రామ తీర్ధం – దర్శించిన వారి జన్మ ధన్యం

Written by

విజయనగరం నుండి కేవలం 12 కిలోమీటర్ల దూరం లో వున్న  దివ్య క్షేత్రం  రామ తీర్ధం.ఎంతో ప్రాశస్త్యం  వున్న ఈ కోవెల దర్శనానికి నేను, మా వారు డా. శ్రీరామ్  ఉదయాన్నే బయలుదేరాము.అక్కడికి వెళ్లేందుకు బస్సులు, ఆటోలు కూడా విరివిగా దొరుకుతాయి. సుమారు అర్థగంట లోపే అక్కడకు చేరుకున్నాం .

పచ్చని పొలాలు, ప్రకృతి  అందాలు, కనువిందైన కొండలు, అత్యంత ప్రశాంతంగా వుండే వాతావరణం లో  అలరారుతున్న పుణ్య క్షేత్రం శ్రీ రామ తీర్థం … ఆ స్వామి విగ్రహాలు తీర్థం లో (నీటిలో )  దొరికినందున  ఈ ప్రాంతానికి రామ తీర్థం అని పేరు వచ్చింది. 500 సంవత్సరాల క్రితం పూసపాటి గజపతులు ఈ కోవెలను నిర్మించారు.

కొవెలలోకి  వెళ్లి శ్రీరాముని దర్శనం గావిన్చాము. అందాల రాముడు, ముగ్ధమనోహరమైన సీతమ్మతల్లి. ఆహా , ఆ సీతా లక్ష్మణ సమేత శ్రీ రామ చంద్రుని విగ్రహ మూర్తులు ఎంతో శోభాయమానంగా ఎంత చూసినా తనివి తీరనట్టుగా వున్నాయి. ఇంత సమ్మొహనమైన ఆ విగ్రహాల  గురించి, ఆ స్థల  ప్రాశస్త్యం గురించి తెలియపరచమని  మా  వారు  అక్కడి పూజారి గారిని  కోరగా, వారు  ఇలా  వివరించారు. ఆ విగ్రహాలను స్వయంగా శ్రీకృష్ణ పరమాత్ముడు సృష్టించి పాండవులకు ఇచ్చారనీ , వారు అరణ్యవాస సమయంలో ఈ ప్రాంతం లో  కొన్నాళ్ళు వుండి ఆ  విగ్రహాలకు నిత్యం పూజాదికాలు నిర్వహించారని స్థల పురాణం చెబుతోంది అన్నారు .  ఆది శంకరాచార్యులు, రామానుజాచార్యులు  కూడా ఇక్కడకు  వచ్చి రాముల వారిని దర్శించుకున్నట్లు చెబుతారు అని  అన్నారు .నేటికీ  వైఖానస ఆగమం ప్రకారం పూజలు చెయ్యడం ఆనవాయితీగా  వస్తోందనీ , ప్రతిరోజూ లోకకళ్యానార్థమ్ హోమం చేయడం ఇక్కడి ప్రత్యేకత అని , మాఘ శుద్ధ ఏకాదశి నుంచి మాఘ శుద్ధ పౌర్ణమి వరకు వార్షిక కళ్యానొత్సవాలు ఘనంగా నిర్వహిస్తారుఅని ,  శ్రీరామ నవమి నాడు  అత్యంత వైభవంగా  కళ్యాణం  జరుగుతుందనీ  , దాదాపు లక్ష మంది భక్తులు శ్రీ సీతారామ కళ్యాణం  కనులార చూచేందుకు వస్తారని చెప్పారు. రాష్ట్ర విభజన అనంతరం ప్రభుత్వ  లాంఛనాలతో  శ్రీరామ నవమి వేడుకలు అంగ రంగ వైభవంగా జరిగాయి  అని, దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రివర్యులు శ్రీ  సీతా రాముల కు పట్టు వస్త్రాలు సమర్పించగా , స్థానిక మంత్రివర్యులు ముత్యాల తలంబ్రాలు సమర్పించార నీ , టి.టి.డి. వారు పట్టు వస్త్రాలను పంపించారు అని వారు సెలవిచ్చారు.

కోవెల ప్రాంగణములో ఊర్ధ్వ పుండ్రము లతో   (తిరు నామములతో )  ఎన్నో  తాబేళ్లు  మనకు  దర్శనమిస్తాయి. వాటిని  చూడగానే  మాకు   కూర్మావతార ధారి అయిన శ్రీమహా  విష్ణువు కనుల ముందు సాక్షాత్కరించిన అనుభూతి కలిగింది. కాసేపటి వరకు వాటిని అలా చూస్తూ ఉండిపోయాం.

అనంతరం,  శ్రీ రాముల వారి కోవెల ప్రక్కనే వున్న శివాలయాన్ని దర్శించుకున్నాము.  శ్రీరాముని వారి లానే ఆ పరమ శివుడు కూడా నిత్యం  పూజలు అందుకుంటున్నారు.  ఇక్కడ శైవ పర్వదినాలు కూడా అత్యంత వైభవంగా నిర్వహిస్తారు. కార్తిక మాసంలో , శివరాత్రి రోజున ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. ఆ దినములలో భక్తుల తాకిడి చాలా ఎక్కువగా వుంటుంది.

శివకేశవుల  దర్శనం  అనంతరం  కోవెలకు  దగ్గరలో  వున్న బోధి కొండ పైకి వెళ్ళాము . ఆ కొండ పైన సుమారు  వేయి  సంవత్సరాల క్రితం నిర్మించిన ఒక చిన్న శిధిల ఆలయం వుంది. శ్రీ రాముల వారి పాద ముద్రలు , చిన్న నీటి కొలను వున్నాయి. త్రేతాయుగంలో శ్రీరాముల వారి వనవాస సమయంలో  రాముల  వారు సీతా లక్ష్మణ సమేతంగా ఈ ప్రాంతంలో  సంచరించార నీ , ఆ సమయంలో సీతమ్మతల్లి కి దాహం వేస్తె, రామయ్యతండ్రి బాణం  వేసి పాతాళ గంగను రప్పించారని తెలుసుకున్నాము. ఎంత వేసవి అయినా  ఆ కొలను ఎండక  పోవడం  ఆ శ్రీరామ చంద్రు ని మహిమ అని ఆ ప్రాంతం వారు ప్రగాఢముగా నమ్ముతారు. నాకైతే ఆ మహాపతివ్రత అయిన సీతమ్మతల్లి దాహం తీర్చిన ఆ చిన్న కొలను అమృత కలశం లా కనిపించింది. ఆ నీటిని నెత్తిన జల్లుకోగానే ఆ సీతమ్మవారే  స్వయంగా వచ్చి ఆశీర్వదించిన మధుర భావన కు లోనయ్యాను.

ఆ ప్రాంతం లో జైనులు,  బౌద్ధులు  కూడా సంచరించారని, అక్కడున్న కొన్ని జైన,  బౌద్ధ  ఆలయ శిధిలాలె వాటికి ఆధారమని తెలుసుకున్నాం. ఇంత ప్రాశస్త్యం  వున్న  దివ్య క్షేత్రం అయిన రామ తీర్థాన్ని దర్శించుకున్న మా జన్మ ధన్యం . ఎంతో భక్తి భావంతో, మనసులో ఆ శ్రీరామ చంద్రుడిని,  సీతమ్మతల్లిని స్మరించుకుంటూ ఇంటికి తిరుగు ప్రయాణం  అయ్యాము.

Comments

comments

Article Categories:
Heritage · Temples

Comments

Menu Title