తెలుగు సినిమాకి దారేది?

Written by

ఆత్మ తృప్తి తప్ప మరెలాంటి లాభాలు ఇవ్వని సినిమాని గత 19 సంవత్సరాలుగా హైదరబాద్ లో మోస్తున్న నిర్మాతలను మెచ్చుకోవాల్సిందే . నూటికో , కోటికో ఒక లాభం, ఎప్పుడూ నష్టాలతో, మూడు ప్లాపులు, ఆరుసూపర్ ఫ్లాప్ లతో సినిమా నడుస్తుంది , కకాపోతే తెలుగు ప్రజలు అన్నీ రాష్ట్రాల్లో , విదేశాల్లో స్తిరపడటంతో మన తెలుగు సినిమా మార్కెట్ పరిధి పెరిగింది , హైదారాబాద్ సాఫ్ట్ వేర్ హబ్ గా మారటం, ఇక్కడ నుండే విదేశాలకు వెళ్ళే అవకాశం రావటం. స్వతహాగా ఆంధ్రా ప్రజలు సినిమా ప్రియులు కావటం, చిత్ర పరిశ్రమ కూడా ఇక్కడికే రావటంతో , విదేశీ మార్కెట్ ఒక్కసారిగా పెరిగింది . కొంత మంది సాఫ్ట్ వేర్ ఇంజనీర్లు విదేశాల్లో డిస్ట్రిబ్యూటర్ల గా మారి సినిమా క్రేజ్ ను క్యాష్ చేసుకున్నారు . అదే సమయంలో అనేక చానల్స్ రావటంతో శాటిలైట్ బిజినెస్ కూడా దీనికి యాడ్ అయ్యింది . అలా రెవిన్యూ పెరిగింది, దానికి పది రేట్లు రెమ్యూనరేషన్లు పెరిగాయి, కోరికలు పెరిగాయి, పెట్టుబడులు పెరిగాయి, అన్నీ కలిసి లాభాలు మాత్రం తగ్గాయి
ఇప్పుడు హైదరాబాద్ సినిమా 19 సంవత్సరాల నవయవ్వనంలో ఉన్న కన్యక. ఇప్పటివరకు పుట్టింట్లో ఏనాడూ సుఖపడని దురదృష్టవంతురాలు. ఇప్పుడు ఈ సినిమా బాగుపడాలి అంటే మంచి అబ్బాయిని చూసి పెళ్ళి చేసి అత్తారింటికి పంపితే అక్కడ ఖచ్చితంగా సుఖంగా, ఆనందంగా జీవిస్తుంది .ఆ అత్తారిల్లు ఆంధ్ర ప్రదేశ్ , అక్కడ ఈ సినిమాని ప్రేమించే, అభిమానించే వారికి కొదవలేదు .

వైజాగ్ నుండి, రాజమండ్రి వరకు, ఇటు రాయలసీమ, ఇటు నెల్లూరు, ఒంగోలు ఎక్కడ చూసినా, సినిమాకు పనికి వచ్చే లోకేషన్స్, చిత్తూరు తలకోన అడవి కన్నా, సరైన అడవి లొకేషన్ ఎక్కడ ఉంది. అరకు లోయ కన్నా అందమైన ప్రాంతం ఎక్కడుంది. బొర్రా కేవ్స్ లో ఎంత అందమైన దృశ్యాలు చిత్రీకరించవచ్చు ??? ఒక్కసారి గండికోట చూడండి, అమెజాన్ లోయ కన్నా అందంగా ఉంటుంది . కోనసీమ కేరళ కన్నా అందంగా ముగ్ద మనోహరంగా కనిపిస్తుంది .పక్కనే ఉన్న యానాం, అటు ఫ్రెంచ్ ఆర్కిటేక్చర్, ఇటు గోదావరి , ఏ యూరోపియన్ కంట్రీలో ఉన్నట్లు అనిపిస్తుంది, విజయవాడ భవానీ ద్వీపం చూడండి ఎంత అందగా కనిపిస్తుందో , కొల్లేరు లేక్ , అసలు ఒక సినిమా మొత్తం అక్కడే తీసేయవచ్చు, శ్రీశైలం ఘాట్ సెక్షన్ చూడండి అందమైన ఈశాన్య రాష్ట్రాలకేమీ తీసిపోదు. ఇవన్నీ మనం , మన సినిమా నిర్మాతలు, దర్శకులు మిస్ అయిన లొకేషన్స్, వారికి తెలియక కాదు, హైదరబాద్ లోనే సరైన టెక్నీషియన్స్ లేరు, ఇక అక్కడ అసాధ్యం, హైదరబాద్ నుండి అక్కడకు తీసుకువెళ్తే అందరికి హోటల్స్, భోజనాలు, బేటాలు, తడిసి మోపెడు అవుతున్నాయి, అందుకే అన్నీ తెలిసినా తప్పక కాంప్రమైజ్ అయ్యి హైదరాబాద్ లో చుట్టేస్తున్నారు. ఈ పరిస్థితి మారాలి, ఆంధ్రా అంతటా షూటింగ్స్ జరగాలి, దీనికి సినీ పరిశ్రమతో పాటు ప్రభుత్వం కూడా సహకరించాలి, అవి రెండు జరిగిన రోజు తెలుగు సినిమా ఖచ్చితంగా బాలీవుడ్ కి పోటీ ఇస్తుంది, ఇటీవల విడుదలైన బాహుబలి సినిమానే ఇందుకు సాక్ష్యం .

ప్రభుత్వ పరంగా చెయ్యాల్సిన కొన్ని పనులు

1) ఆంధ్ర ప్రదేశ్ లో పూర్తిగా షూటింగ్ చేసుకున్న సినిమాలకు టాక్స్ ఉండకూడదు ; నిజానికి ఇది పెద్ద సమస్య కాదు, ఎంటర్ టైన్ మెంట్ టాక్స్ రూపంలో ప్రభుత్వ ఖజానా కు భారీగా డబ్బులు ఏమి రావు, మహా అయితే ఒక 200-250 కోట్లు . ఇది ప్రభుత్వానికి పెద్ద మొత్తం కాదు, కానీ సినిమాకు టికెట్ రేటు తగ్గి ప్రేక్షకులు ఎక్కువ మంది వస్తారు

2) ప్రభుత్వం కొన్ని సినిమాహాళ్ళు నిర్మించాలి : ఇది కూడా పెద్ద సమస్య కాదు, నిజానికి దీనివల్ల ప్రభుత్వానికి టాక్స్ కన్నా ఎక్కువ ఆదాయం వస్తుంది, థియేటర్స్ నిర్మాణానికి పెద్ద అడ్డంకి స్థల లభ్యత, దీనికి సులభమైన మార్గం ఉంది. దాదాపుగా ప్రతి మండల కేంద్రం లో RTC బస్టాండ్ లు ఉన్నాయి వాటి పై భాగం అంతా ఖాళీనే, అక్కడ 150-300 మంది కెపాసిటీ తో థియేటర్స్ నిర్మించవచ్చు . డిస్ట్రిబ్యూటర్ సిస్టమ్ , థియేటర్ లీజ్ సిస్టమ్ లేకుండా, నేరుగా నిర్మాత ,RTC రెండు ,రెవిన్యూ షేర్ చేసుకొనేలా చూడాలి. ఇందువల్ల అటు నిర్మాత కు లాభం వస్తుంది, ఇటు నష్టాల్లో ఉన్న RTC కి అదనపు ఆదాయం వస్తుంది. ఒక్కో థియేటర్ నిర్మాణానికి 25-30 లక్షల కన్నా ఎక్కువ కాదు, టికెట్ తో పాటు, రిఫ్రష్ మెంట్స్, వాటితో , నష్టాల్లో ఉన్న RTC ని కూడా లాభాల బాట పట్టించవచ్చు, ఇటు థియేటర్ లీజు విధానం వల్ల థియేటర్స్ దొరకని చిన్న సినిమాలకు థియేటర్స్ దొరికి నిర్మాత కూడా లాభాలు సంపాదిస్తాడు, ప్రతి టికేట్ ని కంప్యూటరైజ్ చెయ్యటం ద్వారా ఎన్ని టికెట్స్ అమ్ముడయ్యేది ఖచ్చితంగా తెలుస్తుంది

3) ముందుగా ఆంధ్ర లో ఒక ఫిల్మ్ ఇనిస్టిట్యూట్ రావాలి , అది కూడా ప్రభుత్వం తరుపున ఇంకా ఖచ్చితంగా చెప్పాలంటే పూణే తరహాలో మినిస్ట్రీ ఆఫ్ ఇన్ ఫర్మేషన్ & బ్రాడ్ కాస్టింగ్ తరుపున ఒక ఇనిస్టిట్యూట్ స్థాపించాలి, దీని ద్వారా ప్రతిభావంతులైన దర్శకులను, సినిమాటోగ్రాఫర్స్ ను, నటులను తీర్చిదిద్దవచ్చు, దీనికి అనుబంధంగా చిన్న చిన్న డిప్లొమో కోర్స్ లు పెట్టి , కొద్ది సాంకేతిక నిపుణులు (semi skilled labor) లను తయారు చేయాలి, లైట్ మెన్ , మేకప్ మెన్, లాంటి వారిని తయారు చేయవచ్చు, అలాగే మనకు ఇప్పుడున్న సంగీత ,నృత్య కళాశాలలనుండి బయటకు వస్తున్న వారికి సరైన ఉపాధి అవకాశాలు దొరకటం లేదు, అలాగే సినిమా రంగానికి వీరి అవసరం ఎంతైనా ఉంది. ఈ రెండిటికి మధ్య ఒక బ్రిడ్జ్ కోర్స్ లాంటిది ఏర్పాటు చేస్తే , ఇద్దరికీ ఉపయోగకరంగా ఉంటుంది . దీన్ని ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నడపగలగాలి . ఇలాంటి వాటి వల్ల ఆంధ్ర ప్రదేశ్ లో ఎక్కడైనా టెక్నీషియన్స్ దొరుకుతారు, ఇది సినిమా ఖర్చు ను కొంతవరకు తగ్గించగలుగుతుంది

4) సింగిల్ విండో పర్మిషన్ : ఆంధ్ర ప్రదేశ్ లో ఎక్కడ షూటింగ్ చేసుకోవాలన్నా, ఇదవరకలా ఎఫ్‌డి‌సి నుండి లెటర్ తీసుకొని, అక్కడ నుండి ఆ డిపార్ట్ మెంట్ కు వెళ్ళి అక్కడ నుండి పర్మిషన్ తీసుకొని, తిరిగి లోకల్ పోలీస్ స్టేషన్ నుండి పర్మిషన్ తీసుకొని, ఇంత పెద్ద తతంగం కాకుండా ఎక్కడైనా లోకల్ గానే పర్మిషన్ ఇచ్చే ఏర్పాటు చేయాలి, అంటే లోకల్ బాడీస్ ద్వారానే , ఉదాహరణకు ఒక ప్రభుత్వ పార్క్ లో షూటింగ్ చెయ్యాలంటే ఆ పార్క్ దగ్గర ఉండే లోకల్ ఆధారిటీ ద్వారానే పర్మిషన్ వెంటనే వచ్చేలా చూడాలి, ఆ పార్క్ ఆధారిటీ పర్మిషన్ ఇచ్చాకా, పోలీస్ పర్మిషన్ ప్రత్యేకంగా అవసరం ఉండకూడదు, ఇలా చెయ్యగలిగితే నిర్మాత ఎక్కువ సార్లు పర్మిషన్ కోసం తిరగాల్సిన అవసరం ఉండదు

5) పెద్ద పెద్ద స్టూడియోలకు స్థలం కేటాయించటంతో పాటు, చిన్న చిన్న స్టూడియోలు, రికార్డింగ్, డబ్బింగ్ థియేటర్స్, ఎడిటింగ్ స్టూడియోస్ కి కూడా ప్రాధాన్యత ఇవ్వాలి, కొంత మొత్తం సబ్సిడీ గా ఇవ్వగలగాలి, దానికోసం తీసుకువచ్చే ఎక్విప్ మెంట్ మీద టాక్స్ వసూలు చేయకూడదు. కనీసం 5 సంవత్సరాల పాటు ఎలాంటి టాక్స్ వసూలు చేయకూడదు

ఇలాంటి కొన్ని చర్యలు తీసుకొని ప్రభుత్వం సరైన రీతిలో సరైన ప్రోత్సాహం ఇస్తే సినీ పరిశ్రమ తప్పకుండా హైదరబాద్ వదిలి ఆంధ్ర ప్రదేశ్ కి వస్తుంది . అంతే కాదు ఇలాంటి సదుపాయాలు అన్నీ కల్పిస్తే మిగతా భాషల సినిమాలు కూడా ఇక్కడే షూటింగ్ జరుపుకుంటాయి

మనం తరచుగా సినీరంగాన్ని “ఆ నలుగురు” శాసిస్తున్నారు అనే మాట వింటూ ఉంటాం, నిజానికి అది కాదు అనలేని సత్యం, దాని నుండి బయట పడాలి అన్నాకూడా ఇదే మార్గం . ఆ నలుగురు ఉన్న వ్యవస్థకు ప్రత్యామ్నాయ వ్యవస్థను సృష్టించుకొని ప్రజలకు సినిమా చేరువ కాగలగాలి . అప్పుడు సినిమా, బాగుపడుతుంది . ప్రేక్షకుడు కోరుకుంటున్న కొత్త దనాన్ని సినిమా ఇవ్వగలుగుతుంది , తెలుగు సినిమా మిగతా సినిమాల కంటే తీసిపోదు అని నిరూపించుకుంటుంది . మన తెలుగు వారికి అత్యంత ఇష్టమైన తెలుగు సినిమా తిరిగి స్వర్ణయుగంలోకి అడుగు పెడుతుంది, అటు నిర్మాతలు, ప్రేక్షకులు అందరూ సంతృప్తి గా ఉంటారు.

Comments

comments

Article Categories:
Entertainment

Comments

Menu Title