నిగ్గ దీసి అడుగు… ఈ సిగ్గులేని…

Written by

లంకలో 11 మంది తమిళ జాలర్లని అరెస్ట్ చేస్తే డీఎంకే – అన్నాడీఎంకే ఏకమైపోయినంత పనిచేశాయ్… ప్రధాని దిగొచ్చేలా చేశాయ్. దానికి వాళ్లు పెట్టిన పేరు ద్రవిడ ఆత్మగౌరవం.

ముంబైలో చీమ చిటుక్కుమన్నా…సిగ్గూశరం ఉంటే స్పందించండి అంటూ మహారాష్ట్ర పార్టీల్ని చెండాడేస్తుంది శివసేన. అది మరాఠా ఆత్మఘోష.
మేం వంగ భూమిని ప్రేమిస్తే…దేశాన్ని ప్రేమించినట్టే ! బంగాలే ముందు భారత్ ఆ వెంటనే ! ఇదే మా… మతి… మానుష్ తృణమూల్ విస్తృతార్థం

మరి మనం ?

ఇద్దరుంటే చెరో పార్టీ… ముగ్గురైతే చివరిద్దరూ కలిసి మొదటోడి మీద మూడో పార్టీ ! ఇదేనా మన ఐక్యత ? ఇదేనా మన సభ్యత ?

పక్కనున్న తమిళనాడు మొదలు… తీరంలో అల్లంత దూరంలో ఉన్న బెంగాల్ వరకూ అందరికీ ఆత్మగౌరవం, ఘోష, పుట్టిన మట్టి లాంటి సెంటి మెంట్ ఏదో ఒకటి ఉంది. మనకి మాత్రమే ఏ కోశానా అలాంటి ఆలోచనే కనిపించదు. చంద్రబాబు మీద బురద జల్లుదామా… పక్క రాష్ట్రంతో కలిసి ప్రెస్ మీట్ పెడదామా…కేంద్రం బాకా ఊది బాగుపడిపోదామా అనే ఆలోచనే ! చి..చ్ఛీ…సిగ్గు రాదా ? చీమూ నెత్తురు లేదా అనిపిస్తుంది మన దిక్కుమాలిన రాజకీయం చూస్తుంటే ! మన బుద్ధులు ఇంత వంకర కాబట్టే, మనోళ్లవి కుక్కమూతి పిందె బతుకులు కాబట్టే.. జనం గగ్గోలు పెడుతున్నా పట్టించుకోకుండా అలవోకగా విడగొట్టి అవతల పారేసింది కాంగ్రెస్. మరో భాషా ప్రయుక్త రాష్ట్రాన్ని అలా ముక్కలు చేయమనండి చూద్దాం ! తమిళనాడు లాంటి రాష్ట్రాల్ని కదపాల్సొచ్చిందంటే కేంద్రం కూడా కిక్కురుమనదు. వీళ్లతో మనకెందుకులే అని. మరిమనం కూలిచ్చి కొట్టిచ్చుకునే బాపతు. విడి ఎలాగూ పోయాం… ఎవడి బతుకు వాడిది. కనీసం కొత్తగా మిగిలిన పాత ఏపీ కోసం అయినా బుద్ధితెచ్చుకుంటారా మన నేతలు అని చూసిన వాళ్లకి చిర్రెత్తుకొస్తోందిప్పుడు ! ఇలాంటి వాళ్లని ఏం చేసినా పాపం లేదనిపిస్తుంది వాళ్ల మాటలు తీరుచూస్తే !

దేశంలో ఏ రాష్ట్రానికీ లేని దరిద్రం తెలుగు రాష్ట్రాలకి అందులోనూ ఏపీకే పట్టింది. ఇదే మనల్ని వెంటాడుతున్న శాపం. ఇది వాస్తవం. ఢిల్లీలో నిర్ణయం జరిగిపోతోంది… విభజన కోసం ప్రిపరేషన్ సాగుతోందని తెలిసినా మన పదవులు మనకుంటే చాల్లే అని సరిపెట్టుకున్న దగుల్బాజీలు ఉన్నారిక్కడ. చివరి నిమిషం వరకూ పదవులు అనుభవించి… అసంతృప్తి నటించి పక్కపార్టీలోకి దూకిన సిగ్గుమాలిన రాజకీయం నడిచింది కూడా ఇక్కడే ! విభజిస్తే నీకో ముక్క … నాకో ముక్క అంటూ టీఆర్ఎస్ తో అవగాహనకొచ్చి కుళ్లు రాజకీయ కుతంత్రం నడిపిన పార్టీలున్నదీ ఇక్కడే ! ఇపుడు ఇలాంటి రాజకీయమే మరోసారి బైటపడుతోంది మిత్ర, విపక్షాల్ని చూస్తుంటే ! ఇలాంటి రాజకీయమే ఏపీ పాలిట శాపం.

రాష్ట్రానికి కేంద్రం ఎనిమిది ప్రతిష్టాత్మక సంస్థలు ఇచ్చింది. 21 పథకాలు ప్రవేశపెట్టింది. అద్భుతంగా రూపు రేఖలు మార్చేస్తోంది. రాష్ట్ర ప్రభుత్వం కూడా సహకరించాలి కేంద్రానికి !-ఇవి పురందేశ్వరి మాటలు. బీజేపీలో చిటికెడంత పదవి దొరికిందన్న ఉత్సాహమో లేదంటే అమిత్ షా లాంటి నాయకుల దగ్గర మార్కులు కొట్టేయాలన్న తాపత్రయమో గానీ మాట్లాడుతున్న తీరు మామూలుగా వినలేం. బుగ్గలు నొక్కుకోవాల్సిందే ! ఇచ్చిన సంస్థలెక్కడ ? ప్రవేశపెట్టిన పథకాలు ఎటు పోయాయ్? పధ్నాలుగు నెలలవుతోంది… ఇప్పటి వరకూ ఏం చేసింది సాయం? ఏదో మొహమాటం కొద్దీ ఢిల్లీ వెళ్లినప్పుడు కేంద్రం అంత ఇచ్చింది ఇంత ఇచ్చిందని చెప్పారు చంద్రబాబు. అవన్నీ ప్రణాళికా కేటాయింపు కింద విడుదలైనవేనన్న లెక్క ఆయనకి తెలియనిది కాదు. జనానికీ అర్థం కాకపోలేదు. ఇలాంటి సమయంలో కూడా బీజేపీ నాయకులు అడ్డగోలుగా మాట్లాడుతున్న తీరు అయ్యో.. ఆంధ్రమా… అనిపిస్తోంది. నిలువ నీడ లేక… కేసుల నుంచి బైటపడడం ఎలాగో తెలియక నిన్నగాక మొన్న బీజేపీలో చేరిన నాయకులు కూడా ఇపుడు కేంద్రానికి వత్తాసు పలుకుతూ ఏపీ ప్రయోజనాలకి సమాధి కట్టేందుకు పునాదులు వేస్తున్నారు.

రాష్ట్ర కేబినెట్ లో కొనసాగుతున్న మంత్రులు కూడా తక్కువేం తినలేదు. జాక్ పాట్ కొట్టేసిన పశ్చిమ గోదావరి మినిస్టర్ నిట్ విషయంలో నడిపిన రాజకీయం ఏపీ దౌర్భాగ్యాన్ని తెరకట్టి మరీ చూపించింది. వట్లూరు సీఆర్ రెడ్డి కాలేజీలో నిట్ ప్రారభించాలని ప్రభుత్వం సిద్ధమైంది. ఆయన మాత్రం నేను నియోజకవర్గానికి ఉద్ధరించానని చెప్పుకోవాలంటూ తాడేపల్లి గూడేనికి తరలించేశారు. కేంద్రంలో పైరవీ చేసి… ఇష్టాను సారం  తరలించేశారు. ఏపీ ప్రయోజనాలకి దెబ్బ పడింది. బీజేపీ పంతం నెగ్గింది. ఎలాగంటే… వట్లూరులో నిట్ ఉంటే రాజధానికి అరవై కిలోమీటర్ల దూరం. అదే గన్నవరం విమానాశ్రయానికైతే పట్టుమని అరగంట. కనెక్టివిటీ నేషనల్ వైడ్ ఇంట్రెస్ట్… రాజధాని శివార్లో ప్రతిష్టాత్మక విద్యాసంస్థ ఇలా హైప్ ఉండేది. ఇవన్నీ ఒక్క రాజకీయం దెబ్బకి కొట్టేశాయ్. ఇదీ కోన్ కిస్కా రాజకీయం ఏపీకి కొడుతున్న మస్కా !

ఏపీ కేబినెట్ లో జాక్ పాట్ మంత్రి అయినా… బీజేపీలో కొత్తగా పదవులొచ్చిన కప్పదాటు నేతలకైనా ఒక్కటే సవాల్. అంత దమ్మే ఉంటే… సత్తువే ఉంటే కొత్తప్రాజెక్టులు తేవొచ్చు కదా రాష్ట్రానికి ! మీ పేరు చెప్పుకోవడమే కాదు శిలాఫలకం కూడా పెట్టించుకోవచ్చు. ఆ పని చేసేందుకు చేవ లేదు కానీ ఉన్న ప్రాజెక్టుల్ని మాత్రం అడ్డంగా వాడుకుంటారా సొంత మెహర్బానీ కోసం ? సొంత నియోజకవర్గం కోసం ఆరాటపడే మంత్రి కేబినెట్ హోదాలో ఏంసాధించారు ఇప్పటిదాకా? కనీసం పుష్కరాల పనులు కూడా చక్కదిద్దలేని స్థితిలో ఉండి కబుర్లు చెబుతారా ? పురందేశ్వరి లాంటి నాయకులు మాత్రం ఏం చేశారు పదేళ్లపాటు ? పదేళ్లు కాంగ్రెస్ లో హోదా అనుభవించి ఏపీకి చేసిందేమిటి ? శూన్య హస్తాలు నెత్తిన చేతులు తప్ప ! కొత్త కండువాతో ఇప్పుడొచ్చి కబుర్లు చెబుతారా ?

ఇక వైసీపీ. మూణ్నెల్లకోసారి ఢిల్లీ వెళ్లే పార్టీ నాయకత్వం అక్కడేం చేస్తుందో తెలియదు. ఇక్కడకొచ్చి మాత్రం టీడీపీ కేంద్రం నుంచి తప్పుకోవాలనే డిమాండ్ అందుకుంటుంది. ఎందుకు ? ఆ ఒక్క ఆధారం కూడా లేకపోతే రేపోమాపో సాయం వస్తుందన్న భరోసా కూడా పోతుంది కదా ? అంటే రాష్ట్రానికి భరోసా తర్వాత ముందు రాజకీయంగా నిలదొక్కువడమొక్కటే ముఖ్యం అంటోంది ఆ పార్టీ. ప్రభుత్వాన్ని బర్తరఫ్ చేయాలంటూ ఓసారి ముఖ్యమంత్రి రాజీనామా చేయలంటూ మరోసారి… హంగామా చేయడం అలవాటైపోయింది. ఓడిపోయిన 18 రోజులకే నరకాసుర వధ అంటూ రోడ్డెక్కేందుకు విఫలయత్నం చేసినప్పుడే అర్థమైపోయింది ఏపీకి సరైన విపక్షం కూడా దొరకలేదని. ఇలాంటి పిల్లకోరు రాజకీయం కేంద్రానికి అవకాశం అవుతోంది. ఇక్కడ విభేదాలు చూపించి… మధ్యలోంచి జారిపోతోంది కేంద్రం ప్రతీసారీ !

అటు అధికార పక్షానిది బొత్తిగా తమలపాకు బతుకైపోయింది. తమల పాకుది చిత్రమైన పరిస్థితి. అటు పక్కనా అందంగా కనిపించాలి. ఇటు పక్కనా చూడముచ్చటగా ఉండాలి. ఏపీ ప్రభుత్వం కూడా అంతే ! కేంద్రంపై ఒత్తిడి తేలేదు. ఎందుకంటే మోడీ ఏమీ టీడీపీ దయాదాక్షిణ్యాల మీద ఆదారపడిలేడు కదా ! అలాగని ఆ విషయం జనంతో చెప్పుకోలేదు. అందుకే రెండు వైపులా సున్నం రాయించుకుంటూట్టుకొస్తోంది.ఇప్పటికిప్పుడు సాయంచేసి చంద్రబాబును హీరోని చేయడం ఎందుకు.. మనకి లాభం అనుకున్నప్పుడు చూద్దాంలే..అని మంత్రులు అంటున్నారని తెలిసినా ఏపీ సీఎం మాత్రం ఇదంతా డెమక్రసీ అంటూ సరిపెట్టుకోవాల్సిన పరిస్థితి.

అందుకే ఏపీ రాజకీయం గోతికాడ నక్కల సీన్ ని పొలిటికల్ కాన్వాస్ మీద చూపిస్తోంది. గోతి కాడ నక్క ఏం చేస్తుంది ? ఎదురు చూస్తుంది గోతిలో ఏం పడతాయా అని. పడగానే లటుక్కున నోట్టో వేస్కుంటుంది. వేటాడి వెంటాడి సొంతంగా సాధించలేనప్పుడు రాష్ట్రాన్ని పణంగా పెట్టి రాజకీయం నడిపిస్తున్నాయ్ పార్టీలు. అల్టిమేట్ గా ఏపీ ప్రయోజనాలకి పురిట్లోనే సంధికొడుతున్నారు ఇలాంటి నాయకులు.

– అభి

Comments

comments

Article Categories:
Anything Everything

Comments

Menu Title