వీళ్ల సంస్కారానికో నమస్కారం !

Written by

ఛ… ఊరుకోండి ! అసెంబ్లీ వీడియో టేపులు చూసి బుగ్గలు నొక్కుకుంటున్నారు మరీనూ ! మొదటిసారి చూస్తే అబ్బో ! రెండోసారి అయితే సీక్వెల్ ! ఇంకెన్నిసార్లు జరిగినా దానికి ఈక్వల్ ! ఆశ్చర్యపోడానికేముంది ? ఇది నడుస్తున్న చరిత్ర. మాట్లాడ్డానికి ఓ పద్ధతి… పాటించాల్సిన నిమయామవళి… గీత దాటితే కఠిన చర్యలు ఉన్న చోటే మనం ఇలా ఉన్నామంటే… ఇక మామూలుగా మనోళ్ల పరిస్థితి ఏంటో తెలిసిపోతోంది. మన మనసు, ఆలోచనలు ఎలా ఉంటాయో మనభాష దానికి తగ్గట్టు వస్తుంది. అంటే ఇలాంటి దిగజారుడు మనుషుల్ని మనం నెత్తినపెట్టుకున్నాం. ఇదే మన కర్మ. కొన్ని పేపర్లు మొహమాటపడ్డాయ్. సొంత పత్రికలు ఇంకా అన్యాయం అనే టోన్ కంటిన్యూ చేసి మసిపూశాయ్. ఒకట్రెండు మాత్రమే వీడియోల్లో ఏముందో ఏం జరిగిందో రాశాయ్. అందుకే ఇపుడు మాట్లాడాల్సివస్తోంది డీటైల్డ్ గా !

శాసన సభ్యుడు అంటేనే డిగ్రీ ఆఫ్ డిగ్నిటీ. అందుకే గౌరవ సభ్యుడు అని సంబోధిస్తారు సభలో ! డిగ్నిటీనే లేనివాళ్లకి ఆ విషయాలు అర్థమయ్యే అవకాశం లేనేలేదు. అతిమంచితనం ఆత్మరక్షణలో పడితే… అరాచకం అడ్డగోలుగా చెలరేగిపోతే పరిస్థితి ఎంత బీభత్సభయానకంగా ఉంటుందో అసెంబ్లీ చూపిస్తోంది. హౌస్ వచ్చింది ఎందుకు… చేసిందేమిటి ? డైరెక్షన్ ఇస్తూ విపక్షనాయకుడు కూర్చోవడమేంటి ? ప్రభుత్వం చూసీచూడనట్టు చెవులు మూసుకోవడం ఏంటి ? సభ అంటే ఆ 175 మందికి సంబంధించిన వ్యవహారం కాదు. ఏపీ రాత రాసే అత్యున్నత వ్యవస్థ. అలాంటి చోటే ఇంత అస్తవ్యస్థంగా ఉంటే… ఇక రాత ఏం రాస్తారు ? మన కోసం వీళ్లు ఏం చేస్తారు ? చూసి చప్పట్లు కొట్టడానికి… ఎవరేం తిట్టారో అని సరదాపడడానికి అసెంబ్లీ అంటే పొలిటికల్ కోడి పందెం కాదు. పార్టీల వారీగా ఎమ్మెల్యేలు కత్తులు కట్టి ఆడేందుకు. ఇదే కొనసాగితే గాట్లు పడేది సగటు ఆంధ్రుడికే ! జనం కూడా ఈ సంగతి దృష్టిలో పెట్టుకోవాల్సందే !

ఏం జరిగింది ? ఏం జరగాలి ?

చర్చల్లేవ్. చర్చించడాల్లేవ్. ఎప్పటికప్పుడు రచ్చ. ఓన్లీ రచ్చ. లుచ్చా అంటూ ఒకరు… చెప్పుకోలేని భాషతో మరో నలుగురు. ఐదారుగురి కోసం అసెంబ్లీ అస్తవ్యస్తం అయిపోవాలా ? ఏపీ ప్రయోజనాలు గాలికిపోవాలా ? దద్దమ్మ లాంటి మాటలు వాడానికే గజగజలాడిన అసెంబ్లీలో బండబూతులు మామూలైపోయాయ్ ఇప్పుడు. ఇలాంటి అసెంబ్లీని ఎప్పుడూ చూడలేదంటూ చంద్రబాబు మెత్తగా చెబితే సరిపోయిందా ? ఇక్కడే ఓ సమస్య వచ్చిపడింది. సహజనైజం బైటపెట్టేందుకు కొందరు అవకాశాన్ని వాడుకుంటున్నారు. ఊరికే అనలేదు… మెత్తగా ఉంటే మొత్తబుద్ధిఅవుతుంది, కూర్చున్న చోట నుంచి కదలకపోతే ఎత్త బుద్ధి అవుతుందని ! మరి స్పీకర్ కమిటీ వేస్తామంటున్నారు. ఉపసభావతి టీడీపీ, వైసీపీ, బీజేపీ సభ్యులతో కమిటీ ఓ నిర్ణయానికి రాబోతోంది. ప్రివిలేజ్ కమిటీకి ఇచ్చే నివేదిక ఆధారంగా చర్యలు ఉంటాయ్ అంటున్నారు.

వీడియోలో వాస్తవాలు బైటపడ్డాక ఏం జరుగుతోందో తెలిశాక… మరి ప్రివిలేజ్ కమిటీ ఏం చేస్తుంది ? ఏం చేయాలి ? గీత దాటిన ముగ్గురు శివసేన సభ్యులపై పదవీకాలం ముగిసే వరకూ వేటు పడిన విషయాన్ని గుర్తుచేస్తున్నారిప్పుడు. తీసుకునే చర్య… సభ్యులపైనో వ్యక్తిగతంగానో కాదు. అదో హెచ్చరికలా ఉండాలి. అసెంబ్లీ లాంటి అత్యున్నత వేదికకి పహారా కాసేలా పవర్ ఫుల్ ఫెన్సింగ్ లా… ఇకముందు ఎవరైనా చెలరేగే ముందు వార్నింగ్ లా వినిపించాలి. అప్పుడే పరిస్థితిలో మార్పు వచ్చేది. అయినా… మద్యం తాగబోస్తున్నారంటూ పాటకట్టి పాడితేనే నాన్ బెయిలబుల్ కేసులుపెట్టిన రాష్ట్రాల్నీ చూపిస్తున్నారిప్పుడు. అలాంటిది సీఎంపైన, సభామర్యాదపైనా కిరాతకంగా హేయంగా దాడి చేస్తే నీచాతినీచంగా బండబూతుల సంతగా సభని మార్చేయాలనుకున్నవాళ్లని ఏం చేయాలి ? ఎలాంటి వైఖరి కావాలన్నది ఇపుడు ఖరారు కావాలి.

ఈ జనం కూడా తక్కువోళ్లేం కాదు…

ఇంత జరిగాక కూడా కొందరు నీతిసుద్దులు చెబుతున్నారు. నిర్భయ కేసులో మైనర్ ని వెనకేసుకొచ్చినట్టు. నిజానికి డైలాగులు మారాయ్. సూత్రధారులు, పాత్రధారులూ మారలేదు. ఇంతకుముందు బుచ్చయ్య వర్సెస్ రోజా, మొన్న తిరుపతి ఏర్ పోర్ట్ లో ఎంపీ మిథున్, ఇపుడు అసెంబ్లీలో అరాచకం. వీడియోలు వైరైనా కంటెంట్ కామన్. ఇంకో కామన్ పాయింట్ కూడా ఉంది ఇందులో. ఈ మూడుసార్లు కొట్టినోళ్లే ఏడ్చారన్నట్టుఉంది స్టోరీ. కక్షసాధింపు అంటూ గొవడ చేశాక… ఎవరేమన్నారో బుచ్చయ్యపై గొడవ వీడియో బైటపెట్టింది. మిథన్ ఇష్యూలో అయితే దేశమంతా చూసింది మన ప్రతాపం. మా ఎంపీ అమాయకుడు, ప్రభుత్వానిది అన్యాయం అంటూ జగన్ రెడ్డి మాట్లాడిన బైట్ ఓ పక్కన… అధికారిపై దాడి మరో పక్కనా వేసి చూపించాయ్ నేషనల్ ఛానెళ్లు. ఇపుడు కూడా అదే జరిగింది. జగన్ ఆయుధాలన్నీ వాడేశాక… బేస్ లెస్ ఎదురుదాడి చేయాలనుకొని స్పీకర్ పై అవిశ్వాసం ఇస్తామని ప్రకటించాక వీడియోలు అసలు సినిమా చూపించాయ్.
ఇప్పటికీ ఇలాంటి వాళ్లని వెనకేసుకొని రావడమో… ఎదురుదాడి చేయాలనుకోవడమో చేస్తే… అది వ్యవస్థకే వినాశనం.

సపోజ్… మొన్నటి సమావేశాల్లో వైపీసీ సభలోనే ఉండి… ప్రైవేటు వర్సిటీ బిల్లుపై చర్చకి ఎందుకు దిగలేదు ? ప్రైవేటు వర్సిటీలు వస్తే పేద మధ్యగతి పరిస్థితి ఏంటని అడిగి… కొన్ని మార్పులు చేర్పులు ఎందుకు చేయించలేకపోయింది ? విద్యార్థులు గగ్గోలుపెట్టి అసెంబ్లీ ముట్టడికి విఫలయత్నం చేసిన ఇష్యూనే ఇలా వదిలేస్తే మిగతా వాటి సంగతేంటి ? ప్రతిపక్షనేత నిన్న గొప్పగా బాక్సైట్ మీద పేపర్ కటింగ్స్ చూపిస్తూ ఫోజిలిచ్చారు. ఇదే విషయం మీద సభలో ఎందుకు ఏమీ సాధించలేదు ? కాల్ మనీ పై ఎందుకు బైఠాయించలేదు ? బీఏసీని విపక్షనేత బాయ్ కాట్ చేసినప్పుడే వైఖరి తేలిపోయింది. సభ జరగదని. పైగా అదే సంగతి పదేపదే చెప్పారు కూడా ! ఇష్యూల కన్నా కాలక్షేపం టిష్యూలు ముఖ్యం కాబట్టే ఇదంతా ! ఏదోరకంగా గలాటా సృష్టించి మా గొంతు నొక్కుతున్నారంటూ సానుభూతి ఎత్తుగడ ఎన్నాళ్లు ? సభలో అయినా… రాజకీయంలో అయినా… ఆఖరికి ప్రభుత్వంలో అయినా… అరాచకానికి అవతలి గట్టు చూపించాలనుకుంటున్నవాళ్లకి అడ్డుకట్ట పడితీరాల్సిందే !
ఇది ముగింపు పలికి తీరాల్సిన బరితెగింపు !

– విశ్వ

Comments

comments

Article Categories:
Anything Everything

Comments

Menu Title