గోదారిలో ఐదు పులసల కథ

Written by

గోదావరి తీరంలో అదిరిపోయే ఆఫర్… దానవీర శూరకర్ణ ఎక్స్ పీరియెన్స్ తో… కన్ఫెషన్ ఇన్ స్పిరేషన్ తో… రాజమండ్రి రేవులో కిలికిలి ఘాట్ తెరుచుకుంది. కిలికిలంటే తెలుసుగా బాహుబలిలో కాలకేయుల భాష. అబ్బో టైటిలే ఇంత లేటెస్ట్ గా పెట్టారంటే వివరాల్లో ఇంకా విషయం ఏముందో చూద్దాం ! ఇది పాపాలు కడుక్కునేందుకు… ఇదో మహత్తర అవకాశం. ఇక్కడ ప్రవేశం పరిమితం. ఐదుగురికే ఆ ఛాన్స్. అది కూడా వన్ బై వన్.

స్లాట్ బుక్కింగ్… : గోదారి గట్టుమీదున్న ఆఫీస్ లో …
ఫోన్ మోగుతోంది…మోగుతోంది. ఎత్తారు మొత్తానికి. నమస్కారమండీ… చేతులు జోడించి… ఒక్క స్లాట్ అడుగుతున్నా… కంఠం అదోరకంగా మోగింది. అది అభ్యర్థనో… బెదిరింపో అర్థంకాలేదు. బాగా అవసరంలో ఉన్నట్టున్నాడు. ఏ వన్ స్లాట్ ఓకే అయ్యింది. కాసేపట్కి రెండోకాల్ ఢిల్లీ నుంచి. మై కుఛ్ కెహనా చహతీహూ… అవతల నుంచి గొంతు కాస్త ఒణుకుతున్నట్టు. గోదావరి రేవులో ఇవతల మాట్లాడేవాడికి హిందీ రాదు… బోలియే బోలియే తప్ప…! ముఝే ఏక్ స్లాట్ జరూర్ చాహియే…పట్టిపట్టి చదివినట్టు వస్తోంది హిందీ… మళ్లీ మాట్లాడితే హిందీ వినాల్సొస్తుందని ఇది కూడా ఓకే.

ఓయ్… ఎవరెవరికో ఇచ్చేస్తే ఎలా…? అంత రిస్క్ తీసుకొని స్నానమే చేయించాం… ఈ స్లాట్ మన సార్ కి వద్దా అనుకుంది బుచ్చి బుచికి. కోట గుమ్మంలో బెదిరించినట్టే ఇక్కడా అదే ఫార్ములా. అయితే ఓకే ! నాల్గోది… రానుకున్నారా… తీసుకోలేననుకున్నారా బ్యాచ్ ది. ఏపీ ప్రభుత్వంలో వాళ్లకి ఓ కోవర్ట్ మంత్రి ఉన్నాడు. ఉత్తరాంధ్ర నుంచి. కాంగ్రెస్ బతికున్నప్పుడు ఆ ప్రభుత్వంలో… ఇపుడు టీడీపీ ప్రభుత్వాల్లో మంత్రి అయిన ఒకే ఒక్కడు ఆయన. ఆ మంత్రి కీ ఇచ్చాడు. స్లాట్ దొరికింది. ఇంత జరుగుతోందని తెలిసి. ఇక ఐదో స్లాట్. పార్లమెంటు సమావేశాల ముందు పుష్కర ఎనర్జీ కావాలనిపించింది బడాసార్ కి. డైరెక్ట్ కాల్ చేశాడు. జీ మై… దామోద… అనగానే అర్థమైపోయింది. సార్ సార్ మీకోసమే సార్… ఓకే సార్. ఇతవల ఆన్సర్. లాంగ్వేజ్ అర్థం కాకపోయినా ఎమోషన్ కేరీ అయ్యింది సార్ కి.

కిలికిలిలో స్నానానికి కొన్ని షరతులు :

– పొలిటిక్స్ మాత్రమే మాట్లాడాలి… పరిస్థితి చెప్తే చాలు, అంతా గోదారి చూస్కుంటుంది…
– స్నానం చేసేప్పుడు బట్టలిప్పక్కర్లేదు కానీ మాట్లాడేప్పుడు మనసు విప్పాలి
– ఎవరూ వినరు రికార్డ్ చేయరు…ఇంతకు మించిన ప్రైవసీ దొరకదని నమ్మాలి… ఇది నిజం…!
– భాష ఏదైనా పార్లమెంట్ హెడ్ సెట్ లా ఆటోమేటిగ్గా ట్రాన్స్ లేట్ అయిపోయి తెలుగులో అర్థమైపోద్ది గోదారికి…
– కండిషన్స్ అప్లై… ఎవరి నంబర్ వాళ్లకి తెలుస్తుంది. మిగతా నలుగు ఎవరో మాత్రం తెలీదు
– ఐదు గంటల తర్వాత అద్భుతం జరుగుతుంది… వెయిట్ చేయాలి.

రాత్రి 12.05 : ఏ వన్  స్లాట్

– రబ్బర్ ఫేసు ఉబ్బరంగా పెట్టి నవ్వు నటిస్తూ గోదారి వైపు చూస్తున్నాడు ఏ వన్. తల్లీ గోదారమ్మా (రేయ్… రెండూ ఒకటేరా, కానీ బిల్డప్ కోసం చివర అమ్మ కలపాల్సిందే, సెంటిమెంట్) ఎంత కష్టపడ్డానమ్మా బుక్ చేసుకో డానికి ఈ స్లాట్. ఈ దౌర్భాగ్యపు పాలనలో ఐదుస్లాట్ లు మాత్రమే పెట్టారు. చెప్పుకునే దిక్కులేక అరవై అంతస్తుల భవంతిలో అరణ్య రోదన నాది. పవర్ లేక కాగితప్పువ్వులా అయిపోయింది జీవితం ఆరేళ్ల నుంచి. అందుకే చీమ చిట్టుక్కుమన్నా ఒకటే డిమాండ్ చేస్తున్నా ! జీవితం నరకం. బీరుతాగి రెచ్చిపోయినపుడు పంజాగుట్ట స్టేషన్ లో పిచ్చ ఉతుకుడు ఉతికినప్పుడు కూడా ఇంత నొప్పి అనిపించలా. సాగదీతతో లెంగ్త్ ఎక్కువైంది. గంట మోగింది. చేతిలోకి ఓ చెంబొచ్చింది. 5 గంటల తర్వాత చూడమని రాసుంది దాని మీద.

రాత్రి 01.45 : సెకండ్ స్లాట్

(అక్కడ హిందీలో మాట్లాడుతున్నా… మన సుఖం కోసం తెలుగులో అర్థమవుతుంది) ఏం మాట్లాడాలో తెలీదు. జనం ఏమనుకుంటున్నారో అర్థం కాదు. పీకే సినిమాలో రాయి ముక్కకి కిళ్లీ రంగు రాచి దేవుణ్ని చేసినట్టు… మూలన పడున్న నన్ను లీడర్ అని ముద్ర వేశారు. ఇది నాకు రెండో సక్సెస్. మొదటిది నా లవ్ స్టోరీ. పదేళ్ల అధికారం నా ప్రమేయం లేకుండానే కాకి రెట్టలా వచ్చి మీదపడింది. బుర్రుండి నోరులేనినోణ్ని పెట్టి… పదేళ్లు పండగ చేశా. మరో ఐదేళ్ల కోసం ఐదు కోట్ల ఆంధ్రుల గొంతు కోశా. హిట్లర్ జ్యూస్ ని చంపిన దానికంటే చంఘిజ్ ఖాన్ చేసిన అరాచకం కంటే నాదే గొప్ప అనుకున్నా. డామిట్ కథ అడ్డం తిరిగింది. ఇపుడు ఆ పాపం కడుక్కోడానికి రాలేదు. మర్చిపోయేలా చేయమని అడగానికొచ్చా. చెప్పడం పూర్తయ్యింది… చెంబొచ్చింది చేతికి.

రాత్రి 2.55 : మూడో స్లాట్

బెరుకు చూపులు చూస్తూ స్టిఫ్ గా ఉన్న మనిషొచ్చాడు. ఖద్దురు చొక్కా ఇస్త్రీ మడత నిక్కబొడుచుకునుంది. ముఖంలో ఉన్నది కోపమో…. ఎమోషనో…ఆందోళనో తెలియట్లా. బేసిగ్గా అది ఎక్స్ ప్రెషన్ లెస్ ఫేస్. నమస్కారాలు… ప్లెయిన్ గా మొదలైపోయింది గంభీర స్వరం. ఒక మిషన్ తీసుకున్నాం. విజన్ ఉంది మనకి. కానీ పరిస్థితులు కలిసి రావడం లేదు. అంటూ మాట్లాడుతున్నాడు. లోపల చాలా ఆవేదన ఉంది. సూటిగా చెప్పుకోలేక పోతున్నాడు. అర్థమవుతూనే ఉంది. ఎక్కడా పేర్లు ప్రస్తావించడం లేదు ఏ విషయంలోనూ ! ఎవరిని అంటే ఏమవుతుందోనన్న భయం. మధ్య మధ్యలో కాస్త గ్యాప్. మనకిప్పుడు రెండు టార్గెట్లున్నాయ్ అంటూ పాయింటికొచ్చేశాడు. ఒకటి స్టేట్ ని నిలబెట్టాలి. రెండు కొడుకుని కూర్చోబెట్టాలి. దాని కోసరం… ఓ ప్లాన్ ప్రకారం పోతున్నాం. అసమర్థులని తెలిసినా కేబినెట్ లోకి తీసుకున్నాం. అధికారుల్ని కూడా ఏం చేసినా ఏమీ అనట్లేదు. నిధులొచ్చినా రాకపోయినా కేంద్రంతో గొడవకి పోవట్లేదు. అడుగు తీసి అడుగు వేయాలంటే అరవై ఆలోచిస్తున్నాం. అంటూ చెప్పుకొస్తూ సడెన్ గా ఆపేశాడు ఆ మనిషి. ఐ బ్రీఫ్డ్ యు ద హోల్ స్టోరీ. ఇంగ్లిష్ లో కన్ క్లూడ్ చేశాడు తనదైన స్టైల్లో. అరెరె నేను కడుపులో పెట్టుకున్న విషయాల కంటే ఇతను పెట్టుకున్నవే ఎక్కువున్నాయే అనుకుంది గోదావరి. చెప్పడం పూర్తయ్యిందనుకొని… ఇక్కడ కూడా చెంబొచ్చింది.

రాత్రి 3.25 : ఫోర్త్ స్లాట్

ఫిట్ గా లేకపోయినా గట్టిగా కనిపిస్తున్న మనిషి గంభీరంగా కనిపించే ఫేస్ పెట్టాడు. నటించడం ఆయనకి కొత్త కాదు. డైరెక్ట్ పాయింట్ లోకి వచ్చేశాడు. ఈలలన్నీ ఓట్లు కాదు. చప్పట్లన్నీ సీట్లు అవ్వవు. బావమరిది ప్లాన్స్ సూపర్ హిట్లే కాదు మాడుపగిలే దెబ్బలు కూడా తినిపిస్తుంది. హాయిగా హేర్ వీవింగ్ తో ఐదారు రిలీజ్ లు కొట్టేవాణ్ని ఈపాటికి. ఇలా పక్కపాపిడి తీసుకొని సైడ్ అయిపోవాల్సొచ్చింది. ముప్ఫై ఏళ్లు కష్టపడి శిఖరమెక్కి… అమాయకత్వాన్ని (చేతగాని చేవలేని లాంటి మాటలు స్కిప్ట్ ఉంటేనే వస్తాయ్) బైటపెట్టుకున్నా. ఇంత డిజాస్టర్ లోనూ నేను చేసిన ఘనకార్యం ఒకటుంది. రాష్ట్రం విడిగొట్టేందుకు కాంగ్రెస్ చేతిలో చెంచాలా పనిచేసిన ఇద్దరు ముగ్గుర్లో నేనొకణ్ని. కానీ ఏం లాభం. తొత్తుకి పై ఎత్తుగా మిగిలా. అయినా పావలాకి పనికి రాకుండా పోతున్నానన్న బెంగ కుంగదీస్తోంది. ఇక ఫ్యామిలీ యాంగిల్. తెర మీద కొడుకు డింగో డిస్కో తెలియట్లేదు. తోడబుట్టినవాడు నాకు సీక్వెల్ తీస్తాడేమోనన్న భయం. తమ్ముడి రాజకీయానికీ తన పొలిటిక్స్ కీ తేడా లేదని నిర్ణయానికొచ్చినట్టు కనిపించింది ఆ మాట అంటున్నప్పుడు. నువ్ చిన్నప్పట్నుంచి తెలుసుకాబట్టి చెప్పేశా. హ ! డైలాగ్ క్లైమాక్స్ కి రాగానే చేతికి చెంబొచ్చింది.

రాత్రి 4.21 : ఫిఫ్త్ స్లాట్

మేరే జీవన్ మే కయీ సాల్ వెయిటింగ్ మే బితాయా థా…(ట్రేడ్ మార్క్ డైలాగని హిందీ వచ్చింది… ఇక తెలుగే) నమ్మించి మోసం… ఆ రెండు మాటల్లో మొదటి అక్షరాలు కలిపితే నా నిక్ నేమ్. అది ఏపీ అయినా… 70 సీట్లిచ్చిన యూపీ అయినా గొంతు కోయడం పక్కా. రాద్ధాంతం నా సిద్ధాంతం. అదును చూసి దెబ్బ-నా సూత్రం. పావలా ఇచ్చినా పబ్లిసిటీ నాకే రావాలి. తెలివైన సీఎం ఉంటే కన్నెత్తి కూడా ఆ స్టేట్ వేపు చూడను. ఏపీ తమిళనాడే ఎగ్జాంపుల్. సరే వదిలెయ్. ఇమేజ్ మార్చుకుంటున్నా విదేశాలు తిరుగుతున్నా. అయినా పాత పచ్చబొట్టు పోవట్లేదు చేతి మీద. గోద్రా అని. నువ్ గోదావరి కదా కడిగేస్తావా ? వెయిట్ చేయమంది. చెంబొచ్చింది. అప్పటికే టైమ్ ఐదు నిమిషాల తక్కువ ఐదు.

ఐదు చెంబుల్లో కామన్ మెసేజ్. ఐదు స్లాట్లకీ సంబంధించిన కామన్ డిస్ స్క్రిప్షన్ ఉంది.

1. ఫ్రస్ట్రేషన్ తో టైమ్ అంతా తినేశావ్… రేయ్… నీ పాపాలు కడిగితే నే మూసీనైపోతా…
2. ఎక్స్ పైరైపోయిన మెడిసిన్ పనికి రాదు… నువ్ చేసిన సిన్ కడగడం మన వల్ల కాదు…
3. నువ్ కోరుకున్న వాటిలో ఒకటి ఓకే… రెండోది కేకోకేక. స్పీచ్ అరగంటలోనే ముగించావ్… ఇంప్రూవ్ అయ్యావ్…!
4. నువ్ ఎక్కడ మొదలయ్యావో అక్కడికే వచ్చేస్తావు నాయనా… యు ఆర్ ఆన్ ద వే ఆల్రెడీ…
5. వామ్మో… నీకో దండం… 2019 సెటిల్ అవుతుంది నీ లెక్క…

కిలికిలి ఘాట్ కొంపదీసింది. పేపర్లో వచ్చింది ఫేక్ ప్రకటన అని. మనసులో మాట చెప్పించేందుకు ప్లే చేసిన ట్రిక్ తెల్లారి తెలిసింది. అందుకే దానవీర శూరకర్ణ లో క్రిష్ణుడి ఎగ్జాంపుల్ చెప్పారని. దాసవవీర శూర కర్ణ స్టోరీ తెలుసుగా ! పాండవుల్ని పరీక్షిచేందుకు వారితోపాటు ద్రౌపది మనసులో ఏముందో తెలుసుకునేందుకు క్రిష్ణుడు ఓ ట్రిక్ ప్లే చేస్తాడు. మనసులో ఉన్న మాట చెబితే చెట్టు నుంచి రాలిన పండు అతుక్కుంటుంది అంటాడు. అబద్ధం చెబితే అభాసుపాలవుతారని మెత్తగా హెచ్చరిస్తాడు. అంతే… ఒక్కొక్కరూ బైటపడిపోతారు. ధర్మరాజు జూదం ఆడాలని భీమార్జునులు కౌరవుల్ని ఓడించాలని కోరుకుంటారు. ద్రౌపడి సిగ్గుల మొగ్గవుతూ కర్ణుడు ఆరో భర్తగా కావాలనే సరికి క్రిష్ణుడు కంగుతిండాడు. అది సరదాగా సృష్టించిన సన్నివేశం. ఎన్టీఆర్ మనసుపడి మరీ పెట్టారని చెబుతారు. అంటే అది నిజానికి భారతం కాదు. అన్నగారి సృష్టి. ఇది మాత్రం మనం చూస్తున్న భారతమే !

– అభి

Comments

comments

Article Categories:
Anything Everything

Comments

Menu Title