‘బుడుగు’ స్రుష్టికర్త ముళ్ళపూడి వారి 85 వ జయంతి – Remembering Mullapudi Venkata Ramana

Written by

“బాపూ రమణీయం” అని మనం అందరం స్నేహానికి నిలువెత్తు చిరునామాగా బాపు రమణలనే ఇప్పటికీ ఎప్పటికీ చెప్పుకుంటాము.వారి శరీరాలు రెండు అయినా ఆత్మ ఒకటిగా చివరిదాకా జీవించారు.తెలుగు నేల ఉన్నంత వరకు చెరుగని తరగని చిరకీర్తి ఆ ఇరువురిదీ.. బాపు రమణల లోని ముళ్ళపూడి వెంకట రమణ ఈ పేరు వింటే అశేషాంధ్రులకు ఠక్కున గుర్తుకు వచ్చేది బుడుగు మరియు అప్పుల అప్పారావు పాత్రలే.

ఈరోజు ప్రత్యేకత ఏమిటో తెలుసా? మన బుడుగు పాత్ర స్రుష్టికర్త ముళ్ళపూడి వారి 85 వ జయంతి. ముళ్ళపూడి వెంకట రమణ గారు జూన్ 28 1931 న నేటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రములోని దవళేశ్వరం లో ఆదిలక్ష్మి, సింహాచలం దంపతులకు జన్మించారు.వీరి పూర్వీకులు నేటి ఒడిశా లోని బరంపురంకు చెందిన తెలుగు వారు. సింహాచలం గారు గోదావరి ఆనకట్ట ఆఫీసులో పనిచేసేవారు. చిన్నపుడే తొమ్మిది సంవత్సరాల వయస్సుకే తండ్రిని పోగొట్టుకున్న వారి కుటుంబం అనేక కష్టాల పాలయింది.. చివరికి తన తల్లితో కలసి నాటి చెన్నపట్టణానికి తన అక్క, బావ దగ్గరికి వెళ్ళిపోయారు. అక్కడే తన అక్క, భావలతో ఉంటూ చదువుకున్నారు. వారు చదివినది ఎస్ ఎస్ ఎల్ సి అయినా చిన్నప్పటినుండే వారు రచనలు , పద్యాలు అల్లడం ప్రారంభించారు.

వారి మొదటి రచన “అమ్మ మాట వినక పోతే ” శ్రీ బాలానందం న్యాపతి రాఘవరావు గారి “బాల” పత్రికలో మొదటి సారిగా అచ్చయింది. తరువాత అందులోనే వారి రచన ” బాల శతకం” కూడా అచ్చయింది. ఇలా వ్రాస్తూనే చిన్నా చితకా ఉద్యోగాలు చేస్తూ 1954 లో నాటి ప్రముఖ పత్రిక ” ఆంధ్ర పత్రిక” లో సబ్ ఎడిటర్ ఉద్యోగములో జాయిన్ అయ్యారు.అలా సబ్ ఎడిటర్ గా పనిచేస్తూనే వారు ఎన్నో రచనలు చేసారు. అలా వ్రాసినదే బుడుగు.

వీరు రచనలు చేయడడమే కాదు.. నాటి ప్రముఖ నటీమణి భానుమతి గారిని కూడా మనకు రచయిత్రిగా పరిచయం చేసిన ఘనత వారిదే. ఆమె రచించిన “అత్త గారి కథలు” ప్రచురించి ఆమెలోని రచయిత్రి కోణాన్ని మనకు అందించారు. ఆ కథలు తరువాత పుస్తకముగా అచ్చయి సాహిత్య అకాడెమీ అవార్డు కూడా అందుకొన్నది.

ఇక బుడుగు గూర్చి చెప్పుకోవాలి అంటే ఇది రమణ గారు రచించిన ఒక హాస్య రచన. ముళ్ళపూడి వారి వ్రాతలు మరియు బాపు గారి బొమ్మలు ద్వారా హాస్యపూర్వకంగా బుడుగు అనే పిల్లవాని భాష, అల్లరి, ఆలోచనలు, ప్రవర్తన ఈ పుస్తకంలో చెప్పబడ్డాయి. తెలుగు సాహిత్యంలో ఈ తరహా రచనలు రావడం ఇదే ప్రథమం మరియు ప్రసిద్ధమైంది ఇదొక్కటే అని నిస్సంకోచంగా మనం చెప్పుకోవచ్చును.బుడుగు రచనను చదువుతుంటే బుడుగు పాత్రలో మనలను మనం చూసుకుంటాము.

B1-300x169 'బుడుగు' స్రుష్టికర్త ముళ్ళపూడి వారి 85 వ జయంతి - Remembering Mullapudi Venkata Ramana

బుడుగు రచన తరువాత ముళ్ళపుడి వెంకటరమణ “బుడుగు వెంకటరమణ” గా ప్రసిద్ధులైపోయారు.ఇది ఆనాటి నుండీ నేటి వరకు ప్రతి ఒక్కరి ఇళ్ళలో తప్పకుండా ఉన్న పుస్తకం అనుకోండి. నిజానికి చెప్పాలి అంటే బుడుగు కాక వారెన్నో ప్రసిద్ధమైన రచనలు, మరియు సినిమాలకు రచనలు చేసారు. కానీ మన అందరికీ చాలా ప్రత్యేకమైనది బుడుగు. ” నాపేరు బుడుగు.. ఇంకో పేరు పిడుగు ..నాకు ఇంకో అస్సలు పేరు ఉంది.. చెప్పడానికి ఇప్పుడు టైం లేదు.. కావలిస్తే మా భామ్మని అడుగు” అంటు ప్రారంభం అయి మనలను చిన్నతనానికి తీసుకు పోయి కేరింతలు కొట్టిస్తుంది.

ఇందులోని.. భామ్మ, రాధా ,గోపాలం, రెండు జెళ్ళ సీత, బాబాయి.. ప్రైవేట్ మాస్టారు, పక్కింటి లావు పాటి పిన్ని గారు, సీగేన పెసూనాంబ, జెట్కా వాడు,పిన్ని గారి మొగుడు, డిటెక్టివ్… ఇలా అన్ని పాత్రలూ సజీవంగా మన ముందు కదలాడుతాయి. “నా అంతటి వాణ్ణి నేను..నన్ను ఎవరూ కొట్టకూడదు. నేను నిఝంగా పెద్దవాడినే అనుకో. ఐతే వాళ్ళే నన్ను కుర్రకుంకా అంటారుగా. అందుకని అస్సలు కొట్టకూడదు” అని ఒక చోట బుడుగు దబాయిస్తాడు. ఇలాగే “బళ్ళోకెళ్ళకుండా ఉండాలంటే చొక్కా ఇప్పేసి ముందుగా మనం ఎండలో నించోవాలి. అప్పుడు వీపుమీద పొట్టమీద జొరం వచ్చేస్తుంది. అప్పుడు పరిగేఠుకుని అమ్మదగ్గిరికెళ్ళి గబగబా చూడూ బళ్ళోకెళ్ళద్దని చెప్పూ అనాలి. లాపోతే జెరం చల్లారిపోతుంది. బామ్మకి చెప్పేస్తే చాలు. ఇక ఆ పూట బడి ఉండదు.. ప్రైవేట్ ఉండదు.. .. కడుపునెప్పి మంచిది కాదు ఎందుకంటే పకోడీలు చేసుకొని మనకు పెట్టకుండా తినేస్తారు. అందుకని తలనొప్పి అన్నిటికన్నా మంచిది. ఇది కూడా బామ్మకే చెప్పాలి” అంటూ కొండొకచో చిట్కాలు చెబుతూ మనలను కూడా మన చిన్నతనములో బడికి వెళ్ళకుండా ఉండటానికి మనం చేసిన పనులను గుర్తుకు తెస్తారు. ఇలాగే ప్రైవేటు మాస్టారులను గూర్చి.. ఇంటిలో భామ్మ నాన్నకు ప్రైవేటు చెప్పడం.. రాధ గోపాలానికి ప్రైవేటు చెప్పడం.. నాన్న బాబాయి కి ప్రైవేటు చెప్పడం ఇలా .. టెంకె జెల్లలు.. జీడిపాకం.జాఠర్ డమాల్ వంటి ఎన్నో పదప్రయోగాలు గమ్మత్తుగ ఉండి నవ్వు తెప్పిస్తాయి. “సిగరెట్లు తెల్లగా ఉంటాయిలే. వీటిని బాబాయిలాంటి కుర్రవాళ్ళు కాలుస్తారు. .. మరి నేను పెద్దవాడినిగా. అందుకనే కాలవను. నేను ఇంఖా పెద్దవాణ్ణయ్యాకా జెటకా బండియేనా రైలింజనేనా తోలుతానుగా. అందుకని బీడీలు దాస్తాననుకో. అప్పుడు చెవులో పెట్టుకోవాలిగా. బీడీలు బామ్మ వత్తుల పెట్టెలో దాస్తే భద్రంగా ఉంటాయి ” .. “నేనేం చిన్న వాణ్ణా .. చితక వాణ్ణా” అంటు చివరి దాకా బుడుగును ఒక్క పేరా కుడ మిస్సవనీకుండా చదివింప జేస్తారు. బుడుగు వంటి అజరామరమైన చిరంజీవిని స్రుష్టించిన సాహితీ చిరంజీవి ముళ్ళపూడి వారు. బుడుగు అల్లరి కథనానికి అనుగుణంగా బొమ్మలు చిత్రించి బాపు గారు ఆ రచనకు మరింత అందాన్ని చేకూర్చారు. వీరి రచనా శైలి బహు విశిష్టంగా ఉంటుంది. వారి రచనా శైలి నచ్చిన మల్లాది రామక్రిష్ణ శాస్త్రి వంటి సారస్వత ఉద్ధండులు ” నేను – నాకతలు” లో వారి బుడుగు శైలిని అనుకరించారు. ఆయనంతటి వారు అనుకరించడం తనకు లభించిన “ఆక్షరాశీర్వాదం” అని గొప్పగా చెప్పుకున్నారు శ్రీ ముళ్లపూడి వారు. ఇలాగే మరో రచన ” ఋణానందలహరి” ద్వారా అప్పుల అప్పారావు అనే పాత్రను స్రుజించి అప్పులను ఎలా చెయడం.. అప్పుల వాళ్లనుండి ఎలా తప్పించు కొవడం .. అప్పుల ప్రశస్తి గూర్చి చెబుతూ ” ఓ ఫైవ్ అప్పిస్తారూ ” అంటూ.. ఆద్యంతం హాస్యాన్ని కురిపిస్తారు.

B2 'బుడుగు' స్రుష్టికర్త ముళ్ళపూడి వారి 85 వ జయంతి - Remembering Mullapudi Venkata Ramana

ముళ్లపూడి వెంకటరమణ ఈ కథల్లో పంచతంత్రం, జాతకకథలు తదితర భారతీయ కథాసాహిత్య శిల్పాన్ని అనుసరించారు. పౌరాణిక కథన శిల్పంల్లో కూడా శుకమహర్షి భాగవతాన్ని చెప్పడం, కురుక్షేత్రం జరిగే తీరు సంజయుడు చెప్పడం వంటి వాటి శిల్పాన్ని అనుసరించి ఉంటుంది ఈ కథామాలిక. ఆంధ్ర పత్రికలో పనిచేస్తూనే వారు సినిమాలకు సంభాషణలు, కథా రచనలు చేసారు. నాటి ప్రసిద్ధ నిర్మాత డూండీ తమిళములో విజయవంతమైన “పాశమలర్” చిత్రపు హక్కులు కొని దానిని తెలుగు తీయడానికి సంభాషణలు వ్రాయాల్సిందిగా రమణ గారిని అడిగారు. ఆ చిత్రానికి వారు వ్రాసిన పాత్రోచిత సంభాషణలు.. అన్న చెల్లెళ్ళ మధ్య బంధాన్ని అత్యంత హ్రుద్యంగా వ్రాసారు. ఈ సినిమాతోనే శ్రీ ఎన్ టీ ఆర్ గారు అన్న గా ఆంధ్ర మహిళల హ్రుదయాలలో చిరస్థాయిగా నిలచిపోయారు. ఆ చిత్రముతో పేరు ప్రతిష్టలు సంపాదించుకున్న రమణ గారు.. “ఇద్దరు మిత్రులు “, “వెలుగు నీడలు” దాగుడు మూతలు” , “మూగ మనసులు”, “ప్రేమించి చూడు” ఇలా ఎన్నో విజయవంతమైన చిత్రాలకు తమ రచనలు, సంభాషణలు అందించారు.

తమ ప్రాణ మిత్రుడయిన బాపు గారి తో కలసి వారు తీసిన చిత్రాలు కుడా పేరు ప్రఖ్యాతులు సంపాదించి పెట్టాయి.. అలా వారు తీసినవే “సాక్షి”, “బంగారు పిచిక”, “బుద్ధిమంతుడు”, “అందాల రాముడు”, “బాల రాజు కథ”, “సంపూర్ణ రామాయణం”, “ముత్యాల ముగ్గు”,”సీతా కళ్యాణం”, “మిస్టర్ పెళ్ళం” మొదలగునవి. వారు రచన, సంభాషణలు సమకూర్చిన ముత్యాల ముగ్గులో .. ప్రతి నాయకుడు “రావు గోపాల రావు” గారి ఇంట్రడక్షన్ సీన్ లొ ” ఇగో సెగట్రీ.. ఆకాశం వంక చూడు.. పొద్దునే ఏదో ఆకాశం లో మర్డర్ జరిగినట్టు లేదు అంటు ప్రతినాయకుని క్రూరత్వాన్ని ప్రేక్షకులకు పరిచయం చేస్తారు. అలాగే ప్రతి నాయకులకు కుడా కళా పోషణ ఉంటుందంటూ ” మడిసన్నాక కూసింత కలాపోసన ఉండాల. తిని తొంగుంటే మడిసికీ గొడ్డుకీ తేడా ఏటుంటదండే”

ఇలా ఒకట రెండా ఇలా ఎన్నో సంభాషణలు ఆయన వ్రాసిన చిత్రాలలోనివి మనకు ఇప్పటికీ వినబడుతూనే ఉంటాయి. హాస్యాన్ని స్రుష్టించడములో వారికి వారే సాటి. వారు ఇతరుల చిత్రాలకు కుడా పనిచేసినా ఏనాడు నిర్మాత దర్శకులను ఇబ్బంది పెట్టలేదు. తన చివరి చిత్రం ” శ్రీ రామ రాజ్యం” కుడా షూటింగ్ మొదల్లయ్యే రోజుకే కథ, సంభాషణలు అన్నీ సమకూర్చి అందజేసారు. స్వాతి వీక్లీ లో వచ్చిన వారి జీవిత కథ “కోతి కొమ్మచ్చి” ప్రతి ఒక్కరూ తప్పక చదవాల్సిన మరో ఆణిముత్యం.

ఇంక బాపు రమణల స్నేహం .. వారి అన్యోన్యం గూర్చి చెప్పుకోవడానికి మాటలు చాలవు. 1942 లో ఆయిదవ తరగతి చదువుతున్నపుడు ప్రారంభమయిన వీరిరువురి స్నేహం అరవైయేళ్ళు అయినా చెక్కు చెదరలేదు.స్నేహానికి నిలువెత్తు చిరునామా వారిరివురూ.రమణ గారి రచనలు అంటే బాపు గారి బొమ్మల కొలువులే.

b31-300x223 'బుడుగు' స్రుష్టికర్త ముళ్ళపూడి వారి 85 వ జయంతి - Remembering Mullapudi Venkata Ramana

రమణ గారు ఫిబ్రవరి 24 2011 న అశేష ఆంధ్రులను కన్నీటి సంద్రములో ముంచి.. తన చిరకాల మిత్రుడు బాపు గారిని ఒంటరిని చేసి వెళ్ళిపోయారు. రమణ గారి హాస్య రచనలను గూర్చి చెబుతూ.. ప్రముఖ కవి ఆరుద్ర గారు అన్న మాటలు “హాస్యమందున అఋణ,అందె వేసిన కరుణ, బుడుగు వెంకటరమణ, ఓ కూనలమ్మా!” ఎంత మాత్రం అతిశయోక్తి కాదు.

Comments

comments

Article Categories:
People

Comments

Menu Title