హైద్రాబాద్ కి ఎయిట్…ఆంధ్రా అభివృద్ధికి లేట్ ?

Written by
హైద్రాబాద్ లో సెక్షన్ 8 అమలైతే ఏపీకి నష్టమా ? అదెలా ? హైద్రాబాద్ లో శాంతిభద్రతల పరిస్థితులు, ఫోన్ ట్యాపింగ్, లోకల్ నాయకులు అధికార పార్టీ డిమాండ్లు లాంటివన్నీ ఏడాదిగా కామన్ అయిపోయాయ్. కంప్లైంట్లే లేకుండా పోయాయ్. ఇలాంటి సమయంలో గవర్నర్ అధికారాలు, సెక్షన్ 8 తో పగడ్బందీ ఏర్పాట్లంటే హైద్రాబాద్ కి మళ్లీ ప్రాణం పోసినట్టే. ఏపీ ప్రయోజనాల్ని ఇంకొన్నాళ్లు లేట్ చేసినట్టే ! వాస్తవంగా ఆలోచిస్తే ఇదే లాజిక్ !

 

దశాబ్దాలు దాటిపోతున్నా తిరుపతి ఎందుకు డెవలప్ కాదు ? కర్నూలు ఎందుకు పైకి లేవదు ? రాయలసీమ ఎందుకు అలా ఉండిపోయిందంటే అంటే ఒక్కటే సమాధానం… హైద్రాబాద్ 200 కిలోమీటర్ల దూరం. బెంగళూరు 300కిలోమీటర్లకి కాస్త అటూ ఇటూ ! చెన్నై అయితే 250 మాత్రమే ! అలాంటప్పుడు… సీమ వైపు ఎవరు చూస్తారు. సీమలో పుట్టినోళ్లు కూడా ఆ సిటీలకే వెళ్లిపోతారు… వ్యాపారాలు చేస్తారు. పిడికెడు మంది బాగుపడతారు కానీ… సీమ ఎప్పుడూ పక్క చూపులు చూస్తూ అలాగే ఉంటుంది. వెనకబాటుకి ఇది కూడా ఓ ప్రధాన కారణం. కాదనలేని వాస్తవం.

 

ఏపీ కూడా ఇలాంటి సమస్యే ఎదుర్కొంటోంది హైద్రాబాద్ తో ! ఇపుడు కొద్దికొద్దిగా పరిస్థితి మారుతోంది. కొన్నేళ్లుగా ఉద్యమం అలజడి. ఇపుడు ఆధిపత్యపోరాటం… జిల్లాల నుంచి వచ్చిపడిన కొత్త రాజకీయం హైద్రాబాద్ తో ఓ ఆట ఆడుతున్నాయ్. ఇలాంటి సమయంలో పరిస్థితి ఏపీకి అనుకూలంగా మారుతోంది. వెళ్లిపోతే బెటరేమో అనుకుంటున్నవాళ్ల సంఖ్య పెరుగుతోంది. లాజిక్ చాలా సింపుల్. భద్రత… పెట్టుబడులకి సరైన అవకాశాలు, అందుబాటులో భూములు, అన్నిటికీ మించి వసూళ్ల భయం లేని చోట పెట్టుబడులు పెట్టేందుకు పెద్దగా ఆలోచించడానికి ఏం ఉండదు. ఒకరిద్దరొస్తే ద్వారం తెరుచుకున్నట్టే ! అంటే హైద్రాబాద్ మైనస్ లే మన ప్లస్ పాయింట్లు. అలాంటి సమయంలో ఆంధ్రుల భద్రత అంటూ పాత విషయంతో కొత్తగా రాజకీయ చదరంగం ఆడేసరికి కథ అడ్డంతిరుగుతుందా ఏపీకి అనిపిస్తోంది.

 

పక్కరాష్ట్రం బలహీనతనను నమ్ముకోవడమో… పక్కనోడు పడిపోవాలని కోరుకోవడమో కాదిది. వాస్తవ పరిస్థితి. ఇండస్ట్రియల్ సమ్మిట్ లాంటి చోట కూడా దేశీయ పారిశ్రామిక దిగ్గజాలు అంబానీ అదానీ లాంటి సంస్థల ఛాయల్లేనేలేవ్. ఎప్పుడో ఆగిపోయిన ఐటీసీ పర్మిషన్లు ఇస్తే పెడతామంది అంతే ! అంటే సేఫ్టీ, సెక్యూరిటీ, క్రెడిబిలీటీ పెట్టుబడికి ప్రాణాధారం. దావోస్ లాంటి వేదికపై ఏపీ ముఖ్యమంత్రితో కరచాలనానికి బడా బిజినెస్ మాగ్నెట్ లు చూపించిన ఆసక్తి చూస్తే అర్థమవుతుందీ సంగతి. అంతెందుకు ఆంధ్రప్రదేశ్ లో సంప్రదాయేతర విద్యుత్ రంగంలో పెట్టుబడులకి సిద్ధమంటున్నారు జపాన్ సాఫ్ట్ బ్యాంక్ సీఈవో మసాయో సీషోన్. సాఫ్ట్ బ్యాంక్ ప్రపంచంలోనే టాప్ టెన్ గ్రోయింగ్ ఇన్వెస్ట్ మెంట్స్ లెజెండ్స్ లో ఒకటి. ప్రధాని మోడీతో సమావేశం తర్వాత నేరుగా వచ్చింది ఏపీ ప్రభుత్వం దగ్గరకే ! ఇదీ మరి ఊపంటే ! ఓ పక్క ఏపీకి ఇలాంటి సానుకూల సంకేతాలు కనిపిస్తున్నాయ్. హైద్రాబాద్ ని ప్రతికూలతలు వెంటాడడం మొదలవుతోంది. ఇలాంటి పరిస్థితుల్లో గవర్నర్ రూల్ వాతావరణాన్ని మార్చే అవకాశం లేకపోలేదు. శాంతిభద్రతలు గవర్నర్ చేతిలో ఉంటే… అరాచకానికి కళ్లెం పడటం సంగతి అటుంచి… మన అవకాశాలకి గొళ్లెం పడుతుందా అనిపిస్తోంది.

 

ఓ పాతిక వేల మంది హైద్రాబాద్ నుంచి ఏపీలో సొంత జిల్లాలకి వచ్చేస్తే … చాలా మార్పులొస్తాయ్. అదేం పెద్ద నంబర్ కాదని అనుకోలేం. ఎలాగంటే…వీకెండ్ రిలాక్సేషన్ కోసం ఖర్చు పెట్టేవాళ్లలో మెజారిటీ మనోళ్లే. అంటే వారానికి తక్కువలో తక్కువ వేసుకున్నా ఓ పాతిక వేల సినిమా సీట్లు ఖాళీ. శుక్రవారం సాయంత్రం నుంచి పార్టీ మూడ్ ఉండేవాళ్లలో ఎక్కువమంది ఏపీ వాళ్లే. అంటే హోటళ్లు, రెస్టారెంట్లు, ఫన్ పాయింట్స్ లో పాతిక వేల టిక్కెట్లు ఖాళీ. పెట్రోల్ బంకుల్లో ఫ్యూయల్ వాడకం కట్. షాపింగ్ మాల్స్, బ్రాండెడ్ వేర్ పర్చేజింగ్ కట్. ఇవి కాకుండా ఇంటి అద్దెలు, రోజువారీ ఖర్చులు, టిఫిన్ సెంటర్లు, పబ్లిక్ ట్రాన్స్ పోర్టేషన్ ఇలా చాలా ఉంటాయ్ పెట్టే ఖర్చులు. అంటే పిడికెడు మంది కదిలితేనే కోట్ల టర్నోవర్ ఎఫెక్ట్ అవుతుంది. మినీ హైద్రాబాద్ తరలిపోతున్నట్టు కనిపిస్తుంది ఇంపాక్ట్ అర్థమైతే ! ఇళ్లు స్థలాల కొనడం, వెహికిల్స్ లాంటివి కాకుండానే ! అవి కూడా కలిపితే హైద్రాబాద్ లో మార్కెట్ డిఫెక్ట్… ఏపీ వైపు ఎఫెక్ట్ గట్టిగానే కనిపిస్తుంది. జేబులో డబ్బు విషయంలోనే ఇంత తేడా చూస్తే మరి ఉద్యోగాలు పెట్టుబడులు కూడా కలుపుకొంటే… తరలిపోతే తలరాతలు మారడం ఖాయం.

 

ఇప్పుడున్న మూడ్ ని బట్టీ… హైద్రాబాద్ లో స్థిరపడ్డ ఆంధ్రుల్లో మూడొంతుల మంది మానసికంగా సిద్ధపడిపోయారు సొంత రాష్ట్రానికి జిల్లాకి సొంత ఊళ్లకీ వెళ్లిపోయేందుకు ! ఏ మియాపూర్ లోనో బెదిరించారనో.. బండ్లగూడాలో రాయించుకున్నారు బలవంతంగా అనో తెలిస్తే విన్నవాళ్ల గుండెల్లో రాయి పడుతుంది. విదేశాల నుంచో ఇతర రాష్ట్రాల నుంచో వచ్చేవారి కన్నా ముందు వెళ్లేది వీళ్లే ! ఇంకా పనులు మొదలు కాలేదనో… పెట్టుబడుల పాలసీ, ఇండస్ట్రియల్ డెవలప్ మెంట్… జిల్లాల వారీగా ఫోకస్ లాంటి విషయాల మీద ప్రభుత్వం దృష్టిపెట్టడమే ఆలస్యం అని ఎదురుచూస్తున్నారు చాలామంది.  అందుకే వాహనాల రిజిస్ట్రేషన్లు కూడా ఇపుడు 13 జిల్లాల్లో పెరుగుతున్నాయ్. ఇక్కడే పెడదాం ఖర్చు అనుకోవడమే దీనికి కారణం. ఇలాంటి సమయంలో గవర్నర్ రూల్ తరలిపోయే ఆలోచనను ఆలస్యం చేస్తుంది చాలా వరకూ ! ఇది ఏపీ ఆపసోపాల్ని మరి కాస్త పెంచుతుంది.

 

ఇలాంటి పరిస్థితుల్లో గవర్నర్ రూల్ అంటూ హైద్రాబాద్ టు ఏపీ షిప్టింగ్ ఆలస్యం అయితే సెక్షన్ 8 ఏపీకి దెబ్బకొట్టినట్టే లెక్క. హైద్రాబాద్ చుట్టూ రాజకీయం మొత్తానికి ఏపీ ముందరకాళ్లకి మళ్లీ బంధం వేస్తోంది. కాకపోతే ట్రిగ్గర్ నొక్కింది మన ప్రభుత్వమే ! రాజకీయమే ఫస్ట్… జనం, రాష్ట్రం నెక్ట్స్ అని మరోసారి రుజువైంది. రాష్ట్రాన్ని ఎక్కడిదక్కడ వదిలేసి పక్క రాష్ట్రంలో ఆపరేషన్ తో టెన్షన్ కొనితెచ్చుకున్నాక… ఇలా కూడా అనుకుంటే తప్పేముంది !

 

Comments

comments

Article Categories:
Anything Everything

Comments

Menu Title