శ్రీవారి బంగారం లెక్కలు

Written by

తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామికి భక్తులు సమర్పించే కానుకల్లో బంగారం కూడా ముఖ్యమైనది. ఇలా వచ్చిన బంగారంలో అధిక మొత్తాన్ని తిరుమల తిరుపతి దేవస్థానం(టీటీడీ).. బ్యాంకుల్లో నిల్వ చేస్తూ ఉంటుంది. ఇలా నిల్వ చేసిన బంగారం మొత్తం 4.5 టన్నులుగా ఉందని టీటీడీ అధికారులు వివరిస్తున్నారు. ఇప్పటి వరకు తిరుమలేశుడి బంగారం నిల్వలపై సరైన లెక్కలు అందుబాటులో లేవు. ఇప్పుడు అధికారులే స్వయంగా వివరాలు చెప్పారు.

తిరువనంతపురంలోని పద్మనాభ స్వామి ఆలయంలో వెలుగు చూసిన ఆభరణాల విలువ దాదాపు రూ.లక్ష కోట్లు ఉంటుందని అంచనా. తిరుమలేశుడి దగ్గర ఇంతకంటే ఎక్కువగా ఉండొచ్చని అంచనాలు వచ్చాయి. అవి పొరపాటు అంచనాలని.. బ్యాంకుల్లో శ్రీవారి బంగారం నిల్వలు 4.5 టన్నులుగా ఉన్నాయని అధికారులు వివరించారు. ఇది కాకుండా మరో టన్ను బంగారాన్ని SBIలో నిల్వ చేసే ప్రయత్నాల్లో ఉన్నట్లు ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్(ఈఓ) డి.సాంబశివ రావు చెప్పారు. SBIతో పాటు ఇండియన్ ఓవర్సీస్ బ్యాంకు, కార్పొరేషన్ బ్యాంకుతో పాటు మరికొన్ని బ్యాంకుల్లో బంగారాన్ని నిల్వ చేసినట్లు ఈఓ తెలిపారు.

4.5 టన్నుల బంగారంపై ప్రతి సంవత్సరం 80 కేజీల వడ్డీ వస్తోందని టీటీడీ ఈఓ చెప్పారు. 2010 నుంచి టీటీడీ బ్యాంకుల్లో బంగారాన్ని నిల్వ చేస్తోంది. 2014లో ఒకేసారి 1400 కేజీల బంగారాన్ని SBIలో నిల్వ చేసింది. బ్యాంకుల్లో ఉన్న బంగారం నిల్వలు కాకుండా ఇతర రూపాల్లో కూడా స్వామి వారి దగ్గర బంగారం ఉంది. ప్రస్తుతం బ్యాంకుల్లో ఉన్న 4.5 టన్నలు, త్వరలో డిపాజిట్ చేయబోయే టన్ను బంగారం విలువను కలిపితే 5,500ల కేజీలు అవుతుంది. ఈ మొత్తం బంగారం విలువ రూ.1,320 కోట్లుగా ఉంటుంది.

త్వరలో కేంద్ర ప్రభుత్వం గోల్డ్ మానిటైజేషన్ స్కీమును ప్రవేశపెడుతోంది. ఇందులో సుమారు 2.5 శాతం వడ్డీ ఇవ్వాలని కేంద్రం భావిస్తోంది. టీటీడీ గనుక 5,500ల కేజీల బంగారాన్ని ఈ స్కీములో నిల్వ చేస్తే దాదాపు 140 కేజీల దాకా బంగారం వడ్డీ కింద లభిస్తుంది. ప్రస్తుత బ్యాంకు గోల్డ్ డిపాజిట్ స్కీము కన్నా గోల్డ్ మానిటైజేషన్ స్కీము మెరుగైన రాబడిని ఇస్తుంది.

Comments

comments

Article Categories:
My City · Tirupati
Menu Title