శ్రీమంతుడు సందేశాన్ని ఏపీ అందుకుంటుందా ?

Written by

ఏపీ సంపన్నులున్న దీన రాష్ట్రం. కుబేరులున్న కుచేల ప్రాంతం. సిరులుపండే నేలలున్న బీడు భూమి. ఇదేంటి… ఉన్నాయంటారు… దౌర్భాగ్యంతో పోలుస్తారు ? అనుకుంటున్నారా ? ఆ చేతిలో ఉంటే ఈ చేతిలో ఉన్నాట్టా ? ఆకాశంలో ఉండే నేల మీద కురిసినట్టా ? ఇది కూడా అంతే ! ఇలానే ఉంది పరిస్థితి. విడిపోయాం… వీక్ అయిపోయాం… వెనక్కి వెళ్లిపోయాం అంటూ సంతాప సందేశాలిస్తాం కానీ ఆదుకోవాలన్న మాట వస్తే మాత్రం ముందుకు రాం ! ఇందుకే ఇదంతా చెబుతున్నది.

స్పిరిట్ ఉంటే… ఆలోచన ఉంటే… మనం అన్న ఫీలింగ్ ఉంటే రాష్ట్రం ఎలా మారుతుందో చెప్పడానికి జపాన్ సింగపూర్లే అక్కర్లేదు. మన కనుచూపు మేరలోనే ఉన్నాయ్ ఇన్ స్పైరింగ్ స్టోరీస్. గుజరాత్ లోని కచ్ ప్రాంతంలో బలాదియా, కేరా, మాదాపార్ గ్రామాలున్నాయ్. ఇవన్నీ 15 ఏళ్ల నాడు భుజ్ భూకంపంతో తీవ్రంగా దెబ్బతిన్నాయ్. ఇక కోలుకోలేవు. మ్యాప్ నుంచి చెరిగిపోయినట్టే అనుకున్న ఊళ్లు కాస్తా… ఇపుడు ఇంద్రుడు రాజధాని అమరావతిలా ధగధగలాడిపోతున్నాయ్. వేల కోట్ల ఆస్తులు కూడకట్టి ఔరా అనిపిస్తున్నాయ్. ఇంటింటికీ నెట్… సోలార్ ఎనర్జీ… మెటల్ రోడ్స్… క్లీన్ అండ్ గ్రీన్ ఎన్విరాన్మెంట్ తో మోడల్ విలేజ్ అంతే ఇదే అనిపిస్తున్నాయ్. ఇవన్నీ మోడీ తీర్చిదిద్దినవి కాదు. జనం కృషి. కష్టపడి దేశవిదేశాల్లో సంపాదించిందంతా పోసి దేశానికే కిరీటాల్లా తీర్చిదిద్దుకున్నారు ఊళ్లని. ఇలాంటి వాళ్లు, ఊళ్లూ ఉండబట్టే గుజరాత్ మోడల్ అంటూ మోడీ దేశమంతా ప్రచారం చేసుకోగలిగారు. అది నిజానికి అక్కడి జనం స్పిరిట్.

మనం చేయగలమా గుజరాత్ మోడల్ ?

మనమేమీ మన కష్టాన్నంతా ధారపోయనక్కర్లేదు. కచ్ గ్రామాల్లాగా వందల వేల కోట్లు కూడగట్టక్కర్లేదు. పదో పరకో పెట్టి మన వ్యాపారాన్నే… మన యాక్టివిటీనే మన ఊళ్లో చేద్దాం. ఇన్ ఫ్రా, ఇండస్ట్రీ, మన బిజినెస్, మన హెడ్ క్వార్టర్స్ ఏపీకి మార్చి చూద్దాం ! చాలు. జీఎంఆర్, జీవీకే లాంటి సంస్థల హెడ్డాఫీసులు బెంగళూరులోనో ఢిల్లీలోనో ఉండేబదులు బెజవాడ చుట్టుపక్కల పెడితే ప్రాజెక్టు చర్చల కోసం ఎవరైనా మనూరు రావాల్సిందే కదా ! బెంగళూరు వెళ్లేది బెజవాడొస్తారు. దానివల్ల సంస్థకొచ్చే ఇబ్బంది కూడా ఏమీఉండదు. అక్కడ పరిస్థితులు తెలుస్తాయ్. రాక పోకలు పెరుగుతాయ్. పన్నులన్నీ మన ప్రభుత్వానికే చేరుతాయ్. అవకాశాలూ అంది వస్తాయ్. ఇలా ఆలోచించామా ఎప్పుడైనా ? ఈ పని చేయడానికి సిద్ధపడుతున్నామా ఎవరైనా ? అవకాశలొస్తే రెక్కలు కట్టుకొని వాలిపోయేందుకు ఉద్యోగులు సిద్ధం. మరి ఏపీకి అదే రెక్కలు తొడిగేందుకు చిన్నాపెద్ద ఎంటర్ ప్రెన్యూర్స్ రెడీయేనా ? ఈ ప్రశ్నకి అవునన్న సమాధాం దొరికితే ఏపీ పరిస్థితి పరిష్కారమైనట్టే !

ఆదుకోవాల్సినంత దుస్థితిలో ఉందా ఏపీ ?

జాతీయ సగటు ఆదాయం 7,400 రూపాయలైతే… ఏపీ ఏడు జిల్లాలు భాగ్య రేఖకి ఎగువన ఉన్నాయ్. ఐదు మాత్రమే దారిద్ర్యరేఖ దరిదాపుల్లో ఉన్నాయ్. జీవన ప్రమాణాలు… కనీస సౌకర్యాలు… వ్యక్తిగత సౌఖ్యాల స్థాయి…విదేశాల్లో ఉన్న కుటుంబ సభ్యులు… ఇలా సామాజిక, ఆర్థిక పరిస్థితుల్లోని అంచనా కడితే ఏపీ సుసంపన్న రాష్ట్రం కిందే లెక్క. కానీ రాష్ట్రంగా చూస్తే మాత్రం వెనకబాటులో పీఠం వేసుకొని మరీ కూర్చున్నాం. ఉన్నది గోరంత చేయాల్సింది కొండంత అన్నట్టుంది పరిస్థితి. రాజధాని లేదు. పరిపాలనా భవనాలు లేవు. ప్రజలకి దిశానిర్దేశం చేసే అడ్మినిస్ట్రేషన్ కి నిర్మాణాత్మక స్వరూపం లేదు. విద్యా సంస్థలు, వర్సిటీలు. హాస్పిటళ్లు, పరిశ్రమలు ఇలా ఏ కోణంలో చూసినా మనది వెనకడుగే.

కానీ దేశంలోనే కాదు ఎక్కడైనా నిర్మాణాల్లో మనమే ముందుంటాం. ఇన్ ఫ్రా క్రి,యేషన్ లో వరల్డ్ వైడ్ అప్రీసియేషన్ ఉన్నది మనకే. పాపరిపాలనలో స్టాండర్డ్స్ సెట్ చేశాం… విజన్ లోనూ తిరుగులేదని చెప్పుకుంటున్నాం. అన్నీ ఉన్నా ఇలా ఎందుకు అడుగంటి పోతున్నట్టు ?
ఇవన్నీ వ్యక్తిగతంగా కరక్టే. మరి సమష్టిగా చూస్తే… రాష్ట్రంగా లెక్క తీస్తే ఎక్కడ ఉంటాం ? అందుకే మన శక్తిని మన సామర్థ్యాన్ని మనం రాష్ట్రం వైపు మళ్లిద్దాం. మన అడుగేస్తే రాష్ట్రం ముందుకు కదిలినట్టేనన్న విషయాన్ని గుర్తిద్దాం.

శ్రీమంతుడు సందేశాన్ని ఏపీ అందుకుంటుందా ?

శ్రీమంతుడు సినిమా చెప్పినట్టు… కాస్త నిలదొక్కుకున్నవాళ్లు సొంత ఊరిని ఆదుకుంటే చాలు. రాష్ట్రానికి సేవచేసినట్టే. దేశానికి దారి చూపినట్టే. ఎవరి ఊరును వాళ్లు బాగుచేసుకోవాలని రంగంలోకి దిగితే… ఇక రాష్ట్రమంతా కోలాహలం ఖాయం. ప్రభుత్వమే చేయాలనో లేదంటే ఇవన్నీ అయ్యే పనులేనా అని అరుగు మీద కబుర్లో చెబితే సాధించేదేముండదు. టైంపాస్ తప్ప. తిరుపతి వెంకట కవులు చెప్పినట్టు… క్షాత్రమున్నవారెల్లా క్షత్రియులే. కానీ… రాజ్యమున్నవారే రాజులు. డబ్బున్న ప్రతివాడూ శ్రీమంతుడు కాదు. మనసున్నవాడే శ్రీమంతుడు. స్థితిమంతుడూనూ. అందుకే ఇపుడు కావాల్సింది చొరవ. చిత్తశుద్ధి. మన వంతుగా ముందుకొస్తే చాలు మిగతా పనులన్నీ చెయిన్ రియాక్షన్ లా పూర్తవుతాయ్. ఊళ్లని దత్తత తీసుకోవాలంటే ధనవంతుడే కానక్కర్లేదు. ఆలోచనుండి…సంపద సృష్టించగల సత్తా ఉన్నవాళ్లైతే చాలు. ఇన్నిమాటలెందుకు ? అవకాశాలు అందుకుంటే… ఆకాశమైనా అమాంతం దిగొస్తుంది. అడుగున్న ఏపీ పైకి రాలేదా!

– అభి

Comments

comments

Article Categories:
Anything Everything
Menu Title