లవణం లేకపోతే నాస్తికోద్యమం రుచే లేదు…

Written by

దేవుడు, వేదము, గీత… జీవితం వీటిలో మరో కోణాన్ని ప్రపంచానికి చాటింది నాస్తికోద్యమం. దేవుడంటే గుడిలో మొక్కేమొక్కు కాదు. వేదమంటే కొట్టుకు చచ్చేందుకు సాధనం కాదు. గీత అంటే నువ్వనుకున్నట్టు హిందూ అజెండా ఎగరేసిన జెండా కాదంటూ కళ్లు తెరిపించిన భౌతిక వాదం నాస్తికోద్యమం. దానికి ఆయువు పట్టు బెజవాడ. త్రిపురనేని రామస్వామి చౌదరి మొదలు… ఎందరో శిఖర సమానులు ఉద్యమించి… ఉధృతం చేసి కళ్లు తెరిపించిన వికసిత ఉద్యమంలో మహోన్నత కెరటం లవణం. 86 ఏళ్ల జీవన పోరాటానికి ఇవాళ తుది మజిలీ. నాస్తికోద్యమంలో ఓ మూలస్తంభం సెలవంటూ విశ్రమించింది. సందేశాన్ని మిగిల్చి… జాతికి చిర సంకేతమిచ్చింది.

బెజవాడ బెంజిసర్కిల్ లో ఎథీస్ట్ సొసైటీ ఎందరికో జ్ఞానద్వారాలు తెరిచిన దేవాలయం. నాస్తికవాదం అంటే దేవుడు లేడని వాదించడం… మూర్ఖంగా ఎదిరించడం కాదు. ఇదో అస్తిత్వవాదం. భగవంతుడి పేరుతో సర్వం త్యాగం చేసేందుకు, జీవితాన్ని ఇరకాటంలో పడేసుకునేందుకు, అవసరం ఉన్నా లేకపోయినా నిన్ను నియంత్రించుకునేందుకు సిద్ధమవుతావ్ కదా… మరి అదే పని సాటి వాడి కోసం ఎందుకు చేయవు ? తోటి మనిషిలో దేవుణ్ని ఎందుకు చూడలేవంటూ ప్రశ్నిస్తుంది…. ఆనక నిలదీస్తుంది. మనిషిలో కాదు కాదు మనసులో మార్పుకి బీజం వేస్తుంది. ఇలాంటి వాదనలు విభేదాలు విధానాలు… ప్రసంగాలు చేయడంలో ఆరితేరిన లవణం ఎందరికో ఆదర్శప్రాయం. ఉప్పుసత్యాగ్రహ సమయంలో పుట్టినందుకు… ఏ దేవుడి ప్రభావమూ కనిపించని పేరు కావాలని తండ్రి గోపరాజు రామచంద్రరావు ఈ పేరు పెట్టారు లవణానికి. 1973 నుంచి హేదువాద సంఘానికి లవణం దిశానిర్దేశం చేస్తున్నారు. గుర్రం జాషువా కుమార్తె హేమలత లవణానికి జీవన సహచరి. సంప్రదాయం మూఢనమ్మకాలు లాంటివన్నీ మనిషి బలహీనతలుగా మారుతున్నాయని వాటిని ధిక్కరించేందుకు ఓ సందేశం ఇవ్వాలన్న సంకల్పంతో ఆయన జీవితాన్నే అంకితం చేశారు. ప్రముఖ వైద్యుడు సమరం… లవణం సోదరులు.

క్రిష్ణాజిల్లా ముదునూరుతో ప్రపంచంలోనే తొలిసారిగా నాస్తికోద్యమ కేంద్రాన్ని తండ్రి గోరా ప్రారంభిస్తే… దాన్ని విస్తరించి సందేశాన్ని విశ్వవ్యాప్తం చేయడంలో అవిరళ కృషిచేశారు లవణం. త్రిపురనేని రామస్వామి చౌదరి, పెరియార్ రామస్వామి లాంటి తెలియని నేటి జనరేషన్ కి హేతు వాదాన్ని, నాస్తికవాదాన్ని పరిచయం చేసిన చిరయశస్వి లవణానికి కోస్తా లైఫ్ నివాళి.

Comments

comments

Article Categories:
Anything Everything
Menu Title