వీడా… మేడిన్ ఆంధ్రా లీడర్ ?

Written by

వాలును బట్టీ నీరొస్తుంది. వాటాన్ని బట్టీ గాలి వీస్తుంది. నేలరకాన్ని బట్టీ మొక్కలూ ఉంటాయ్. ఇవన్నీ ఎంత సహజమో… నేతల తీరును బట్టీ వాళ్లు నడిపే రాజకీయాన్ని బట్టే రాష్ట్రం తలరాత కూడా ఉండటం అంతే సహజం. మన స్టేట్ స్టేటస్ ఇలా అయిపోవడానికి అసలు కారణం ఇదేనా ? స్టేటస్ అంటే హోదా అనుకునేరు… సీజన్ కాబట్టి. కాదు. ఇక్కడ మాట్లాడుతున్న స్టేటస్ – తలరాత. ఏపీలో ఏం జరుగుతోంది… ఏపీకే ఎందుకిలా ? ఏపీకి అలా ఎలా అన్యాయం చేస్తారు ? ఇలాంటి ప్రశ్నలతో విసిగిపోయాం రెండుమూడేళ్లుగా. మనం ఫీలవుతున్న సఫకేషన్ సరిగ్గా ఇదే ! దీనంతటికీ కారణం ఎవరు ? రియాలిటీ ఏంటి ? ఏపీ పుట్టె ముంచుతున్నదెవడో కాదు. నాయకుడు. ఆ లీడర్లే సరైన వాళ్లుంటే పరిస్థితి ఇంతకన్నా మెరుగ్గా ఉండేదని కచ్చితంగా చెప్పొచ్చు. అలా లేకపోవడం వల్లే అడుగడుగునా అధ్వాన్నం. పరిస్థితి ఇంత ఘోరం.

ఏపీ లీడర్ల బయోడేటా ఎలా ఉంటుందంటే :

ఇంట్రో :
జనం చేత జనం కొరకు జనం వలన ఎన్నుకోబడిన… అనే పాతరకం ఎక్స్ ప్రెషన్ ప్రమాణస్వీకారంతోనే మర్చిపోతాడు ఏపీ లీడర్. మనమేంటి ?
మనకేంటి ? అధికార పార్టీలో ఉంటే ఎలా లాభపడాలి అనేదే టార్గెట్. ప్రతిపక్షంలో ఉంటే ఎలా గోడ దూకాలన్నదే సబ్జెక్ట్. అంతకు మించి ఎన్నుకున్న జనం ఏమనుకుంటారు… రాష్ట్రానికి ఏం చేయాలి… ఏం చేయగలం … అనే ఆలోచనలు ఏకోశనా ఉండనోడే ఏపీ లీడర్. ఎమ్మెల్యే అయినా ఎంపీ అయినా ఆఖరికి ఎంపీపీ అయినా ఈ మాత్రం “స్ట్రెంగ్త్” ఉంటేనే ఏపీ పొలిటిక్స్ లో రాణించగల్గుతాడు. రాజవ్వగల్గుతాడు.

క్వాలిఫికేషన్స్ :
– ముక్క ఇంగ్లిష్ రాకూడదు…
– విభజన అయినా… హోదా అయినా ఆఖరికి పట్టి సీమకి సంబంధించైనా పావలా సబ్జెట్ కూడా ఉండకూడదు…
– పార్టీ నాయకుడి ముందు మెమ్మెమ్మె… అనాలి…
– పార్లమెంట్ కి వెళితే కిక్కురుమనకుండా కూర్చోవాలి…(ఐ డిడింట్ గెట్ యూ అని ఛైర్మన్ అంటుంటే… సార్ సార్ అంటూ తత్తరపడిన ఎంపీలూ గుర్తులేరూ!)
– ప్రత్యర్ధి కౌంటర్ వేస్తే… డమ్మీలా ఊరుకోకుండా నోటికొచ్చింది వాగేయాలి (ప్రత్యర్థి కూడా ఇలాగే ఉంటాడు కాబట్టి నో ప్రోబ్లం)
– దండిగా వ్యాపారాలుండాలి…
– దండుకునే తెలివితేటలుండాలి. ఉంటే, అధికార-విపక్షం అనే తేడా ఉండదు.
– చొక్కా నలక్కూడదు… ఇష్యూ తెగకూడదు…
– గెలిచాక జనం ముఖం చూడకూడదు…
– సమస్యలు తలకి చుట్టుకుంటే పోరాడతాం… ఒత్తిడి తెస్తాం అనాలి…
– యోగా క్లాసులు పెడితే తిట్టుకోవాలి… విదేశీ డెలిగేషన్ వస్తే ఏంట్రా ఈ కర్మ అన్నట్టు ఫేస్ పెట్టాలి
అబ్బో ఇలా చెప్పుకుంటూ పోతే లక్షా తొంభై క్వాలిఫికేషన్స్. ఇందులో నాలుగైదున్నా చాలు రాజకీయానికి కనెక్ట్ అయిపోతాడు. ఐదేళ్లలోనే ఎక్కడికో వెళ్లిపోయేందుకు సెలక్ట్ అయిపోతారు.

పరువు పోతున్నా చొరవ ఉండదెందుకు ?

పార్లమెంటులో ఏపీ ఎంపీల పరిస్థితి చూస్తే మనమీద మనకి జాలేస్తుంది. విభజన సమయంలో పక్క ప్రాంతం ఎంపీలు హంగామా చేస్తుంటే వాయిస్ వినిపించలేకపోయారు. ప్రత్యేక హోదా… భవిష్యత్ లాంటి విషయాలపై మాట్లాడింది ఒకరో ఇద్దరో. అది ఫ్లాష్ బ్యాక్. ఇపుడు ఏపీ హోదా వ్యవహారం తీసుకుందాం. అరుపులు కేకలు పెడతారు. కెమెరాలో కనిపించేందుకు పోటీ పడతారు తప్పితే అంతకు మించి ముందుకెళ్ల లేరు. ఇప్పుడు కూడా హౌస్ లో మాట్లాడుతున్నది ఒకరో ఇద్దరో. భాష రాక కొందరు. మాట్లాడే సరుకు లేక ఇంకొందరు దిష్టిగుమ్మడి కాయల్లా ఉండిపోతారు. ఇక నేషనల్ ఛానెళ్లు పెట్టే డిస్కషన్ లో మన ఎంపీలు కూర్చుంటే… చూస్తున్న ఆంధ్రులకి గుండె దడ వచ్చేస్తుంది. ఎక్కడ పరువు తీస్తాడో… ఏం మాట్లాడతాడో… అర్నాబ్ లాంటివాడు ఎక్కడ కసిరేస్తాడోనని. సబ్జెక్ట్ లేకపోవడం… ఎంత సేపూ పొలిటికల్ ఆబ్జెక్ట్ మీద ధ్యాసే ఉండడం వల్ల వచ్చిన తిప్పలివన్నీ !

తుపాకీ గుండుకి కూడా దొరకరు…

గెలిచాక జనానికి ముఖం చూపించేవాళ్లు కనీసం 10% కూడా ఉండరు మన నాయకుల్లో. టీడీపీ అయినా వైసీపీ అయినా బీజేపీ అయినా ఇదే సీన్. కాంగ్రెస్ అయితే చెప్పుకోనక్కర్లేదు. అదే మరో చోట అయితే మోతమోగిపోతుంది ఇలాంటి వాళ్లకి. కొన్ని ఎగ్జాంపుల్స్ తెలిస్తే… అవునా
అనుకుంటాం మనమే !

బులందర్ షహర్లో చిట్ ఫండ్ సంస్థ 13 లక్షలు కొట్టేసి బోర్డ్ తిప్పేసింది. స్థానిక బీఎస్పీ ఎమ్మెల్యేని బజార్లోకి ఈడ్చుకొచ్చి నిలదీశారు జనం. నువ్ న్యాయం చేయకపోయావో అంతు తేలుస్తామన్నారు. అప్పటి సీఎం మాయావతి దగ్గర కూర్చొని మరీ మూడ్రోజుల్లో చచ్చినట్టు న్యాయం చేశాడు. కేవలం 13 లక్షలకి అలా రియాక్ట్ అయితే… ఇక్కడ మన భవిష్యత్ విషయంలో మన ఎలా ఉండాలి ? విషయం లేని మంత్రులు… విభజనతో గొంతులుకోసే పార్టీలు… సొంత మైలేజ్ కోసం దీక్ష డ్రామాలాడే నాయకులు… అసెంబ్లీ అంటే కుస్తీ పట్టే రింగ్ అనుకునే నాయకులు. వీళ్లందర్నీ ఏం చేయాలి ?

మహారాష్ట్రలో టోల్ గేట్ పెట్టి వసూళ్లతో వేధిస్తున్నారు తక్షణం తీసేయాలంటూ గత ప్రభుత్వ హయాంలో ఓ కాంగ్రెస్ ఎంపీ 130 లేఖలు రాశాడు. రోడ్డు మీద అడ్డం పడుకొని అయినా సాధిస్తాననే సరికి ఇక ప్రభుత్వం ఆ కాంట్రాక్టర్ ని ఒప్పించి… సమస్య పరిష్కరించింది. పంజాబ్ లో మాదకద్రవ్యాల మీద అధికార పార్టీ ఎంపీనే తిరగబడి రోడ్డెక్కేసరికి పాలసీ మారింది. రాజకీయంగా ఇబ్బందని తెలిసినా ప్రభుత్వం చర్యలు తీసుకోకతప్పలేదు. ఇవన్నీ నిన్నమొన్నటి సక్సెస్ స్టోరీలు. ఏవి ఏపీలో చూపించండి ఇలాంటివి. భూతద్దం కూడా ఫెయిల్ అయిపోతుంది తప్ప ఫలితం లేదు. మనం నిలదీసే వాళ్లమే అయితే… డిఫాల్టర్లు మంత్రులెలా అవుతారు ? వేల కోట్ల కేసులున్నవాళ్లు పబ్లిగ్గా ఎలా తిరుగుతారు ? అడ్డోగోలుగా పదేళ్లు లూటీ చేసిన తిమింగలాలు అధికార ప్రతినిధులెలా అవుతాయ్ ?

ఏపీకి ఈ కర్మ ఎందుకు ?

చూస్తున్నాం కదా.. ప్రాణాలు పోయినా.. ఆత్మహత్యలు జరిగినా.. జనంలో అసహనం పెరిగినా..మన నాయకులు స్పందించేతీరు ఘోరాతిఘోరం. కండితుడుపుగా దండసేరి వెళ్లిపోతారు గుంటూరు కేంపస్ లో చేసినట్టు. సమస్య ఏదైనా… ఆ… ఏమిస్తారు… ఇవ్వరు మాకు తెలీదా అంటారు బెజవాడ మీటింగ్ లో టీడీపీ ఎంపీలు అన్నట్టు. లేదంటే ఉన్నారో లేదో అనే డౌటొచ్చేట్టు అజ్ఞాతంలోకి వెళ్లిపోతారు వైసీపీ ఎమ్మెల్యేలు, ఎంపీల్లా ! ఇలాంటి వాళ్లు ఎలా ఉద్ధరిస్తారు రాష్ట్రాన్ని ? అదే హిందీ రాష్ట్రాల్లోనో పక్కనున్న తెలంగాణలోనో అయితే ఇలాంటి లీడర్లని బైటకి లాగుతారు గుండీలు ఊడిపడేట్టు. ఇక్కడ మాత్రం రాష్ట్రం కాలుతున్నా సిగరెట్ వెలిగించుకుంటారు నాయకులు. వాళ్లకి చేవలేదో… మనకి చైతన్యం లేదో అర్థం కాదు చాలాసార్లు.

మన పరిస్థితినో… రాతనో తిట్టుకొని ఉపయోగం లేదు. బాధపడితే లాభమూ రాదు. పరిస్థితి మారాలంటే ముందు రాజకీయం మారాలి. నేతల ధోరణి మారాలి. లేదంటే వాళ్లని మార్చాలి. అది మనలో కసి రగిలినప్పుడే సాధ్యం. పదేళ్ల అరాచకం మీద విజయనగరం తిరగబడి తొడగొడితే పికెట్ పెట్టుకొని మరీ బిక్కుబిక్కుమంటూ బతికిన నాయకుల్ని నిన్నగాక మొన్న చూశాం. ఈ పార్టీ ఆ పార్టీ అనేంలేదు. పనికిరాని నాయకుడుంటే నిలదీతలు, వెలివేతలు ఖాయం అన్న సందేశం అందాలి. అప్పుడే మకిలీ, నకిలీ నాయకుల రంగు దిగిపోతుంది. జనం ఏడుపును సొమ్ముచేసుకోవాలనుకునే ఏడుపుగొట్టు రాజకీయానికి బ్రేక్ పడుతుంది. ఇది జరిగితే ఏపీకి మూడొంతుల సమస్యలు తీరినట్టే !
అంతే తప్ప జంతర్ మంతర్లతో జనానికి ఒరిగేదేం లేదు.

– అభి

Comments

comments

Article Categories:
Anything Everything
Menu Title