సుజనా మరో లగడపాటి…

Written by

బౌలింగ్ చేతగాక తేలిపోతుంటే..రెండో విడత బ్యాటింగ్ ఉంటుందన్నాడు. బ్యాటింగ్ మొదలయ్యాక టాప్ ఆర్డర్ అంతా ఠపీమని లేచిపోయింది.
అప్పటికీ కళ్లుతెరవకుండా స్టార్ బ్యాట్స్ మన్ వస్తాడని ఊరించాడు. తొమ్మిదివికెట్లు పడ్డాక కూడా పది పడితేనే మ్యాచ్ పోయినట్టన్నాడు. కాళ్లకి నీళ్లొస్తుంటే కన్నూమిన్నూ కానకుండా చెప్పిన కంటితుడుపు కబుర్లివి. ఇంత బఫూనరీ చూపిందెవరో ఎలా మర్చిపోతాం. ఢిల్లీ – హైద్రాబాదుల్లో లంగరేసి మరీ లగడపాటి చేసిన హంగామా ఇది. ఇపుడు ఈ వారసత్వాన్ని మరోక ఆయన అందిపుచ్చుకున్నారు. కేంద్ర మంత్రి తీరుచూస్తే అదే రూట్లో జోరుగా సాగిపోతోంది. వారానికోసారి ప్రకటన చేసిన ప్రతిసారీ ఉలిక్కిపడ్డం తప్ప చేసేదేం కనిపించడం లేదు. సెకండ్ వాల్డ్ వార్లో జర్మనీ నేలమట్టం అవుతుంటే..అదేం లేదు, అద్భుతంగా పోరాడుతున్నాం.. అదరగొట్టేస్తున్నాం అని ప్రెస్ మీట్ పెట్టిచెప్పిన గోబెల్స్ కీ వీళ్లకి పెద్ద తేడా లేదనిపిస్తోంది.

ఇదంతా ప్రకటనా ? నటనా ?

ఎందుకిలా? ఇప్పుడంటే ప్రత్యేకహోదా మీద హంగామా జరుగుతోంది. ఇంతకు ముందుకూడా ఎవరూ పెద్దగా అడగకపోయినా కేంద్రం ఉద్ధరిస్తోందని భారీ సాయం రాబోతోందని సుజనా చెప్పడం రివాజు. చెప్పిన ప్రతిసారీ ఆయన అభాసుపాలవుతూనే ఉన్నారు. అయినా పద్ధతి మాత్రం మారలా. కేంద్రం ఓ పక్క కర్రుకాల్చి వాత పెండుతుంటే… సాయం కోసం సంచి తెచ్చుకోమన్నారంటూ ఓసారి… 31లోగా నిధులొచ్చేయాస్తాయంటూ మరోసారి చెప్పి కామెడీ అయిపోయారు. వారం రోజులే డెడ్ లైన్. తీరా ఆ వారం అయ్యే సరికి అదిగో రేపు సాయంత్రమే వస్తాయ్ అంటూ మరో మాట చెప్పారు. వేల కోట్లుకాదు కదా పైసా కూడా రాలదు. ఆర్థిక సంఘం కేటాయించిన వందల కోట్లు వస్తే … ఇదిగో ఇది అదే అంటూ సర్ది చెప్పే ప్రయత్నం చేస్తారు. సుజనా కబుర్లు చిత్రంగా ఉంటాయ్. లేవలేనోడు నే లేస్తేనా అన్నట్టు అనిపిిస్తాయ్. అయినా చెప్పడం ఎందుకు ? మళ్లీ దాన్ని కవర్ చేసుకునేందుకు తిప్పలెందుకు ? ఒకసారి కాదు… ఇప్పటికి ఐదారుసార్లు జరిగి ఉంటుంది ఇలాంటి విన్యాసం. ఇంత గంభీరమైన విషయంలోనూ ఇలా నాన్ సీరియస్ గా ఘడియకోతడవ ఎందుకు మాట్లాడతారు ?

ఏడాదిపైగా గడిచింది. ప్రత్యేక హోదా, ఏపీ ప్రయోజనాల విషయంలో మోడీని ఎన్నిసార్లు కలిసుంటారు ? కేటాయింపుల కోసం అరుణ్ జైట్లీకి ఏం డిమాండ్లు, విజ్ఞప్తులూ చేశారు ? స్మృతీ ఇరానీ నుంచి కేంద్ర సంస్థలు ఏం సాధించారు ? వెంకయ్యతో కలిసి వ్యూహరచన చేసి ఆయన సాధించినవేమైనా ఉన్నాయా ? సీఎం కదిపిన ఫైళ్లు కాకుండా ? ఈ ప్రశ్నల్లో ఒక్కదానికి అవునన్న సమాధానం ఉన్నా సుజనా గొప్పే. మరెందుకు ఇలా హంగామా చేస్తారంటే… పార్టీలో అంతర్గతంగా పోరు, పోటీ ఉన్నాయ్. ఢిల్లీ పంపిస్తే ఏం చేస్తున్నారంటూ ప్రత్యర్ధి వర్గం దుమ్మెత్తి పోస్తుంది. మరోపక్క నుంచి చంద్రబాబు పైనా ఒత్తిడి పెరుగుతోంది. యాక్టివిటీ జరుగుతోందంటూ ఏదో రకంగా నమ్మించే ప్రయత్నాలే ఇవన్నీ. పరోక్ష లాబీయింగ్ వ్యాపార లావాదేవీలు తప్ప ప్రత్యక్ష రాజకీయాలు తెలియకపోవడం సమాధానం చెప్పుకోవాలన్న స్మృహ లేకపోవడం కూడా దీనికి కారణాలే. గోయల్ లాంటి ఒకరిద్దరు తప్ప… సుజనా ప్రత్యక్షంగా ఒత్తిడి తీసుకురాగల్గిన మంత్రివర్గ సహచరులు కూడా ఎవరూ లేరు.

ఆయన లగడ… ఈయన రగడ…

ప్రకనటల్లోనే కాదు ఇంకా చాలా విషయాల్లో పోలికలున్నాయ్ సుజనాకీ… లగడపాటికి. సుజనా ప్రయత్నం చేసి ఇప్పటి వరకూ కేంద్రంలో సాధించిన పనులెన్నున్నాయ్ ? లగడపాటి కూడా అంతే. ఓ దశలో దాదాపు మూడేళ్లపాటు సోనియా ఆయన ముఖం చూడడానికి కూడా ఇష్టపడలేదు. ఆయన మాత్రం ఆ సంగతి బైటకి తెలియనివ్వకుండా కేంద్రం ఇలా అనుకుంటోంది అలా అనుకుంటోందంటూ మసిపూసి మరేడు చేశారు. సొంత వ్యాపార వ్యవహారాల కోసం పొలిటికల్ షీల్డ్ వాడుకోవడంలోనూ ఇద్దరూ ఇద్దరే. అన్నిటికీ మించి ప్రకనటలు. అడిగినా అడకపోయినా మాట్లాడ్డంలోనూ అల్టిమేట్ గా పోలిక వచ్చేసింది ఇద్దరికీ. ఇదే ధోరణి లగడపాటిని తేరుకోలేని దెబ్బకొట్టింది. అలాంటి పరిస్థితి రాకుండా యలమంచిలి వారు అయినా జాగ్రత్తపడితే మంచిది ! ఈ జాగ్రత్త ఆయన కెరీర్ కోసంకాదు. రాష్ట్రానికి లేనిపోని చికాకులు లేకుండా… రాకుండా ఉండటం కోసమే సుమా !

Comments

comments

Article Categories:
Anything Everything
Menu Title