రజనీ సినిమాకు విజయేంద్ర ప్రసాద్ దర్శకత్వం!

Written by

విజయేంద్ర ప్రసాద్.. పేరుగా తగ్గట్లునే ఇప్పుడు విజయశిఖరాల మీద సేద తీరుతున్నారు. బాహుబలి, భజరంగీ భాయ్ జన్ సినిమాలు సెన్సేషనల్ హిట్స్ కావడంతో విజయేంద్ర ప్రసాద్ పేరు మర్మోగుతోంది. కేవలం వారం వ్యవధిలో విడుదల అయిన ఈ రెండు సినిమాలకు విజయేంద్ర కథలు అందించారు. అనుకోకుండా రెండు సినిమాలు ఒకేసారి విడుదల కావడం.. రెండూ కూడా భారీగా వసూళ్లు సాధించడంతో దేశంలోని అన్ని భాషల సినిమా వారు ఈ వెటరన్ రైటర్ గురించి చర్చించుకుంటున్నారు.

పశ్చిమ గోదావరి జిల్లా కొవ్వూరుకు చెందిన విజయేంద్ర ప్రసాద్ గొప్ప రచయితే కాదు.. ఆయనలో ఒక దర్శకుడు కూడా ఉన్నారు. 72 ఏళ్ల వయసులో ఆయనకు తన దర్శకత్వ ప్రతిభను చూపించే అవకాశాన్ని ఏకంగా సూపర్ స్టార్ రజనీకాంత్ ఇచ్చారు. బాహుబలి సినిమా మీద చర్చ వచ్చినప్పుడు విజయేంద్ర ప్రసాద్.. రజనీకాంత్ కు కథ చెప్పగా.. ఆయన గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం. రాజకీయ నేపథ్యం ఉన్న ఈ కథ రజనీకాంత్ కు బాగా నచ్చినట్లు సినిమా వర్గాలు చెబుతున్నాయి.

ప్రస్తుతం రజనీకాంత్ రోబో సినిమా తీసిన శంకర్ దర్శకత్వంలో నటిస్తున్నారు. ఆ సినిమా పూర్తి కాగానే విజయేంద్రప్రసాద్ దర్శకత్వంలో నటించనున్నారు. రజనీ ఇప్పుడు మంచి హిట్ కోసం చూస్తున్నారు. లింగ దెబ్బ నుంచి కోలుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. ఐ సినిమా తో బోల్తా పడిన శంకర్ ఇప్పుడు రజనీకి హిట్ ఇచ్చేందుకు శ్రమిస్తున్నారు.

విజయేంద్ర ప్రసాద్ ప్రస్తుతం తన లైఫ్ లో పీక్ స్టేజ్ లో ఉన్నారని చెప్పవచ్చు. మళ్లీ ఆయనకు వారం వ్యవధిలో రెండు పెద్ద హిట్లు దొరికే సందర్భం లభిస్తుందని చెప్పలేం. విజయేంద్రకే కాదు.. బహుశా ప్రపంచ సినీ చరిత్రలో ఇలాంటి అరుదైన రికార్డు మరే రచయితకు లభించకపోవచ్చు.

ఒకప్పుడు శ్రీమంతుల కుటుంబం అయినప్పటికీ కాలక్రమంలో ఆస్తులన్నీ పోగొట్టుకుని విజయేంద్ర ప్రసాద్ ఎన్నో ఇబ్బందులు పడ్డారు. కుమారుడు రాజమౌళికి ఉన్నత చదువులు చెప్పించలేకపోయారంటే ఆయన ఆర్థిక పరిస్థితి ఎలా ఉండేదో అర్థమవుతుంది. అలాంటి స్థితి నుంచి నేడు రాజయోగం పొందే స్థాయికి చేరుకున్నారు. ఎంత కష్టంలో ఉన్నా.. జీవితంలో ఉన్నత స్థానానికి ఎదుగుతామనే నమ్మకంతో శ్రమించారు. ఫలితం అందుకున్నారు. కష్టాల్లో ఉన్న వారికి విజయేంద్ర ప్రసాద్ కుటుంబ చరిత్ర గొప్ప పాఠం. తండ్రి కుమారులు సక్సెస్ అనే పదానికి పర్యాయపదంగా నిలిచారు. వీరిని ఎంత అభినందించినా తక్కువే.

 

Comments

comments

Article Categories:
Entertainment
Menu Title