తిరుపతి లడ్డూ వజ్రోత్సవం

Written by

 కల్పవృక్షం… కామధేనువు… పారిజాతం… ఐరావతం. ఇదే వరసలో మన తిరుపతి లడ్డూ. పురాణాల్లో చెప్పిన విశిష్టతల్లో లడ్డూ కూడా ఉందని చాలా కొద్ది మందికి తెలుసేమో !

గరుడ పురాణం మోక్షకాండలో తిరుమల… అక్కడ విలసిల్లే సంప్రదాయాల ప్రస్తావనొస్తుంది. తిరుమల పేరు చెప్పకపోయినా శ్రీనివాసం.. అక్కడి విధివిధానం వేల ఏళ్ల కిందటే గరుడ పురాణం వివరించింది. అంతటి ప్రత్యేకత ఉన్న లడ్డూ ఇపుడు 75 ఏళ్లు పూర్తిచేసుకుంది. వజ్రోత్సవం జరుపుకుంటోంది. అంతకు ముందు కూడా ప్రసాదాలున్నా… ప్రస్తుతమున్న లడ్డూ భక్తులకి అందుబాటులోకి వచ్చింది మాత్రం 1940లోనే ! అందుకే బ్రహ్మోత్సవానికి తోడు ఈ ఏడాది లడ్డూకి వజ్రోత్సవం కూడా !

పారిజాతం… కల్పవృక్షంలో లడ్డూని ఎందుకు పోల్చడం ? అంత ప్రత్యేకమా అంటే… కచ్చితంగా అంతకంటే ఎక్కువే అని చెప్పాలి. కామధేనువు, ఐరావతం చదివి తెలుసుకోవడమే కానీ చూసింది లేదు. అనుభూతిని అస్వాదించిందీ లేదు. లడ్డూ అలా కాదు. ఎన్నో ఏళ్ల నుంచి మనకి అందుబాటులో ఉంది. భక్తితోపాటు రుచి మాధుర్యాన్ని కూడా అందిస్తోంది. అందులోనే ఎవరూ అందుకోలేని విశిష్టత కూడా ఉందని మనం ఎప్పుడైనా ఆలోచించామా ? తిరుమల లడ్డూ అద్భుతం. వైవిధ్యం. అపూర్వం. అనితర సాధ్యం. ఇందులో రుచి మాత్రమే కాదు మహిమ కూడా ఉంది. అదే అసలు రహస్యం. కొన్నేళ్లుగా… ఒకటీ అరా వ్యక్తిగత స్వార్థాలతో వివాదాలు సృష్టించి ఉండొచ్చు గాక…కానీ లడ్డూ విశిష్టతకి మాత్రం విలువ తగ్గలేదు. చెక్కుచెదరదు కూడా! ఇది నిత్య సత్యం.

వజ్రోత్సవంలో తొలి అడుగులు…

లడ్డూ వెనక చాలా చరిత్రే ఉంది. శతాబ్దాల క్రితం అంటే ఐదారొందల ఏళ్ల కిందట సఖీయం తిరుప్పొంగరం లాంటివి ఉండేది ప్రసాదాలుగా. పాలు నెయ్యి లాంటివి వాడి… అటు ద్రవపదార్థం కాదు ఇటు ఘనమూ కాదన్నట్టుగా మెత్తగా ఉండే పదార్థాలవి. చాలా వరకూ తమిళ ప్రభావం ఉంటుంది అప్పటి రుచుల మీద ! అప్పటికి శాతాబ్దాల పూర్వమే… పల్లవుల కాలంలో లడ్డూ లాంటివి ప్రసాదంగా ఉండేవని చెబుతారు కానీ…అది లడ్డూనే అనేందుకు కచ్చితమైన ఆధారం లేదు. ఆ తర్వాత కాలంలో క్రమక్రమంగా మార్పులొచ్చాయ్. కామాక్షి ఆలయంతోపాటు ఇతర ప్రసిద్ధ క్షేత్రాల్లో ప్రత్యేకమైన ప్రసాదాలు తయారు చేసే సంప్రదాయం అప్పటికే బలపడింది. తిరుమలలో వడ కూడా ఉంది అప్పటికే ! అయితే అంతకు మించినదేదో కావాలన్న ఆలోచనతో బియ్యప్పిండి… బెల్లం కలిపి కొత్త రకం వంట తయారు చేశారు కొన్నాళ్లు. పాకంలోవేసి మిఠాయి తరహాలో చేసి నివేదన సమర్పించేవారు. అరవ ప్రభావంతో మనోహరాలు అనేవారు అప్పట్లో ! ఆ మనోహరాలే కాలక్రమంలో మారి.. భక్తుల సంఖ్య వేలకి వేలు మించిపోయే సరికి ప్రస్తుతమున్న లడ్డూల పద్ధతి స్థిరపడింది. అప్పటి మద్రాసు ప్రభుత్వం స్వామి కి ప్రత్యేకంగా ఓ ప్రసాదం ఉండాలి… అది నిల్వ ఉండిదై ఉండాలని భావించిందని కొన్ని మార్పులు చేర్పులతో దీని తయారు చేశారని చెబుతారు. ఇదేదో అవసరం కోసం చేసిందనుకునే పొరపాటే. లడ్డూ ప్రస్తావన గరుడ పురాణంలోనే ఉందంటే … పరంపర మారుతూ ఒక్కడికి వచ్చి స్థిరపడిందనేది విశ్వాసం.

ఎలా చేస్తారు ?

tirumala-kitchen తిరుపతి లడ్డూ వజ్రోత్సవం

మొదట్లో… కొండ మీద దొరికే సుగంధ ద్రవ్యాలను ఎక్కువగా వాడారని ఆ తర్వాత తర్వాత పద్ధతి మారిందంటారు. ప్రస్తుతం కేరళ నుంచి ప్రత్యేకంగా రప్పిస్తున్నారు దినుసులన్నీ ! లడ్డూ తయారీలో శనగపిండి, పంచదార, జీడిపప్పు, కర్పూరం, నెయ్యి, పటికబెల్లం, ఎండుద్రాక్ష మాత్రమే వాడతారు. రుచిని పెంచేందుకు కానీ నిల్వ ఉండేందుకు కానీ రసాయనాలు ఏమీ వాడకుండా దాదాపు నెల రోజుల వరకూ ఏమాత్రం తేడా రాకుండా ఉండే అరుదైన గుణం కూడా తిరుపతి లడ్డూ సొంతం. రసాయన జోక్యం లేకుండా భూమ్మీద మరేయిత పదార్థం ఇంతకాలం నిల్వ ఉండదు. ఇది కూడా మన ప్రత్యేకతే ! దిట్టమైన రుచుల దేవళం… నిజానికి లడ్డూ… భక్తి భావానికి భౌతిక అనుభూతి. వెంకన్న ఆశీర్వాదానికి ప్రతీక. చరిత్ర సరే ! మరి దేనితో చేస్తారో చెప్పినా… ఎక్కడ నుంచి దినుసులు తెస్తున్నారో తెలిసినా ఇప్పటి వరకూ తిరుమల లడ్డూ రుచిని తేవడం ఎంత చేయి తిరిగిన వంటగాడికైనా సాధ్యం కాలేదు. ఓ మాట ఉంటుంది… కొండమందీ దిట్టంలో పనిచే వంటవాడైనా ఇంటి దగ్గర చేస్తే మళ్లీ ఆ రుచి రాదని ! ఇదీ తిరుమల లడ్డూ గురించి కచ్చితంగా చెప్పుకొని తీరాల్సిన విషయం. కొచ్చి నుంచి కొనుక్కొచ్చేస్తేనో… అక్కడ చేసిన మనిషితో చేయిస్తేనో వచ్చేయదు రుచి. తిరుమల కొండ మీద ఉండే సహజ సిద్ధ వాతావరణం, అక్కడి గాలి నీరు అన్నీ ప్రత్యేకమే. ఆ ఆధ్యాత్మిక వైశిష్ట్యం అంతా లడ్డూలో కనిపిస్తాయ్. అదే అసలు మహత్తు. అందుకే భౌగోళిక ప్రాధాన్యాన్ని ప్రపంచానికి చాటి చెబుతూ జీఐపేటెంట్ కూడా సాధించిన శ్రీవారి లడ్డూ శతవసంతం దిశగా ఘుమఘుమలు పంచుతోంది.

– అభి

Comments

comments

Article Categories:
My City · Tirupati

Comments

Menu Title