ఏపీ తీరంలో రాజకీయ రాబందులు…

Written by

రెండు కళ్లూ చాలనంత పండగ చేసి… జిల్ జిగేల్ మన్న గోదారి తీరంలో 12 గంటలు గడవకముందే గుండె పలిగే విషాదం. లేజర్ వెలుగులు విద్యుత్ జిలుగులతో అలరించిన గోదావరి పుష్కర ఆవిష్కరణ ఘట్టం ముహూర్తం ముగిసేలోపే అనుఘోని ఘోరం. కోటగుమ్మం మృత్యుద్వారం అయిపోయింది. పాతికప్రాణాలు గాల్లో కలిసిపోయాయ్. కుటుంబ సభ్యులకే కాదు గోదారికి కూడా గుండె పగిలే దారుణమిది. చిన్న అలజడిగా మొదలైన తొక్కిసలాట మృత్యు విలయంగా మారిపోయింది. మహా సంరంభ ఆరంభంలో కలలో కూడా ఊహించని దురదృష్టమిది.
గోదావరి హారతి అటు తర్వాత ప్రారంభ వేడుక రంగరంగ వైభవంగా జరిగాయ్ ముందు సాయంత్రం. ఇంద్రధనస్సు నేలకి దిగిందనిపించేంత వెలుగులతో అట్టహాసంగా జాజ్వల్యమానంగా వెలుగులీనింది గోదారి తీరం. విభజన సమస్యలు అధిగమించి పన్నెండేళ్ల పండగని శక్తి వంచన
లేకుండా నిర్వహిస్తామని ప్రభుత్వం ప్రకటించింది. తెలతెలవారగానే మృత్యుస్వాగతంలా అయిపోయింది పరిస్థితి. ఎవరు దీనికి బాధ్యులు ? పుణ్యం పురుషార్థం కోసం వచ్చిన భక్తుల హాహాకారాలతో కోటగుమ్మం ప్రతిధ్వనించిపోయింది. తొక్కిసలాట జరగడమంటే అనాగరికమైన, అస్తవ్యస్థమైన పరిస్థితి. ఒప్పుకోక తప్పదు. బారికేడ్లు ఏర్పాటు చేశారా లేదా ? క్యూ లైన్లు పాటించారా లేదా ? లాంటి ప్రశ్నలన్నీ తర్వాత. ముందైతే జరగాల్సి నష్టం జరిగిపోయింది. గుండె కోత మిగిలింది. గోదావరి గట్టున రక్తపు మరక పడింది.

ఏం చేయాలి ?

ఇలాంటి ఘటనలు జరుగుతాయని ఊహించి ముందస్తు ఏర్పాట్లు చేసుకోవాలి. అలాంటి ఏర్పాట్లు జరగలేదేమోనని ఘటనాస్థలాన్ని చూస్తే అర్థమవుతోంది. సమీపంలో 108 లాంటి కనీస సౌకర్యాలు కూడా లేక…పోయిన ప్రాణాలుకూడా ఉన్నాయ్ అందులో ! అన్నిటికీ మించి లేనిపోని పోటీ స్నానాలు చేసేందుకు. అదే ఘాట్ లో చేస్తే పుణ్యమని, సెంటిమెంట్ అంటూ చేసిన ప్రచారం కూడా ప్రాణం మీదకి తెచ్చింది. వీటికి తోడు… ఉన్నట్టుండి వ్యాపించి వదంతులు, ఏదో జరిగిపోతోందన్న ఆందోళన ఈ ఘటనకి కారణమయ్యాయ్.
ఇలాంటివి జరిగినప్పుడు… తక్షణం స్పందించాల్సిన యంత్రాంగం ఏమైపోయింది ? అసలు అలాంటి ఏర్పాట్లు ఉన్నాయా లేవా ? ప్రథమ చికిత్స లాంటివి కూడా ఎందుకు చేయలేదు అక్కడ ? మాక్ డ్రిల్స్, రిహార్సెల్స్ అన్నీ సీఎం వచ్చినపుడు… మీడియా దృష్టిని ఆకర్షించేందుకు మాత్రమేనా ? ఇలాంటివన్నీ ఇపుడు శేషప్రశ్నలు. సమాధానం దొరకాల్సిందే. నష్టం జరిగిపోయింది కదా అనుకోడానికి లేదు. ఇదో గుణపాఠం. దీన్ని నుంచి మనం నేర్చుకోకపోతే ఘోరాల పునరావృతమయ్యే ప్రమాదమే ఎక్కువ !

ఏపీకి సంబరానికి దిష్టి తగిలిందా ?

నీరు పుష్కలం. ఏర్పాట్లు ఉన్నంతలో బావున్నాయ్. భారీ సంఖ్యలో భక్తులు. ఆరు కోట్ల అంచనాలు. కనీవినీ ఎరగని రీతిలో చేస్తున్నామ్. కుంభమేళా గోదారి తీరంలో చూపిస్తాం… రండి తరలి రండి అని ప్రచారం హోరెత్తింది. దానికితోడు అంచనాలు పెంచేస్తూ అట్టహాసంగా ప్రారంభోత్సవం. అక్కడే దృష్టి సోకిందా ? దిష్టితగిలిందా అనిపిస్తోంది. దిష్టి అంటే ఇదేదో మూఢ నమ్మకమో… మరోటో మరోటో అనుకోడానికి లేదు. విశ్వాసం కచ్చితంగా ! పడుతూ లేస్తూ అధికార యంత్రాంగం నిధులున్నా లేకపోయినా ప్రభుత్వం విజయవంతంగా అడుగు వేస్తున్న సమయంలో విషాదంలో ఇలాంటి యాంటీ సెంటిమెంట్ కనిపిస్తోంది. కొత్తగా ప్రయాణం ప్రారంభించిన ఏపీ లాంటి రాష్ట్రానికి ఇదో దుర్దినం. ఇలాంటి సమయంలో సహాయ కార్యక్రమాల్లో పాల్గొనేందుకు ఆదుకునేందుకు అందరూ కలిసిరావాలి. ఏకం కావాలి.

కానీ ఏపీలో అదే జరగడం లేదు. ఏపీలో పరిస్థితి ఎంత దారుణంగా ఉంటుంది… రాజకీయం ఎలా ఉంటుందనేది మరోసారి తెలిసొచ్చింది ఈ దుర్ఘటనతో ! ప్రచారం చేసుకున్నారుగా రాజీనామా చేయండి అంటుంది విపక్షం ! పుష్కరాలు ఏపీ బ్రాండ్ అని ప్రచారం చేశారు… మరి రాజీనామా ఎందుకు చేయరు అన్నది ప్రతిపక్షనాయకుడి ప్రశ్న. జనం ఏమనుకుంటారోనని గానీ..ఎలా స్పందిచాలన్న ఇంకితంగాని లేకపోవడం వల్ల వచ్చిన సమస్య ఇదంతా ! అవకాశం వచ్చిందా ఓ రాయి వేసేద్దాం అన్నట్టు మాట్లాడ్డం చూస్తే రక్తం మరిగిపోతుంది. ఆదుకోవడం…సాయం చేసేందుకు చొరవ చూపడం లేదు. పిడుక్కీబియ్యానికీ రాజీనామా డిమాండే రాజకీయం అనుకునే దగుల్బాజీలున్నారు ఏపీలో. మరో పార్ట్ టైమ్ పొలిటీషియన్ చిరంజీవొచ్చి ముఖ్యమంత్రి చేతగాని తనం అంటారు. చేతగాని తనానికి బ్రాండ్ అంబాసిడర్ లాంటి ఆయనే అలాగంటే ఇకేం చేస్తాం..చేతగానితనమే చిన్నబుచ్చుకుంటుంది. రాబందులు అంతరించిపోతున్నాయన్నారు…లేదే కనిపిస్తూనే ఉన్నాయ్ గా అనిపించింది టీవీలు చూస్తుంటే ! ఇవా… ఇలాంటి సమయంలో మాట్లాడాల్సిన మాటలు అనిపించింది.

ఒక్క పవన్ కల్యాణ్ మాత్రం సాయం చేద్దాం…. అభిమానులు ముందుకి రండి అని ఆపేశాడు. తెలిసో తెలియకో ! అక్కడికి నయం. దిష్టి అంటే పొరుగు నుంచే తగలక్కర్లేదు. ఇలాంటి నాయకుల నుంచి కూడా తగలొచ్చు. ఏపీకి ఇలాంటి రాజకీయం, ఇలాంటి మసస్థత్వాలే అసలు సమస్యని గోదారి దుర్ఘటన మరోసారి నిరూపించింది. ప్రాణాలు కోల్పోయిన యాత్రికుల ఆత్మకి శాంతి కలగాలని కోరుకుంటూ …

– అభి

Comments

comments

Article Categories:
Anything Everything

Comments

Menu Title