విజయనగర వైభవం

Written by

విజయనగరం ! ఆహా  ఆ పేరు వింటేనే మనసు పులకించిపోతుంది , మది సంగీత పరవళ్ళు తొక్కుతుంది. విద్యలనగరం కళల నిలయం విజయనగరం. ఒక్కరా ,ఇద్దరా ఎందరో మహాను భావులు ,  మరెన్దరో మహా  కళాకారులు  పుట్టిన పుణ్య భూమి .

విజయనగరాన్ని పూసపాటి గజపతులు పరిపాలించారు. 1713 వ సంవత్సరం లో అయిదు జయ శబ్దాలు కలిసి వచ్చేలా  శ్రీ విజయ రామ గజపతి పేరు మీద విజ యనామ సంవత్సరం  లో విజయదశమి జయవారం నాడు విజయనగర కోటకు శంకు స్థాపన    చేసారు. ఆ కోటని చూస్తే  విజయనగర రాచరికపు దర్పం ఈనాటికి కళ్ళకు కట్టినట్టు కనబడుతుంది.

ఇక్కడ ఇంకో ప్రధానమైన చారిత్రిక కట్టడం గంట స్థంభం. ఈ కట్టడాన్ని పురపాలక సంస్థ వారు 1885 లో అయిదు వేల రూపాయిల   వ్యయం తో నిర్మించారు. దీని ఎత్తు 68 అడుగులు .రెండవ ప్రపంచ యుద్ధ సమయం లో ప్రజలను అప్రమత్తం చేయడానికి దానిపై ఏర్పాటు చేసిన సైరన్ నేటికి ప్రతి రోజు ఉ 8 గం ” మ.12 గం” రా. 8 గం” కు మ్రోగు తుంది. ఈ కట్టడ  నిర్మాణంలో  పూసపాటి రాజుల ఎంతో  సహాయ సహకారాలు అందించారు . ఇంతే కాక విజయనగరం లో ఎన్నో విద్యాలయాలను స్థాపించింది కూడా పూసపాటి గజపతులే.

 రాజా సాహెబ్ కీ. శే.  శ్రీ  పి .వి.జి.రాజు గారు వారి తండ్రిగారైన మహారాజ అలక్ నారాయణ గజపతి గారి  జ్ఞాప కార్థం  మాన్సాస్   ట్రస్ట్ ని స్థాపించి  తద్వారా వారి కోటలో ఎన్నో విద్యాలయాలను, కళాశాలలను ప్రారంభించారు.

విజయనగరం  రాష్ట్రానికి  సాంస్కృతిక రాజధానిగా పేర్కొనడం లో అతిశయోక్తి లేదు. మహారాజ సంగీత కళాశాల ఇక్కడ  ఉండటమే ఇందుకు కారణం. 1919వ సంవత్సరం ఫిబ్రవరి 5న ఈ ప్రతిష్టాత్మక సంస్థ కు బీజం పడింది. పాఠ శాల గా  ప్రారంభమై అంచెలంచెలుగా ఎదిగి కళల నిలయం అయ్యింది. ఈ కళాశాల ఎందరినో సరస్వతి పుత్రులుగ  మలచింది. శ్రీ ద్వారం వెంకట  స్వామి నాయుడు గారు , శ్రీ ఘంట సాల మాస్టారు  , శ్రీమతి  సుశీలమ్మ , శ్రీ సాలూరి రాజేశ్వరరావు  గారు, ఇలా ఎందరో కళాకారులకు  జన్మనిచ్చింది.

అంతే కాక ఇంకా ఎన్నో కళల పుట్టినిల్లు విజయనగరం. హరికథ పుట్టింది ఇక్కడే. శ్రీ ఆదిభట్ల నారాయణ దాసు గారే ఆ కళ కు ప్రాణం పోశారు. అందుకే ఆయన హరికథా పితామహుడయ్యారు.

 మరి యుద్ధ కళ  విషయానికి వస్తే  వెంటనే  గుర్తుకు  వచ్చే  పేరు  శ్రీ  కోడి  రామ  మూర్తి  గారిదే . ఆయన్ని  కలియుగ  భీముడిగా  అభివర్ణించారు. కుస్తీ పట్టులో  ఆయనకు  ఆయనే  సాటి. అదొక్కటే  కాదు  వాయు  స్థంబన , జల  స్థంబన లో  కూడా  ఎంతో పట్టు సాధించి దేశ  విదేశాల్లో  ప్రదర్శనలు   ఇచ్చి   అందరితో శెహభాష్  అనిపించుకున్నారు.

ఇంకా మన గురజాడగారి గురించి చెప్పాలి.ఆ మహనీయుడు దేశమంటే మట్టి కాదోయ్ దేశమంటే మనుషులోయ్ అని చేసిన రచన  ప్రజలలో  దేశభక్తి ని  నింపింది . ఆయన చేసిన మరో అద్భుత రచన కన్యాశుల్కం . ఆనాటి ఆచార వ్యవహారాలకు అద్దం ప ట్టే ఆ రచన  దశాబ్దాలుగా వేళ్ళూనుకున్న  దురాచారాలను  పట్టి పెకలించింది.

శ్రీ    రాజా సాహెబ్ కీ. శే.  శ్రీ  పి .వి.జి.రాజు గారి   సమకాలికులు  అయిన కీ. శే .శ్రీ  చల్లపల్లి బ్రహ్మాజీ రావు గారు  ,మంచితనం ,మానవత్వం విలువలకు  మారు  పేరు గా నిలిచారు .ఆయన  మానవ సేవే  మాధవ  సేవ అనుచూ  చేసిన  ప్రజా సేవ స్లాఘనియం .స్థానిక  మినర్వా  థియేటరు  లో ఉద్యోగ ధర్మాన్ని  నిర్వ హిస్తూ ,పలు  ప్రజాసేవా  కార్యక్రమాల్లో  పాలుగొంటూ చేసిన సేవ  ను  మెచ్చిన    పి .వి.జి.రాజు గారు   ఆయన  చేసే  సామాజిక సేవా కార్యక్రమాలను తగిన రీతిన   ప్రోత్సహించేవారు .శ్రీ వివేకానంద  సేవాసమితి  అనే  సంస్థను  స్థాపించి   తద్వారా లెప్రసీ  రోగులకు  సేవ చేసేవారు. భగవద్  గీత  శ్లోకాలను  ను  పిల్లలకు నేర్పి  ,మంచితనం ,మానవత్వం,సంస్కారాలకుప్రతినిధులు  గా తీర్చిదిద్దేవారు .
ఇప్పటికీ ఆయన  వారసులు  ఆ సంస్థను  నడిపిస్తూ పేద  మరియు అనాధ   పిల్లలకు  ఉచిత విద్యను అందిస్తున్నారు.

ఇక   విజయనగరం ప్రజల సంస్కృతీ సంప్రదాయాల విషయానికి  వస్తే ముఖ్యంగా  చెప్పవలసినది వారు ఎంతో భక్తీ , శ్రద్దలతో  నమ్మి కొలిచే    దైవం , ఇలవేల్పు    శ్రీశ్రీశ్రీ పైడితల్లి అమ్మవారుగురించి . ఆ  బంగారు తల్లి పూసపాటి గజపతుల ఆడపడుచు. కోరిన కోరికలు తీర్చే కల్పవల్లి ,ఉత్తరాంధ్ర కొంగు బంగారం. దేశమంతా దసరా పండుగ కోసం ఎదురు చూస్తె  ,విజయనగరం ఇంకా ఆ చుట్టుప్రక్కల ప్రాంతాల వారు మాత్రం దసరా , అనంతరం వచ్చే మంగళ వారం కోసం ఎదురు చూస్తారు.  ఆ రోజు అమ్మవారి సిరిమానోత్సవం జరుగుతుంది. ఆ వేడుక ను చూసేందుకు లక్షలాది భక్తులు తరలి వస్తారు .  పులి  వేషాలు, కోయ వారి  నృత్యాలు  ,డప్పులు ,ఘటాలు  ,కోలాటాలు , అంజలి  రథం  ,జాలారి  పాలధార   ,అంబరాన్ని తాకే సిరిమానోత్సవ సంబరాన్ని చూసేందుకు రెండు కన్నులు చాలవు.

ఇలా   ఎన్నో ఆచార వ్యవహారాలకు , కళలకు  , సంస్కృతీ సంప్రదాయాలకు ,మంచితనం ,మానవత్వం,సంస్కారాలకు నిలయం  విజయనగరం.

జై పైడిమాంబ !!!

Comments

comments

Article Categories:
Anything Everything

Comments

Menu Title