కృష్ణపట్నం పోర్టుకు విదేశాల నుంచి ఇసుక దిగుమతి

Written by

మన ఇంట్లో ఉన్న వస్తువులను పరిశీలిస్తే కనీసం 50 శాతం విదేశాల నుంచి దిగుమతి చేసుకున్నవే ఉంటాయి. కంప్యూటర్, సెల్ ఫోన్, ప్లాస్టిక్ వస్తువులు, స్టీల్.. చివరకు బట్టలు, షూస్ కూడా దిగుమతి చేసుకుంటున్నాం. మన దిగుమతులు విపరీతంగా పెరగడం వల్లే రూపాయి క్రమంగా దిగజారిపోతోంది. ఈ పరిస్థితిని మార్చేందుకు మేకిన్ ఇండియా కార్యక్రమాన్ని చేపట్టారు. ఇది ఎలాంటి ఫలితాలు ఇస్తుందన్నది వేచి చూడాలి.

మేకిన్ ఇండియా సంగతి అలా ఉంచితే ఆంధ్రప్రదేశ్ లోని కృష్ణ పట్నం పోర్టు విదేశాల నుంచి ఇసుకను దిగుమతి చేసుకోనుంది. ఈ మేరకు అనుమతులు కూడా పొందింది. ఆగ్నేసియాలోని మేకాంగ్ నది నుంచి ఇసుకను ఇంపోర్ట్ చేసుకోనున్నారు. ఈ నది చైనాలోని యున్నాన్ ప్రావిన్స్, బర్మా, లావోస్, థాయ్ ల్యాండ్, కంబోడియా, వియత్నాంల మీదుగా ప్రవహిస్తుంది. ఈ దేశాల నుంచి ఇసుక దిగుమతి అయ్యే అవకాశం ఉంది. మేకాంగ్ నది ప్రపంచంలో 12వ అతిపెద్ద నది. 4,350 కి.మీ. మేర ప్రవహిస్తుంది.

ప్రస్తుతం కేరళలోని కొచ్చిన్ పోర్టుకు కంబోడియా నుంచి ఇసుక దిగుమతి అవుతోంది. ఆంధ్రప్రదేశ్ లో క్యూబిక్ మీటర్ ఇసుకను అధికారికంగా రూ.600లకు సరఫరా చేస్తున్నారు. కంబోడియా తదితర దేశాల నుంచి భారీ ఓడల్లో ఇసుకను దిగుమతి చేసుకుంటే అన్ని ఖర్చులు పోనూ రూ.600ల కంటే తక్కువకే ఇసుకను సరఫరా చేయొచ్చని కృష్ణపట్నం పోర్టు నిర్వాహకులు భావిస్తున్నారు. కంబోడియా కంటే మేకాంగ్ నది ప్రవహించే ఇతర దేశాల్లో కూలీ ఖర్చులు తక్కువగా ఉన్నందున ఏపీలో అమ్ముతున్న ధర కంటే తక్కువకే ఇసుకను దిగుమతి చేసుకోవడానికి వీలుంటుందని వారు చెబుతున్నారు. అంతేకాకుండా ఇసుకను అతిగా తవ్వేయడం వల్ల మన దగ్గర భూగర్భ జలాలు బాగా పడిపోతాయి. ఇందువల్ల చంద్రబాబు ప్రభుత్వం ఇసుక తవ్వకాలపై ఆంక్షలు పెట్టింది. ఈ ఆంక్షలతో డిమాండ్ కు తగ్గట్లు ఇసుక సరఫరా కాని పరిస్థితి ఉంది. ఇసుక దిగుమతికి ఇది కూడా ఒక కారణంగా ఉంది.

Comments

comments

Article Categories:
News
Menu Title