ఇంటింటి ఆత్మబంధువు… చాగంటి

Written by

భక్తి అంటే వయస్సు మీదపడిన తర్వాత వచ్చే వైరాగ్యమా ? పురాణాలు వినడం అంటే పనీపటాలేని వాళ్లు చేసే పనా ? సంప్రదాయాలు తెలుసు కోవడం అంటే టైమ్ కిల్లింగ్ వ్యవహారమా? ఇలాంటి ఆలోచనలు ఏమూల ఉన్నా తుడిచిపెట్టేసేందుకు ఓ ప్రభంజనం వీస్తోంది తెలుగునేల మీద.
ప్రవచనం దాని పేరు. చాగంటి కోటేశ్వరరావు దాని చిరునామా.

పిల్లలకి చదువుల టెన్షన్. పెద్దలకి ఉద్యోగాలు, వ్యాపారాల హడావుడి, రిటైరైనోళ్లని వెంటాడే అలజడి… గృహిణిలకి కుటుంబ సమస్యల ఒత్తిడి. యూత్ కిఉద్యోగం లేదనో… ఉంటే దాంతోపాటు టెన్షన్ పెరిగిందనో ఏదో ఓ సమస్య. మొత్తమ్మీద పట్టుమని పదిమందితో మాట్లాడితే అందరికీ ఏదో ఓ ప్రోబ్లమే ! ఇవన్నీ మందులతో నయమయ్యేవో… సైకాలజిస్ట్ ని సంప్రదించేవో కాదు. మర్చిపోయేంత చిన్నవి కాదు చెప్పుకునేంత పెద్దవీ కావు. కానీ వెంటాడతాయ్. ఇలాంటి సమస్యలకి పరిష్కారం డివోషన్. ఎమోషనల్ గా కనెక్ట్ చేస్తూ… రిలీఫ్ ఇచ్చే బిలీఫ్. మనలో చాలామందికి ఈ యాంగిల్ తట్టకపోవచ్చు గానీ ఇదో ట్రెండ్. ఇపుడు ఇదే దారిలో వందలు వేలుకాదు లక్షలు దాటి కోట్లమంది నడుస్తున్నారు. వాళ్లకి చేరువై నడిపిస్తున్న ఆధ్యాత్మిక తత్వవేత్త చాగంటి.

ఎవరీ చాగంటి ? ఎందుకు ?

భక్తి ఓ భుక్తి మార్గం అయిపోయిన రోజుల్లో…డబ్బే ఆధ్యాత్మిక అవసరాలకి వారధి కడుతున్న కాలంలో…ఓ ధార్మిక పవనం తెలుగు రాష్ట్రాల్లో రివ్వున వీస్తోంది. అద్భుతాలు చేస్తోంది. భారత రామాయణ భాగువత భగద్గీతలకి ఆయన అభినవ దూత. లలితా సహస్రం నీ సమస్యకి పరిష్కారం తెలుసా? ర్యాంకుల కోసం పడికొట్టుకుపోకండి…విభీషణుడు నీ గురించి ఓ మాట చెప్పాడు విను…. పార్వతీ దేవికీ నీలాగే ఓ సందేహం వచ్చింది
దానికి పరమశివుడు చెప్పిన సమాధానం ఇప్పటికీ నిలిచిన వాస్తవం. తెలుసుకో… అంటూ కలుపుగోలుగా ఆయన చెప్పే ప్రవచనం… నిజానికి ఆధ్యాత్మిక ఉత్తేజం. ప్రసార మాధ్యమాల విస్తృతి… అంసఖ్యాకమైన అభిమానజనం…నెత్తినెట్టుకు కొలిచేంత ఆకర్షణ ఉన్నా ఆయన నడత ముందు అవన్నీ చాలా చిన్న సంగతులుగా తోస్తాయ్.

బ్యాక్ టు వేదాస్…

సౌందర్య లహరిలో శంకరుడేం చెప్పాడు ? శివానంద లహరి సారం అంతా నీకు గ్లాసులో పోసినట్టు అదించేదెవరు ? పోతన భావగతాన్ని కొత్తగా పురరావిష్కరించేది ఎవరు ? గరుడ పురాణంలో గమన గంభీర సత్యాల్ని కొత్త తరానికి విడమరిచి చెప్పేందుకు ఎవరొస్తారు ? ఈ ప్రశ్నలకి ఒక్కేటే సమాధానం. సందేహాలు పెరుగుతున్నప్పుడో… ఆధ్యాత్మిక పరిమళాలు అత్యవసరం అయిప్పుడో వాగ్గేయకారులు అవతరిస్తారనేది మన సంస్కృతి చెప్పిన సత్యం. కొందరు పాడతారు.. కొందరు రాస్తారు. ఇంకొందరు విడమరచి వివరిస్తారు. అందరూ ఆధ్యాత్మిక సుగంధాన్ని పంచేవాళ్లే ! అలాంటి అపురూమైన బాధ్యతని అత్యద్భుతంగా నిర్వర్తిస్తున్న అభినవ ప్రవక్త చాగంటి. భగవంతుడు ఎవరైనా… ఈశ్వర తత్వాన్ని ఆయన విడమరిచి చెప్పే తీరు చూస్తే తన్మయత్వం తన్నుకొస్తుంది. చాగంటి ప్రవచనం ఓ మేల్కొలుపు. పురాణాలు పుస్తకాల్లో రాస్తేనో… కొత్తగా అచ్చు వేస్తేనో బుర్రకి ఎక్కవుట. అర్థమయ్యే రీతిలో… ఎవరికి ఎలా చెబితే కనెక్ట్ అవుతారో అలాగే చెప్పాలట. ఇలాంటి అవకాశం హిందూ ధర్మంలో లేదు. ఎందుకంటే సంస్కృతంలో మంత్రాలు, అర్థంకాని గ్రాథికంలో వేదసాహిత్యం, పురాణాలు ఉంటాయ్. అందుకే అటువైపు చూస్తున్నవాళ్లు క్రమేపీ తగ్గుతున్నారు. కొత్త తరం భక్తికి దూరంగా జరుగుతోందా అనే అభిప్రాయం కల్గడానికి ఇదే అసలు కారణం. దీనికి సమాధానమే కాదు పరిష్కారం కూడా చూపిస్తున్నాయ్ చాగంటి ప్రవచనాలు. పద్య రూపంలో… అర్థం కాని గ్రాంధికంగా ఉన్న గ్రంథాను, వేదాలను, పురాణాలను సామాన్యులకి కూడా హత్తుకునేలా చెప్పడం ఆయనకి వాక్కుతో పెట్టిన విద్య. అందుకే ఆ మాటే ఆధ్యాత్మిక శాసనం. ఇలా అంటారేమిటి కాస్త నియంతృత్వంలా లేదు… అనిపించొచ్చు సున్నిత మనస్కులకి. కానీ ఇదివాస్తవం. ఆయన మాటకున్న ప్రభావం చూస్తే ఇది కచ్చితంగా అతిశయోక్తి కాదు. చాగంటి వారి ప్రత్యేకత… విజయరహస్యం కూడా అదే !

అతి ప్రాచీన రుగ్వేదం మొదలు ఆది శంకరుని వరకూ అన్నిటినీ కాచి వడపోసి సారాన్ని, జ్ఞానాన్ని నేటి తరానికి అందించే మహా యజ్ఞాన్ని అప్రతిహతంగా కొనసాగిస్తున్న ఆధ్యాత్మిక దురంధరుడు చాగంటి. భక్తి అంటే భారం కాదు.. ఉత్తేజాన్నిచ్చే భావం. విశ్వాసం అంటే గుడ్డినమ్మకం కాదు. నిను నడిపించే ఇంధనం. పురాణం అంటే కాలక్షేపం కాదు..మన సమస్యలకి సమాధానం చూపే సంజీవని. హర్ట్ అయ్యాను అయ్యాను అంటావ్… ఎవడు అవమన్నాడు నిన్ను… ఇదే సందర్భం లక్ష్మణుడికి ఎదురైతే, అన్న రాముడు ఏం చెప్పాడో తెలుసా అంటూ ఆయన చెప్పే తీరు అద్భుతమనిపిస్తుంది. భాష తెలిసిన వాళ్లందరికీ ఇంత సమర్థంగా భావాన్ని చేర్చడం అంటే మాటలు కాదు. అదొకవరం. కచ్చితంగా అలాంటి వరసంపన్నుడు చాగంటి.

నిగర్వి… నిత్య సంతోషి…

డొక్కశుద్ధి ఉండొచ్చు. కానీ తెలిసిన విషయాల్ని సామాన్యులకి పంచాలన్న చిత్తశుద్ధి ఎందరికుంటుంది చెప్పండి ? జీవితం ఊక మీద పొర్లడం లాంటిది. నీకు అంటుకునేది చివరికి నీతో వచ్చేదీ ఏం లేదు… నాకు తెలిసింది నేను చెప్తున్నానంతే… ఏమీ ఆశించి కాదు. ఇదివరకు నా భోజనం కూడా నేనే తెచ్చుకునేవాడిని… ఇప్పుడు చక్కెర వ్యాధి కదా…అందుకని అప్పుడప్పుడూ పళ్లో పలహారమో కాస్త ఎంగిలి పడుతున్నా… అంతకు మించి మీరేం శుస్రూషలు చేయకండి… అంటూ ఆయన సున్నితింగా తనదైన పద్ధతిలో తిరస్కరిస్తారు రాచమర్యాదని. అది ఆయన రాజముద్ర.
కేంద్ర ప్రభుత్వ ఉద్యోగం. భార్యకీ సర్కారీ కొలువు. ఒకే ఒక్క కూతురు. కుటుంబ బాధ్యతలూ తీరినయ్. ఇతంటి సౌకర్యవంతమైన జీవితాన్ని కూడా తోసిరాజని… నిరంతర ప్రయాణాలతో చిరంతర ప్రసంగాలు సాగిస్తూ అనంత ఆధ్యాత్మిక జ్ఞానాన్ని తెలుగు నేల నాలుగుచెరగులూ వ్యాప్తి చేస్తున్న జ్ఞానవాహిని చాగంటి. సరస్వతీపుత్రుడు చాగంటికి జన్మదిన శుభాకాంక్షలు

– అభి

Comments

comments

Article Categories:
People

Comments

Menu Title