మోడి-బాబుకి చెడిందా ?

Written by

బావకళ్లల్లో ఆనందం చూడాలని ఎవరెవరో ఏదేదో చేసినట్టు… బాబు కళ్లల్లో అభ్యర్థన చూడాలని మోడి కోరుకుంటున్నారా ! అందుకేనా ఏపీకిసాయం సంగతి ఎటూ తేలడం లేదు ! అనుమానమో… అవమానమో కాదు. అత్యవసరం. అయినా రోజులు గడిస్తేనే బెటర్ అని కేంద్రం గట్టిగా అనుకుంటోంది. దాని వెనక చిన్న లాజిక్ కనిపిస్తోంది. ఇస్తాం ఇస్తాం అంటూనే ఎప్పుడిస్తారో… ఏమిస్తారో చెప్పకపోవడానికి ఇదేఅసలు కారణం.

బ్రదర్… ఢిల్లీలో వెదర్ మారింది… !

కేంద్రం సాయం చేసే మూడ్ లో లేదు. చంద్రబాబుకీ మోడీకి చెడింది. అందుకే పట్టించుకోవడం లేదు. బాబు కూడా కేంద్రంపై ఒత్తిడి తెచ్చే పరిస్థితి లేదంటూ పిట్టకథలు పుట్టుకొస్తున్నాయ్. మూణ్నెల్ల కిందటి సంగతేమోగానీ ఇపుడున్న పిక్చర్ వేరు. బీజేపీకి వ్యతిరేకంగా బీహార్, బెంగాల్ ఎన్నికల కోసం పార్టీలన్నీ ఏకమవుతున్నాయ్. లాలూ, నితీశ్ కలిసినట్టు… బెంగాల్లో ఆఖరికి వామపక్షం, మమత ఓ అవగాహనకి వచ్చినా ఆశ్చర్యం లేదన్నట్టుంది పరిస్థితి. మమతా బెనర్జీ పార్లమెంటులో కలియతిరుగుతూ ఆఖరికి కేజ్రీవాల్ తో కూడా సమావేశం అయ్యాక బీజేపీకి అర్థమైంది వాస్తవం. మోడీ చెన్నై వెళ్లి. జయఆతిధ్యం స్వీకరించడం వెనక లాజిక్ ఇదే. జాతీయ స్థాయిలో ఇన్ ఫ్లూయెన్స్ ఉన్న నాయకులతో సున్నం వద్దనేది ఇపుడు బీజేపీ వ్యూహం. ఉత్తరాది సీట్ల కోతపడి వచ్చే ఎన్నికల్లో మోదీ 200 సీట్ల దరిదాపుల్లో ఆగిపోతే కాంగ్రెస్ కూడకట్టే పక్షాలే ఎక్కువుంటాయ్ బీజేపీకన్నా ! అలాంటప్పుడు చంద్రబాబు అవసరం కాదు ఐసీయూ అవుతారు బీజేపీకి. నవీన్ పట్నాయక్, నితీశ్, జయ లాంటివాళ్లని ఏకం చేసే శక్తిఉన్న నాయకుణ్ని ప్యాకేజీల కోసం లగేజీల కోసం వదులుకునే అవకాశం ఎక్కడుంది ? ఏపీలో అడ్డంగా ఎదిగేందుకు అమిత్ షా మొదలెట్టిన ఆపరేషన్ కి మోడీ బ్రేకులు వేయించడానికి కారణం ఇదే !

ఆలస్యం అయినకొద్దీ బాబులో అసహనం పెరుగుతుంది. అప్పుడు ఓ పావలా తక్కువకే ఒప్పించే అవకాశం ఉంటుందని మోడీ అదును కోసం ఎదురుచూస్తున్నది వాస్తవం. ఇప్పుడు కాకపోతే మరో వారం పదిరోజులకైనా తెలిసేది ఇదే ! ఇలాంటప్పుడు తెగదెంపులో… చావుడప్పులో కాదు మోగాల్సింది. ఆలోచన కావాలి. బీజేపీలో హయాంలో విడదీసిన జార్ఖండ్, ఛత్తీస్ గఢ్, ఉత్తరా ఖండ్లని కాంగ్రెస్ ఏ మాత్రం ఉద్ధరించింది ? ఏదో ఓ పక్షాన్ని సపోర్ట్ చేయడానికి చెబుతున్న మాట కాదు ఇదంతా. వాస్తవ రాజకీయం. అందులోనూ ఢిల్లీ మనస్తత్వం ఇలా ఉంటుంది అని విడమరచి వివరించడానికే ! అయినా… దగుల్బాజీ పార్టీ అడ్డంగా విడకొట్టి చేతులు దులుపుకొంది. ఏపీ మీద అంత ప్రేమ, నిబద్ధతఉంటే ప్యాకేజీని విభజన చట్టంలోనే పెట్టేది. మనమే అధికారంలోకి వస్తామని ఇక్కడ మరో పార్టీ పిల్ల గంతులేసింది. ఇపుడు రెండూ ఏకమై తప్పుదోవ పట్చించేందుకు పడ్తున్న తంటాలివి. జానేదో.

ఎన్నికల సమయంలో ఆదుకుంటామని చెప్పారు కాబట్టి అడుగుతాం బీజేపీని. ఇప్పుడు ఎలాగూ చేతిలో అధికారం ఉంది. వచ్చే ఐదేళ్ల కోసం ఇప్పటి నుంచి ఇటుకలు పేర్చుకునే పనిలో ఉంది మోడీ అండ్ కో. ఇలాంటి సమయంలోనే ఈ ఐదేళ్లలో మనకి ఏం కావాలో తెచ్చుకోవాలి. ముందు ముందు బంధం బలపడడమే కానీ బలహీనం అయ్యే అవకాశంలేనే లేనప్పుడు అదును చూసి… పదును చూపించుకోవాలి. ఇది వాస్తవం. అయినా ఆర్థిక విషయాల్లో కేంద్ర రాష్ట్రాల సంబంధాలు ఎలాస్టిక్ లా ఉంటాయ్. అవసరమైనప్పుడు సాగదీయాలి. అనువుగా వాడుకోవాలి. మంట తెలియాలనుకున్నప్పుడు లాగి వదలాలి. అప్పుడే చుర్రంటుంది. అంటే… ఒత్తిడి పెంచాలి. అంతేగానీ తెగే వరకూ లాగకూడదు. ఎలాస్టిక్ తెగితే… ఎటూ కాకుండా పోతుంది.

– అభి

Comments

comments

Article Categories:
Anything Everything
Menu Title