ఎట్టకేలకు అన్ని అడ్డంకులను దాటుకుని సీనియర్ నాయకులను సంతృప్తి పరుస్తూ తెలంగాణ నూతన ముఖ్యమంత్రిని కాంగ్రెస్ పార్టీ ఎంపిక చేసింది. కొద్దిరోజులుగా రాష్ట్రవ్యాప్తంగా నెలకొన్న ఉత్కంఠకు తెరదించుతూ టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డిని సీఎల్పీ నేతగా ఎంపిక చేసినట్లు కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్ ప్రకటించారు. డిసెంబర్ 7న రేవంత్‌రెడ్డి ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేస్తారని వెల్లడించారు.
తెలంగాణాలో ఎన్నికల ఫలితాల తర్వాత తెలంగాణ ముఖ్యమంత్రి ఎవరనే విషయంలో భిన్నాభిప్రాయాలు వెలువడ్డాయి. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేస్తారని రాష్ట్ర వ్యాప్తంగా ప్రచారం జరిగినా పలువురు సీనియర్ల నుంచి అభ్యంతరాలు వ్యక్తం కావడంతో గచ్చిబౌలిలోని ఎల్లా హోటల్లో సమావేశమైన కాంగ్రెస్ ఎమ్మెల్యేలంతా సీఎల్పీ ఎంపిక నిర్ణయాన్ని ఏఐసీసీ అధ్యక్షుడు ఖర్గేకు అప్పగిస్తూ ఏక వాక్య తీర్మానం చేశారు. తెలంగాణ ముఖ్యమంత్రి ఎంపిక విషయంలో సుదీర్ఘ చర్చల అనంతరం కాంగ్రెస్ అగ్రనేతలు రేవంత్‌రెడ్డిని సీఎంగా ఎంపిక చేశారు. కాగా ముఖ్యమంత్రి ప్రకటన జరుగుతున్న సమయంలోనే రేవంత్‌రెడ్డి హుటాహుటిన ఢిల్లీకి బయల్దేరడం గమనార్హం.