అమృత గళం – అజరామరం

Written by

తెలుగింటి సంగీత ప్రపంచం లో ఓ సుస్వరాల గళం మూగబోయింది. అద్భుత గాత్రం తో ఎందరో సంగీతప్రియుల మనసులు కట్టిపడేసిన మహా గాయకుడు శ్రీ విస్సంరాజు రామకృష్ణ గారు అమరులయ్యారు.

కళల నిలయం అయిన విజయనగరానికి చెందిన ఎందరో మహా కళాకారులలో శ్రీ రామకృష్ణ గారు ఒకరు. ఆగష్టు 20, 1947 లో శ్రీ విస్సంరాజు రంగసాయి, శ్రీమతి రత్నం దంపతులకు జన్మించారు. శ్రీ ఘంటసాల గారు మరియు వారి పిన్నిగారైన శ్రీమతి సుశీలమ్మ ల నుంచి స్ఫూర్తిని పొంది గాయకునిగా తన వృత్తిని మొదలుపెట్టారు. శ్రీ బండారు చిట్టిబాబు గారి సుకుమార్ ఆర్కెస్ట్రా లో పాటలు పాడేవారు. అల్ ఇండియా రేడియో లో లలిత సంగీతం ఆలపించేవారు.

1972లో విచిత్ర బంధం అనే చిత్రం లో “వయసే ఒక పూల తోట” అనే పాట ద్వారా సినీరంగానికి పరిచయం అయ్యారు.1972-80 ల మధ్యలో వారు పాడిన ప్రతి పాట ఓ ఆణిముత్యం. భక్తి గీతాలు ఆలపించడం లో ఆయనకు ఆయనే సాటి. ఎందరో గొప్ప సంగీత దర్శకుల తో పని చేసి వాళ్ళ మన్ననలు పొందారు. ఎన్టీఆర్, ఎ యెన్ ఆర్, శోభన్ బాబు మొదలైన ప్రముఖ హీరోలు రామకృష్ణ గారే తమకు నేపధ్యగానం అందించాలని నిర్మాతలను కోరేవారుట. దాదాపు 5 వేలకు పైచిలికు పాటలు పాడారు.

ఘంటసాల మాస్టారి తో అనుబంధం:
అచ్చం ఘంటసాలలా పాడుతున్నారే అన్నది రామకృష్ణ గారికి వచ్చిన గుర్తింపు. ఈ మాట ఘంటసాల గారే అనడం ఆయనకు ఓ మధుర జ్ఞాపకం. కొన్ని సమయాల్లో తాను పాడాల్సిన పాటలను రామకృష్ణ గారి చే పాడిన్చేవారుట. అల్లూరి సీతారామరాజు సినిమాలో “తెలుగువీర లేవరా ” అనే పాటను ఘంటసాల మాస్టారు స్వయంగా పిలిపించి పాడిన్చారుట. ఆ పాటకు తనతో సమానమైన పారితోషికం ఇవ్వాలని నిర్మాతలకు సూచిన్చారుట. ఘంటసాల గారి చివరి దశలో కొన్ని పాటలు రామకృష్ణ గారే పూర్తి చేసారని అంటారు. ఘంటసాల, రామకృష్ణ ల మధ్య అంతటి అనుబంధం, ఆత్మీయత ఉంది.

దాన వీర శూర కర్ణ లో ఆయన పాడిన పద్యాలు అద్వితీయం. అన్నదమ్ముల కధ సినిమాలో దేవులపల్లి కృష్ణ శాస్త్రిగారురచించి, సాలూరు రాజేశ్వరరావు గారు స్వరపరిచిన “తరలిరా జలధరా కరుణించి కదలిరా” అనే పాటను రామకృష్ణ గారు, బాలు గారు కలిసిపాడారు. మద్రాసు జెమినీ స్టూడియో లో ఈ పాట రికార్డింగ్ జరుగుతుంటే నిజంగానే జలధార కురిసిందిట… వర్షాలు లేని అలనాటి మద్రాసులో వర్షం కురిసిందిట…

“శిసుర్వెత్తి పశుర్వేత్తి , వేత్తి గాన రసం ఫనిః ” అని నట్టుగా అలాంటి గంధర్వ గాత్రానికి ప్రకృతి సైతం పులకిస్తున్ది అనడానికి ఇదే నిదర్శనం .

ఆ మహా గాయకుడు పాడిన అద్భుతమైన పాటల్లో మచ్చుకు కొన్ని:

అనుబంధం , ఆత్మీయత అంతా ఒక బూటకం, ఏమిటో ఈ లోకమంట ఎంతకూ అంతుపట్టని వింత – తాతా మనుమడు

ఎదగడానికెందుకురా తొందర – అందాల రాముడు

మనసున నీవే , నీవే ఆది దైవము, పాండురంగ నామం, పిలుపు వినగలవా, శ్యామ సుందరా – భక్త తుకారామ్

కృష్ణవేణి తెలుగింటి విరిబోణి – కృష్ణవేణి

తెలుగు వీర లేవరా – అల్లూరి సీతా రామరాజు

ఏదో ఏదో అన్నది – ముత్యాల ముగ్గు

శివ శివ శంకర భక్త వ శంకర – భక్త కన్నప్ప

చెప్పలేదని అనకపోయెరు, మాయదారి మారాల బండిర, నందామయ గరుడ నందామయ,శివ గోవింద గోవింద, వినరవినర ఓ నరుడా – శ్రీమద్ విరాట్ వీరబ్రహ్మేంద్ర స్వామి చరిత్ర

శారద నను చేరగా – శారద

ఇంతే ఈ జీవితము చివరికి అంతా శూన్యము – అమరదీపం

పువ్వుకన్నా పున్నమి వెన్నెల కన్నా – కరుణామయుడు

ఇలాంటి ఎన్నోపాటలు తన మధుర గాత్రం తో ఆలపించిన శ్రీ రామకృష్ణ గారు అమరజీవి… తన సుమధురమైన పాటలతో ఎప్పటికి మన మనస్సులలో జీవిన్చేవుంటారు….

మీను శ్రీరామ్

Comments

comments

Article Categories:
News

Comments

Menu Title