పుష్కర గోదారిలా… రాజమౌళి రహదారి

Written by

ఒకడి కల… వేల మంది కలయిక… వేయి రోజుల శ్రమ : బాహుబలి
మెరుపు అరవలేదు. ఉరుము మెరవలేదు. మెరుపు అరుపూ రెండూ ఉండాలంటే ఆకాశం కావాలి. ఆకాశం లేకపోతే ఉరుములు మెరుపులు కనిపించే అవకాశం లేదు. మనుషుల్లో కూడా ఇలాంటివాళ్లుంటారు. అప్పుడప్పుడూ మెరిసేవాళ్లు. ఒకట్రెండు మెట్లెక్కగానే ఉరిమే వాళ్లూ ! ఆకాశంలా ఉండేవాళ్లే అరుదు. అలాంటి అతి కొద్దిమందిలో చెప్పుకొని తీరాల్సిన పేరు బాహుబలి రూపశిల్పి రాజమౌళి. ఇంతటి భారీ బాధ్యతని గుండె ధైర్యంతో మోసి… తన కలని ప్రపంచానికి చూపించే సాహసం చేసిన రాజమౌళిని నిజానికి బాహుమౌళి అనాలి ఇక నుంచి !
పుష్కరానికి రాజమౌళికీ లింకేంటి? లింకూ ఉంది. సిమెంట్ లాంటి సెంటిమెంటూ ఉంది. పాపికొండల పైరగాలి పీల్చి కొవ్వూరు గట్టున పెరిగిన
రాజమౌళికి పుష్కర ఆశీర్వాదం పుష్కలం. సరిగ్గా పన్నెండేళ్ల కిందట సింహాద్రి. ఓ బంపర్ హిట్ తో నేనొచ్చానంటూ టాలీవుడ్ కి ప్రూవ్ చేశాడు. అది అప్పటికి తెలుగులో హయ్యెస్ట్ గ్రాసర్. అది మామూలు పుష్కరం. ఇపుడు జరుగుతున్నది మహాపుష్కరం. అందుకే ఈసారి హాలీవుడ్ ఎరీనాలో ఎంట్రీ ఇచ్చాడు. ఇదీ నా తడాఖా అంటూ తనని తాను రీ లాంచ్ చేసుకున్నాడు. పరవళ్లలోనే కాదు..ఒరవడి, ఉద్ధతిలోనూ గోదారికి రాజమౌళికీ చాలా పోలికలున్నాయ్.

 పచ్చబొట్టేసినా… పిల్లగాడా నిన్ను…

గోదారికి ఓ చిత్రమైన గుణముంది. కథలు చెప్తుంది. కవ్విస్తుంది. ఆ నీళ్లు తాగితే క్రియేటివిటీ ఒంట్లోకి జీర్ణించుకుంటుంది. అద్భుత సాహిత్యం, ఆశ్చర్యపరిచే ఆలోచనలు… ఎగిరి దూకి అవకాశాన్ని అందుకోవాలన్న ఉత్సాహం అన్నీ అందులోనే ఉంటాయ్. దానికి కారణం ఉంది. భద్రాచలం నుంచి గోదారి నీళ్లలో ఔషధ గుణాలు పెరుగుతాయట. వాగులు, అడవుల్లోంచి కొన్ని పాయలు వచ్చి కలవడం లాంటివన్నీ ఇందుక్కారణమే! ఆ వేళ్లు..నేలలో ఉండే కొన్ని లవణాలు చేరి…గుణం మారుతుంది. మహారాష్ట్ర మట్టి..తెలంగాణని కలుపుకొనొచ్చి…కోనసీమకి కుదువ పెడుతుంది.
అందుకే గోదావరిజిల్లాలో కదిపితే కథలు. ఆ కథల్ని కంచికి చేర్చేవాళ్లు ఎందరుంటారు చెప్పండి. అలాంటి కొందరిలో విక్రమార్కుడు రాజమౌళి.
గోదావరికి పొడవెక్కువ. లోతెక్కువ. దానికి తగ్గట్టే గాంభీర్యం కూడా ! సముద్రంలో కలిసే ముందు చెలరేగే పిల్లవాగు స్వభావంలేనిది గోదావరి. గౌతమి, వైనతేయ లాంటి పాయల్ని, ఛాయల్ని కలుపుకొంటూ కొండలు గుట్టలుచేరి రాష్ట్రాలు దాటొస్తుంది గోదావరి జిల్లాలకి. అయినా… ఎంతో చూశానన్న జడి ఎక్కడా ఉండదు. అలజడి లేనేలేదు. కొత్తదనాన్ని కలుపుకొంటూ మార్పుల్ని తనలో ఇముడ్చుకుంటూ తన పనేదో తనది అన్నట్టు వెళ్లిపోతుంది గోదావరి. అందుకే ఈ రోజుల్లో ఎర్రనీళ్లతో కనిపిస్తుంది గోదావరి. ఆ ఎరుపు కొత్త మెరుపు సంకేతం. విరుచుకుపడడం, విలయం
తల్లి గోదావరికి తెలీదు. వీలైతే ఓ చేయివేసి సాయం చేస్తానన్నట్టు కనిపిస్తుంది వాలు,ప్రవాహం. అందుకే గుజరాత్ తర్వాత నదీ అనుసంధానం మన కోస్తాలో జరిగే అకాశాలు ఎక్కువున్నాయ్.

రాజమౌళి అడుగులు కూడా అచ్చం గోదారిలాగే! ఓ సినిమా హిట్ అయితే సీఎం అయిపోవాలనుకునే హీరోలు..ఓహిట్ కొడితే మరో ప్రపంచాన్ని
క్రియేట్ చేసేస్తాం అన్నట్టు రెచ్చిపోయే డైరెక్టర్లు ఉన్న రోజుల్లో రాజమౌళి కచ్చితంగా మన గోదారి కైండ్ ఆఫ్ పర్సన్. ఎక్కడా తొణకడు. బెణకడు. ఓ ప్రాజెక్ట్ అనుకుంటే అటూఇటూ బెసకడు కూడా ! ఇప్పటి వరకూ గాసిప్ లు..గందరగోళాలు, నెగెటివ్ టాక్ లు పర్సనల్ గా, ప్రొఫెషనల్ గా కూడా
లేని వన్ అండ్ ఓన్లీ డైరెక్టర్ రాజమౌళి. పైగా ఇతరుల సినిమాల్నికూడా ప్రమోట్ చేయడం టాలీవుడ్ లో యూనిక్ ట్రెండ్. తారక్ యాక్షన్ సీక్వెన్స్ అదుర్స్..మహేశ్ లుక్ సూపర్బ్ గా వచ్చింది లాంటి కామెంట్స్ కామన్ గా వస్తాయ్. పెద్ద హీరోల ప్రాపకం కోసం అలాచేశాడు అనుకుందాం.నిఖిల్ స్టోరీ పికింగ్ అద్భుతం. కీపిటప్. నీ సినిమాచూశా బావుందని అని చెప్పాడంటే కచ్చితంగా జక్కన్న జన్యూన్. చాలాతక్కువ మందికి తెలిసిన ఇంకో విషయముంది. హృదయకాలేయానికి అంత హైప్ రావడానికి కారణం రాజమౌళే ! యూ ట్యూబ్ లో ప్రోమో పడగానే… వాట్ ఎన్ అటెంప్ట్ అన్నాడు. సంపూ చింపేశావ్… గో ఎ హెడ్ అన్నాడు. అదేంటి రాజమౌళి ట్వీట్ చేశాడంటే అంటూ… హైప్ తెచ్చారు ఆ సినిమాకి. అంతామన వాళ్లే అందరూ మనకి కావాలి అనుకునేవాళ్లు ఇలా ఎంతమంది ఉంటారు ?

గుండెల్లో గోదారి…కరకట్టలు కొట్టేస్తాయ్. ఆనకట్టలు ఆవరిస్తాయ్. మడ అడవులు చెరిగిపోతాయ్. ఎన్ని ఇబ్బందులొచ్చినా ఒక్కోసారి లంకల మీదకొచ్చిపడినా, పిల్లల మీద కోప్పడిన తల్లిలాగా తనంతట తానే వెనక్కి తగ్గుతుంది గోదావరి. పచ్చని మాగాణుల్ని దగ్గరుండి తన తీర్చిదిద్దుతుంది మళ్లీ ! రాజ మౌళైనా ఇంతే ! గోదావరికి వరదొస్తుంది. రాజమౌళికి కొత్త ఆలోచనొస్తుంది. కాకపోతే ఇక్కడ ప్రకోపం ఉండదు. సమాధానం డైరెక్ట్ సెల్యులాయిడ్ మీదే ఉంటుంది. సగటు ప్రేక్షకుడికి ఆ సంగతి తెలీదు. అది ప్రతీకారమని. పంతంకూడా అంతగొప్పగా సాధించొచ్చని.. వెటకారం చేసినోళ్లని వెంటాడే రేంజ్ లో విజయం ఉంటుందని రాజమౌళిని చూస్తే… కాస్త ఆలోచిస్తే తెలుస్తుంది. దీనికో చిన్న స్టోరీ ఉంది. మగధీర ఇండస్ట్రీ హిట్. వంద మందిని ఒకేసారి రమ్మన్న వీరుడు రాజమౌళి. కానీ ఆ సినిమా అంత హిట్ అయ్యాక ఓ టాక్ టాలీవుడ్ ని షేక్ చేసింది. ఆ నిర్మాత లేకపోతే ఆ హీరో లేకపోతే రాజమౌళెక్కడ అని ! వింటేనే కలుక్కుమనే విషయం. మరి విని తట్టుకోవడం అంటే సాధ్యమా ? మరొకడైతే ప్రెస్ మీట్ పెట్టి చెడుగుడు ఆడి…. మసాలా డైలాగ్ లు మోతమోగించేస్తాడు. రాజమౌళి గోదావరి లాంటోడు కదా ! అలాంటిదేమీ చేయలేదు. ఒకరిద్దరు అడిగినానవ్వి ఊరుకున్నాడు. తెరమీద ఎవరున్నా రియల్ హీరో ఎవరన్నది నిరూపించింది మర్యాదరామన్న. కామెడియన్ సునీల్ తో సూపర్ హిట్. హీరోగా చేసేది ఎవరైనా…హీరోని చేసేది రాజమౌళేనని ప్రూవ్ చేసిందీ సినిమా. నిజానికి ఆ టైటిల్ రాజమౌళికి బాగా సూటవుతుందేమో ! తర్వాత… అదే కసిలోంచి ఈగ పుట్టింది. నేనే హీరోనంటూ బాక్సాఫీస్ ని షేకాడించి మూడు భాషల్లో దాదాపు 90 కోట్లు వసూలు చేసింది. ఈగని హీరోని చేసినోడు ఇంకేమైనా చేస్తాడు కదా ! అదే బాహుబలికి పునాది. పెట్టుబడి. కాన్ఫిడెన్స్ ! ఓ రకంగా… నిర్మాతని డైరెక్టర్ తయారు చేస్తాడా ? నిర్మాతని డైరెక్టర్ నిలబెడతాడా ? అనే ప్రశ్నకి సమాధానం ఈగ. ముగింపు ఈగ.

గోదావరి పుష్కరాలకి రాజమౌళి బహుమానం… బాహుబలి

క్రియేటర్ ఏదైనాచేసి చూపించగలడు అనడానికి ఎగ్జాంపుల్ బాహుబలి. కలలు చాలామంది కనొచ్చు. ప్రాజెక్ట్ ఐడియాలు కూడా కొంతమందికి
ఉండొచ్చు. కానీ ఆ కలల్ని ప్రపంచానికి చూపించే సాహనం అతి కొద్దిమంటే చేయగలరు. గ్లోబంతా గిరగిరా తిప్పి వెదికినా నలుగురైదుగురైనా కనిపిస్తారో లేదో. కామెరూన్ అనో..స్పీల్ బర్గ్ అనో అంటాంవాళ్లని. ఇక నుంచి రాజమౌళి కూడా చేరిపోయాడు ఆ లైన్ లో! గుర్తుపెట్టుకుందాం.
ఒప్పుకుందాం… గర్వంగా చెప్పుకుందాం… తప్పులేదు !

– అభి

Comments

comments

Article Categories:
Entertainment

Comments

Menu Title