పుష్కరస్నానం మూర్ఖత్వమా మిస్టర్‌ ఆర్కే- Weekend Comment Against RK

Written by

భారతదేశం సనాతనధర్మానికి చిరునామా. యజ్ఞ, యాగది క్రతువులతో అలరారే కర్మభూమి, పుణ్యభూమి. ప్రపంచమొక గృహం అయితే దానిలోని పూజ మందిరమే ఈ దేశం. పూజా పీఠం వద్ద చేసే పూజ ఇంటి మొత్తానికి శ్రేయోదాయకం అయినట్టు ఈ దేశంలో నిర్వహించే పూజలు, పునస్కారాలు, వేదపఠనం, పుణ్యకార్యాలు, హోమాలు, యజ్ఞ, యాగాదులు, నిత్యార్చనలు.. యావత్‌ ప్రపంచానికి శుభకరం. ఇంటిల్లపాదికీ మంచిదని ఎలాగైతే బెడ్‌రూమ్‌లో, వంటింట్లో, బాత్రూమ్ లో పూజలు చేయమో.. అలాగే ఈ భూమి మీద ఎక్కడ ఇవి జరగకపోయినా ఈ గడ్డపై నిర్వహించే క్రతువులు అందర్నీ రక్షిస్తూంటాయి.

ఇది కోటానుకోట్ల ప్రజల విశ్వాసం. మన ముత్తాతలు, వారి ముత్తాతలు అలా ఎన్నో వందల తరాల నుంచి అనుసరిస్తున్న సంప్రదాయం . ఇప్పుడీ విశ్వాసాలు పాటిస్తున్న కోట్లమంది, మునుపు పాటించిన వందల కోట్లమందిని వెర్రివాళ్లుగా జమకడుతూ ప్రింట్‌, టీవీ మీడియాల్లో వ్యాఖ్యానాలు, వ్యాసాలు వస్తున్నాయి.

ఆంధ్రజ్యోతి పత్రికపై నాకు గౌరవం ఉంది. అప్పుడప్పుడు వాళ్లు మంచి అంశాలు లేవనెత్తుతూ ఉంటారు. ఆర్కే గారి వీకెండ్‌ వ్యాసాలు కూడా అప్పుడప్పుడు బాగుంటాయి. కానీ జూలై 19 ఆదివారం నాటి వ్యాసం చాలా అభ్యంతరకరంగా ఉంది.

ఎవరికి నచ్చిన విశ్వాసాలను వారు అనుసరించే స్వేచ్ఛ దేశంలో అందరికీ ఉంది. నచ్చిన నటులు, పత్రికలు, టీవీలు, పార్టీలు, సంస్థలు, సినిమాలు, నాయకులు, పుస్తకాలు, మతాన్ని, గురువులను అభిమానించడం నా ఇష్టం. ఫలానాది పాటించే వాళ్లంతా మూర్ఖులని చెప్పడానికి ఆర్కే గారి అర్హత ఏంటో?

కొన్ని సినిమాల విడుదలప్పుడు తొక్కిసలాటలో జనం చనిపోయిన ఘటనలు ఉన్నాయి. ఆ సినిమాలకు మీ పత్రికలో, టీవీలో ఇచ్చిన ప్రచారమే కారణం అంటే మీరు అంగీకరిస్తారా?

వేల వాహనాల్లో లక్షలాదిని తరలించి కొన్ని పార్టీలు సభలు పెడతాయి. ఆ క్రమంలో అడపాదడపా ప్రమాదాలు జరిగి చనిపోయిన ఉదంతాలు ఉన్నాయి. పార్టీలను సభలు, ర్యాలీలు పెట్టవద్దని మీరు సూచిస్తారా?

ధర్నాలు, రాస్తా, రైల్‌రోకోల్లో, ఉద్యమాల్లో గంటల కొలది వాహనాలు నిలిచిపోయి..అంబులెన్స్‌లు ఆగిపోయి ప్రాణాలే పొగొట్టుకున్న దృష్టాంతాలు ఉన్నాయి. మీ పత్రికలు, టీవీల కవరేజి వల్లే అవి జరుగుతున్నాయి కాబట్టి ఉద్యమాలను నిషేధించాలంటే మీరు ఏమంటారు?

మేడారం సమ్మక్క-సారక్కల జాతరకు పుష్కరాల కంటే ఎక్కువ జనం వెళ్తారు. బస్సులుపైన కూర్చుని వెళతారు. బస్టాండ్లలో నేలపై పడుకుంటారు. ఆధ్మాతిక ఉత్సవాలకు జనం హాజరవడం ఇదేం కొత్త కాదు. పుట్టగొడుగుల్లా ఛానెళ్లు పుట్టకొచ్చి ఇప్పుడు రద్దీని చూపిస్తున్నాయి తప్ప జనం హాజరు ఎప్పుడూ ఉండేదే. నిన్నటికి నిన్న పూరీ జగన్నాథ రథయాత్రకి 30లక్షలమంది హాజరయ్యారు. అయ్యప్ప జ్యోతి దర్శననానికి లక్షోపలక్షలు వెళతారు. వీరందరూ మీ దృష్టిలో తెలివి తక్కువ వారా మిస్టర్‌ ఆర్కే?

ఆర్కే వ్యాసంలో ప్రస్తావించిన కొన్ని అంశాలకు నా స్పందన
ఆర్కే: సృష్టిని పూజించాలా? సృష్టికర్తను పూజించాలా?

-సృష్టి కూడా సృష్టికర్తలో భాగమే. నదీనదాలను, గోవు, పశుపక్ష్యాదులను, రాయిని, రప్పను పూజించే సంస్కృతి, సంస్కారం ప్రజలకు ఉంది. మధ్యలో మీకేందుకు అభ్యంతరాలు? మా ఇంట్లో మా తాతగారు వాడిన ఇంకుపెన్ను, డైరీలు బయటపారేసి మా తాత ఫోటోను పూజించమన్నట్టు ఉంది మీరిచ్చిన సలహా. యత్భావం తద్భవతి.

ఆర్కే: తెలుగునాట భక్తి పేరిట జరుగుతున్నది వ్యాపారం.
-నిజమే. మీడియా చేస్తున్నది అదేగా. యంత్రాలు, రుద్రాక్షలు, జాతిరత్నాలు పేరుతో అరగంట వాణిజ్య కార్యక్రమాలు ఇస్తూ ప్రజల విశ్వాసాలను సొమ్ము చేసుకుంటున్నది మీరు కాదా?

ఆర్కే: తెలుగునాట ఇప్పుడు భక్తి మాఫియా రాజ్యమేలుతోంది.
-ఈ పదం అనుచితం, అవాంఛనీయం. చేతిలో కవర్లు, క్వార్టర్‌ బాటిల్స్‌ పెడితేనే వార్తలు రాసే విలేకరులు ఉన్నారని.. మొత్తం మీడియానే అలా ఉందంటే అంగీకరిస్తారా? మఠాధిపతులను బ్లాక్‌ మెయిల్‌ చేసి కేసులు ఎదుర్కొంటున్న మీడియాపై లోగడ మీరే కథనాలిచ్చారు. అలాగని మీడియా అంతా బ్లాక్‌మెయిలింగ్‌ బాపతే అంటే ఏకీభవిస్తారా? అన్ని వ్యవస్థల్లో ఉన్నట్టే ఇక్కడా స్వార్థపరులుంటే నిర్దుష్టంగా ప్రస్తావించండి తప్ప గాలిలోకి కాల్పులు జరిపినట్టు అస్పష్ట సమాచారంతో మాట్లాడవద్దు.

ఆర్కే: ప్రవచనాలు చెప్పేవారు పుట్టుకొచ్చారు .
-ప్రవచనాలు చెప్పే వారు పుట్టుకొచ్చారనడం పుట్టుగుడ్డితనంతో చేసే వ్యాఖ్య.
పూర్వం నుంచీ ఊరి శివాలయంలో భారత, భాగవత, రామాయణాధులు చెప్పేవారు ఎప్పటినుంచో ఉన్నారు. రేటింగుల కోసం మీ మీడియా కళ్లు తెరిచి ఇప్పుడు వారిని చూపిస్తోంది తప్పితే.. వారెవరూ రాజకీయనాయకుల్లా కవరేజి కోసం ప్రాకులాడరు.

ఆర్కే: కలుషితంగా ఉన్నా లెక్కచేయకుండా మునగాల్సిందే, పుణ్యం మూటకట్టుకోవలసిందేనని ప్రజలంతా భావించే స్థితి కల్పించారు.
-కాలుష్యం ఉందని హైదరాబాద్‌లో మీరు తినటం, తిరగటం మానేస్తున్నారా?
కాలుష్యమని తెలిసి సగంమంది ప్రజలు మంచినీరు తాగకుండా మానేస్తున్నారా? తరించడానికి 12ఏళ్లుకోమారు వచ్చే సందర్భం కాబట్టి అసౌకర్యం ఉన్నా ఇష్టపూర్వకంగా వెళ్లి ఆచరిస్తున్న స్నానాన్ని అజ్ఞానంగా భావించడమే నిజమైన అపరిపక్వత.

ఆర్కే: కృత్య అనే రాక్షసి పుష్కర స్నానం చేసిన వారి పుణ్యాన్ని తినేస్తుందని చాగంటి గారు చెప్పటం గురించి.
-శాస్త్రంలో ఉన్న విషయాన్ని వారు ప్రస్తావించారు. ఆచరించడం, ఆచరించకపోవడం ఎవరి ఇష్టం వారిది. శాస్త్రాన్ని చెప్పటమే తప్పు అనడం ఒప్పు కాదు. మీరు వీకెండ్‌ ఆర్టికల్ రాసినట్టుగా పురాణాలను, శాస్త్రాలను ఎవరికి తోచినట్టు వారు రాయరు. సనాతనధర్మాన్ని అనుసరించి చెబుతారు. మీరు పొద్దున్నే ఇచ్చే ఒక మతం వారి వాణిజ్య ప్రకటనల్లోలాగా ప్రార్థన చేయగానే కాలు లేని వాళ్లు నడిచి వస్తారని చెప్పలేదుగా. వాటిని ఎందుకు ప్రస్తావించరు? అవి మీకు డబ్బులు ఇచ్చి పోషిస్తున్నందుకా? ఒక్కో ప్రవచనకారుడు ఒక్కోటి చెబుతున్నారని మీరు అనవచ్చుగాక. ఒకే రోగానికి ఒక్కో ఆస్పత్రిలో ఒక్కో మందు రాస్తున్నారు మీరు చెప్పే సోకాల్డ్‌ సైన్స్‌ చదివిన వైద్యులు. ఎవరు ఒప్పు? ఏ శాస్త్రం అయినా ..అది వైదికమైనా వైద్యమైనా మహాసముద్రం అంత లోతు ఉంటుంది. ఏ ఒక్కరూ దానిలోతు చూడలేదు. వారికి అందుబాటులో ఉన్న, వారి అధ్యయనం చేసిన దాని ప్రకారం నడుచుకుంటారు. మీకు బాగా అర్థం అయ్యేలా చెప్పాలంటే ఒక ప్రెస్‌మీట్‌/ఘటన జరిగితే ఒక్కో మీడియా ఒక్కో లీడ్‌ తీసుకున్నట్టు. ఒక్కొక్కరి ప్రజెంటేషన్‌ ఒక్కోలా ఉంటుంది.

ఆర్కే: స్వాములు తమకు సొంతంగా భక్తి చానెళ్లు ఏర్పాటు చేసుకుంటున్నారు.

-మీ దృష్టిలో రాజకీయనాయకులు, రియల్‌ ఎస్టేట్‌దారులు, అడ్డదారిలో, రాజకీయ ఆశ్రయంతో ఎదిగినవారు మాత్రమే ఛానెళ్లు పెట్టాలా? ఎక్కడ ఉండేవారు ఇప్పుడు ఎలా ఎదిగారో జనానికి తెలియదా? క్రైస్తవ మతసంస్థల నుంచి కోట్ల రూపాయలు తీసుకుని రోజూ గంటల తరబడి మీ ఛానెల్స్‌లో ప్రచారం చేస్తే తప్పు కదా? పదిశాతం కూడా లేని ఒక మతం కోసం పది ఛానెళ్లు ఉండగా లేనిది 80శాతం ప్రజలున్న హైందవుల కోసం సొంతంగా ఛానెళ్లు పెట్టుకుంటే మీకు కంటగింపు ఎందుకు? తిరుమల నుంచి మారుమూల గుడి వరకూ ప్రతి హిందువు తన జేబులో నుంచి తీసిస్తున్న విరాళాలతో పనిచేస్తున్నాయి. ప్రజలు వాటిని పోషించుకుంటున్నారు. ప్రజలిచ్చిన వితరణతో ప్రజల కోసం ఛానెళ్లు పెడితే మీకెందుకు బాధ. విదేశాల నుంచి డంప్ అయిన డబ్బులతో మతప్రచారం చేసుకునే ఛానెళ్లను ఈ ప్రశ్న ఎందుకు అడగరు? ఇతర పార్టీల వారిని తమ పార్టీలోకి ఫిరాయింపులు ప్రోత్సహించినట్టు ఎరలతో మాతమార్పిడుల నుంచి తమ ధర్మాన్ని కాపాడుకునే ప్రయత్నాలకు మీరు అడ్డుపడదలచారా?

ఆర్కే: దళితులు హిందూ ధర్మానికి దూరంగా ఎందుకు ఉండిపోతున్నారు.
దళితులు అందర్నీ ఒకే గాటన కట్టడం వారిని అవమానిండమే అవుతుంది. కొందరిపై ఉన్న వివిధ ప్రభావాలను సరిదిద్ది వారిని తమతో తీసుకువెళ్లే ప్రయత్నం నిరంతరం హిందూ ధర్మం చేస్తోంది. మీ రాతల్లోనే వివక్ష తప్ప ఎవరి చేతల్లోనూ లేదు. ఛానెల్‌ పెడుతున్నారని మీరు ఆడిపోసుకున్న స్వామి పరిపూర్ణానంద ఎన్ని గ్రామల్లో ఎన్ని వేలమంది దళితులతో సహపంక్తి భోజనం, ఆలయ ప్రవేశం చేశారో మీకు తెలుసా?

ఆర్కే: ప్రవచనాలతో పరివర్తన వచ్చుంటే ఇవ్వాళ సమాజంలో అధర్మం ఇంతగా విజృంభించి ఉండేది కాదు.
-రోడ్డుకు ఎడమవైపు నడవండి అని, వన్‌ వే ట్రాఫిక్‌లో ఎదురు వెళ్లద్దు అని చట్టం చెబుతుంది. ప్రతిచోటా పోలీసులు బోర్టులు పెడతారు. చాలామంది వాటిని పాటించరు. అలాగని చట్టం రద్దు చేయాలా? పాటించని వారి గురించి బోర్డులు పీకి పారేయాలా? ధర్మబోధ, హితబోధ చేయడం విజ్ఞుల విద్యుక్తధర్మం. పాటించడం శ్రేయోదాయకం. పాటించకపోతే ఫలితాలు అనుభవిస్తారు. కనీసం ఆ చట్టం, ఆ బోర్టులు ఉన్నాయి కాబట్టే ఆమాత్రమైన సురక్షితంగా రోడ్డు మీద నడవగలుగుతున్నారు. అలాగే ధర్మప్రచారం కారణంగానే సమాజం అల్లకల్లోలం కాకుండా అంతోఇంతో జనం ధర్మబద్ధంగా జీవిస్తున్నారు.

అయినా ప్రవచనాల వల్ల మేము మారామో లేదో మీ దగ్గరకి వచ్చి నిరూపించుకోవాలనా మీ ఉద్దేశం?

మీ మీడియా దృష్టి చర్చల పేరుతో పార్టీల మధ్య తంపులు పెట్టడంపైనే మీ ఆసక్తి. సెలబ్రిటీలపై గాసిప్స్‌ పట్లే మీకు అనురక్తి. డబ్బిలిస్తే దేని ప్రసారానికి, ప్రచారానికి అయినా వెనుకాడకపోవడమే మీకు భుక్తి.

Comments

comments

Article Categories:
Anything Everything

Comments

Menu Title