సూర్య కాంతం- గోదావరి పుష్కర స్నానం

Written by

అది దేవతల రాజధాని నగరం అమరావతి. అక్కడ సమస్త దేవగణాలు, ఋషులు, దిక్పాలకులు, మునులు, కిన్నర కింపురుషాదులు, గంధర్వులు.. సర్వులూ.. ఇంద్రుని కొలువు కూటమున కొలువు తీరారు. ఆవేళ పుష్కరునితో దేవరాజు పుణ్య ఫలదాయిని గోదావరీ నదీమతల్లి పుష్కరాలను గూర్చి చర్చిస్తున్నారు.ఇది ప్రతి పండ్రెండు సంవత్సరాలకు ఒకసారి వచ్చే పుష్కరం కాదు..మహా పుష్కరం కావున పుష్కరుని విధులను గూర్చి నదీ పరీవాహక ప్రాంతమంతా వచ్చే సకల జనులకు పుణ్యం ఒసగి వారి పాపాలను హరించి నదీస్నాన ఫలితమొసగాలని ఆజ్ఞవేశారు దేవరాజు.

ఈ మహా పుష్కరానికి సమస్త దేవగణాలూ, ఋషులందరూ గోదావరి నదీతీరములో పుష్కర స్నానమొనరించి తన్మయమొందాలని నిశ్చయించుకున్నారు. ఈ పుష్కర స్నానం.. ఋషులు, దేవతలూ అందరికీ సకల శుభదాయకం , సకల దోషహరణం అని అందరూ పుష్కర మహత్యాన్ని ప్రాశస్త్యాన్ని గూర్చి అక్కడ విపులంగా దేవగురువు బృహస్పతుల వారు అందరికీ వివరించారు. ఆనాటికి కొలువు సమాప్తమైనది అందరు తమ తమ దివ్యభవానాలకు ఏగుతెంచారు.

ఈ విషయమంతా దేవరాణి శచీదేవికి ప్రాణ మిత్రురాలు అయినా మన ఆంధ్రుల అభిమాన అత్తగారు సూర్యకాంతమ్మ గారు కూడా అక్కడ దేవసభలో శచీదేవి పక్కన ఉన్నతాసీనురాలై ఆలకించింది. తాను భూలోకములో ఉండగా చేసిన గోదావరి స్నానాలు, పుష్కర స్నానాలు, పూజావిధులు ఆమెకు అన్నీ గుర్తుకు వచ్చాయి.. తాను భూలోకములో ఉండగా మహా పుష్కరాలను చూడలేకపోయాను అన్న బాధతో మనసు భారమైంది మన సూర్యకాంతమ్మకు.సభ సమాప్తమవగానే ఆమె కుడా మెల్లగా తన భవనానికి చేరుకుంది.ఆమెకు గోదావరి నదికి గల బంధం అంతా గుర్తుకు వచ్చింది. ముఖ్యంగా ఆమెకు ధవళేశ్వరం అంటే మహా ప్రీతి.. అక్కడేగా మూగమనసులు షూటింగ్ అంతా జరిగింది.. అదీ కాక తన మిత్రులు బాపు రవణలు కూడా అక్కడి వారే.. తనదీ ఆ ప్రాంతమే కాకినాడలో పుట్టిపెరిగింది కాబట్టి ఆమెకు ఆ మధుర జ్ఞాపకాలన్నీ గుర్తుకు వచ్చాయి.

మనసు భారంగా ఉన్న కాంతమ్మ మెల్లగా తన పానుపు మీద పవ్వళించింది.. ఇంతలోనే ఆమె స్నేహితురాండ్రు చాయాదేవి మరియు కల్పనా రాయ్.. అక్కడ స్వర్గములోని కొలువుకూటములోని అవాళ్టి విశేషాలు ఏమిటో తెలుసుకోవాలని కాంతమ్మ దగ్గరకు పరుగున వచ్చారు. మెల్లగా ఆమె పక్కన కూర్చుని..ఏం కాంతమ్మ వదినే ఏం దిగాలుగా ఉన్నావు అని పరామర్శించిందిచాయాదేవి. అదేమిటమ్మా కాంతమ్మ పిన్నీ అలా ఉన్నావు అని ఆదుర్దాగా అడిగింది కల్పనా రాయ్. వారి మాటలు విన్న కాంతమ్మ మెల్లగా లేచి కూర్చుని.. ఏమీ లేదు వదినే.. మన భూలోకములో గోదావరి నది పుష్కరాలు అట. ఇవి ప్రతి పండ్రేండేళ్ళకు వచ్చే పుష్కరాలు కావే? 144 సంవత్సరాలకు ఒకసారి వస్తాయి.. వీటినే మహాపుష్కరాలు అంటారు. మనం బ్రతికి ఉండగా వీటిని చూడలేక పోయాము.. ఈ మహా పుష్కర స్నానం చేస్తే జన్మ జన్మాంతర పాపాలన్నీ పరిహారమవుతాయిట. ఈ పుష్కర స్నానం సకల శుభదాయకం అని ఇవాళ దేవ గురువు బృహస్పతుల వారు చెప్పారు. దేవతా గణాలు అందరు పుష్కర స్నానానికి వెళుతున్నారే . నాకు అప్పటి జ్ఞాపకాలు గుర్తుకు వస్తున్నవే.. ఎక్కడో నాసికా త్ర్యంబకములో పుట్టి మన తెలుగు రాష్ట్రాలలో ప్రయాణించి తుగోజీ, పగోజీ లో మెట్టిన మన గోదారమ్మ ఎంత చల్లని తల్లి. మన తెలుగు నాట మెట్టిన ఈ నదీ తీరాన్నే కదా ఆ రామచంద్రప్రభువు చల్లనితల్లి సీతమ్మతో నడయాడినది.. ఈ నదీమతల్లివలనే కదా మన ఆంధ్ర రాష్ట్రానికి అన్నపూర్ణ అనే పేరు వచ్చింది. నన్నయగారు , రామదాసు వంటి వారు ఎందరో మహనీయులు ఈ నదీమతల్లి ఒడిలో ఆడుతూ పెరిగినవారే కదా. ఇలా మన తెలుగు వారిది తరతరాల జలబంధం కదా గోదారమ్మతో అని చెప్పుకూ పోతూ ఉంది.

అవును వదినే నేను కూడా ఓ రెండు పుష్కర స్నానాలు చేసాను గానీ మహాపుష్కరాలు మనం భూలోకములో ఉండగా రాలేదు కదా .. ఎంతైనా భూలోకములో ఉన్నపుడు ఎంత బాగుండేదో అని నిట్టూర్పు విడిచింది చాయాదేవి.. అవును పిన్నీ ఇక్కడ ఎన్ని స్వర్గ సౌఖ్యాలు ఉన్నా భూలోకమే బాగుండేది.. అని బాధగా అంది కల్పనా రాయ్. మరే అంది చాయా దేవి.. మా కాంతమ్మ వదిన తలచుకుంటే మనం కూడా ఈ పుష్కర స్నానాలకు దేవతలతో పాటు వెళ్లవచ్చు.. ఇంతకీ మన కాంతమ్మ వదిన ఏమంటుందో అంది కన్ను గీటుతూ కల్పనా రాయ్ ని చూసి చాయాదేవి. అవును అత్తా, మా పిన్ని తలచుకుంటే ఏదైనా చేసేయగలదు అని చాయాదేవి కోరికను బలపరించింది కల్పనా రాయ్. అదెలా కుదురుతుంది వదినే.. మనం చనిపోయి స్వర్గానికి వచ్చాము కదా? మళ్ళీ భూలోకానికి ఎలా వెళ్ళగలం అంది కాంతమ్మ. నువ్వు శచీదేవికి విన్నవిస్తే ఆమె మీ మాట కాదనగలదా?ఆమెకు మీ మాట మీద ఎంత గౌరవం.. దేవేంద్రులవారికి అమె చెబితే అంతా అవుతుంది కదా వదినే అంది చాయాదేవి.. అవుననుకో .. తనకూ ఈ మహా పుష్కర స్నానం చేసి ఆ వింతలు విడ్డూరాలు.. గోదావరి హారతి.. సప్త గోదావరి స్నానమాచరించి మళ్ళీ గోదారమ్మ చల్లని నీరు తాగి..తిరిగి రావాలని ఉంది అన్నది.

అనుకున్నదే తడవుగా కాంతమ్మను పురికొల్పి దేవరాణి మందిరానికి పంపారు చాయాదేవి , కల్పనా రాయ్ ఎలాగయినా ఈ మహాపుష్కరానికి భూలోకానికి రావాలని. దేవరాణి సముఖానికి వెళ్ళిన కాంతమ్మను చూడగానే ఎంతో ప్రేమతో దగ్గరకు పిలుచుకుని అప్యాయంగా కబురులు చెప్పుకోవడం ఆరంభించారు ఇద్దరూ. మాట మంతిలో పెట్టి.. వేదంలా ఘోషించే గోదావరి నదీమతల్లి వైభవాన్ని పుష్కర స్నాన ఫలితాన్ని..అక్కడ జరిగే వింతలను కళ్లకు కట్టినట్టు వివరించింది మన కాంతమ్మ. దేవరాణి అచ్చెరువొంది.. తాము కుడా మహాపుష్కర స్నానానికి వెళుతున్నాం అని చెప్పింది శచీదేవి.. సమయమూ సందర్భమూ చూసుకుని.. కాంతమ్మ తన మనసులోని మాట.. మరియు తన మిత్రురాండ్ర విన్నపం ఆమెకు విన్నవించుకుంది.. దానికేం భాగ్యం.. నిన్ను వదలి నేనూ ఎటు వెళ్లనుగా తనతో పాటే దేవతాస్త్రీల దివ్య విమానములో గోదావరి పుష్కర తీరానికి తీసుకువెళతానని మాట ఇచ్చింది శచీదేవి. అనుకున్నది సాధించాను హమ్మయ్య అనుకుని.. అక్కడ దేవరాణి వద్ద సెలవు పుచ్చుకుని కాంతమ్మ తిరిగి తన భవనానికి బయలుదేరింది. భవనానికి రాగానే అక్కడే కాచుకుని ఉన్న చాయాదేవి, కల్పనా రాయ్ తమ అదృష్టానికి పొంగిపోతూ.. అంతా నీ వల్లనే సాధ్యం అయింది వదినే అంటూ కాంతమ్మను పొగడ్తలతో ముంచెత్తారు. కాంతమ్మ సరే సరే పుష్కర ఉత్సవాల ప్రారంభం రేపేనట.. మనం తెల్లవారక మునుపే గోదావరి తీరానికి దేవతా గణాలతో చేరుకుంటాము సిద్ధం కమ్మని చెప్పింది.

దేవతా గణాలు అంతా స్వర్ణఖచిత, రత్న మాణిక్యమయ విమానాలలో గోదావరీ నదీ తీరానికి మహా పుష్కర యాత్రకు స్వర్గం నుండి బయలు దేరారు. మన కాంతమ్మ గారు, చాయాదేవి, కల్పానా రాయ్ లు కూడా దేవతా స్త్రీగణాలకు అమర్చిన ప్రత్యేక విమానాలలో గోదావరి తీర ప్రాంగణానికి చేరుకున్నారు.. అక్కడ దిగగానే ఆ ప్రాంతమంతా పుష్కర వైభవాలతో అలరారుతోంది. రాజమహేంద్రవరం అంతా అమరధామాన్ని తలపిస్తూ అందరికీ అహ్వానం పలికింది. అక్కడికి దూరాన ఎక్కడనుండో గోదావరి మహాత్యం గూర్చి లీలగా ఈ గానం వినబడుతోంది.

శ్రీరామ పాదాలు కడగంగా
రామదాసుని నోట తిరగంగా
నన్నయ్య గంటాన సుడులు తిరుగుతూవచ్చి
తెలుగింటి వేదమై భూదారి గంగ
మా వాడకొచ్చింది గోదారిగంగ…

కోనసీమా ఆకుపచ్చ చీరకట్టి
కోటిలింగాలతో మెడకు హారాలెట్టి
పాపికొండలపైట పరువాలకే చుట్టి
శబరితో కలిసింది గౌతమై కరిగింది
దక్షిణాదికి గంగ గోదారిగంగ
దక్షవాటికి చేరె నేడు శివగంగ..

వెన్నెలంతా మేసి తాను నెమరేసింది
ఎంకి పాటలు పాడి ఎల్లువైపోయింది
పడతి కిన్నెర సానిలా పరుగులెత్తింది
పదములే పాడింది పైరులై పండింది
శ్రీనాధ సీసమై శృంగార గంగ
వీరేశలింగాల విజ్ఞానగంగ.

దేవతలంతా తొలుత పుష్కర ఆరంభ స్నానమాచరించి పులకించి పోయారు. మన కాంతమ్మ గారు కూడా అక్కడ తన మిత్రురాండ్రతో పుష్కర స్నానం ఆచరించి పునీతురాలయింది.
( పాట సాహిత్యం .. వేటూరి సుందరరామ మూర్తి గారు)

Comments

comments

Article Categories:
My City · Rajahmundry

Comments

Menu Title