రాజమండ్రి, ఆ పరిసరాల్లో దర్శించాల్సిన పుణ్యక్షేత్రాలు

Written by
godavari-pushkaram-2015-843

రాజమండ్రి మహా పుష్కరాలకు వెళ్ళి స్నానం ఆచరించి పునీతులు కావాలని ఇప్పటికే అందరూ ప్రణాళిక సిద్ధం చేసుకుని వుంటారు. వారికి ఈ యాత్ర అనుభవాలను ద్విగుణీకృతం చేసేందుకు, రాజమండ్రి ఆ చుట్టుప్రక్కల సుమారు 50 కి.మీ. లోపల వున్న దేవాలయాల వివరాలను, వాటి ప్రాశస్త్యాన్ని మీ ముందు ఉంచుతున్నాము.

శ్రీ ఉమా కోటిలింగేశ్వర స్వామి ఆలయం :

రాజమండ్రి లో గోదావరి తీరాన కొలువై వున్నది శ్రీ ఉమా కోటిలింగేశ్వర స్వామి ఆలయం. ఆ పరమ శివుడు రాక్షస సంహారం చేస్తుండగా , కొన్ని స్వేద బిందువులు రాక్షసులపై పడి వారంతా లింగాలుగా మారగా , వారిని బ్రహ్మ విష్ణులు స్థాపించుకుంటూ వచ్చారని , ఆ క్రమం లో చివరిగా కాశీ నుంచి తెచ్చిన లింగమే ఈ శ్రీ ఉమా కోటిలింగేశ్వర స్వామి ఆలయ గర్భాలయంలో కొలువు తీరిందని పురాణ కధనాలు చెప్తున్నాయి. కావున గోదావరిలో స్నానం ఆచరించి, శ్రీ ఉమా కోటిలింగేశ్వర స్వామి కి అర్చన చేయిస్తే అత్యంత పుణ్యం , కోటిలింగాలకు అభిషేకం చేసినంత ఫలితం లభిస్తుందని శివ పురాణం లో చెప్పబడినది.

శ్రీ మార్కండేయ స్వామి ఆలయం :

రాజమండ్రి లో గోదావరి నదీ తీరాన తప్పక చూడవలసిన మరో ఆలయం శ్రీ మార్కండేయ స్వామి ఆలయం. రాజ రాజ నరేంద్రులు, చోళ రాజులు, రెడ్డి రాజులు ఈ ఆలయాన్ని ఎంతో అభివృద్ధి చేసారు.సువిశాల ప్రదేశంలో ప్రధాన ఆలయం తో పాటు పలు ఉపాలయాలు కూడా ఇక్కడ వున్నాయి. ఆధ్యాత్మిక శోభ తో అలరారుతున్న ఈ ఆలయాన్ని దర్శించి తీరాల్సిందే.

ఇస్కాన్ మందిరం :

రాజమండ్రి లో గోదావరి ఒడ్డున ఉన్న ఈ ఇస్కాన్ మందిరం రెండు ఎకరాల విస్తీర్ణం లో ఎంతో అద్భుతంగా నిర్మించబడినది. ఈ మందిరం చుట్టూ దశావతార మండపాలు కూడా ఎంతో అందంగా తీర్చి దిద్దారు. దక్షిణ భారత దేశంలో ఉన్న ఇస్కాన్ మందిరాలలో ఈ మందిరం మూడవ స్థానంలో వుంది.

శ్రీ లక్ష్మీ జనార్ధన స్వామి ఆలయం, ధవళేశ్వరం :

రాజమండ్రి నుండి కేవలం 8 కి.మీ. దూరంలో కొండ పైకొలువై వుంది శ్రీ లక్ష్మీ జనార్ధన స్వామి ఆలయం. ఇది ఎంతో పురాతనమైన ఆలయం. కృత యుగ అవతారంగా బ్రహ్మాండ పురాణం లో చెప్పబడిన స్వయంభూ ఈ జనార్ధన స్వామి. ఇక్కడి క్షేత్ర పాలకుడు ఆంజనేయస్వామి . వారి కోవెల కూడా ఈ ఆలయ ప్రాంగణంలో వుంది.

గోష్పాద క్షేత్రం, కొవ్వూరు :

రాజమండ్రి నుండి కేవలం 10కి.మీ. దూరంలో ఉన్న కొవ్వూరు లో , పావన గోదావరి నదీ తీరాన శ్రీ బాలా త్రిపుర సుందరీ సమేత సుందరేశ్వర స్వామి దేవాలయం వున్నది. ఇక్కడి వాతావరణం ఎంతో రమణీయంగా వుంటుంది. లక్ష గోవులు ఏక కాలంలో సంచరించిన అత్యంత పవిత్ర ప్రదేశం ఈ గోష్పాద క్షేత్రం. ఇక్కడ స్పటిక లింగే శ్వరాలయము మరో ప్రత్యేకత.

శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి దేవస్థానం , కోరుకొండ :

రాజమండ్రి నుండి 22కి.మీ. దూరంలో ఉన్న కోరుకొండ లో కొండ పైన మరియు కొండ కింద రెండు నరసింహ క్షేత్రాలు వున్నాయి . పరాశర మహర్షి తపస్సుకు మెచ్చి ప్రత్యక్ష్య మైన స్వామి మహర్షి కోరిక మేరకు శ్రీ లక్ష్మి సమేత నృసింహ స్వామిగా ఇక్కడ వెలిసాడని పురాణ కధనం. ఇక్కడి గోడలపై చెక్కిన శిల్పాలు ఎంతో మనోహరంగా, రమణీయంగా వుంటాయి.

శ్రీ వీరభద్ర స్వామి ఆలయం, పట్టిసీమ :

రాజమండ్రి నుండి 40కి.మీ దూరంలో కొలువై వుంది శ్రీ వీరభద్ర స్వామి ఆలయం. పవిత్ర గోదావరి నది మధ్యలో దేవకూట పర్వతంపై వున్నది ఈ దేవాలయం. ఇక్కడ వీరభద్రుడు లింగాకారంగా స్వయంభువై వెలిసాడు. ఈ ఆలయానికి గోదావరిపై మోటార్ బోటు లో వెళ్ళాలి. పడవలో ప్రయాణం చేస్తున్నప్పుడు ఆ గోదావరి నీటిని తాకుతూ వస్తున్న చల్లని గాలులు మనల్ని పలకరిస్తూ ఆహ్లాదాన్ని కలిగిస్తూ వుంటాయి.వెనుకనున్న కొండలని చూస్తూ వెళుతుంటే అపూర్వమైన ఆధ్యాత్మిక అనుభూతికి లోనవుతాము.

శ్రీ జగన్మోహిని కేశవ స్వామి ఆలయం, ర్యాలి :

రాజమండ్రి నుండి సుమారు 40కి.మీ దూరంలో ఉన్న ఆత్రేయపురం మండలం, ర్యాలి గ్రామం లో కొలువై వుంది శ్రీ జగన్మోహిని కేశవ స్వామి ఆలయం. దేశం లో నే ఏకైక శ్రీ జగన్మోహిని కేశవ స్వామి ఆలయం యిది. ఈ కోవెలను 11వ శతాబ్దంలో నిర్మించారు. ఇక్కడి మూల విరాట్ విగ్రహం స్వయంభు అని పురాణ కధనాలు చెప్తున్నాయి.

శ్రీ భీమేశ్వర స్వామి దేవాలయం , ద్రాక్షారామం :

రాజమండ్రి నుండి సుమారు 44కి.మీ ( ద్వారపూడి-యానం రోడ్డు) దూరం లో ఉన్న శివ క్షేత్రం ద్రాక్షారామం. ఇది పంచారామ క్షేత్రాలలో ఒకటి. ఈ క్షేత్రం దక్షిణ కాశీ గా ప్రసిద్ది . ఈ ఆలయ ప్రాంగణంలో మాణిక్యాంబ అమ్మవారు కొలువై వున్నారు. అష్టా దశ శక్తి పీఠాల్లో ఇది ద్వాదశ శక్తి పీఠమ్. మాణిక్యాంబ అమ్మవారి దర్శనం జన్మ జన్మల పుణ్యం గా భక్తులు భావిస్తారు.

శ్రీ కుమార రామ భీమేశ్వరాలయం, సామర్లకోట :

రాజమండ్రి నుండి సుమారు 50కి.మీ. దూరంలో ఉన్న సామర్లకోటలో వుంది శ్రీ కుమార రామ భీమేశ్వరాలయం. ఇది పంచారామ క్షేత్రాలలో ఒకటి. ఈ ఆలయాన్ని స్వయంగా కుమార స్వామి ప్రతిష్ట చేసారని పూర్వ కధనము . అందువలనే ఈ ఆలయానికి ఆ పేరు వచ్చిందని చెబుతారు. ఎంతో విశాలంగా , ప్రశాంతంగా వుంటుంది ఈ ఆలయం. ఎంతో ప్రాశస్త్యం గల ఈ ఆలయాన్ని తప్పక దర్శించాలి.

సకల దేవతా అనుగ్రహ ప్రాప్తి రస్తు!!!

మీను శ్రీరామ్.

Comments

comments

Article Categories:
My City · Rajahmundry

Comments

Menu Title