సప్తసిరుల గోదావరికి మహాపుష్కరం

Written by

ఆంధ్రావనిని దీవించ వచ్చిన జనని. నిను దివి నుంచి భువికి తెచ్చెను గౌతమముని. పులకించెను అవని. భక్తకోటి పుణ్యతీర్ధానికి అరుదెంచిన మహాపుష్కర వేణి. .ఆంధ్రదేశాన్ని అన్నపూర్ణగా మార్చిన ధన్యగోదావరి.. కర్షకుడి కలలు పండించే జలసిరీ.. హృదయ గోదారీ అంజనాద్రి కి అవతల బ్రహ్మగిరిలో నీ జననం..అంతర్వేదికి సాగిన మహా ప్రస్థానం. బ్రహ్మ పంపెనా, గంగమ్మ పంపెనా నిను ఓ గౌతమీ, మా జీవనవాహినీ

గోదావరి మహాపుష్కరాలకు ముహూర్తం సమీపిస్తోంది. గోదావరి తీరం జనహారంలా మారిపోవటానికి మిగిలింది ఇంకా రెండువారాలు. 144 ఏళ్లకు ఒక సారి వచ్చే మహాపుష్కర భాగ్యం ఈ పర్యాయం గోదావరి నదీమతల్లికి దక్కింది. జూలై 14 నుంచి 25 వతేదీ దాకా దక్షిణ గంగలో పవిత్రస్నానాలు. బృహస్పతి సింహరాశిలో ప్రవేశించే ఘడియల్లో ఆరంభమవుతున్న గోదావరి పుష్కరాలలో..12 రోజులకీ 12 ప్రత్యేకతలున్నాయి.

ప్రాణికోటి మనుగడకు జలమే ఆధారం. అందుకే నదీతీరాల్లోనే నాగరికతలు విలసిల్లాయి. భగవంతుణ్ణి మనం నారాయణుడు అంటున్నాం. ‘నారము’ అంటే నీరు. నీటి నుంచి ఉద్భవించిన వాడే నారాయణుడు అని భక్తజనుల విశ్వాసం. ఈ జలాలను దేవతల రూపంలో ఆరాధించటం హైందవ సంప్రదాయం.

జీవరాశుల మనుగడకు నీరెంత ఆవశ్యకమో గుర్తు చేసే సందర్భం కూడా పుష్కరాలు. లక్షలాది ప్రజల గుండె ఘోష గోదావరి. నవ్యాంధ్రకు జీవనరేఖ. అష్ట అయిశ్వర్యాలు అలా వుంచుదాం. మనకు సప్త సిరులున్నాయి. అవి గౌతమి,వశిష్ట, వైనతేయ, ఆత్రేయ, భరద్వాజ,తుల్యభాగ,కశ్యప. ఏడు పాయలా? మూడు పాయలా? అవి ఈనేలను సస్యశ్యామలం చేయటానికి గోదావరి తల్లి నడకలు. ఆంధ్రావనిని దక్షిణ భారత ధాన్యాగారంగా మార్చి..కరవు తీర్చేందుకు ఆమె వేస్తున్న అడుగులు.

గోదావరి మహాపుష్కరం-2015 సంబరాలలో ప్రత్యేకతలెన్నో వున్నాయి. ‘శోభాయాత్ర’ నుంచి ‘గోదావరి అఖండ హారతి’ దాకా, ‘సైకత కళాకృతుల’ నుంచి, ‘కడియం పుష్ప ప్రదర్శనలు’ వరకు విశేషాంశాలెన్నో వున్నాయి. యాభై వేల ఆకాశదీపాలతో గోదావరి తీరం వింత శోభను సంతరించుకోబోతోంది. గోదావరి లేజర్ షో, క్రీడాకారుల పుష్కర జ్యోతి లాంటి ఆకర్షణలు భక్తులను, సందర్శకులను ఆకట్టుకుంటాయి.. చత్తీస్‌గఢ్‌,తెలంగాణ, ఒడిషా, పశ్చిమబెంగాల్‌, కర్ణాటక రాష్ర్టాల నుంచి మూడున్నర కోట్ల మంది పుణ్యస్నానాలకు తరలివస్తారని అంచనా.

Comments

comments

Article Categories:
My City · Rajahmundry

Comments

Menu Title