తెలుగు సినిమాకి దారేది? – Part-2

Written by

తెలుగు సినిమాకు కష్టాలు కొత్త కాకపోయినా హైదరాబాద్ వచ్చాక మాత్రం “సినిమా” కష్టాలు వచ్చిపడ్డాయి . “సినిమా” కష్టాలు అంటే తెలుసు కదా ( హీరో చెల్లెలు మూగ, తల్లి రోగిష్టి, తండ్రి తాగుబోతు, దొరకని ఉద్యోగం, వేలానికి వచ్చిన ఇల్లు, అవమానించే హీరోయిన్ తండ్రి ..ఇలాంటివన్నీ కలిసి ఒక్క హీరో కే వస్తుంటాయి) ఇలాంటి కష్టాలు దాటటానికి హీరో సైకిల్ తొక్కి పదివేలు సంపాదించి ఆ పదివేల రూపాయలతో అన్నీ కష్టాలు గట్టెక్కినట్లే అని ప్రేక్షకులను ఎలా కొద్దిసేపు సంతృప్తి పరుస్తాడో, అలాగే నిర్మాత కూడా చెమటోడ్చి కష్టపడితే కొద్దో గొప్పో సినిమా పరిశ్రమ కూడా తాత్కాలికంగా కొంచెం కలెక్షన్లు సాధించి తృప్తి పడుతూ ఉంది. అన్నట్లు హీరో కి పదివేలు అవసరమైనప్పుడల్లా సైకిల్ పోటీలు పెట్టి పదివేలు ఇచ్చి ఆదుకొనే వారు సినిమాలలోనే తప్ప నిజంగా ఉండరు, కాబట్టి ఆ పదివేల కాన్సెప్ట్ కూడా ఎప్పుడో ఒకప్పుడు తప్ప ప్రతి సినిమాకి వర్కవుట్ కాదు.

(తెలుగు సినిమాకి దారేది? Part- 1 కోసం క్లిక్ చెయ్యండి)

మద్రాసులో ఉన్నప్పుడు అన్నీ లాభాలే అని చెప్పలేము కానీ, నష్టాలు మాత్రం ఈ స్థాయిలో లేవు, తెలుసు సినిమా తెలుగు రాజధానిలో ఉండాలి అన్న ఆలోచన మంచిదే , అందుకోసం ఇక్కడకు తరలి రావటం మంచిదే . అందుకు నిర్మాతలను, దర్శకులను ఖచ్చితంగా అభినందించే తీరాలి . కానీ ఆ పరిశ్రమ నిలబడటానికి, అభివృద్ది చెందటానికి తగ్గ ఏర్పాట్లు మాత్రం ఇక్కడ లేవు, ఆ ఏర్పాట్ల మీద అటు ప్రభుత్వ పరంగా కానీ, పరిశ్రమ పరంగా కానీ ఎలాంటి శ్రద్ద పెట్టలేదు దాంతో ప్రొడక్షన్ కాస్ట్ బాగా పెరిగిపోయింది. స్టూడియోలు ఉన్నాయి కదా, వాటికి స్థలం ప్రభుత్వమే కేటాయించింది కదా అనుకోవచ్చు, కానీ సినిమా కు కావాల్సింది కేవలం స్టూడియో కాదు. దానిలో అన్నీ శాఖలకు సంబంధించిన సాంకేతిక నిపుణులు. పరిశ్రమ పెద్దలు కూడా ప్రభుత్వం కేటాయించిన స్థలాల్లో కోట్లు ఖర్చు పెట్టి స్టూడియోలు కట్టారు కానీ, సాంకేతిక నిపుణులను ఎలా సమకూర్చుకోవాలి అనే విషయాన్ని పట్టించుకోలేదు. మద్రాసులో 1915 నుండే చలన చిత్ర పరిశ్రమ ఉండటంతో అక్కడ సాంకేతిక నిపుణుల కోసం వెతుక్కోవాల్సిన పనిలేకుండా పోయింది, లెక్కకు మించినంతమంది అందుబాటులో ఉండేవారు, అందువల్ల ఎవ్వరూ ఈ సమస్య మీద దృష్టి పెట్టలేదు అసలు అదొక సమస్య గా కూడా గుర్తించలేదు.

సాంకేతిక నిపుణులు

నిర్మాతలు, దర్శకులు, హీరోలు హైదరబాద్ కు షిఫ్ట్ అయ్యి ఇక్కడే షూటింగ్స్ చెయ్యటం ప్రారంభించినా సాంకేతిక నిపుణులను పూర్తి స్థాయిలో హైదారాబాద్ కు రప్పించటంలో పరిశ్రమ సక్సెస్ కాలేకపోయింది . దానికి కారణం సాంకేతిక నిపుణులు ఎవ్వరికీ కూడా పెద్ద రెమ్యూనరేషన్లు ఉండకపోవటం, వర్క్ గ్యారంటీ లేకపోవటం తో , మద్రాసు వదిలి హైదారాబాద్ రావటానికి ఎవ్వరూ పెద్దగా ఇష్టపడలేదు, ఇక్కడ వర్క్ ఎలా ఉంటుందో, అసలు ఉంటుందో, ఉండదో తెలియని పరిస్థితుల్లో వారు రావటానికి ఇష్టపడక పోవటం లో విచిత్రం లేదు . అందుకే షూటింగ్స్ ఇక్కడ జరుగుతున్నా, సాంకేతిక నిపుణులు అందరిని మద్రాసు నుండి పిలిపించుకొనే షూటింగ్స్ చేసేవారు, రామోజీ ఫిల్మ్ సిటీ వచ్చాక కొంత మార్పు వచ్చినా, అది సిటీకీ బాగా దూరంగా ఉండటం, అక్కడ లోకేషన్స్ రేట్లు . ఉదయాన్నే షూటింగ్ చేయాలి అంటే ముందు రోజు రాత్రే అక్కడ ఉండవలసి రావటం ,దానికి హోటల్ ఖర్చులు . ప్రయాణ ఖర్చులు తడిసి మోపెడు అవుతుండటం ఇవన్నీ కూడా ప్రభావం చూపాయి.

లొకేషన్స్

ఇక లొకేషన్స్ విషయానికి వస్తే హైదరబాద్ చుట్టు పక్కల అందమైన లోకేషన్స్ కొంచెం తక్కువే అని చెప్పుకోవాలి, సినిమాతెరపై అందంగా కనపడే సముద్రం కానీ, సహజమైన ల్యాండ్ స్కేప్స్ కానీ పెద్దగా లేవు, ఏదైనా విలేజ్ వాతావరణం కావాలి అన్నా కూడా ఇక్కడ కష్టమే, దానికి తోడు ఎక్కడైనా ఒకటి రెండు చోట్ల అలాంటి లోకేషన్స్ కనపడినా విలేజర్స్ భారీ మొత్తంలో డబ్బులు డిమాండ్ చెయ్యటం కూడా జరుగుతుంది (ఒక ఆగ్ర నిర్మాత తన కొడుకు ని హీరోగా ఇంట్రడ్యూస్ చేస్తూ తీసిన ఒక సినిమాలో ఒక్క రోజు, ఒక వీధిలో షూటింగ్ చేసుకున్నందుకు ఏకంగా కమ్యూనిటీ హాల్ కట్టించవలసి వచ్చింది, మరో నిర్మాత, మరో గ్రామంలో ఒక రోజు షూటింగ్ కోసం బోర్ వేయించాల్సి వచ్చింది ) ఇవన్నీ సామాజిక సేవలో భాగమే కదా, చేస్తే తప్పేముంది అని చెప్పకండి ప్లీజ్, అదే మద్రాసు చుట్టుపక్కల గ్రామాల్లో అయితే ఇలాంటి సమస్య లేదు, వారు డిమాండ్ చేసే మొత్తం ఇక్కడితో పోల్చుకుంటే చాలా తక్కువ, ఇక గోదావరి గ్రామాల్లోనో, వైజాగ్ దగ్గరి గ్రామాల్లోనో, అయితే విలేజర్స్ రూపాయి అడగరు కదా ! యూనిట్ అందరికి భోజనాలు కూడా ఏర్పాటు చేస్తారు . ఏమైనా కోస్తా వాళ్ళు సినిమా అంటే అన్నీ కోసేసుకుంటారు ఇలాంటివన్నీ ప్రొడక్షన్ ఖర్చు ను విపరీతంగా పెంచేస్తాయి .

క్రమశిక్షణ

హైదరబాద్ కి వచ్చాక, నష్టపోయిన మరో ముఖ్య విషయం క్రమశిక్షణ. మద్రాసు లో ఉదయం 6 గంటలకే లొకేషన్లో ఉండే వారు. ఏడుగంటలకి ఎట్టి పరిస్థితుల్లో మొదటి షాట్ తీసేవారు, నటులు, దర్శకులు, సాంకేతిక నిపుణులు అందరు 6 గంటలకే లొకేషన్ కి వచ్చి మేకప్ , కాస్ట్యూమ్స్ అన్నీ చూసుకొని, లైటింగ్ ఆరేంజ్ మెంట్స్ అన్నీ సెట్ చేసుకొని 7 గంటలకు మొదటి సీన్ షూట్ చేసితీరేవారు, హైదరబాద్ వచ్చాక ఇది మిస్ అయ్యింది . ఇప్పుడు ఎవరో ఒకరు తప్ప 8 -8:30 కి కానీ మొదటి షాట్ తియ్యటం లేదు, ఒక గంటే కదా పెద్ద లేట్ ఏముందిలే అనుకుంటారేమో, ఒక పెద్ద సినిమాకి రోజు అయ్యే ప్రొడక్షన్ ఖర్చు 5 -6 లక్షల రూపాయలు ఉంటుంది . అంటే గంటకు దాదాపు 50 వేల రూపాయలు, అంటే ఒక్క నిమిషం ఖర్చు దాదాపు 1000 రూపాయలు, ఇందులో రెమ్యూనరేషన్ కలిపి లేదు, అది కలిపితే ఆర్టిస్ట్ ని బట్టి మరో 2000-20000 రూపాయలు అదనం .యాభై రోజులు షూటింగ్ అనుకుంటే ఈ మొత్తం ఎంత అవుతుందో ఆలోచించండి. మద్రాసులో ఇప్పటికీ కూడా ఉదయం 7 గంటలకే మొదటి షాట్ తీస్తూ ఉండటం గమనార్హం .దానికి కారణం బహుశా బ్రిటీషర్స్ ఇచ్చి వెళ్ళిన క్రమశిక్షణ కావచ్చు, మద్రాసులో ప్రజలు త్వరగా పడుకొని, త్వరగా లేచే అలవాటు. హైదరబాద్ లో అంతా నవాబ్ కల్చర్, ఇక్కడ ఆలస్యంగా నిద్రలేచి, ఆలస్యంగా పడుకొనే అలవాటు .ఇది చూడటానికి చిన్న విషయంలానే కనిపిస్తుంది కానీ, రోజువారీ షూటింగ్ లో ఇది చాలా ఇబ్బందికరంగా ఉంటుంది.

సెట్టింగ్స్

సెట్టింగ్స్ విషయానికి వద్దాం. మద్రాసులో ఏ సెట్టింగ్ కావాలన్నా దానీ సంబంధించిన మౌల్డ్స్ రెడీమేడ్ గా అందుబాటులో ఉంటాయి, దానితో సెట్టింగ్స్ కాస్ట్ చాలా తగ్గుతుంది, హైదరబాద్ లో ఎందుకో గానీ ఆలా రెడీమేడ్ మౌల్డ్స్ అందుబాటులో ఉండవు, ప్రతి సారి కొత్త మౌల్డ్ చేయించుకోవాల్సిందే ఇటీవల ఒక చిత్రానికి దాదాపుగా ప్రతి సినిమాలో కనిపించే కోర్ట్ బోన్ కూడా కొత్తగా తయారు చేయించుకోవాల్సి వచ్చింది , మద్రాసు లో అయితే అవి రెడీమేడ్ గా అందుబాటులో ఉంటాయి, నామ మాత్రపు అద్దె ఇస్తే సరిపోతుంది . ఇక ఆర్టికల్స్ విషయానికి వద్దాం. సాధారణంగా లొకేషన్ స్పాట్ లో రకరకాల వస్తువులు వాడుతుంటారు .ఇవన్నీ అద్దెకు తెచ్చి వాడేవే. మద్రాసులో ఇలా ఆర్టికల్స్ అద్దెకు ఇచ్చేవి కనీసం 20-25 షాపులు ఉన్నాయి, హైదరబాద్ లో 4-5 కు మించి లేవు, అవి కూడా అన్నీ రకాల వస్తువులు అందూబాటులో ఉండవు, ఇవన్నీ కొనాలన్నా, తయారు చేయించాలన్నా, అనవసరమైన ఖర్చు. స్టూడియోలు ఉన్న నిర్మాతలకు ఈ బాధ కొంచెం తప్పుతుందేమో కానీ అవి లేని నిర్మాతలకు ఇది పెద్ద భారమే ఇలా ప్రతి విషయంలోనూ, మద్రాసు నుండి హైదరబాద్ కు సినిమా తరలి వచ్చాక, సినిమా పరిశ్రమ నష్టపోయిందే కానీ పెద్దగా లాభ పడింది లేదు, కాకపోతే మన తెలుగు నేల మీద మనం తెలుగు సినిమా అనే భావం ఒక ఆత్మ తృప్తి ని ఇస్తుంది.

Comments

comments

Article Categories:
Entertainment

Comments

Menu Title