సంపన్న తెలంగాణ ఏపీ రుణం తీర్చుకోలేదా ?

Written by

తల్లికి కూడు పెట్టనివాడు పిన్నమ్మకి పట్టు చీర పెడతానన్నాడట. పక్క రాష్ట్రంలో ప్రభుత్వం నిర్వాకం ఇలాగే కనిపిస్తోంది. రాని విద్యుత్ కోసంలేని లైన్లు వేసేందుకు వందల కోట్లు ఖర్చుపెట్టేందుకు సిద్ధమంటూ ఛత్తీస్ గఢ్ చుట్టూ ప్రదక్షిణలు చేశారు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి. ఇక్కడ ఓ పక్కన ధర్మల్ విద్యుత్ సర్దుబాటు చేసి ఆదుకుంటున్న ఏపీకి మాత్రం సున్నం రాస్తున్నారు. 16 నెలల నుంచి ఇదే పరిస్థితి. ధర్మర్ విద్యుత్ సర్దుబాట్లలో భాగంగా ఏపీ నుంచి తెలంగాణ భారీ స్థాయిలో విద్యుత్ బదలాయించుకుంటోంది. దానికోసం ఏపీకి డబ్బు కట్టాల్సి ఉంటుంది. ఆ విషయం అడిగితే ఏడాదిన్నర నుంచి దాటవేతే తప్ప డబ్బిచ్చింది లేదు. అందుకే ఇపుడు పంచాయతీ ఢిల్లీ వరకూ వెళుతోంది.

విభజన తర్వాత ఏపీ తెలంగాణ మధ్య… ధర్మల్ విద్యుత్ పంపిణీ జరిగింది. 46.11 శాతం విద్యుత్ ఏపీకి… 53.89 శాతం తెలంగాణకి దక్కింది. అవసరాల ప్రకారం పంపకాల్లో మార్పులు జరిగి 7.78 శాతం విద్యుత్ అదనంగా వెళుతోంది. దీనికి డబ్బు చెల్లించాల్సి ఉందని ఏపీ ట్రాన్స్ కో కేంద్రానికి (సెంట్రల్ ఎలక్ట్రిసిటీ అథారిటీకి) చెప్పాలన్న నిర్ణయానికొచ్చింది. రాష్ట్ర విభజన జరిగిన నాటి నుంచి లెక్క కడితే టీఎస్ పీసీసీ ఇప్పటి వరకూ 2721 కోట్లు ఏపీకి బాకీ పడింది. సర్దుబాట్లలో భాగంగా ఏపీ కూడా తెలంగాణకి 1593 కోట్లు చెల్లించాల్సి ఉంది. ఆ మొత్తం మినహాయించుకున్నా తెలంగాణ 1128 కోట్లు బాకీ పడినట్టే. మే నెల బకాయిలు కూడా కలిపితే 1271కోట్లు రావాల్సి ఉందని ఇక కేంద్రం కోర్టులోనే తేల్చుకుంటే నయమన్న నిర్ణయానికి వచ్చామని ఏపీ జెన్ కో చెబుతోంది.

పైకి పెడబొబ్బలు… లోన పిడిగుద్దులు…

విద్యుత్ విషయంలో మాకు అన్యాయం జరిగిపోయింది. సీలేరులో వాటా రావాలి… శ్రీశైలం నుంచి చివరి బొట్టు వరకూ కరెంటు తీస్తామని పైకి బీదఅరుపులు అరుస్తూ దొంగదెబ్బ కొట్టేందుకు తెలంగాణ ప్రయత్నిస్తోంది అనేందుకు ఇది మరో ఎగ్జాంపుల్. లేదంటే… వాటా వాడుకొని డబ్బు ఎగ్గొట్టడం దేనికి ? సంపన్న రాష్ట్రం అంటూ ప్రచారం… అవసరమైతే యూనిట్ 15 రూపాయిలిచ్చైనా కొంటానన్న డాంబికాల్లాంటివి అన్నీ పబ్లిసిటీ స్టంటే అనుకోవాలా ? లేదంటే ఏపీని ఇబ్బందులు పాల్జేసేందుకే ఇలా వేల కోట్లు ఎగ్గొడుతున్నారని అనుకోవాలా ? అని ఆలోచించాలి.

కరెంటు, నీళ్లు, ట్రాన్స్ పోర్ట్ లాంటివన్నీ ఇరుగుపొరుగు ఇచ్చిపుచ్చుకోవాల్సిన విషయాలు. అందులోనూ కలిసివిడిపోయిన రాష్ట్రాలైతే కిక్కురుమనే పరిస్థితి రాకూడదు. తెలంగాణ మాత్రం అందుకు పూర్తి భిన్నంగా పోతోంది. తను గిల్లి… తనే గోల చేసి సింపథీ కొట్టేయాలన్న వ్యూహాన్ని కేసీఆర్ ఇక్కడ కూడా అమలు చేస్తున్నట్టు కనిపిస్తున్నారు. ఇలాంటి విషయంలో పక్కాగా నిక్కచ్చిగా లేకపోతే ప్రపంచానికి ఎలా తెలుస్తుంది ? ఏపీ ట్రాన్స్ కో ఇప్పటికైనా ఈ విషయం మీద దృష్టిపెట్టి… వాటాగా రావాల్సిన మొత్తం వెంటనే వసూలు చేసుకోవాలి. లేదంటే… ఏడుపు గొట్టు మొహంతో బాకీలు ఎగ్గొడుతున్న వాళ్లు చెబుతున్న కబుర్లే గట్టిగా వినిపిస్తాయ్.

– అభి

Comments

comments

Article Categories:
Anything Everything
Menu Title