మేరా భారత్ మహాన్

Written by

భారత దేశం గర్వించ దగ్గ పరిణామము మరొక్కసారి పునరావృతమైంది. యావత్ ప్రపంచాన్ని సంభ్రమాశ్చర్యాల్లో ముంచెత్తుతూ, భారత కీర్తి కిరీటంలో మరో కలికితురాయి చేరింది. అంతరిక్ష యాత్రలలో వేరొక దేశపు వేదిక ఉపయోగించడం అనే స్థాయి నుంచి, మన సొంత వేదికను సాధించి, ఈరోజు ఇతరదేశాలకు సహాయం చేసే స్థాయిలో మన సాంకేతిక సామర్థ్యము వుండడం ఎంతో గర్వ కారణం. మన శాస్త్రవేత్తలు మన దేశానికి మరియు ఇతరదేశాల వాణిజ్య ప్రయోజనాల కు ఉపయోగపడే విధంగా , ఉప గ్రహాలను సొంత సాంకేతిక నిపుణతతో తయారు చేయడమే కాక వాటిని మనదేశం నుండి ప్రయోగించి మన భారత దేశ కీర్తిని ఇనుమడిమ్పచేసారు.

ఇతర దేశాలు అసూయపడేలా, భారత జాతి గర్వించే విధం గా 5 బ్రిటిష్ ఉపగ్రహాలు తో ఇస్రో రాకెట్ పిఎస్ఎల్వి-C28 (పోలార్ శాటిలైట్ లాంచ్ వెహికల్) ఇంకా భారతీయ అంతరిక్ష పరిశోధనా సంస్థ యొక్క (ఇస్రో) 30యవ అంతర్జాతీయ మిషన్, శ్రీహరికోట నుండి అంతరిక్షంలోకి ప్రయోగించబడింది. ఈ ప్రయోగము తో ఇ ప్పుడు భారతీయ అంతరిక్ష సంస్థ యొక్క భారీ వాణిజ్యము ప్రారంభము ఐనది. ఒక్క రోజులోనే 5 ఉపగ్రహాలనుపంపి 187 కోట్ల ఆదాయాన్ని సమకూర్చింది.

భారతీయ అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ ) , అంతరిక్ష పరిశోధనల కోసం భారత ప్రభుత్వం నెలకొల్పిన సంస్థ. ఇస్రో గా ప్రసిద్ధమైన ఈ సంస్థ దేశాభివృద్ధి లక్ష్యంగా అంతరిక్ష విజ్ఞానాన్ని అభివృద్ధి చేసేఉద్దేశ్యంతో ఏర్పాటై, ప్రస్తుతం ప్రపంచంలోని ప్రముఖ అంతరిక్ష సంస్థల్లో ఒకటిగా ఖ్యాతి గాంచింది. బెంగుళూరు కేంద్రంగా ఏర్పాటైన ఇస్రో, దేశంలోని వివిధ ప్రదేశాల్లో పరిశోధన, అభివృద్ధి సౌకర్యాలు కలిగి ఉంది.

విక్రం సారాభాయ్, భారత అంతరిక్ష పరిశోధనా వ్యవస్థకు పితామహుడిగా సారాభాయ్. 1957లో రష్యామొట్టమొదటి శాటిలైట్ అయిన స్పుత్నిక్‌ను ప్రయోగించినపుడు శాటిలైట్ యొక్క ఆవశ్యకతను అప్పటి ప్రధాన మంత్రి అయిన నెహ్రూకు వివరించి, 1962లో భారత అణు శక్తి వ్యవస్థ పితామహుడయిన హోమీ భాభా పర్యవేక్షణలో ఇండియన్ నేషనల్ కమిటీ ఫర్ స్పేస్ రీసెర్చ్ ను ఏర్పరిచారు. నాసాతో చర్చలు జరిపిన అనంతరం, కేవలం శాటిలైట్లను తయారు చేయడమే కాకుండా వాటిని ప్రయోగించే సౌకర్యాన్ని కూడా కలిగివుండాలి అని గుర్తించిన సారాభాయ్, ఇస్రోతో కలసి ఉపగ్రహాలను ప్రయోగించే వేదిక అయిన లాంచింగ్ ప్యాడ్ రూపకల్పన మొదలు పెట్టారు. దాని పేరే శాటిలైట్ లాంచ్ వెహికల్ . మరొక వైపు ఇస్రో పూర్తిస్థాయి ఉపగ్రహాన్ని తయారు చేయగా, దానికి భారత గణిత మరియు ఖగోళ శాస్త్రవేత్త అయిన ఆర్యభట్ట పేరు పెట్టబడింది. భారతదేశపుమొట్టమొదటి ఉపగ్రహమయిన ఆర్యభట్టను ఏప్రిల్ 19, 1975న అప్పటి సోవియట్ యూనియన్ నుండి విజయవంతంగా ప్రయోగించారు.

మన ప్రయోగశాలలు

తుంబా:
కేరళలో తిరువనంతపురం సమీపాన భూ అయస్కాంత రేఖకు దగ్గరలో ఉన్న తుంబాలో 1962లో మొదటి రాకెట్ ప్రయోగ కేంద్రాన్ని నిర్మించారు. అప్పటి శాస్త్రవేత్తలలో అబ్దుల్ కలాం ఒకరు. మొదట కేవలం రాకెట్ల ప్రయోగకేంద్రముగా ఉన్న తుంబా నెమ్మదిగా రాకెట్లకు అవసరమయిన ప్రొపెల్లర్లు, ఇంజన్లు తయారు చేసి అమర్చగలిగి పూర్తిస్థాయి రాకెట్ నిర్మాణ కేంద్రంగా తయారయింది.

శ్రీహరి కోట:

భారతదేశంలో ఉపగ్రహాల ప్రయోగానికి అత్యంత అనువయిన ప్రదేశమయిన శ్రీహరికోట నెల్లూరు జిల్లాలో సూళ్ళూరుపేట దగ్గర ఉన్నది. ఈ అంతరిక్ష కేంద్రం పేరు సతీష్ ధావన్ స్పేస్ సెంటర్, దీనినే షార్ అని కూడా పిలుస్తారు. ఇది భారతదేశంలోని ఏకైక ఉపగ్రహ ప్రయోగ కేంద్రం. ఇక్కడనుండి ఎన్నో PSLV మరియు GSLV ఉపగ్రహాలను విజయవంతంగా ప్రయోగించారు. ప్రస్తుతం ఇక్కడ రెండు లాంచ్ ప్యాడ్‌లు ఉన్నాయి. ఈ రెండిటివల్ల ప్రతి ఏడాది 6 శాటిలైట్లను ప్రయోగించే వీలు ఉన్నది.

బలేశ్వర్:
ఇది ఒరిస్సాలో ఉన్నది. దీనిని ప్రధానంగా రాకెట్లను ప్రయోగించుటకు ఉపయోగిస్తారు.

తణుకు:
ఆంధ్రప్రదేశ్, పశ్చిమ గోదావరి జిల్లా తణుకు పట్టణము ,UDMH-MMH(monomethylhydrazine) అనే రసాయనము మెండుగా ఉన్నమన దేశంలో కొన్ని ప్రదేశాలలో ఒకటి. చాలా సాధారణంగా (OMS) NASA యొక్క స్పేస్ షటిల్ ఇంజిన్లు ఉపయోగించే ఒక ముఖ్యమైన ద్రవ రాకెట్ ఇంధనం, ఇక్కడే తయారు అవుతుంది.

ఇలాంటి ప్రయోగశాలలు మన దేశానికే గర్వకారణం. నిప్పులు చిమ్ముతూ నింగి లోకి ఎగసే ఉపగ్రహాలతో మన భారత కీర్తి పతాకాన్ని అంతరిక్షం లో ఎగురవేస్తున్నారు మన శాస్త్రవేత్తలు.

జైయహో..

-మీనూశ్రీరామ్

Comments

comments

Article Categories:
Anything Everything

Comments

Menu Title