హోదాపై జగన్ జంతర్ మంతర్

Written by

అన్ని విధాలా ఆదుకుంటానంటూ తిరుపతిలో గోవింద కొట్టించిన మోడీకి ఏపీ గుర్తులేదా ? ఏపీని నిలబెట్టే బాధ్యత మాదంటూ ఎన్నికల సభల్లో చెప్పిన నరేంద్రుడు ఇప్పుడెందుకు ముఖం చాటేస్తున్నాడు ? అసహనం ఆత్మహత్యల వరకూ వెళుతోంది. పరిస్థితి విషమిస్తే మోడీదే బాధ్యత. బిడ్డని బతికించి తల్లిని చంపేశారంటూ మోడీ కొట్టిన సెంటిమెట్ డైలాగులు ఎటుపోయాయ్ ? ఇలాంటి మాటలు పేలతాయేమో ఢిల్లీ జంతర్ మంతర్ దీక్షలో అని ఎదురుచూసిన అభిమానులకి పట్టెడు నిరాశపంచి పెట్టాడు జగన్మోహన్ రెడ్డి. పోలవరం రెండర్లు, ఓటుకు నోటు కేసులో బాబు ఎందుకు అరెస్టు చేయరు ? పట్టిసీమ ఎత్తెంత ? లోతెంత ? ఇవే మాటలు. పాత పాటలు. స్టేజ్ మారింది కానీ జగన్ స్టేటస్ పెంచలేదేమో ఈ మినీ దీక్ష అనిపిస్తోంది.

నా గోడు వెళ్లబోసుకునేందుకు ఏపీ ప్రత్యేక హోదా మరో అవకాశం అన్నట్టుంది జగన్ ఢిల్లీ పోరాటం. అంత దూరం వెళ్లినపుడు కోట్లకి కోట్లు డిపాజిట్లు చేసి జనాన్ని పోగేసి రాజధానిని మోతమోగించాలనుకున్నప్పుడు కటౌట్ తో పాటు కంటెంట్ కూడా తప్పనిసరి. ఫిరంగులు గురిపెట్టి మందుగుండు మర్చిపోయారు. విపక్షాలన్నీ ఏకమై మదగజ మోడీని గడ్డివెంటితో బంధించేప్రయత్నం చేస్తున్నప్పుడు జగన్ కూడా ఓ గడ్డిపోచలా సాయపడాలి కానీ వెన్నపూస రాయకూడదు ప్రధానమంత్రికి. జగన్ తెలియక చేసిందో… రాజకీయ అమాయకత్వం వల్ల జరిగిందో కాదు ఇది. ఢిల్లీలో దీక్ష చేశామన్న పేరు రావాలి… చంద్రబాబు ఇరుకున పడిపోవాలి. మోడీ దృష్టిలో పడాలి. పైగా నన్నేమి అనలేదని ఆయన ఆనందపడాలి.
ఇన్ని లక్ష్యాలున్నాయ్ జగన్ దీక్షలో. మోడీని సంతోషపెట్టాలన్న లక్ష్యమే లేకపోతే రాహుల్ మీద గురిపెట్టాల్సిన అవసరం లేదు జగన్ కి. కాంగ్రెస్ కూడా హోదాపై మోడీని నిలదీస్తానంటోంది కాబట్టి కలిసి నడవొచ్చు. కానీ నిలదీయడం మెలిపెట్టడం కాదు జగన్ కి కావాల్సింది. హడావుడి జరగాలి. హోదా రాజకీయం ఓ ఆయుధంగా వాడుకోవాలి. కొన్నాళ్లు పబ్బం గడవాలి.

ఏం కావాలి ఏపీ విపక్షానికి ?

అన్నదమ్ములిద్దరు విడిపోయారు. తమ్ముడికి ఇష్టం లేదు. అయినా విడిపోక తప్పలేదు. విడగొట్టే సమయంలో తండ్రి చెప్పాడు తమ్ముణ్ని నిలబెడతా. ఆదుకుంటానని. అన్నలాగే సొంత ఇల్లుకట్టుకొని సంపాదించుకొని తనతిండి తాను తినగలిగే స్థాయి వరకూ ఆదుకోవాలనేది ఒప్పందం. ఓకే ! విడిపోయి ఏడాది దాటింది. తండ్రి మాట నిలబెట్టుకోవడం లేదు. ఇచ్చిన మాట పోషించుకుంటాడో లేదో తెలీదు. అలాంటప్పుడు మరి ఎవరైనా తండ్రిని ఘాటుగా నిలదీస్తారా ? లేదంటే… తండ్రి అంతు తేల్చునువ్ అంటూ తమ్ముడి మీద ఒత్తిడి తెస్తారా ? బుర్రున్న వాడికి ఎవరికైనా అర్థం అవుతుంది స్టోరీ. జగన్ కి తప్ప. ఏపీ విపక్ష నాయకుడు మాత్రం తండ్రిని అడగడం మానేసి తమ్ముణ్ని తిట్టిపోస్తాడు. వీలైతే తండ్రితో సిట్టింగ్ పెట్టాలని ఆశ పడతాడు. ఇదేం రాజకీయం ! ఇదెక్కడి పెద్దరికం ! డియర్ జగన్… దిస్సీజ్ రియల్లీ అన్ ఫార్చునేట్ ఆన్ యువర్ సైడ్.

పక్కనున్న తెలంగాణలో చూడండి. సెటిలర్ల ఓట్ల ఏరివేత అయినా… ఆంధ్రా విద్యార్థుల ఫీ రీయింబర్స్ మెంట్ లాంటి విషయాలైనా విపక్ష కాంగ్రెస్ కూడా కేసీఆర్ నే సపోర్ట్ చేస్తుంది. తెలంగాణ ఫీలింగ్. యూనిటీ. రాజకీయంగా ఎంత కొట్టుకున్నా ఆ మాత్రం స్పిరిట్ ఉంటుంది చూడండి. మన దగ్గరేది ఆ క్లారిటీ ? ఎంత సేపూ పైనున్నవాణ్ని లాగేస్తే నేను కూర్చోవచ్చు కదా అనే ఆరాటం తప్ప ! హోదాలోనూ అదే గొడవ. ఆత్మహత్యల్లోనూ అదే తగువు. ప్రాజెక్టులు టెండర్లు… రాజధాని. చీమ చిటుక్కుమంటే చంద్రబాబు బాధ్యత వహించి అయితే రాజీనామా చేయడమో లేదంటే అరెస్ట్ కావడమో జరగాలి. వాటివల్ల ఒరిగేదేంటి ఏపీకి… జగన్ హ్యాపీ అవ్వడం తప్ప.

జగన్… ఇంకెన్నాళ్లు స్పిఫ్పర్ పాలిటిక్స్ ?

పోలీసుల దగ్గర స్పిఫ్పర్ స్క్వాడ్ ఉంటుంది. ఏదైనా నేరం జరిగినప్పుడు వచ్చి వాసన చూస్తాయ్. వాటికిచ్చిన ట్రైనింగ్ ని బట్టీ పసిగట్టే ప్రయత్నం చేస్తాయ్. జగన్ పసిగట్టేదేం లేదు కానీ వాసన మాత్రం పట్టుకుంటాడు ఠంచనుగా. మున్సిపల్ ఉద్యోగుల జీతాలపై పుష్కరాల ముగింపునాటికి నిర్ణయం ఉంటుందని తెలియగానే… రెండ్రోజుల ముందు ఓ ప్రకటన చేస్తాడు. పెంచకపోతే వంచుతాం ప్రభుత్వాన్ని అని. ఎలాగూ ప్రభుత్వం పెంచేస్తుంది కాబట్టి ఆయన చలవ అన్నమాట. రుణమాఫీ విడతల వారీ వ్యూహం సిద్ధమవుతుంటే… ప్రకటన వస్తుంది మాఫీ మీద పోరాటం చేస్తానని. ఎలాగూ అనుకున్న ప్రకారం విడుదలవుతుంది కాబట్టి..అదికూడా ఆయన సాధించిన విజయమే. హోదా విషయంలోనూ ఇదేరూటు
దసరా నాటికి మోడీ అమరావతి శంకుస్థాపనకి వస్తారన్న సమాచారం ఎలాగూ ఉంది కాబట్టి హడావుడి ఉద్ధృతం చేసి నేనున్నానని చెప్పుకునే ప్రయత్నాలే ఇవన్నీ.

జగన్ కి చెప్పే వాళ్లు లేరా ? వ్యూహకర్తలంతా దివాణంలో ఉండిపోయారా ? లేదంటే దివాళా తీసేశారా ? వీటిలో ఏదీ నిజం కాదు. వ్యూహాలు పన్నేవారు లేకపోవడమేం… ఉంటారు. కానీ… ఆయన వినిపించుకోరు. తన చరిష్మా ముందు ఎత్తుగడలన్నీ జుజుపి అనుకుంటారు. అదే సమస్య.
జగన్ వ్యవహారం చూస్తుంటే మాయాబజార్ లో రేలంగి పాత్ర గుర్తొస్తుంది. అతడికి మీ తెగువేది. అతనికి మీ తెలివేది అంటూ పక్కన ఇద్దరు ఉంటారు. ఉత్త పొగడ్తలకి మురిసిపోయి ఉత్తర కుమారుడు వాళ్లకి తన హారాలు ధారపోస్తుంటాడు. జగన్ కూడా అంతే అనిపిస్తుంది. ఒక్కటే తేడా ! అక్కడ రేలంగి ఉదారంగా ఇచ్చేశాడు. ఇక్కడ మాత్రం అలా ఉండే అవకాశం లేదు.

– అభి

Comments

comments

Article Categories:
Anything Everything
Menu Title