స్కీమ్ బాబుది… నేమ్ కేసీఆర్ ది…

Written by

సంక్షేమంలో కొత్త పుంతలు తొక్కిస్తాం… నేల మీద నుంచే చుక్కలు లెక్కిస్తాం అంటున్న కేసీఆర్ హిస్టరీని జాగ్రత్తగా తిరగేస్తున్నారు. సరిగ్గా 17, 18 ఏళ్ల కిందట ఏం చేశాం… ఏం ఆలోచించాం… అని గుర్తుచేసుకునే పనిలో బిజిగా ఉన్నారు. అప్పుడు ఏం జరిగిందంటారా ? చంద్రబాబు సీఎం. ఆయన వ్యూహబృందంలో కేసీఆర్ కూడా సభ్యుడు. అప్పట్లో ప్రవేశపెట్టిన పథకాలు, విధానాలు ఆలోచించిన పంథాలోనే ఇపుడు కేసీఆర్ జాగ్రత్తగా అడుగులేస్తున్నారు. మధ్య మధ్యలో తూలిపడుతూ, తుళ్లిపడుతూ ప్రయాణం నింపాదిగా సాగుతోంది. కొత్తగా రిబ్బన్ కట్ చేసిన స్కీమ్ చూశాక… ఇక ఇదే కన్ఫామ్ అయిపోయింది.

గ్రామ జ్యోతి పథకం పక్క రాష్ట్రంలో మొదలైంది. ఇది అప్పట్లో చంద్రబాబు మొదలు పెట్టిన శ్రమదానం కాన్సెప్ట్. స్క్రిప్ట్ అదే. టైటిల్ మారింది. గ్రామ స్థాయిలో పనులు పూర్తి చేసుకోవడం… పారిశుద్యం… శిశుసంక్షేమ విభాగం, గ్రామీణాభివృద్ధి విభాగం లాంటివాటిని భాగస్వామ్యం చేయడం లాంటివన్నీ అచ్చం అలాగే ఉంటాయ్. కాకపోతే పేరు మాత్రం గ్రామ జ్యోతి అని పెట్టారు. ఇంతకు ముందు కేసీఆర్ మొదలు పెట్టిన మన ఊరు మన చెరువు కాన్సెప్ట్ కూడా ఇలాంటి రిపీటే. అప్పట్లో జన్మభూమి అంటూ పూడిక తీతలు, గట్టు వేయడం లాంటి పనులు చేస్తే ఇపుడు అదే పేరు మార్చి కొత్తగా మళ్లీ పెట్టారు. కాకపోతే అప్టటికీ ఇప్పటికీ ఓ భారీ తేడా ఉంది. అప్పట్లో చంద్రబాబు అందర్నీ భాగస్వామ్యులని చేసి చేయిద్దాం అనుకున్నారు. ఇప్పుడు మాత్రం దానికోసం 35 వేల కోట్ల కేటాయించారు. ఆ మాత్రం… దారి ఖర్చులుండవాఏంటి… మరి వెంకలు వెదుకుతారు అంటారు ఇంకా గట్టిగా మాట్లాడితే ! అంతేలే… బులియన్ రేటు తగ్గినా ‘బంగారు’ లక్ష్యాలు ఆ మాత్రం కాస్ట్ లీ గానే ఉంటాయ్.

ఈ రెండే కాదు… ఆడపిల్లల భద్రత కోసం ప్రవేశపెట్టిన స్కీమ్… హాస్టళ్ల విధానాలు అన్నీ ఇంచుమించు అప్పటివే. కాకపోతే కలర్ మారింది. పేరు ఎలాగూ మారింది. ఎంతైనా అప్పట్లో నేర్చుకున్నవే తప్ప… ఆ తర్వాత పెద్దగా ఇంప్రూవ్ మెంట్ లేదనిపిస్తుంది కేసీఆర్ సైడ్ నుంచి ఆలోచించినా !
ప్రభుత్వం మహత్తరమైనటువంటి నిర్ణయం తీసుకుంది… మన ముఖ్యమంత్రివర్యుల నేతృత్వంలో ప్రాంతీయ అసమానతలు రూపుమాపేందుకు అంటూ… అచ్చమైన తెలుగులో కేసీఆర్ చేసిన ప్రసంగాలు యూట్యూబ్ లో కనిపిస్తూ ఇదే విషయాన్ని గుర్తుచేస్తున్నాయ్.

ప్రభుత్వాన్నే కాదు టీఆరెస్ ని కూడా ఆయన తను పుట్టిపెరిగిన పార్టీ తరహాలోనే నడపాలని మోజు పడతారు ఇప్పటికీ. అందుకే పొలిట్ బ్యూరో సహా సెటప్ అంతా అలాగే ఉంటుంది. లీడర్లుని అక్కడి నుంచే ఎలాగూ ఖర్చుకి వెరవకుండా దిగుమతి చేసుకుంటారు. అది వేరే విషయం. మొత్తానికి ఇటు పార్టీ అయినా అటు ప్రభుత్వం అయినా అంతా బ్యాక్ టూ బేసిక్సే ! ఎంతైనా కేసీఆర్ చిత్రమైన మనిషి సుమీ. నేర్చుకున్నది అక్కడ అమలు చేస్తూ… విషం మాత్రం ఇటు పక్కకి చిమ్మేందుకు శాయశక్తులా ప్రయత్నిస్తారు !

Comments

comments

Article Categories:
Anything Everything
Menu Title