మనకి తెలుసా ఏపీ ఎక్కడుందో ? 

Written by

అథ:పాతాళంలో ఆంధ్రప్రదేశ్… చదవడానికి ఇబ్బందిగా…. వినడానికి ఎబ్బెట్టుగా ఉంది కదూ ! కానీ వాస్తవం. సోషియో ఎకనామిక్ సర్వే  ఏపీ దౌర్భాగ్యాన్ని కళ్లముందు పెట్టింది. అభివృద్ధి చెందిన ప్రాంతం… ఎలాగైనా నిలబడగలదు… అంటూ అడ్డంగా గొంతుకోసి ఏడాది దాటిందో లేదో అప్పుడే వాస్తవం బైటపడుతోంది. లెక్కలు తీస్తే… సర్వే ఆవిష్కరించిన వివరాలు చూస్తే గుండె గుభేల్ మంటోంది. ఏపీ భోరుమంటుంది.

ఎక్కడున్నాం మనం ? 

ఎవరితోనో పోల్చుకోవడం ఎందుకు ? పక్కనున్న తెలంగాణనే తీసుకుందాం. ఇన్నాళ్లు ఏపీ అభివృద్ధి చెందిపోయింది… పాలకులంతా దోచి ఏపీకి పోసేశారని ఆరోపించి… రెండు ముక్కలుగా చించేశారు కదా ! తెలంగాణ కూడా మన కన్నా అన్నిట్లోనూ ముందే కనిపిస్తోంది. దేశమంతా సీటీ వైపు చూస్తున్న రోజుల్లో కూడా ఏపీ ఇప్పటికీ పల్లెటూళ్లనే నమ్ముకుంది. 71 శాతం జనాభా ఉంటున్నది పల్లెల్లోనే ! అదే తెలంగాణలో అయితే పల్లె మీద బతుకుతున్నది 31 శాతం మాత్రమే ! పల్లె కన్నీరు పెడుతుందో అంటూ వాళ్లు పాటగట్టి పాడి… ఏదో జరుగుతోందని చెప్పుకున్నారు. మనం మాత్రం పచ్చని పల్లెలు… పొలాలు అంటూ మిగిలిపోయాం. దాని ఫలితమే ఏపీ ఆర్థిక సంక్షోభం. సేవల రంగంలేని చోట ఏకానమీలో డబ్బు ఎలా సర్క్యులేట్ అవుతుంది ? అభివృద్ధి ఎక్కడ నుంచి వస్తుంది ? అందుకే పల్లెటూళ్లతో ఏపీ వెనకబడిపోతోంది. పచ్చని పల్లెలు,అన్నపూర్ణ, మనం మన జీవనం… ఇవన్నీ గొప్ప సంగతులే కానీ… పోటీలో నిలబడ్డానికి మాత్రం అవన్నీ లగేజ్ అనే విషయాన్ని సర్వే అంకెలతో నిరూపించింది.

పల్లె, పట్టణాల తేడాలోనే కాదు… ఉద్యోగాలు, మొబైల్ వాడకం, టాయిలెట్లు అందుబాటులో ఉన్నాయా లేవా ? రోడ్లు కనెక్టివిటీ ఇలా అన్నిట్లోనూ మన నోట్లో మట్టే కనిపిస్తోంది. ఏపీలో ఉద్యోగాలు చేస్తున్న కుటుంబాలు లక్షా 55 వేలు. అంటే మొత్తం జనాభాలో 1.93 శాతం మాత్రమే. అదే తెలంగాణలో లక్షా 79 వేలు 2.72 శాతం. మనకంటే నయం. మొబైల్ వాడకం ఏపీలో 72 శాతం ఉంటే తెలంగాణలో 86శాతంఉంది. అంటే అందుబాటులో ఫెసిలిటీలు అక్కడే ఎక్కువ. రోడ్లు సదుపాయం, టాయ్ లెట్లు లాంటి విషయాల్లో కూడా తెలంగాణ ఏపీ కన్నా ముందే ఉందని నిరూపిస్తోంది కొత్త సర్వే !

గుండె చెదిరే ఏపీ…

ఏపీకి బుందేల్ ఖండ్ తరహా ప్యాకేజీ ఇస్తాం అంటూ అడ్డంగా గొంతు కోసిన సమయంలో కాంగ్రెస్ మంత్రి జైరాం రమేశ్ అంటే (మాట వరసకి అన్నారు అది కూడా ఇవ్వలేదు. అది వేరే సంగతి) గొంతు చించుకున్నాం. ప్రోగ్రెస్సివ్ స్టేట్… అగ్రెస్సివ్ పీపుల్ మమ్మల్ని బుందేల్ ఖండ్ తో పోలుస్తారా అని. ఇప్పుడు మాత్రం పరిస్థితి అంతే దయనీయంగా కనిపిస్తోంది. ఈ లెక్కలు చూడలేదా ? విభజించేటప్పుడు ? గణాంకాలు జాడ లేకుండానే…వాస్తవాలు పట్టించుకోకుండానే కేకు కోసినట్టు రాష్ట్రాన్ని కోసేశారా ? శ్రమని చెమటని పైసాపైసా కూడబెట్టుకున్న సొమ్ముని కలల్ని అన్నీ హైద్రాబాద్ లో పోశాం. తీరా ఇపుడు ఎంటి పరిస్థితి ? అణాకానీల్లా…అడ్డంగా రోడ్డున పడిపోయామా? తల్చుకుంటే గుండెతరుక్కుపోతోంది.

ఎవరిదీ పాపం ? 

లెక్కలు వేయలేదు. వాస్తవాలు పట్టించుకోలేదు. భవిష్యత్ ఏమైపోతుందో కూడా ఆలోచించలేదు. దేశంలో.. ఆ మాట కొస్తే ప్రపంచంలోనే ఎక్కడా లేనంత అన్యాయంగా రాజధాని ఉన్న ప్రాంతాన్ని ప్రత్యేక రాష్ట్రంగా ప్రకటించి మిగతా జనాభాను ప్రాంతాన్ని అనాథని చేసేసిన ఫలితం కాదా ఇది? అసలు భూమి పుట్టాక ఎప్పుడైనా జరిగిందా… అభివృద్ధి చెందిన ప్రాంతం విడిపోవాలని కోరుకోవడం… రాజధాని ఉన్న భూ భాగం వేరు పడడం సాధ్యమేనా? కొత్తవాళ్లకి తెలిస్తే ఫక్కున నవ్వుతారు. మన మీడియా పట్టించుకోదు. మన పార్టీలు ఎవరి లెక్కలు వాళ్లవి. పుట్టిన రోజునాడు హామీ ఇచ్చాం అంటూ ఇటలీసంస్థానం అడ్డంగా విడగొట్టి పారేస్తే … పదవుల్లో ఊరేసిన కాంగ్రెస్ ఛీడపురులు చేతగాక చూస్తుండిపోయాయ్. మాకూ సమన్యాయం చేయండి అంటే వేళాకోళం వెక్కిరింతలు. ఇప్పుడేమైంది ? ఎరో చేసిన పాపానికి ఆరుకోట్ల ఆంధ్రులు అవస్థలు పడాలా ?

ఏపీకి దారేది ? 

కేసు ఓడితే ఓడాం… కోర్టు పద్ధతులు తెలిశాయన్నట్టు సరిపెట్టుకోవాల్సిందేనా ఏపీ ? విడిపోతే పోయాం మనమే వెనకబడ్డాం అని మనల్నిమనం ఊరడించుకోవాల్సింేదనా ? కచ్చితంగా కాదు. కాకపోతే వాస్తవాలు ఇప్పటికైనా కళ్లు మూసుకుపోయి గుడ్డి రాజకీయాలు చేసే దగుల్బాజీ గాళ్లకి తెలియాలి. ఏపీ ఎంత వెనకబడింది… లోటు ఎంత ఉంది… విభజనతో ఎంత పోటు పడింది అర్థమవుతుందేమో కొంతలో కొంత. అద్భుతమైన రాజధాని అవసరం ఏంటో ఇప్పుడు తెలుస్తుంది. ఓ మణిపూస లాంటి నగరం లేనిదే ప్రపంచం ఏపీని ఎందుకు పట్టించు కుంటుంది అందుకే అద్భుతమైన ప్రాంతంలో తిరుగులేని కిరీటం లాంటి రాజధాని కావాలిప్పుడు. పరిపాలన అక్కడి నుంచేచేసే స్వయం నిర్మిత వ్యవస్థ కళ్లముందుకి రావాలి. పడినా లేచి ఠీవీగా నిలబడ్డారంటే ఇక్కడ పైసా పెడితే పదికోట్లవుతుందన్న భరోసా ప్రపంచానికి కలగాలి. ఆదిశగా ప్రయత్నాలు నడవాలి. వ్యూహాలు, ప్రాణాళికలు, ప్రాంతాల వారీ లెక్కలు ఇపుడు అత్యవసరం. ఇది ఒక్క ప్రభుత్వందే బాధ్యత కాదు. మనం – జనం అంతా ఏకం కావాలి. విదేశాల్లో ఉన్న ఆంధ్రులు ఏపీని ఆదుకునేందుకు ముందుకు రావాలి. బుర్రల్లో ఉన్న ప్లాన్స్ భూమి మీద పడితే ఇక ఏపీ మహా వృక్షమై విస్తరించిశాఖోపశాఖలు కావడానికి ఎంతో సమయం పట్టదు.

– అభి

Comments

comments

Article Categories:
Anything Everything

Comments

Menu Title