అన్ని దారులూ గోదావరి వైపే…

Written by

ఊళ్లకి ఊళ్లే ఖాళీ అయిపోతున్నాయ్. జనమంతా ఛలో గోదావరి అంటున్నారిప్పుడు. అనంతపురం అయినా హైద్రాబాద్ అయినా అందరూ ఇపుడు రాజమండ్రి రేవులో వాలిపోడానికి రెక్కలు కట్టుకుంటున్నారు. ఒక్క రాజమండ్రేనా ? అంతర్వేది నుంచి ఆ ఎగువ వరకూ అన్ని చోట్లా పోటెత్తిపోతున్నారు జనం. ఒకరు స్నానానికొచ్చారంటే ఐదారుగుర్ని పంపుతున్నారు. అక్కడున్న ఏర్పాట్లు… మారు మూల చోట్ల కూడా ఆకట్టుకునే అనుభూతులు చెబుతూ, గోదావరిలో మళ్లీ మళ్లీ చేయగల్గుతామా… ఎప్పుడో పన్నెండేళ్లకి అంటూ … పుష్కరాలకి జై కొడుతున్నారు. ఈసారి రద్దీలో కొత్త రికార్డులు నమోదు కాబోతున్నాయని చెబుతున్నారు. 90 రోజుల పాటు జరిగే కుంభమేళాకి ఏ మాత్రం తగ్గని రీతిలో మన గోదారి మహా పుష్కరాలకి జనం వస్తున్నారని అధికారులంటున్నారు.

మా దారి… గోదారి…

శుక్రవారం సాయంత్రం హైద్రాబాద్ అంతా నాలుగైదు గంటలు జామ్ అయిపోయింది. సాయంత్రం ఐదారు గంటల నుంచే ప్రత్యేక బస్సులు, ఎక్స్ ట్రా బస్సులు, ప్రైవేటు వెహికిల్స్ రాజమండ్రి పుష్కరాల కోసం రోడ్డెక్కడమే దీనికి కారణం. హైద్రాబాద్ విజయవాడ రూట్ టోల్ గేట్లలో నిన్న ఒక్క రోజే 60 శాతం ఆదాయం పెరిగిదంటే ఫ్లో అర్థమవుతోేంది. వరసగా సెలవులు రావడం ఓ కారణం అయితే… టీవీల్లో కనిపిస్తున్న హారతి, అద్భుతమైన ఏర్పాట్లు కదిలించాయని, పుష్కరాలకి బయల్దేదదీశాయని చెబుతున్నవాళ్లూ చాలామందున్నారు. ఉద్యోగాల హడావుడిలో కొట్టుకు పోతున్నవాళ్లైతే ఓ అడుగు ముందుకేస్తున్నారు. “అవసరమైతే సెలవు పెట్టైనా వెళ్లాలి… హారతి వెలుగులు చూస్తుంటే అక్కడ ఉంటే బావుండేది ఆ సమయానికి అనిపిస్తోంది. గోదారిగట్టున ఓ రెండ్రోజులుండి చుట్టూ ఉన్నగుళ్లూగోపురాలు చూసొద్దాం” అంటూ ఫ్యామిలీలు సిద్ధమైపోతున్నాయ్

రోజూ దాదాపు 40 లక్షల మంది భక్తులు గోదావరి జిల్లాల్లో పుష్కర స్నానాలు చేస్తున్నారు. ప్రతి జిల్లా నుంచి వందల కొద్దీ ప్రత్యేక బస్సులు తిరుగుతున్నాయ్. ఇవన్నీ ఆర్టీసీ నడిపేవే కాదు. ప్రైవేటు బస్సులు నాయకులు తిప్పుతున్నసర్వీసులు ఊరుఊరంతా ఉత్సాహంగా బయల్దేరుతున్న బస్సులూ ఇవన్నీ ! జనం అడుగుతున్నారన్నా… అందుకే మూడు నాలుగు బస్సులు రోజూ ఫ్రీగా తిప్పుతున్నామని ఓ ఎంపీకి చెందిన సంస్థ చెబుతోంది. వ్యాపారం చేసే వాళ్లే ఇంత ఉదారంగా ఉండక తప్పని పరిస్థితి వచ్చిందంటే ఇక సంగతి చెప్పక్కర్లేదు. పుష్కరాలకి వస్తున్న వాళ్లలో దాదాపు 40శాతం ఉత్తరాంధ్ర నుంచి వస్తున్నవాళ్లే. క్రిష్ణా గుంటూరు జిల్లాలు ఆ తర్వాత. రాయలసీమ నుంచి కూడా కనీ వినీ ఎరగని రీతిలో తరలి వస్తున్నట్టు టోల్ గేట్ లెక్కలు చెబుతున్నాయ్.

Comments

comments

Article Categories:
My City · Rajahmundry
Menu Title