OTT ప్లాట్ ఫారంలు ఇండియాలో మొదలైన నుంచే విపరీతమైన క్రేజ్ తెచ్చుకున్నాయి , ఎన్ని డబ్బులైనా సరే కట్టేసి వాటికి చందాలు కట్టేశారు, కట్టేస్తున్నారు ప్రేక్షకులు. కొన్ని ఓటీటీల్లో అసలు మంచి ప్రోగ్రాములు సినిమాలు లేక పోయినా సరే, చందా దారులు బాగానే ఉంటున్నారు
ఏ ఓటీటీ లో ఏ కంటెంట్ ఉన్నా, ప్రతి దాంట్లోనూ అడల్ట్ కంటెంట్ ఉన్న సినిమాలు, ముఖ్యంగా వెబ్ సిరీస్ లు ఎక్కువై పోయాయి.
ముఖ్యంగా వెబ్ సిరీస్ ల పేరుతో వస్తున్న పరిమిత ఎపిసోడ్ ల కథల్లో హింస, డ్రగ్స్ వాడకం, సెక్స్ ఇవన్నీ మోతాదు మించి పోవడం, వాటి మీద ఎటువంటి నియంత్రణా లేక పోవడం ప్రేక్షకులుగా ఉన్న తల్లిదండ్రుల్లో ఆందోళన కలించే విషయం. ఈ హింస, బూతు పదాల వాడకం లాంటివి, మొదట ఇంగ్లీష్ సిరీస్ లలో ఎక్కువగ ఉండేవి, తర్వాత అవి హిందీ కి ఆ తర్వాత తెలుగు సిరీస్ లకు (ఉదాహరణ రానా నాయుడు) కూడా వ్యాపించాయి.
గత కొద్ది ఏళ్ళుగా విపరీతంగా పెరిగిన ఓటీటీ సిరీస్ లు, సినిమాలు సామాన్య ప్రేక్షకులకు బాగా ఎక్స్ పోజర్ ని ఇస్తున్నాయి. మనకు తెలియని ప్రపంచాన్ని చూపించడం, మారిపోతున్న జీవన విధానాలను కథలుగా మలిచి తీయడం దీన్లో భాగం. కొత్త సినిమాలను సైతం రిలీజ్ అయిన కొద్ది రోజులకే చూసే అవకాశం ఉండటం, ఇంటర్నెట్ చవగ్గా దొరుకుతుండటం, ఈ ఓటీటీలన్నీ మొబైల్ లో చూసే అవకాశం ఉండటంతో ప్రేక్షకులు విపరీతంగా పెరిగి పోయారు
ఈ లెక్కలు పక్కన పెడితే, వీటిని చూసే ప్రేక్షకుల మీద హింస, రక్త పాతం, విపరీతమైన సెక్స్, డ్రగ్స్, ఆల్కహాల్ ప్రభావం కూడా పెరిగి పోతోందని తెలుస్తోంది.
ముఖ్యంగా యువకులు, టీనేజర్ల మీద డ్రగ్స్ వాడకం, హింస ఒక తెలియని కిక్ ని ఇచ్చి, అలాటి జీవితం ఒకసారైనా గడిపి చూడాలని ప్రేరేపిస్తున్నాయి. ఇక హిమ,నేరాలు సరే సరి. ఫలనా వెబ్ సిరీస్ చూసి ఈ నేరానికి ఐడియా వచ్చిందని ఒప్పుకుంటున్న టీనేజ్ నేరస్థులు అనేక మంది కనిపిస్తున్నారు ఈ మధ్యన
లాక్ డౌన్ సమయంలో ఓటీటీకి ప్రేక్షకులు విపరీతంగా పెరిగారు. స్కూళ్ళు కాలేజీలు ఆన్ లైన్లో నడవడం వల్ల, ఇంటర్నెట్ అందుబాటులో ఉన్న పిల్లలు టీనేజర్లు ఓటీటిని చూడ్డానికి కూడా విపరీతంగా అలవాటు పడ్డారు.
“ఒకసారి చేసి చూస్తే ఏం?” అనే ఉత్సుకత పిల్లల్లో , ముఖ్యంగా దేనికైనా త్వరగా ఆకరిషితులయ్యే ఎటూ కాని టీనేజ్ వయసులో చాలా ఎక్కువ.
ఓటీటీలో హింసను ఎక్కువగా చూస్తున్న టీనేజర్ల ప్రవర్తనలో కొద్ది పాటి హింసా ప్రవృత్తి చోటు చేసుకోవడం గమనిస్తున్నాం. గంటల తరబడి వెబ్ సిరీస్ లు సినిమాలు చూసి వాటిలో లీనమై బయటికి వచ్చాక వాస్తవ ప్రపంచం భిన్నంగా ఉందనే స్పృహ లోకి వచ్చిన టీనేజ్ పిల్లలకు డిప్రెషన్, తీవ్రమైన అసంతృప్తి వాటి నుంచి పుట్టే ఫ్రస్ట్రేషన్ ఇవన్నీ చాపకింద నీరులా పాకి పోతున్నాయి. ఎవరితోనూ కలవక పోవడం, మొబైల్లో ఓట్ట్ కంటెంట్ చూస్తూ ఒంటరిగా ఉండటానికి ఇష్టపడుతూ ఉండటం వల్ల సోషలైజేషన్ స్కిల్స్ కొన్నాళ్ళకి పూర్తిగా నశించిపోయే ప్రమాదం ఉంది.
చదువు మీద శ్రద్ధ నశించి పోతుంది. ఏ చిన్న వాదనకైనా హింసతో జవాబు చెప్పగలను అన్న అతి నమ్మకం కలుగుతుంది. పర్యావసానాలు ఆలోచించే సహనం ఉండదు. ‘
నిద్ర లేమి, ఒబెసిటీ, విపరీతంగా తినడం, యాంగ్జైటీ, ఒత్తిడి వల్ల వచ్చే టైప్ 2 డయాబెటిస్, బిపి వంటి సమస్యలు అదనం
హింస సరైనదే, డ్రగ్స్ తీసుకుంటే మరేం పర్లేదు, టీన్స్ లో ఉండగానే సెక్స్ సంబంధాలు సహజమే అనే అభిప్రాయాలు పాతుకు పోతున్నాయి.
స్కూళ్ళలో జరిగే అత్యాచారాలు, టీనేజర్ల మధ్య బాహాబాహీ గొడవలు, వీటన్నిటి వెనుకా కొంత మేరకు ఓటీటీలల్లో సెన్సార్ షిప్ లేకుండా ప్రసారమవుతున్న వెబ్ సిరీస్ లే
ఇవే కాదు, విచ్చలవిడి గా సిగరెట్ల వినియోగం, సీట్ బెల్ట్, హెల్మెట్ లేకుండా డ్రవింగ్ చేయడం వంటివి కూడా వెబ్ సిరీస్ ప్రోత్సహిస్తున్న నేర ప్రవృత్తులే.
ఆయా దృశ్యాలు నడుస్తున్నపుడు, సిగరెట్, ఆల్కహాల్ ఆరోగ్యానికి హానికరం, సీట్ బెల్ట్ లేకుండా ప్రయాణించడం నేరం వంటి సూచనలు స్క్రీన్ మీద వేస్తే సరి పోదు. వాటి పట్ల నిబద్ధత ఉండాలి. ఉంటే ఆ దృశ్యాలే పెట్ట కూడదు
ఒక స్టడీ లో ఈ మధ్య తేలిందేమిటంటే, మన దేశంలో యువతీ యువకులు రోజుకు దాదాపు 8 గంటల పాటు మొబైల్ లో వీడియోలు చూస్తున్నారట. ఇది విదేశాల్లో ఆరు గంటలుగా ఉంది.
తల్లిదండ్రుల పాత్ర:
ఇంత భారీ స్థాయిలో ఓటీటీ కంటెంట్ మన చుట్టూ పరుచుకు పోయి ఉండటం వల్ల, ఈ విషయంలో తల్లిదండ్రులు పెద్దగా చేయగలిగిందేమీ లేదు. అలాగని పూర్తిగా వాళ్లని వదిలేయలేరు కూడా
ఓటీటీ కంటెంట్ కి కూడా సెన్సార్ షిప్ ఉండాలనే వాదనలు, అభ్యర్ధనలు తల్లి దండ్రుల నుంచి వస్తున్న నేపథ్యంలో ఆ దిశగా ఏవైనా అడుగులు పడతాయేమో అని ఎదురు చూడ్డం తప్ప ప్రస్తుతం ఎవరు చేయగలిగిందీ ఏమీ లేదు