సాధుకొండ.. బంగారు కొండ

Written by

రాయలసీమ ఖనిజ నిక్షేపాలకు పెట్టింది పేరు. ఇక్కడ ఇనుము, క్వాడ్జ్, బరైటీస్, ఆస్ బెస్టాస్ తో పాటు వజ్రాలు, బంగారం కూడా లభిస్తాయి. అనంతపురంలో ఏకంగా వజ్రకరూర్ అనే ఊరు ఏర్పడింది. కర్నూలు జిల్లాలో వర్షాలు వస్తే వజ్రాల వేట సాగుతుంది. కడపలోని మంగంపేటలో దొరికే బరైటీస్ ప్రపంచంలో అత్యుత్తమ నాణ్యత కలిగినది. బరైటీస్ అవసరం పడితే ఏ దేశమైనా మంగంపేట వైపే చూస్తుంది. అలాగే పులివెందులలో ఆస్ బెస్టాస్, యురేనియం నిల్వలు ఉన్నాయి. చిత్తూరు జిల్లాలోనూ ఖనిజన్వేషణ జరుగుతోంది. ఈ జిల్లా లోని తంబళ్లపల్లి మండలంలో విలువైన ఖనిజాలు ఉన్నట్లు జియాలజిస్టులు అంచనా వేస్తున్నారు. ముఖ్యంగా బంగారం నిల్వలు ఉండటానికి అవకాశం ఉందనే అభిప్రాయం ఉంది. ఈ అంచనాలు, అభిప్రాయాలు ఎంత వరకు నిజమో తెలుసుకునేందుకు ప్రయత్నాలు మొదలయ్యాయి. ఎప్పటి నుంచో తంబళ్లపల్లిలో ఖనిజాన్వేషణ చేపట్టడానికి ప్రయత్నాలు జరుగుతున్నా వాటికి ఎప్పటికప్పుడు ఫుల్ స్టాప్ పడుతోంది. ఇప్పుడు జియో మైసూర్ సర్వీసెస్ అనే కంపెనీకి ఖనిజాల కనిపెట్టేందుకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది.

తంబళ్లపల్లి మండలం(ఇది నియోజకవర్గం కూడా).. అనంతపురం జిల్లా, కర్ణాటక సరిహద్దులో ఉంటుంది. ఈ మండలంలోని మల్లయ్య కొండ, సాధుకొండలు దాదాపుగా ఆనుకుని ఉంటాయి. వీటిలో సాధుకొండలో బంగారపు జాడలు ఉన్నాయనే అంచనాలు జియాలజిస్టుల్లో ఉన్నాయి. సాధుకొండలో 9 చ.కి.మీ. ప్రాంతంలో డ్రిల్లింగ్ చేసి పరీక్షలు జరిపేందుకు గనుల శాఖ అనుమతి ఇచ్చింది.

తంబళ్లపల్లి.. రాజంపేట లోక్ సభ నియోజకవర్గం పరిధిలోకి వస్తుంది. గతంలో ఇక్కడి నుంచి ఎంపీగా ఉన్న సాయిప్రతాప్ కేంద్ర గనుల శాఖ సహాయ మంత్రిగా ఉండేవారు. ఆయన సాధుకొండలో ఖనిజాన్వేషణ చేపట్టాలని ప్రయత్నించారు. అయితే స్థానిక రాజకీయ నాయకుల నుంచి సహకారం అందక వెనక్కు తగ్గారు.

ఎందుకు స్థానికులు సాధుకొండ ఖనిజాన్వేషణను వద్దంటున్నారు. ఖనిజాలు ఉంటే స్థానికంగా ఉపాధి అవకాశాలు వస్తాయి కదా! అనే మాట ఈ సందర్భంగా వస్తుంది. సాధారణంగా మనకు కొండల్లో ఆలయాలు ఉంటాయి. ఇలాగే సాధుకొండ కూడా శైవ క్షేత్రం. ఇక్కడ జరిగి గ్రామీణ జాతరకు చుట్టు పక్కల జిల్లాల నుంచి ప్రజలు వస్తుంటారు. అందువల్ల తవ్వకాలు చేపట్టొద్దు.. ప్రజల సెంటిమెంటును దెబ్బతీయొద్దు అని నేతలు చెబుతున్నారు. ఇప్పుడు జియో మెస్సర్స్ కంపెనీకి అనుమతి ఇచ్చిన నేపథ్యంలో తంబళ్లపల్లిలో ఆందోళనలు జరిగే అవకాశం ఉందని పరిశీలకులు భావిస్తున్నారు.

Comments

comments

Article Categories:
News
Menu Title