లక్ష్యంపై గురిపెడితే ఏపీలో ప్రతి ఒక్కడూ బాహుబలే…

Written by

ఇన్నాళ్లూ ఏపీలో మనమున్నాం. ఇక నుంచి మనలో ఏపీ ఉండాలి. గుండెల్లో ఉండాలి. అవును. జాతికి మన అవసరమొచ్చింది. రాష్ట్రం నీ వైపు చూస్తోంది. ఆసరా కోసం చేయి చాస్తోంది. ఆదుకోమంటోంది. అక్కున చేర్చుకుందాం. ఇక ప్రతిక్షణం యుద్ధమందాం ! మనం ఏపీ కోసం ప్రత్యేకించి చేయాల్సిందేమీ లేదు. మనం చేస్తున్నదే ఏపీలో చేద్దాం. ఏపీ కోసం చేద్దాం. ఉద్యోగాలు, వ్యాపారాలు, స్కిల్ పెట్టుబడిగా పెడ్తున్నవాళ్లు, అద్భుతాలు సాధిస్తున్నవాళ్లు.. పరిశోధనలతో అవకాశాలు శోధిస్తున్నవాళ్లు… ఇలా ఏపీ కన్నబిడ్డలెందరో సక్సెస్ కి ఆనవాళ్లు. వీళ్లంతా ఒక్క ఐదేళ్లు అమ్మ లాంటి ఆంధ్రప్రదేశ్ కోసం అంకితమైతే… శక్తియుక్తుల్ని కేటాయిస్తే, పనులు చక్కబెట్టేందుకు సిద్ధపడితే ఒక్క అమరావతేంటి.. జిల్లాకో మహా నగరం పుట్టుకొస్తుంది. వజ్రపుతనకలా ఏపీ విరాజిల్లుతుంది.

ఏం మనం తల్చుకుంటే…

ఏపీలో ఊళ్ల రూపురేఖలు మారిపోవా ? పెట్టుబడులు పెట్టడం మొదలు పెడితే ప్రవాహమైపోదా ? కంపెనీలు పెట్టలేమా ? కష్టపడి పని చేయలేమా ? మనం సంపాదించే పది రూపాయాల్లో ఓ రూపాయ్ ఇవ్వలేమా ? అభివృద్ధి ప్రాజెక్టులు మనం టేకప్ చేయలేమా ? ఏపీని టేకాఫ్ చేయలేమా ? ఎందుకు చేయలేం. రంగంలోకి దిగాలేగానీ రప్ఫాడిస్తాం. ఇప్పుడు కావాల్సింది అదే !

బ్రదర్ … ఇదంతా దేశ సేవ కాదు. మన కోసం మనం పెట్టుకునే ఇన్వెస్ట్మెంట్. దానికి గిట్టుబడి అనుభవించేది మనమే. మన దగ్గరికే జపాన్, చైనా లొస్తే ఇక మనం ఎటో వెళ్లడం ఎందుకు ? మనకే హైద్రాబాద్ మించిన నగరం ఉంటే సైబరాబాద్ సందుల్లో మనమెందుకు ? వరల్డ్ క్లాస్ ఫెసిలిటీలుంటే డల్లాస్ అయితేఏంటి కాకినాడ అయితే ఏంటి ? ఇవన్నీ ఆశలో ఊసులో కాదు. మనం కళ్లముందుకి తెచ్చుకోవాల్సిన వాస్తవాలు. దానికోసం జీవితాతం అక్కర్లేదు. ఒక్క ఐదేళ్లు ధ్యాస… మన ఆశ మీద పెడదాం. ఏపీ మీద దృష్టి పెడదాం ! కొండలు తొలిచి కైరో కట్టుకున్నట్టు… చెమటచుక్కలు, నెత్తురు ధారపోసి మెసపుటోమియాని మలుచుకున్నట్టు కొత్త చరిత్ర సృష్టిద్దాం. ఏపీని పున: ప్రతిష్టిద్దాం.

మనకేం తక్కువ… మనమెందులో తక్కువ ? 

ఏం చేస్తారా… ఎలా చేస్తారా అని చూస్తున్నవాళ్ల నోళ్లు మూతపడేలా… చప్పట్ల మోతమోగేలా ఒక్క అమరావతినే కాదు ఆంధ్రావని మొత్తాన్నీ తీర్చిదిద్దుకోవాల్సిన బాధ్యత మన భుజస్కందాలపై ఉంది. అది భయపడాల్సిన బరువు కాదు. మన జాతి పరువు. వందల ఏళ్ల నాడే ఇంజనీరింగ్ నిపుణుల్ని తలదన్నే తెలివితేటలు… పశ్చిమ దేశాల్ని కూడా ఆశ్చర్యంలో ముంచెత్తిన రేషనలిజం పుట్టిన నేల మనది. సవాళ్లు సాహసాలు మనకి కొత్త కాదు. రింగ్ లోకి దిగే బాక్సర్ ని ఉత్సాహపరిచేందుకు చెప్తున్న మాటలు కాదివి. వెనక్కితిరిగి చూస్తే కనిపించే వాస్తవాలు.

ఎక్కడో రాజాంలో పుట్టి రాజ్యాలేలుతున్న జీఎంఆర్ సక్సెస్ స్టోరీ ఇదే చెప్తోంది. ఏం హైద్రాబాద్, ఢిల్లీ ఏర్ పోర్ట్ లు కడతాం కానీ ఏపీని మనం అదే స్థాయిలో నిలబెట్టుకోలేమా ? ప్రపంచవ్యాప్తంగా 70 వేల కోట్ల వ్యాపార సామ్రాజ్యాన్ని సృష్టించిన నెల్లూరు బిడ్డ జీవీకేదీ ఇదే స్టోరీ. వ్యాపారం కోసమే కాదు ఏపీ మన రాష్ట్రం అనే స్పిరిట్తో దిగ్గజాలు అడుగేస్తే కానిదేముంటుంది ? వేల కోట్ల ఫార్మా సామ్రాజ్యాన్ని సృష్టించిన అంజిరెడ్డి గ్రూప్, కార్పొరేట్ హాస్పిటల్స్ చెయిన్ తో ట్రీట్మెంట్ ని కొత్త పుంతలు తొక్కించిన అపోలో ప్రతాప్ రెడ్డి లాంటివాళ్లు మహా మహా రోగాలకే మందు లిస్తున్న ధీరులు. ఏపీ రుగ్మతల్ని క్యూర్ చేయలేరా ? ఇలా చెప్పుకుంటూ పోతే ఏపీలో గజానికో దిగ్గజం. మహామహులంతా ఊరికొకరు ఉద్ధరించినా రాష్ట్రమంతా ఉత్సవం అయిపోదా ?

డియర్… కష్టాన్ని నమ్ముకునే దేశాలున్నాయ్. వనరుల్ని అమ్నుకునే దేశాలున్నాయ్. కానీ తెలివితేటల మీద ఆధారపడి ఎదిగే జాతులు ఎన్నున్నాయ్ ?  నీళ్లు లేకపోయినా సముద్రంతో పంటలు పండించే ఇజ్రాయిల్, భూమి లేకపోయినా పొరుగు దేశాల్లో ప్రొడక్షన్ చేసి శాసించే జపాన్. తెలివితో ప్రపంచంలో ఏమూలైనా జెండా ఎగరేసే ఆంధ్రులు. వెరీ వెరీ స్పెషల్. తెలుసోలేదో… సాఫ్ట్ స్కిల్స్ తో ప్రపంచాన్ని ఏలుతున్న వారిలో ఆంధ్రుల ప్లేస్ టాప్ ఫైవ్. లెక్క చూస్కో…

హైద్రాబాద్లో సాఫ్ట్ వేర్ ఇంజినీర్లలో 58 % ఆంధ్రులే – ఇండియాకొచ్చే విదేశీ మారక ద్రవ్యంలో 22 % శాతం అంధ్రులదే – అమెరికాలో ప్రభుత్వోద్యోగాల్లో ఉన్న NRIలో 18 % ఏపీ వాళ్లే – యూఎస్ లో డాక్టర్లు, ఇంజినీర్లుగా ఉన్న NRIలలో 32 % ఏపీ వాళ్లే -యూరోపియన్ నాలెడ్జ్ ఇండస్ట్రీలో 17 % ఆంధ్రులు – ఆస్ట్రేలియా డొమెస్టిక్ ఇంజనీరింగ్ సెక్టర్ లో ప్రతి పదిమంది NRIలలో ముగ్గురు తెలుగువాళ్లే – ఆఫ్రికాలో వ్యవసాయం చేస్తున్నవాళ్లలో 22%ఆంధ్రావాళ్లే -ఆఫ్రికాలో కేబుల్, శాటిలైట్ సిగ్నలింగ్ వ్యాపారంలో 8% మనవాళ్లే ! ఎక్కడ ఏపీ. ఎక్కడ ఉగాండా!  వెనకబడిపోయిన ఆఫ్రికాలో పైకి రావడంలోనూ మనోళ్లు మందున్నారు. ఒడుపు, పట్టువిడుపులే మనకి అండ. అలాంటిది ఏపీ రైజ్ కావడం ఓ సమస్యా ?

మనోళ్లు ఒట్టి వెథవాయిలోయ్… 

ఇంతా చెప్పి… ఇలా గాలి తీసేశారేంటి ? ఇది గిరీశం అన్నమాట కాదు. కాస్త బాధనిపించినా నిజం. ఎన్ని తెలివితేటలున్నా, తెగింపు సామర్థ్యంలో పోటీలేదని చెప్పుకున్నా మనకెప్పుడూ స్వార్థమే పరమార్థం. మన కన్నా ముందు మన స్వార్థమే ముందు వెళ్తుంది ఎక్కడికైనా. వాస్తవం. రేటు తక్కువకొస్తుందని రొయ్యల చెరువు కొని పూడ్చి పొలంగా మార్చేద్దాం అనుకుంటాం కానీ పది మందికీ పనికొచ్చే పనంటే మనకి చేతులు రావు. మిగతా వాళ్లతో పోలిస్తే మనకి సొంతగడ్డ మీద ప్రేమ ఉన్నట్టు కనిపించదు. మనసు చివుక్కుమన్నా ఒప్పుకొని తీరాల్సిన వాస్తవం ఇది. గుజరాతీల్ని చూడండి… ఎక్కడ కష్టపడినా ప్రతిపైసా ఖర్చూ సొంత రాష్ట్రంలోనే ! పంజాబీలూ అంతే ! వాంకోవర్ అయినా వాషింగ్టన్ లో ఉన్నా… ప్రతి రూపీ భటిండాకో పటియాలాకో రావాల్సిందే. మనం అలాకాదు. లండన్ ఉంటే అక్కడే ఉండిపోతాం. సిడ్నీ వెళితే అక్కడే కల్లు కొంటాం. ఆఖరికి హైద్రాబాదైనా అంతే. ఐదేళ్లు తిరిగే లోపు అక్కడ స్థిరపడాల్సిందే ! ఇది అసలు సమస్యకి మూలం. ఇప్పటికైనా కళ్లు తెరుద్దాం. మన పైసా..మన తెలివి, మన శక్తియుక్తులు సొంత రాష్ట్రంవైపు మళ్లిద్దాం. మనం బాగుపడదాం… తరతరాలను నిలబెడదాం.

ఐదేళ్లు నిలబడితే…

మనకిప్పుడు చైనా లాంటి స్ఫూర్తి కావాలి. జపాన్ కున్నంత స్పీడ్ రావాలి. కొరియా మన ఇన్పిరేషన్ అవ్వాలి. అద్భుతం. ఏపీ లాంటి రాష్ట్రం మరోటి లేదు పోల్చేందుకు అనే రోజు ఎంత దూరంలో ఉందో తేల్చుకుందాం ! తడబాటుకి తలవంచం అని నిరూపించుకునే అవకాశం కళ్ల ముందుంది. ఆంధ్రుడు అంటే సారధి అని అర్థం అని చెబుతోంది ఐతరేయ బ్రాహ్మణం. మరి సారథులై.. సాయుధులై సాధిద్దామా? రాజమౌళి ఒక్కడు సింగిల్ హ్యాండ్ తో ఐదొందల కోట్లు కొట్టి చూపిస్తున్నాడు ఆంధ్రోడి దెబ్బేంటో ! జూలు విదిలిస్తే… టార్గెట్ పై గురిపెడితే ఏపీలో ప్రతి ఒక్కడూ బాహుబలే. విజయాన్ని గెలవడం పెద్ద కష్టంకాదు. అందుకే వెయ్యేళ్ల కోసం ఐదేళ్లు త్యాగం చేద్దాం…!!

– అభి

Comments

comments

Article Categories:
Anything Everything

Comments

Menu Title