మాయదారి సినిమావోళ్లు గోదారిని ముంచారండి…

Written by

ఈ సినిమావోళ్లు మా సెడ్డ గడుసోళ్లండి. అవసరముంటే అవకాడున్నా ఎతుక్కుంటా ఎదురొత్తారు. పనైపోయాక పట్నమెళ్లిపోయినట్టే ఆలోచన కూడా అంతటితో ఆపేత్తారు. గోదారి..సంగతే సూడండి. సరాసరి 1800 సినిమాలు గోదారి గట్టుమీద.. పంటి మీదో.. ఒంటి మీదో తీశారండి. ఇదో రికార్డు. పెపంచంలో ఏ నది కూడాని ఇంత గొప్ప షూటింగ్ స్పాట్ కాలేదండి. అంత పిచ్చి తల్లి గోదారి. అప్పుడెప్పుడో క్రిష్ణ గోరు బెరుగ్గా కనిపిత్తారే ఆ సాచ్చితో మొదలుపెట్టి నిన్నమొన్నటి ఉయ్యాలజంపాల దాకా ఒకటా రెండా. వేలండి వేలు. నీళ్లుంటే పాటలు తీత్తారండి. పసిరకుంటేసీన్లు కూడా పండించేత్తారండి. ఇసక మేటలెస్తే ఫైటింగులు, అరిటి గెలల కటింగులు మీకు తెలీదా అయన్నీని. ఆయ్… ఈ లెక్కంతా ఇప్పుడేంటి… ఏం పంచాయతీ పెట్టారా ఏంటి ? అని అగుడుతారా… ఏం లేదండి గుండెల్లో ఎక్కడో కూసింత కలుక్కుమన్నాదండి.

అనదాండి మరి. ఇన్ని సినిమాలు తీశారు గందా… ఇన్ని డబ్బులు చేసుకున్నారు గందా.. ఒక్కళ్లంటే ఒక్కళ్లన్నా వచ్చారండీ. తానాలాడేందుకు కాదండి. ఆ మాటకొస్తే వచ్చార్లెండి రాఘవేందరావు ఆరూఈరూ వచ్చారు. బోయపాటైతే ఇక్కడే ఉన్నోడు చాలా రోజులు. అందుక్కాదండీ. గోదారి పండగ కదా…మనం కూడా కూతంత సంబరం సేద్దారి… మనింట్లో ఇషయం కదా అనుకున్నారా ఎవరైనా ? నాకైతే కనిపించలేదండి. ఎందరో పొడ్డూసర్లు బతికారండి… హీరోలు వెలిగారండి… డైరెటర్లైతే అయితే డైరెక్టుగా స్టార్లు అయిపోయారండి గోదారి ఫ్రేమింగుతోనే. కానీ ఇటేపు చూణ్ను కూడూ సూళ్లేదు. ఇదంతా ఏదో గవర్నమెంటోళ్ల పననుకున్నట్టున్నారు. జనం ఆళ్ల తిప్పలు ఆళ్లు పడతార్లే అనుకున్నట్టున్నారు . ఓ వాటర్ పేకెట్ ఇద్దారనో గుప్పెడు పులిహోర పెడదారనో… ఏ చిన్న ఫిల్ము ఎజ్జిబిషనోటి పెట్టి గోదారి గొప్పంతా సూపిద్దారనో… ఏ కోశానా లేదండీ ఈళ్లకి. ఈళ్లు తల్చుకుంటే ఇదో పనా సెప్పండి. మన పండగ అన్నారు. రాష్ట్రం కొత్తగా ముక్కలయ్యాక ఏడాదిలోనే వచ్చిందాయే పుష్కరం. ఏదో కళనో సాహిత్తమనో సూపించొచ్చు గందా. గోదారి గట్టున యాసతో గోసెట్టిన రావు రాలేడు. ఈవీవీ దూరమెళ్లిపోయాడు. చెప్పుకుంటే చానా మంది కరుసైపోయారు. బాదొచ్చేత్తది. ఉన్నోళ్లొన్నా చేయొచ్చు కదా ఆ పని. ఎందుకు చేద్దారండి… ఈళ్లు మనక్కాదు కదా… ప్రతి బొట్టునీ డబ్బుల్తో కొలుత్తారండి సినిమావోళ్లు. అయినా ఏమాటకామాట. పాపం బాపూగోరే నయమండి. మన మధ్యలో లేకపోయినా విగ్రహంలా వచ్చి నించొన్నారు రవణ గారితో కలిసి. ఎంతైనా బంధానికి విలువిచ్చే మనుషులు కదా ఆళ్లు.

రాకపోతే రాకపోయార్లెండి ఈళ్లసంగతి మనకి తెలుసుకదా. నిన్నెప్పుడో కొత్తగా ఎన్నికయ్యాక సురేస్ బాబు గారు సెప్పారు చూశారా. ఏపీలో పిలిం డెవలప్మెంట్ అధారిలేదని. పన్నుల్లో కూడా ఒరగబెట్టిందేమీ లేదని. అక్కడికి ఇక్కడికీ తేడా ఏం లేదంటన్నారండి ఆయనగోరు. సర్లెండి డబ్బులు కూడా అక్కడే పిండుకోమనండి. మన గోదారి జిల్లాలు కిష్ణగుంటూరోల్లు కోట్లకి కోట్లు పోత్తారండి ఆళ్ల కోసం. ఆళ్లేమో ఇలా మాట్లాడేత్తారు. సూటింగుకి గోదారి… సూసేందుకు మనమూ కావాలి గానీ వచ్చెందుకు, నాలుగు మంచిముక్కలు చెప్పేందుకు మాత్రం పనికిరావాండీ ? ఇలాంటప్పుడే… మనసు కొట్టుకుపోయినట్టు ఉంటాది. మూగమనసుల్లో సావిత్రి ఏఎన్నార్ తెప్ప కొట్టుకుపోద్ది చూశారా అలాగనమాట. వాకిట్లో ఓ మాట వంటింట్లో ఓ మాట మాకు రావండి. అందుకే ఉన్నదున్నట్టు అలా సెప్పానండి. సర్లెండి. వత్తానండి. మళ్లీ కులుద్దాం. ఈకొలి బాక్టిరియా అంటన్నారండి. అయన్నీ వదించుకోవాలి. బాయ్ యండి…

Comments

comments

Article Categories:
Anything Everything

Comments

Menu Title