హైద్రాబాద్ నుంచి మనల్ని గెంటేస్తున్నారా ?

Written by

సర్వే అంటూ ముందు ఆరా తీశారు. రీయింబర్స్ మెంట్ లో పేచీ పెట్టారు. ఇపుడు ఓట్ల ఏరివేతతో గెంటివేసేందుకు సిద్ధమవుతున్నారా ? హైద్రాబాద్ లో ఆంధ్రుల చోటెక్కడ ? ప్రశ్నించే గొంతులేవి ?

హైద్రాబాద్ లో 23 లక్షల ఓట్లు గల్లంతైపోయాయ్. ఇళ్లకి తాళాలేసి ఉన్నాయని 12 లక్షలు… అడ్రస్ తేలలేదంటూ కొన్ని… డబుల్ ఉన్నాయంటూ ఇంకొన్ని ! ఏరిపారేయాలనుకున్నప్పుడు రాళ్లైతేనేం… బియ్యమైతేనేం ! గ్రేటర్ ఎలక్షన్ కి ముందు ఇదంతా గ్రౌండ్ ప్రిపరేషన్. ఆంధ్రుల ఓట్లు ఎక్కడ ఎక్కడ ఉన్నాయో ఏరికోరి రెక్కీ చేసి లెక్క తీసి మరీ ఏరేస్తోంది తెలంగాణ ప్రభుత్వం. ఎన్నికల ప్రధానాధికారి భన్వర్ లాల్ కాపలాలో టీఆర్ఎస్ మూకలు కవాతు చేస్తూ రెచ్చిపోతున్నాయ్. ఆంధ్రోళ్లకి ఓట్లుంటే మనకేడ ఏస్తరు ? గయినా వాళ్ల ఊళ్లల్లా మనకున్నయ ఓట్లు… ఈడ ఎందుకు? ఇట్స్ ఎ మేటర్ ఆఫ్ కామన్ సెన్స్. ఇదీ సమీక్షలో డైలాగ్. అధికారులకి గైడెన్స్.

ఆంధ్రోళ్లు మా బిడ్డల్లెక్క. కడుపులో పెట్టుకుంటామన్న కబుర్లలో చేవెంతో ఇక్కడే తెలిసిపోతోంది. కడుపులో కత్తులు పెట్టుకొని విషం కక్కుతున్న తీరు ఇపుడు అడ్డంగా బైటపడుతోంది. 72 లక్షలున్న ఓ సిటీలో 23 లక్షల ఓట్లు ఏరివేయడమంటే మాటలా ? అంటే ప్రతి ముగ్గురిలో ఒకరి ఓటు ఎగిరిపోయినట్టే. ఇంతటితో అయిపోలేదు… ఆపరేషన్ కొనసాగుతోంది… ఆధార్ లింక్ లాంటివన్నీ కొలిక్కి వస్తే నెలాఖరుకి తేలుతుంది ఎవరికి ఓటుందో లేదో అంటూ తీరిగ్గా చెబుతున్నారు ఎన్నికల అధికారి. అంటే ఓట్ల ఊచకోత ఇంకా కొనసాగుతుందన్న మాటే !

ఎందుకీ ఏరివేత ?

గ్రేటర్ ఎలక్షన్ ముంచుకొస్తోంది. ఆర్నెల్లు ఆర్నెల్లు అంటూ వాయిదాల మీద వాయిదాలేస్తోంది తెలంగాణ ప్రభుత్వం. బరిలో దిగాలంటే కాళ్లు ఒణుకుతున్నాయ్. ఓ పక్క నుంచి టీడీపీ ఎమ్మెల్యేల్ని కొనుక్కుంటూ ఇంకోపక్క నుంచి సెల్ప్ పబ్లిసిటీ చేసుకుంటూ వస్తోంది. ఇది పైకి కనిపిస్తున్న సీన్. తెర వెనక ఇంకోటి నడుస్తోంది. ఓట్ల ఏరివేత. ఆంద్రులు ఎక్కువగా ఉన్న ప్రాంతాల్ని వార్డుల విభజన పేరుతో చిన్నాభిన్నం చేయడం లాంటి ఎత్తుగడలు వేస్తోంది టీఆర్ఎస్ ప్రభుత్వం. టీడీపీ బలమెంతో హైద్రాబాద్ లో సెటిలైన ఆంధ్రులు ఏం కోరుకుంటున్నారో గత ఏడాది ఎన్నికల సమయంలోనే తెలిసిపోయింది. ఇప్పుడు ఆ అభిప్రాయం ఇంకా బలపడుతోంది. సెక్షన్ 8, సెటిలర్ల పేరుతో అరాచకాలు లాంటి వన్నీ తీవ్రమవుతున్న సమయంలో టీఆర్ఎస్ కొడుతున్న దొంగ దెబ్బ ఇది. దానికి ఎన్నికల అధికారి వత్తాసు. ధ్రుతరాష్ట్రృడి లాంటి గవర్నర్ సమర్థింపు.

ఓటు లేకపోతే మనిషి ఉన్నా లేకపోయినా ఒక్కటే. ఇది ప్రజాస్వామ్య ప్రాధమిక సూత్రం. అలాంటి హక్కునే కాల రాస్తున్నారంటే ఇంక ఉనికిని పట్టించుకోనట్టే. కరివేపాకుల్లా తీసి పారేసినట్టే. పదేళ్లు ఉమ్మడి రాజధానా… కొడుకులు ఇక్కడనే ఉంటరా పదేళ్లు అంటూ కడుపు మంట బైట పెట్టుకోవడం విన్నాం… కబ్జాపెట్టి సెటిల్మెంట్ల వరకూ వెళ్లి వెంటాడడమూ చూస్తున్నాం. ఇపుడు ఓట్లే తుడిచేస్తున్నారంటే… ఉనికినే చెరిపేయాలనుకుంటున్నారని అర్థమవుతూనే ఉంది. మరి ఎవరు స్పందించాలి ? ఎవరు మాట్లాడతారు. కాళ్లు మొక్కితే పరవశించిపోయే గవర్నర్ మాట్లాడే పరిస్థితిలో లేరు. హైద్రాబాద్ లో ఆంధ్రులు గ్లాడియేటర్ లా పోరాడాలని వినోదం చూడాలని కేంద్రం కోరుకుంటున్నట్టు కనిపిస్తోంది. ఇప్పటి వరకూ కనీసం నోరెత్తకపోవడానికి కారణం అదే. మరి ఇప్పుడు ఏది దారి ? ఏళ్ల తరబడి హైద్రాబాద్ లో ఉన్నవాళ్లు కూడా చచ్చినట్టు ఓటు లేకపోతే సరిపెట్టుకోవాల్సిందేనా ? మన రాష్ట్రంలో మనం ఓటు రాయించుకుందాం అంటూ పెట్టేబేడా సర్దుకోవాల్సిందేనా?

హైద్రాబాద్ లో మనోళ్లకి దారేది ?

మన రక్తమాంసాలతో హైద్రాబాద్ ని పోషించాం. పెట్టుబడులు పెట్టి పెంచాం. హైద్రాబాద్ ఎదుగుదలతో మనమేంటో… మన ప్రభావమెంతో అర్థంకావడానికి ఎంతో కాలం పట్టదు. ఇప్పుడు విషయం అది కాదు. మనమేంటి ? మనం చేయాల్సిందేంటి ? చేస్తున్నదేంటి ? మనంతట మనం వచ్చేస్తే ఇష్టానుసారం. మెడపట్టి గెంటేస్తే అది కష్టానుసారం. ఇలాగే అనుకోవాలా ? జరుగుతున్నది ఇంతేనా ? ఇప్పటికైనా హైద్రాబాద్ మీద ప్రేమ ఒలకబోసుకునే వాళ్లు కళ్లు తెరవాలి. మనమేంటో… మన స్థానమేంటో… ఎలా ట్రీట్ చేయాలనుకుంటున్నారో అర్థం చేసుకోవాలి. సెటిలర్ ఫ్రంట్లు ఫోరాలు పెట్టి రాజకీయ బేరాలాడేవాళ్లు… తెలంగాణ ఫోరమ్ ఫర్ ఆంధ్రా అంటూ పబ్బం గడుపుకొనే వాళ్లు కుతంత్రాలు ఆపాలి. అమ్ముడుపోతే స్వార్థం చల్లబడుతుందేమో… కానీ భవిష్యత్ వ్యర్థం అయిపోతుందన్న వాస్తవం తెలుసుకోవాలి. ఇదే తక్షణ అవసరం.

నీకు సిగ్గూ లేదు నాకు ఎగ్గూలేదన్నట్టు తుడుచుపోయే రోజులు పోయాయ్. నా ఇంటికే పర్మిషన్ ఇవ్వలేదని మూలుగుతూ, ఇక్కడే వేలాడే చంద్రబాబు ఇప్పుడేం చెబుతారు ? హైద్రాబాద్ వదిలి రాబోమంటూ గబ్బిల్లాల్లా పట్టుకుంటామంటున్న ఏపీ ఉద్యోగులు ముఖమెక్కడ పెట్టుకుంటారు ? విడిపోతే మనకేంటి… మనం ఇక్కడే ఉంటాం అంటూ ఆస్తుల కోసం అడ్డగోలు వాదనలు చేసే వాళ్లు లెక్కలో ఉండాలనుంకుటన్నారా ? లేకపోయినా పర్వాలేదని ఎలాగోలా బతికేయాలనుకుంటున్నారా ? తేల్చుకోవాలి. లేకపోతే లెక్క మారిపోద్ది.

– అభి

Comments

comments

Article Categories:
Anything Everything

Comments

Menu Title