మోడీ సాయం చేయాలంటే… ఏపీలో ఎన్నికలు రావాలా ?

Written by

బీహార్ కి లక్షా 65 వేల కోట్ల ప్యాకేజీ ప్రకటించారు మోడీ. వెనకబడిపోయిన బీహార్ ని ఆదుకునేందుకు మిగతా రాష్ట్రాలతో సమానంగా అభివృద్ధి సాధించి పోటే పడేందుకు ఈ తోడు తప్పనిసరిగా కావాలని ఆయన చెబుతున్న తీరు మిగతా వాళ్లకి ఎలా కనిపిస్తుందో తెలీదు కానీ ఏపీకి మాత్రం కారం పూసినట్టుంది. బీహార్ వెనకబడి పోయిందా ? బీహార్ పరిస్థితి దయనీయంగా ఉందా ? ఇంతకన్నా దారుణం ఎక్కడన్నా ఉంటుందా ? అభివృద్ధి రేటులో బీహార్ దేశంలోనే టాప్ త్రీలో ఉందిప్పుడు. కనీస సౌకర్యాల కల్పనలో టాప్ ఫైవ్… పరిశ్రామిక అభివృద్ధిలో రెండంకెల్లో గ్రోత్… ఇవన్నీ చెబుతున్నాయ్ బీహార్ ఎక్కడుందో ! నితీశ్ కుమార్ పగ్గాలు చేపట్టాక పరిస్థిితి పూర్తిగా మారింది. ఇదంతా ఓ రోజులోనో ఓ సాయంత్రంలోనో జరిగింది కాదు. పదేళ్ల నుంచి కళ్ల ముందు కనిపిస్తున్నదే ! అలాంటి రాష్ట్రానికి కూడా అప్పనంగా ఇన్ని లక్షల కోట్లు కేటాయించడం కచ్చితంగా రాజకీయ దివాళాకోరుతనమే !

ఎలాగంటే… నితీశ్ ఇన్ క్లూసివ్ ఇమేజ్ ని అధిగమించాలంటే మోడీకి ఓ ఆయుధం కావాలి. వెనకబడిపోయింది పోయింది అంటూ ముతక మాటలు చెబుతూ ఆదుకునే లుక్ ఇచ్చేందుకు ఇంత సాయం అట్టహాసంగా ప్రకటించారు. బీహార్ దేశంలో మిగతా రాష్ట్రాలతో సమానంగా అంటూ కబుర్లు దంచుతున్నారు బేస్ వాయిస్ లో ! ఇంతకంటే దగుల్బాజీతనం ఇంకోటి లేదు. రాజకీయం కోసం మోడీ ఎంతకైనా దిగజారుతారు అనేందుకు ఇదే ఉదాహరణ. పంజాబ్ లో ఎన్నికలకి ఓ ఏడాది ముందే 20 వేల కోట్ల పరిశ్రమలిచ్చి దువ్వుతున్నారు. ఇపుడు బీహార్ లో మరీ బరితెగించారు. నిజానికి ముందుగా అనుకున్న ప్రకారం బీహార్ లో నిన్నే ఎన్నికల షెడ్యూల్ వచ్చేసిఉండాలి. మోడీ దుబాయ్ నుంచి రాలేదని… ఆ షెడ్యూల్ కూడా ఆపేసింది కేంద్రం. ఎన్నికల కోడ్ అడ్డంకాకుండా ! హడావుడిగా ప్యాకేజీ ప్రకటించేసి… ఇపుడు రేపో మాపో ఎన్నికల షెడ్యూల్ ఇస్తారు చూడండి. ఇంతకన్నా దిక్కుమాలిన రాజకీయం ఉంటుందా ?

అభివృద్ధి పోటీలో బీహార్ ఎక్కడుంది అంటూ కబుర్లు చెబుతున్నారు మోడీ. అవునా… అంత మానవతా దృక్పథం, విజన్ ఉండి ఉంటే… మోడీ అంత అభివృద్ధి కోరుకునేవాడే అయితే ఏపీ అధోగతి ఏడాదిన్నరగా ఎందుకు కనిపించలేదు ? కేటాయింపులు ప్రణాళికలు ఇటు వైపు కూడా రాలేదు ఎందుకు ? ఇక మోడీ చెబుతున్నట్టు… వెనకబాటు, మావన వనరుల రంగంలో సునామీ సృష్టించడం లాంటి విషయాల్లో ఏపీ దేశంలోనే అట్టడుగున ఉంది. మరి మనకెందుకు ప్రకటించరు సాయం ? ఇవి అడాల్సిన ప్రశ్నలు. తేల్చుకోవాల్సిన విషయాలు. వచ్చి హామీ ఇచ్చి కళ్ల నీళ్లు తుడుస్తా, కడుపులో పెట్టుకొని చూసుకుంటానంటూ ఎమోషన్ పండిస్తే అయిపోలేదు మోడీ జీ… మాట నిలబెట్టుకోవడంలోనే తెలుస్తుంది ఎవరి స్థాయి ఏంటో !

అరవై వేల కోట్ల ప్యాకేజీ ఇస్తారు బీహార్ కి ని ముందే చెప్పారు. ఆ తర్వాత ఏపీకి కూడా సాయం ప్రకటించే అవకాశం ఉందన్నారు. కేంద్రం లీకులిచ్చింది కూల్ చేసేందుకు. తీరా చూస్తే ఇంత భారీ ప్యాకేజీ అక్కడ. మనమేమే లగేజీ అయిపోయినట్టు… సాయం కుదరదన్న మాటలు వినిపిస్తున్నాయ్. మరి కూల్ చేశారా… ఏపీని నిలువునా కూల్చేశారా అనేది ఇప్పటికిప్పుడు తేలాల్సిన విషయం. తేల్చుకోవాల్సిన విషయం. బిడ్డని బతికించి తల్లిని చంపేశారన్న మోడీ డైలాగులో నిజముంటే… మోడీ చేసుకుంటున్న అభివృద్ధి ప్రచారం నిజమైతే… మోడీ రాజకీయాలకి అతీతంగా ఆదుకునేవాడే అయితే ఇప్పుడు ఏపీ సంగతి తేల్చి తీరాలి. లేదంటే మనమే తేల్చాలి మోడీ సంగతి ! ఇది కచ్చితం.

– అభి

Comments

comments

Article Categories:
Anything Everything
Menu Title