక్కటే సమాధానం. అంతేనా ? సముద్రం… సంఘర్షణకి ప్రతిరూపం. నిరంతరం నిత్యచలనానికి సంకేతం. కెరటాలుగా అనంత శక్తిని జనించే శక్తి పీఠం. మథనం చేసిన సంతకం.

ఫైనల్ గా…

తీరం ఓ సందేశం… తీరం ఓ సంకేతం. తీక్షణంగా చూడు తీరంలో కూర్చొని…! దిగంతం సముద్రం అవతలి గట్టులా కనిపిస్తుంది. ఆకాశం అందుకుంటున్నట్టు అనిపిస్తుంది. ! నిజానికి తీరంలో కనిపించేది ఆకాశం కాదు… అవకాశం !

– అభి

Article Tags:
· · ·
Article Categories:
Anything Everything

Comments

Copy Protected by Chetan's WP-Copyprotect.
Menu Title