అమృత ఫలం “లడ్డు ప్రసాదం”

Written by

మూడు వందల సంవత్సరాల చరిత్ర, మూడు వందల అరవై అయిదు రోజులూ తిన్నా తనివి తీరదే అనే ఓ పవిత్రమైన, ఆధ్యాత్మికమైన భావన. ప్రపంచం లో మరి ఎక్కడా దొరకని అమూల్యమైన వరం, శ్రీవారి భక్తులకు మాత్రమే లభ్యమయ్యే అదృష్టం. శ్రీ వేంకటేశ్వర స్వామివారి దర్శన భాగ్యం అనంతరం దక్కే అమృత ఫలం “లడ్డు ప్రసాదం” . “శ్రీ వారి లడ్డు ” గా జగత్ విఖ్యాతమైది. ఎవరైనా తిరుపతి వెళ్ళారని తెలియగానే, స్వామి వారి దర్శనము బాగా జరిగిందా? లడ్డుప్రసాదం తెచ్చారా? అని అడగని భక్తుడు ఉండడు. ప్రసాదం కళ్లకు అద్దుకుని , నోట్లోవేయగానే, ఓం నమో వేంకటేసాయ అంటూ ఆధ్యాత్మిక పారవశ్యాన్ని పొందని భక్తులు ఉండరు.

తిరుపతి శ్రీవారి లడ్డుకు ఎంతో ప్రాశస్త్యం ఉంది. ప్రపంచం లో ఎక్కడా ఇలాంటి రుచి ఉండదు. చిన్న పలుకు కళ్లకద్దుకొని , నోటిలో వేయగానే మనసంతా ఆధ్యాత్మిక భావనతో నిండిపోయి, ప్రశాంతం గా మారి పోతుంది. శ్రీవారి దర్శనానంతరం ఏ భక్తుడు, లడ్డు ప్రసాదం స్వీకరించకుండా తిరిగి వాళ్ళ ఊరు బయలు దేరడు. ఇంటికి వెళ్లిన తరువాత ఆ ప్రసాదాన్ని బంధు మిత్రులకు పంచి ఆనందాన్ని పంచుకోడం తెలుగువారి సంప్రదాయం.

2/8/2015 తో శ్రీవారి లడ్డు 300 సంవత్సరాలు పూర్తి చేసుకుంది అని టి. టి. డి. ప్రకటించింది. 2/8/1715 నుండి లడ్డులు తయ్యారు చేస్తున్నట్టు తెలిపారు. భక్తులకు లడ్డు ప్రసాదంగా 1940 వ సంవత్సరం నుండి పంపిణి చేస్తున్నారు. ప్రసాదం కౌంటర్లో 620 మంది పనిచేస్తున్నారనీ, అందులో 270 మంది లడ్డు తయారీలో నిమగ్నమై ఉంటారనీ , రోజుకు 1,20,000 కు పైగా లడ్డులు తాయారు అవుతాయని టి. టి. డి.వారు తెలిపారు.

తిరుమలలోని స్వామివారికి ప్రతిరోజూ నైవేద్యాలు పెడుతూ ఉంటారు. మనకు సాధారణంగా తెలిసే ప్రసాదాలు లడ్డు, వడ, పులిహోర, పొంగలి, అట్లు, కదంబం. ఇవికాక ఎన్నోరకముల ప్రసాదములు స్వామివారికి ఆరగింపుగా పెడతారు. ఇవి అన్నీ శ్రీ వారి ప్రధాన వంటశాల అయిన పోటులో తయారు చేస్తారు.

స్వామివారికి పెట్టే ఇతర నైవేద్యాలు:

వెన్న, పాలు, చక్కెర, బెల్లం కలిపిన నువ్వుల పిండి, చక్కెర పొంగలి(శాకరిబాత్), అప్పాలు, శుద్దనం, సిరా, పాయసం, కేసరిబాత్, క్షిరాన్నం, పంచకజ్జాయం (చక్కెర, గసగసాలు, కలకండ, ఎండుద్రాక్ష, జీడిపప్పు, బాదంపలుకులు, ఎండు కొబ్బరి తురుము మొ. కలిపిన పొడిప్రసాదం ), నెయ్యి దోసెలు, మోల్హర, పండ్ల ముక్కలు, జిలేబి, పెద్దపెద్దమురుకులు, పూర్ణ బూరెలు, శనగ గుగ్గిళ్ళు, బెల్లపు దోసెలు, పెసరపప్పు పరవాన్నం, పానకం, మనోహరం మొ !! నైవేద్యాలు పెడతారు. వకుళమాత వీటి తయారిని పర్యవేక్షిస్తుంటారుట.

ఆధునిక కాలంలో గ్యాస్ స్టవ్ వంటకాలు సర్వసాధారణం. కానీ తిరుమలేశునికి ఈ కృత్రిమ స్టవ్వులమీద వండిన వంటకాలు నైవేద్యంగా సమర్పించరు. సంప్రదాయబద్ధంగా కట్టెల పొయ్యిపై వండిన అన్న ప్రసాదాలను నైవేద్యంగా సమర్పిస్తారు.

సుప్రభాత సేవ, తోమాల, అర్చన సేవలు ముగిసిన తర్వాత వేంకటేశ్వరుని ఆలయం ఎదురుగా, స్వామి పుష్కరిణి వద్ద కొలువైన ఆది వరాహస్వామివారికి తొలుత నైవేద్యం సమర్పించిన తర్వాత గర్భగుడిలోని మూలవిరాట్టుకు నైవేద్యం సమర్పిస్తారు.

తిరుమల వేంకటేశ్వరునికి ”ఓడు” అని వ్యవహరించే పగిలిన కొత్త మట్టికుండలో వెన్న మీగడలు కలిపిన అన్నాన్ని నైవేద్యంగా సమర్పిస్తారు. ఈ అన్నాన్ని ”మాతృ దద్దోజనం” అంటారు .

ఇన్ని రకాల పిండి వంటలతో రోజు స్వామి వారికి ఆరగింపు పెడుతున్నా, శ్రీవారు, పద్మావతమ్మ, అలివేలుమంగమ్మ లకు నచ్చిన, మెచ్చిన, అత్యంత ప్రియమైన, ప్రీతికరమైన ప్రసాదం మాత్రం లడ్డునె.

-మీను శ్రీరామ్

Comments

comments

Article Categories:
Heritage · Temples
Menu Title