జగన్ చేస్తున్న తప్పేంటి ?

Written by

రాజకీయం వదిలేయండి… మనం ఏం చేశాం… ఏం చేస్తున్నాం… ఆగస్ట్ నాటికి లక్ష్యం… నీళ్లు ఇస్తున్నామా లేదా అన్నదే పాయింట్ – పట్టిసీమ రివ్యూలో చాలా సాధారణంగా సీఎం నోటివెంటొచ్చిన మాట. విపక్షం ఇంతగోల చేస్తుంటే కనీసం ఎందుకు ఖాతరు చేయట్లేదు? సమాధానం

సింపుల్. పాయింట్ లేనప్పుడు… ఎన్ని జాయింట్లు వేసినా నిలబడవ్. ఏపీలో ప్రధాన ప్రతిపక్షం అందుకే నిలబడలేకపోతోంది. జనం కోసం చేసే ప్రతి పనిలోనూ లేని చీకటి కోణాన్ని ఆవిష్కరించాలనుకొని అభాసుపాలవుతోంది. రాష్ట్రం విడిపోయాక చేపడుతున్న తొలిప్రాజెక్టు అయినా అంతే పాలసీల విషయంలో అయినా అంతే ! ఇలాంటి వ్యూహాలే ఎవరు ఎక్కించకుండానే విపక్షాన్ని బోనులో నిలబెడుతున్నాయ్. బోరు కొట్టిస్తున్నాయ్.

విపక్ష నాయకుడంటే మనీమనీ సిినిమాలో ఖాన్ దాదా కాదు. ఎవరో అన్యాయం చేశారంటూ కత్తిపట్టుకొని తిరగడానికి. ఎక్కడో ఉన్నవాళ్లని పొడిచేస్తానంటూ నవ్వులపాలు కావడానికి. జగన్ తీరు ఇలాగే ఉంది. తాడూబొంగరం లేని రాష్ట్రంలో తొలి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 18 రోజులకే రావణ దహనాలంటూ చేసి అసలు విలనీని బైటపెట్టుకున్నది మొదలు ఇప్పటి వరకూ మైనస్ ల మీద మైనస్ లే. గూగుల్ చేసి వెతికినా ప్సప్ పాయింట్ ఒక్కటీ లేదు. ఎందుకిలా ? జగన్ సమస్యేంటి ?

జగన్ కి ఏమైంది ?

ఏపీ గురించి కానీ… విభజన తర్వాత పరిస్థితి గురించి కానీ… జనం గురించి కానీ జగన్ పాటిజివ్ గా మాట్లాడిన సందర్భం ఒకటి చెప్పండి. అనే కాంటెస్ట్ పెట్టి కోటి రూపాయల ప్రైజ్ మనీ పెట్టినా ఎవ్వరూ గెలవలేరు. ఎందుకంటే ఒక్క పాజిటివ్ డైలాగ్ కూడా రాలేదు కాబట్టి. ఇదే అసలు సమస్య. పైగా చేసే విమర్శలన్నీ ఆయన మీదున్న ఆరోపణల్ని పక్కనోళ్లకి రుద్దుతున్నట్టుగా ఉంటాయ్… పట్టిసీమ పేరుతో కాంట్రాక్టర్ల దగ్గర కొట్టేస్తున్నారని… రాజధాని పేరుతో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నారని..వగైరా! జగన్ ఎదుర్కొంటున్న కేసులన్నీ ఇవేగా ! పైగా ప్రతిదానికీ

సీఎం రాజీనామా చేయాలన్న డైలాగ్ చూస్తే… ఏదో సినిమాలో పిల్లలు పిల్లలూ గొడవపడితే లెక్చరర్ వచ్చి అపాలజీ చెప్పాలన్న సునీల్ కామెడీ గుర్తొస్తుంది. ఏడవలేక నవ్వొస్తుంది. రాజకీయం ఎప్పుడూ అపథీతో నడుస్తుంది. సింపధీతో కాదు. జనం ఏమనుకుంటున్నారు వాళ్ల అభిప్రాయాల్ని ప్రతిబింబిస్తున్నామా లేదా అనే దాన్ని బట్టే సక్సెస్ ఆధారపడి ఉంటుంది. జగన్ రెండోదాన్ని నమ్ముకున్నాడు.

గుర్తొచ్చినప్పుడు యాత్రలు… తిక్కరేగినప్పుడు దీక్షలు చేస్తే అయిపోదు. ప్రభుత్వం పాజిటివ్ గా చేసిన పనిని కూడా తప్పుపట్టి.. లేనిపోని రంగు మార్చాలనుకోవడం వల్ల తెలిసిపోయేది… వెలిసిపోయేది విపక్షమే ! ప్రభుత్వం ఏం చేయలేకపోయిందో వైఫల్యాలేమున్నాయో వాటిని ఎత్తిచూపడం ఎలాగో అర్థంకానీ గందరగోళం విపక్షానిది. ఎంత సేపూ హామీలిచ్చి గెలిచాడు గెలిచాడు. ఇదే మాట. నీ ఎసిడిటీ కోసం జనానికి డైజిన్ మాత్రలేస్తానంటే… యాత్రలు చేస్తానంటే పలచనైపోయేది నువ్వే దోస్త్ ! రాజధాని పునాది రాయి పడుతుంటే లేనిపోని శాపనార్థాలు పెడితే ఏంటి ఉపయోగం ? ఏడాది దాటినా పాలన ఏపీకి ఎందుకు రాదు ? మంత్రులు, సీఎం ఎందుకు దిగిరారు అంటూ నిలదీయొచ్చుగా మంగళగిరిలో నిలబడి ? నేనొచ్చా రాజధానికి… బాధ్యతున్నవాళ్లు ఎవరైనా రావాల్సిందే… నువ్ రా అంటూ ఒత్తిడి పెంచితే హీరో అయ్యేదెవరు ? ఎప్పుడన్నా చేశాడా ఇలాంటి ఆలోచన ఈ విపక్షనేత ? చేయలేడు ఎందుకంటే భయం. హైద్రాబాద్ అయితే కేసీఆర్ షీల్డ్ ఉంటుంది. ఆస్తులకి భరోసా ఉంటుంది… ఏపీ కొస్తే ఎక్కడ దొరికిపోతామోనన్న భయం. కేసుల ముందు స్టోరీ అంతా బెంగళూరు నుంచి నడిపించినట్టు ఇపుడు .

అద్భుతమైన ఘాట్లు… ఆకట్టుకునే ఏర్పాట్లు… హారతితో జాతీయ స్థాయి ఖ్యాతి వస్తే తొలినాటి తొక్కిసలాటనే పన్నెండ్రోజులు ప్రచారం చేసి సాధించింది ఏమిటి ? జనాన్ని సీఎం కంట్రోల్ చేస్తారాఅండీ అంటూ జనమే ప్రశ్నిస్తున్నప్పుడు విపక్షం మాత్రం తొలి రోజు దగ్గరే ఆగిపోయింది. నెగెటివ్ తప్ప పాజిటివ్ మాట్లాడబోమని పుష్కరం మీద ఒట్టుపెట్టుకుంది. ఇదొక్కటే కాదు. చందనం వేలం, కొత్త ప్రాజెక్టుల నిర్మాణం, కేంద్రం నుంచి సాయం కోరేందుకు ప్రతిపాదనలు… బడ్జెట్ లక్ష్యాలు… భూసేకరణ ఇలా ఎందులో అయినా కాళ్లు పట్టి కిందకి లాగినట్టే కనిపిస్తుంది విపక్షం తీరు. ఆఖరికి రాజధాని నిర్మాణంపైనా రివర్స్ రాగమే. ఎవరికో కట్టబెట్టాస్తున్నారంటూ …స్విస్ టెండర్ పద్ధతిని తప్పుపడుతూ పూటకో తడవ ఎదురుదాడి చేస్తే తగిలేది ఎదురు దెబ్బలే ! రాజకీయం చేయాల్సిందే. పూర్తిగా మద్దతివ్వాలని… చప్పట్లు కొట్టాలని అనరు ఎవరూ. కానీ విమర్శించేందుకు మాట్లాడేందుకు లాజిక్ ఉండాలి కనీసం. దమ్మిడీ ఆదాయం లేదు ఖర్చులతో పోలిస్తే. అలాంటి రాష్ట్రంలో ఇలాంటి రాజకీయమా చేసేది ? అందులోనూ ఐదారేళ్లలో నమ్మశక్యం కానంతగా వేల కోట్లు లాభాలు ఆర్జించడం ఎలాగో బిజినెస్ బొమ్మగీసి చూపించిన జగన్ లాంటి వాడు మాట్లాడాల్సిన మాటలా ఇవి ?

ఇలాగే ఉంటే…

వైఎస్ అటు తర్వాత చంద్రబాబు లాంటి దిగ్గజాలు పోషించిన ప్రతిపక్ష పాత్రలో జగన్ తేలిపోవడానికి చాలా కారణాలున్నాయ్. నెగెటివ్ మైండ్ సెట్ తోపాటు అనుభవం లేకపోవడం… సరైన వ్యూహరచన చేయలేకపోవడం..ఏం చెప్పాలనుకుంటున్నాడో…ఏం కోరుకుంటున్నాడో విడమరచే పరిజ్ఞానం లేకపోవడం లాంటివన్నీ ఉన్నాయ్. దానికితోడు ఆత్రం ఎక్కువ సూత్రం తక్కువైన జగన్ లాంటి నాయకుడిపైనైతే అనుమానాలు అనంతం. అనుభవంలేదు..ఓపిక లేదు..సానుకూలంగా ఒక్కమాటా మాట్లాడ్డు. ఇన్ని పెట్టుకొని గురివింద… పరనింద అంటే ఫక్కున నవ్వుతారు.

అల వచ్చినపుడు తల వంచాలి. కల వచ్చినపుడు కళ్లు తెరవాలి. అలకి ఎదురెళ్లినా…కలలోనే ఉండిపోవాలనుకున్నా మిగిలేది నిరాశే. జగన్ ధోరణి కూడా ఇదే సమాధానం. జనం మనసు గెలిచేందుకు ఏం చేయాలో ఆలోచించాలి కానీ… గెలిచినోడి మీద బురద జల్లాలనుకోవడం వృధా ప్రయాస. వంద తప్పులు చెయ్. తెలివితక్కువ తనాన్ని పదేపదే బైటపెట్టుకో. క్షమిస్తారు. కానీ రాష్ట్రానికి మేలు జరిగే విషయాల్ని మాత్రం కీడుగా ఆవిష్కరించాలనుకోకు దెబ్బ పడుతుంది. నీ రాక కెవ్వు కేక అటూ పేరడీలు పుడుతున్నది ఇందుకే. ఇదేం వ్యతిరేక భావంతో చెబుతున్న మాట కాదు. సమర్థమైన ప్రతిపక్షం ఉండడం ఏపీకి అవసరం. కానీ ఆలోచనలేని యాగీ రాజకీయం అనర్థం. అలాంటి అనర్థాలు లేకూడదనే కోరుకుంటోంది కొత్త ఏపీ.

Comments

comments

Article Categories:
Anything Everything

Comments

Menu Title