శ్రీ శ్రీకాకుళ ఆంధ్ర మహా విష్ణువు

Written by

శ్రీకాకుళ ఆంధ్ర మహా విష్ణువు కోవెల కృష్ణా జిల్లా విజయవాడ నుండి 65 కి. మీ.దూరం లో ఘంటసాల మండలం శ్రీకాకుళం గ్రామం లో , కృష్ణా నదికి అర కి.మీ. దూరం లో వున్నది. భక్తులు స్వామి ని శ్రీకాకుళెశ్వర స్వామి, ఆంధ్ర మహా విష్ణువు, ఆంధ్రనాయకుడు, ఆంధ్ర వల్లభుడు, తెలుగు వల్లభుడు, సిరి కాకుల నాధుడు అని పిలుచుకుంటారు. ఉపనిషత్తుల ప్రకారం బ్రహ్మకు సంస్కృతం, విష్ణువుకు ఆంధ్రం, శివునికి ప్రాకృత భాషలు అత్యంత ప్రియమైనవి. ఆంధ్ర భాష పై ప్రీతి గల విష్ణువు శ్రీకాకుళం లో కొలువు తీరారని పురాణోక్తి.

ఈ కోవెలలో విష్ణువుకు శంఖం కుడి చేతిలో చక్రం ఎడమ చేతిలో ఉంటుంది.ఇది శాంతిని సూచిస్తుంది. ఇక్కడ విష్ణువును సాలగ్రామ మాల తో అలంకరిస్తారు. ఇలాంటి అలంకరణ మనం తిరుపతి లో మరియు ర్యాలి లో మాత్రమే చూడగలం. ఆశ్లేష, రేవతి, జ్యేష్ఠ నక్షత్రాలకు, మిధున,కన్య రాశులకు, బుధగ్రహ దోషాలకు ఈ క్షేత్రం పరిహార స్థలంగా చెబుతారు.

పురాణ కథనము :

కలియుగంలో పాపాలు పెరిగిపోతున్నాయని కలత చెందిన దేవతలు బ్రహ్మ దేవుని వద్దకు వెళ్లారట. అప్పుడు బ్రహ్మ దే వుడు, దేవతలు అంతా కలిసి భూలోకానికి వచ్చి తపస్సు చేసారట. వారి తపస్సుకు మెచ్చిన శ్రీ మహా విష్ణువు వరం కోరమని అడుగగా, మీరు భూలోకంలో ఈ ప్రాంతం లో కొలువై ఉండి భక్తుల పాపాలు హరించాలని కోరారట. అందుకు విష్ణువు అంగీకరించడంతో చతుర్ముఖ బ్రహ్మే నారాయణుడిని ప్రతిష్ట చేసారట. “కా” అనగా బ్రహ్మ “ఆకుళము” అనగా ప్రదేశము, అందువలనే ఆ ప్రాంతానికి శ్రీకాకుళం అని పేరు వచ్చిందని చెబుతారు.

క్రీ.పు. నాలుగవ శతాబ్దం లోనే ఇక్కడ స్వామివారికి ఆలయం ఉండేదట. ఆపై స్వామి మూల విరాట్ అదృశ్యమైపోయిందిట. దాదాపు 1000 సంవత్సరాల పాటు ఎవ్వరికి కనపడలేదట. ఒక సారి, ఒరిస్సా పాలకుడైన అంగపాలుడి ప్రధానమంత్రి నరసింహవర్మ ఈ ప్రాంతానికి వచ్చారట. ఈ క్షేత్ర మహిమ తెలుసుకుని, అదృశ్యమైన విగ్రహం కోసం ఎన్నో చోట్ల వెతికించా రట. కాని వారికి విగ్రహం లభించలేదు. కొన్ని రోజుల తరువాత స్వామి, నరసింహవర్మ స్వప్నం లో కనిపించి, వేమశర్మ అనే బ్రాహ్మణుడి ఇంటి ఆవరణలో వున్నానని చెప్పారట. వెంటనే ఆ బ్రాహ్మణుడి ఇంటికి వెళ్లి ఆ ప్రాంగణంలో తవ్వించగా అక్కడ స్వామి మూర్తి దొరికిందిట. ఆ మూర్తిని తీసుకొచ్చి శ్రీకాకుళం లో పునః ప్రతిష్ట చేసారట.

1081 వ సంవత్సరం లో ప్రస్తుతం వున్న రాజగోపురం, అనంత దండపాలుడు అనే రాజు నిర్మించారని అక్కడున్న శాసనాలు ద్వారా అవగతమవుతోంది.12,13 శతాబ్దాల నాటి 30 కి పైగా శాసనాలు కోవెల గోడల పైఉన్నాయి. 16వ శతాబ్దంలో శ్రీ కృష్ణ దేవరాయలు ఈ కోవెలను సందర్శించారనీ, తన ఆంధ్ర కావ్యం ఆముక్త మాల్యద రచన ఇక్కడే ప్రారంభించారని చెబుతారు. కోవెల సంరక్షణకి అయిదు ఊళ్ళను దానమిచ్చారని అంటారు. ఆ తరువాతి కాలంలో చల్లపల్లి జమిన్దారులైన యార్లగడ్డ కొదండరామన్న ఈ దేవాలయ సంరక్షణా బాధ్యతను చేపట్టారు. ఇప్పటికీ ఆ వంశీయులే ఈ ఆలయ ధర్మకర్తలు…

నారాయణ తీర్థులవారు శ్రీకృష్ణ లీలా తరంగిణి లో ఆంధ్ర మహా విష్ణువును కీర్తించారు. శ్రీనాధుడు కూడా క్రీడా గ్రామంలో ఈ క్షేత్ర మహిమను కొనియాడారు.

కృష్ణా నదిలో స్నానం ఆచరించి దైవ దర్శనం చేసుకుంటే సకల పాపాలు నశిస్తాయని, వైకుంఠ ఏకాదశి నాడు ఉత్తర ద్వారం ద్వార స్వామి ని దర్శిస్తే పుణ్యలోక ప్రాప్తి అని భక్తుల ప్రగాఢ విశ్వాసం. ప్రతి ఏటా వైశాఖ మాసంలో బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవంగా నిర్వహిస్తారు.

పౌరాణికముగా, చారిత్రికముగా ఎంతో ప్రాశస్త్యం వున్న ఈ దివ్య క్షేత్రాన్ని దర్శించండి, పాపాలను తొలగించుకుని పుణ్య లోక ప్రాప్తిని పొందండి…

శ్రీ శ్రీకాకుళ ఆంధ్ర మహావిష్ణు కటాక్ష సిద్ధిరస్తు …

-మీను శ్రీరామ్

Comments

comments

Article Categories:
Heritage · Temples
Menu Title