స్వర్ణోత్సవ సింగపూర్ పాజిటివ్స్ పట్టుకుందాం…

Written by

పాజిటివ్స్ లో పోలికలు చూసుకుంటాం ! అనుకోకుండా వాటివెంటే నెగెటివ్స్ లోనూ ఒకేలా ఉండడం కొన్ని సార్లు కనిపిస్తుంది మనకి. సింగపూర్ మోడల్ కావాలంటూ మనం ఆరాటపడుతున్న సమయంలో… రాజధాని హంగులకి ఆ రంగులు వేసుకున్న వేళలో… ఆ దేశం స్వర్ణోత్ససం జరుపుకొంటోంది. ఆగస్ట్ 9కి సింగపూర్ ఏర్పడి సరిగ్గా 50 ఏళ్లు. అంతకు రెండుమూడేళ్ల ముందే బ్రిటిష్ నుంచి స్వతంత్ర్యం వచ్చినా మలేషియాలో ఓ రాష్ట్రంగా ఉండేది సింగపూర్. తన ప్రమేయం లేకుండానే… కోరుకోకుండానే విడిపోయింది. కొత్త దేశంగా అవతరించాల్సి వచ్చింది. అచ్చం మన ఆంధ్రప్రదేశ్ లానే ! సింగపూర్ కూడా ఆవిర్భావ సంబరాలు చేసుకోలేదు. మన లాగే. ఎందుకంటే అది కోరుకున్న ఆవిర్భావం కాదు కదా ! అప్పటుంచి ఇప్పటి వరకూ సింగపూర్ కీ ఏపీకీ చాలా పోలికలున్నాయ్. చెబితే రోషం పొడుచుకొచ్చే మైనస్ లూ ఉన్నాయ్.

వాటీజ్ ద సింగపూర్ మోడల్ ?

సింగపూర్ అవతరించినప్పుడు పరిస్థితి ఇప్పటిలా లేదు. నడి రోడ్డున కట్టుబట్టలతో నిలబడిపోయినట్టు… ప్రపంచం వైపు ఒంటరిగా, దిగాలుగా చూస్తున్న చిన్న కన్నీటిబొట్టులా మిగిలిపోయింది సింగపూర్. అలాంటి దేశాన్ని… ఆ కన్నీటి చుక్కని ముత్యంలా మలిచింది ఓ విజన్. చుట్టూ ఉన్న ప్రాంతాలు, దేశాల్ని పరిశీలించి మన బలాలేంటి బలహీనతలేంటి అని పక్కాగా అంచనా వేసుకొని మరీ రేసులోకి దిగింది. ఆ తర్వాత 30 ఏళ్లలో సింగపూర్ సూపర్బ్ స్పాట్ లా మారిపోయింది. దాని వెనకున్న ఒకే ఒక్కడు లీ క్వాన్ యు. ఆయన పార్టీ… పీపుల్స్ యాక్షన్ పార్టీ – పాప్.
సింగపూర్ మోడల్ మోడల్ అంటారు నిజానికి మోడలేం లేదు… ఏదైనా సమస్య ఎదురైనప్పుడు ఎలా ఫేస్ చేయాలనే విషయంలో వ్యూహం డిఫరెంట్ గా ఉంటుంది. కాస్త ప్రాక్టికల్ గా వెళ్తుంది అంతే ! ఏది అవసరమో అది చేసుకుంటూ పోవడం.. లేనిపోని ఆర్భాటాలకి దిగకపోవడం… ఏ మూల నుంచి వచ్చే పెట్టుబడికైనా రెడ్ కార్పెట్ పరచడం… ఇలా అన్నిట్లోనూ ఓ కొత్త పంథానే. అందుకే అమెరికన్స్ కూడా సొంత దేశంలో కన్నా సింగపూర్ లోనే సేఫ్ అని భావిస్తారు. అక్కడే పెట్టుబడులు పెడతారు.

సీక్రెట్ ఆఫ్ సింగపూర్

ఆశయాలే ఊపిరిగా ఉన్నపుడు పరిమితులు అవరోధం కాబోవనేది సింగపూర్ ట్యాగ్ లైన్. ఎదగాలన్న కోరిక బలంగా ఉంటే మిగతా వన్నీ ఆటోమేటిగ్గా వస్తాయ్ అంటుంది. వర్క్ కల్చర్ ప్రాధమిక హక్కు అని నిరూపించింది. ఓపెన్ అండ్ ట్రాన్స్ పరెంట్ ఎకనామిక్ పాలసీ విదేశీ మారక ద్రవ్యాన్నే కాదు టాలెంట్ ని కూడా తెచ్చి పోస్తోంది. మల్టీనేషనల్ కంపెనీలకి ఫేవరెట్ డెస్టినేషన్ అయ్యింది. అందుకే అమెరికా కన్నా తలసరి ఆదాయం ఎక్కువ. జపాన్ కన్నా స్పీడు… చైనా లాంటి కమిట్మెంట్ ఉన్నాయక్కడ. భారీ డిగ్రీలు, థియరీటికల్ చదువులు లేనేలేవ్. సింగపూర్ వర్సిటీ లాంటి ప్రతిష్టాత్మక ఇనిస్టిట్యూట్ లోనూ ప్రాధాన్యమిచ్చేది డిప్లొమో కోర్సులకే. 20 ఏళ్లు వచ్చీ రాగానే ప్రతి ఒక్కరూ ఏదో ఓ ఉద్యోగంలో ఉంటారు. నిరుద్యోగం ఉండదు. ఎకానమీకి బుస్ట్ వస్తుంది.

సింగపూర్ లో ఆశ్చర్యపరిచే మరో విషయం డిసిప్లిన్. ప్రభుత్వం ఓ నిర్ణయం తీసుకుందంటే ఇష్టంలేకపోయినా జనం సమర్థించేతీరు కొంత ఆశ్చర్యం అనిపిస్తుంది. 60 లక్షల జనాభాలో మూడొంతుల మంది ముస్లింలో లేదంటే చైనా జాతీయులే. వాళ్లిద్దరికీ క్షణం పడదు. అయినా ఎక్కడా ఎప్పుడూ ఇబ్బందొచ్చినట్టు, గొవడలు జరిగినట్టు కనిపించదు. అది సింగపూర్ మార్క్ డిసిప్లేన్. అంత పగడ్బందీ వ్యవస్థ ఉంది కాబట్టే పంట భూమిలేకపోయినా… సొంతగా ఓ కల్చర్ అంటూ ఉండకపోయినా… జాతీయ భాష లాంటి భేషజాలు పెట్టుకోకపోయినా సింగపూర్ సింగంలా నిలబడగల్గింది.

నెగెటివ్ సైడ్ ఆఫ్ సింగపూర్…

50 ఏళ్ల ప్రస్థానంలో పాజిటివ్సే కాదు నెగెటివ్ లూ ఉన్నాయ్. రాజకీయ నియంతృత్వం. పాప్ పెత్తనం, క్వాన్ యూ తర్వాత… ఆయన కొడుకు లీ హైసెన్ లూంగ్ యూ ప్రధాని కావడం లాంటి నిరంకుశపోకడులున్నాయ్. ప్రస్తుతం… సింగపూర్ ఎదుర్కొంటున్న ప్రధాన సమస్య సోషల్ నెట్ వర్కింగ్. అవకాశాలకి దారులు తెరుచుకోవడానికి సోషల్ నెట్ వర్కింగ్ బాటలు పరుస్తోంది. అందుకే ఉద్యోగుల్లో స్థిరత్వం ఉండడంలేదు. పక్కనున్న మలేషియాకో జపాన్ కో ఎగిరిపోతున్నారు. కన్సిస్టెన్సీ ఎఫెక్ట్ అవుతోంది. 15,16 ఏళ్లు వచ్చే సరికే సెక్సువల్ ఎడిక్షన్ లాంటివన్నీ దీని ప్రభావమేనంటోంది. అయితే లీ క్వాన్ కుటుంబ పాలనతో దశాబ్దాలుగా జనం విసుగెత్తిపోయారని … ప్రశ్నిస్తున్నందుకే ప్రభుత్వం ఇలా దారి మళ్లిస్తోందన్న విమర్శలూ ఉన్నాయ్.

ఏపీ టూ సింగపూర్ :

పాలసీ విషయంలో సింగపూర్ ని అడాప్ట్ చేసుకోవాలనుకుంటోంది ఏపీ. ఇతర రాష్ట్రాలైనా.. ప్రపంచ దేశాలైనా ఎక్కడాలేనంత ఫ్లెక్సిబిలిటీ ఫ్రెండ్లీ అప్రోచ్ ఉండాలనేది ఇక్కడ ఆలోచన. వర్క్ కల్చర్ తీసుకురావాలని… వర్సిటీ లెవెల్ విద్యను పూర్తిగా సంస్కరించాలని… వర్క్ హియర్… పెర్క్ హియర్ అనే స్లోగన్ తో పెట్టుబడులు పెట్టించి, సంపద సృష్టిస్తామనే వ్యూహంతో ఉన్నట్టు కనిపిస్తోంది. ఇదంతా నిర్మాణాత్మకం. పోలికలు చెప్పుకోవచ్చు. రాజకీయాన్ని కూడా పక్కపక్కనే పెట్టి చూసుకోనూవచ్చు. కానీ…సింగపూర్ మోడల్ ఎందులో ఉపయోగం… ఎంత వరకూ ప్రయోజనం అనేది కూడా ఆలోచించుకోవాలి. వ్యవసాయ ఆధారిత సమాజం మనది. కావాల్సినంత భూ భాగం ఉంది. పైగా జనం కూడా సింగపూర్ అంత వైబ్రెంట్, మైగ్రేటెడ్ మైండ్ సెట్ ఉన్నవాళ్లు అని చెప్పలేం. ఇవన్నీ ప్రాక్టికల్ లిమిటేషన్స్. పాలసీ మేకింగ్ లో వీటిపై దృష్టిపెట్టకపోతే సింగపూర్ ఫార్ములా అంతగా సింక్ కాకపోవచ్చు. మన ఘోష వినిపిస్తూనే… స్వర్ణోత్సవ సింగపూర్ కి మాత్రం శుభాకాంక్షలు చెబుదాం !

– అభి

Comments

comments

Article Categories:
Anything Everything
Menu Title