మకాం అక్కడ… దుకాణం ఇక్కడా ? ఎన్నాళ్లు ?

Written by

మేరే పాస్ బంగ్లా హై… బ్యాంక్ బ్యాలెన్స్ హై… …. సబ్ కుచ్ హై ! క్యా హై తుహ్మారే పాస్ ? మేరే పాస్ మా హై ? శశికపూర్ – అమితాబ్ డైలాగ్ పేలిపోయింది. నలభై ఏళ్లయినా నలిగిపోని డైలాగ్. విభజనయ్యాక… పక్క రాష్ట్రం ఏపీని ఇలాగే వెక్కరించింది. మాకు రాజధానుంది…అసెంబ్లీ ఉంది సెక్రటేరియట్ ఉంది. నీకే ముంది అని అడిగింది. అప్పుడు ఏపీ చెప్పింది…మేరే పాస్ చంద్రబాబు హై అని ! కానీ ఏం లాభం ? ఒరిగింది ఏముంది ఏడాదిలో ?

చంద్రబాబుకి 13 జిల్లాలున్నాయ్… ఆడా సమస్యలున్నయ్…నీ ప్రతాపమేందో అక్కడ సూపించుకో… మా కాడ నడవదీ. పక్క రాష్ట్రం సీఎం పదే పదే నొక్కి చెబుతున్న మాట. మళ్లీ రిపీట్ అయ్యింది లేటెస్ట్ గా ! మనకేం ఖర్మ ? అక్కడ పడి ఏడవడం ఎందుకు ? హైద్రాబాద్ ని వదిలి బతక లేమా ? ఏపీకి ఏం లేక ? ఎందుకు అక్కడే వేలాడ్డం ? అర్థంకాదు. మూడ్రోజులు ఇక బెజవాడలోనేనన్న మాట వారానికోసారైనా వస్తుంది. మరి చంద్రబాబు సరంజామా ఏపీకి ఎప్పటికొస్తుంది ? ఇది ఐదు కోట్ల ఆంధ్రుల్ని తొలుస్తున్న మిలియన్ డాలర్ల ప్రశ్న.

పునాదుల నుంచి కొత్తగా కట్టుకోవాల్సిన రాష్ట్రం. విభజనతో చచ్చిబతికిన రాష్ట్రం. రేసుగుర్రం లాంటిప్రాంతం..కుంటి గుర్రంలా మూలనపడింది.
మాలీష్ చేసి… మళ్లీ పరిగెత్తించాల్సిన జాకీ… పక్క రాష్ట్రంలో బాకీలు తీరుస్తానంటున్నాడు. చంద్రబాబు తీరుఇలాగే ఉందిప్పుడు. జపానెళ్లి పెట్టుబడి వేట సాగిస్తేనో… కేంద్రంతో చర్చలు సాగిస్తేనో రాతలు మారిపోవు. అంతకన్నా ముందు మనం చేయాల్సిన పనులు చాలా పెండింగ్ ఉన్నాయ్. ఏడాది దాటిపోయాక వాటిని పెండింగ్ అనరేమో ! ఫెయిల్యూర్స్ అనాలి.

విదేశాలకి ఆహ్వానం… మనం మాత్రం ఆబ్సెంట్ :

దేశవిదేశాలు తిరుగుతూ… పెట్టుబడులు పెట్టేందుకు అమరావతికి రండి… అద్భుతాలు చేద్దాం…అసౌకర్యం అనే మాట మా డిక్షనరీలోనే లేదంటూ పబ్లిసిటీ ఇస్తాం. వాళ్లు ఏపీకి రావాలి. మీరు మాత్రం హైద్రాబాద్ వదలి అడుగు బైటపెట్టరా ? ఓ దశలో అయితే 38 రోజుల పాటు ఏపీ మొహం కూడా మీరు చూడని రోజులున్నాయ్ లెక్కపెట్టుకోండి. దావోస్ తిరిగొచ్చిన నెలలో ! ముఖ్యమంత్రిగా మీరే మీ రాష్ట్రంవైపు తిరిగి చూడనప్పుడు ఎవడో చూస్తాడని ఎలాఆశిస్తారు? హైద్రాబాద్ వదిలి రండిరండి అనేది అక్కడ మీకున్న సౌకర్యాలు దూరం చేయాలని కాదు. మీరొస్తే మంత్రులూ వస్తారు. వాళ్లొస్తే అధికారులు కూడా రాక తప్పని పరిస్థితి వస్తుంది. పాలన జనం దగ్గరకొస్తుంది. ఏదైనా అవసరం పడితే సెక్రటేరియట్ లో ఏపీ వింగ్ ఏమూలుందో హైద్రాబాద్ లో వెదుక్కోవడం వేరు. బెజవాడ వచ్చి దిలాసాగా పనిచేయించుకోవడం వేరు. నిజానికి కొండంత భరోసా, కిక్ వస్తాయ్ పాలన బెజవాడొస్తే ! వారంలో మూడు రోజులు ఇంకా బెజవాడలోనే అని మీరు పదే పదే చెప్తారు. ఆ మర్నాడో మరునిమిషమో మరో మంత్రి… పదేళ్లుకాదు అవసరమైతే అంతకన్నా ఎక్కువ కాలమే హైద్రాబాద్ లో ఉంటాంఅంటాడు. అది నిర్లక్ష్యమో..కనీస ఇంకితం లేకపోవడమో
అర్థంకాదు.

అసలిప్పుడు… పాలన నడుస్తోందో లేదో తెలియదు. మంత్రులు ఎక్కడుంటారో ఏం చేస్తున్నారో అర్థంకాదు. డబ్బుల్లేవని పనులు ఆగిపోతాయ్. నోటిఫికేషన్లు ఎప్పుడొస్తాయో తెలీదు. అసలు ప్రభుత్వం ఉందన్న భరోసా ఎప్పటికి కలగాలో ఆలోచిస్తే దరీ అంతూ దొరకదు. రాజకీయ ప్రత్యర్థి లేడనో.. లేదంటే ఇంకా సమయం చాలా ఉందనో బండిని బండకేసి కట్టేసినట్టు కనిపిస్తున్నారు. ఇలాగైతే ఏపీకి ఏం చేయాలి ? ఎవరికి మొర పెట్టుకోవాలి ? వంకరగా చూస్తే కాదు ఓ రకంగా చూస్తే ఇదంతా వైఫల్యమే !

మకాం అక్కడ… దుకాణం ఇక్కడా ? ఎన్నాళ్లు ?

హైద్రాబాద్ వదిలొచ్చే ఉద్దేశమే ఉంటే… కొత్తగా ఇల్లెందుకు అక్కడే కడుతున్నారు ? అద్దె ఇల్లంటూ హడావుడి చేస్తున్నారంటే ఏపీ ఎలా అర్థం చేసుకోవాలి ? ఓ పక్కన అదిగో అమరావతికి శంకుస్థాపన… మూడేళ్లలో తొలి దశ పూర్తి చేసి చూపిస్తాం అంటారు…ఇంకోపక్కన మీరు అక్కడే ఇల్లు కట్టుకుంటారు… అంటే అమరావతి ఇప్పట్లో పూర్తికాదని మీరనుకుంటున్నారా ? సౌకర్యాల్లేని చోటకి వెళ్లి ఏముంటామని మీ ఫీలింగా ? మీరే అలా అనుకుంటే ఇక ఉద్యోగులు, జనం ఎప్పుడు వాపస్ వస్తారు అమరావతికి, ఏపీకి ! జగన్మోహన్ రెడ్డిలా వందల గదుల ప్యాలెస్ లు కట్టుకుంటేనో… వందల కోట్ల ఆస్తులు అక్కడే ఉంటేనో అనుకోవచ్చు… ఉన్నారందుకే అక్కడ అని ! ప్రభుత్వాధినేత అయ్యుండి కూడా ఇలా చప్పగా సాగదీస్తుంటే ఏపీకి ఎప్పటికొచ్చేను కాన్ఫిడెన్స్ ?

ఈ ప్రశ్నలకి సమాధానం ఎవరు చెబుతారు ?

– మీరు హైద్రాబాద్ లో ఉండాలనుకోవడం వల్లే కదా తెలంగాణని నిలదీయలేకపోతున్నది… క్రిష్ణా డెల్టా నీళ్లైనా… కరెంటైనా ?
– మీరే రాకపోతే… సెక్రటేరియట్ సిబ్బంది ఎందుకొస్తారు ఏపీకి… ఉద్యోగుల్ని ఆదేశించలేకపోవడానికి హైద్రాబాద్ సిండ్రోమే కారణం కాదా ?
– హైద్రాబాద్ లో ఆంధ్రుల రక్షణ కోసం సెక్షన్ 8 ఉండాలన్నారు సరే… మీరేం చేశారు ఇప్పటి వరకూ ? కనీసం ఫీజు రీయింబర్స్ మెంట్, రుణ మాఫీ కూడా వాళ్లకి వర్తింపచేయలేదుగా ?
– మీరు హైద్రాబాద్ లో ఉండడం వల్ల కాదూ… వ్యాపార సంస్థలన్నీ అక్కడే ఉండిపోతున్నాయ్… పన్నులన్నీ తెలంగాణ ఖాతాలో పడుతున్నాయ్ ?
– కనీసం సెక్షన్ 10లో ఉన్న ప్రభుత్వ సంస్థలనైనా తరలించలేకపోయారు ఇప్పటి దాకా హైద్రాబాద్ మోజుతోనే కదా ?
– మనకి నూకల్లేవ్ హైద్రాబాద్ లో ! ఇవాళ కాకపోతే పదేళ్లకైనా మనం వదలాల్సిందే ! ఎందుకు కళ్లు తెరవడం లేదు ఇప్పటికైనా ?

ఇలా అడుగుతూ పోతే చాలా ఉన్న ప్రశ్నలు. ఇవి నిజానికి ప్రశ్నలు కాదు.. ఏపీకి సవాళ్లు. ఇలాంటి విషయంలో చేవ, చొరవ చూపించకపోతే ఏపీకి భరోసా ఎప్పుడొస్తుంది పైగా మాట్లాడితే హైద్రాబాద్ నేనే డెవలప్ చేశా అంటారు..ఆ మాట అన్నప్పుడు ఏపీకి కారం పూసినట్టు ఉంటోంది. అక్కడ హైద్రాబాద్ ని అభివృద్ధి చేశానంటే… ఏపీని చేయలేదనేగా ? ఇక్కడ సొమ్మంతా తీసుకెళ్లి… ఇటు రావాల్సిన వాటా కూడా మళ్లించి దోచి పెట్టారు అనేకదా అర్థం. దయచేసి ఇప్పటికైనా అర్థం చేసుకోండి… ఎక్కడ ఉంటున్నాం… ఏం మాట్లాడుతున్నామో ! చేసినందుకు మెప్పు సత్కారం లేకపోతే ఛీత్కారాలే అక్కడ బహుమానాలు. అయినా తట్టుకుంటూ… ఇంకో చెంప చూపిస్తా… అంటే ఈ పక్క అసహనం ఆలోపే కట్టలుతెంచుకుంటుంది. ఇప్పటికైనా గుర్తించండి.

అసలు చంద్రబాబు ప్రోబ్లమేంటి ?

స్ల్పిట్ మైండ్. అమరావతి రమ్మంటుంది. హైద్రాబాద్ వదలద్దంటుంది. చంద్రబాబుకి ఇదే సమస్య. మూడేళ్లు పూర్తయ్యేలోగా పునుల రూపురేఖలు కావాలి. ఏపీ జనం వెనక్కి రావాలి. కంపెనీలు వస్తున్నాయని… భవిష్యత్ కి దారులు పడుతున్నాయని భరోసా కలగాలి. లేదంటే పన్నెండేళ్ల తర్వాత రాజధాని తొలి ఫేజ్ పూర్తిచేసుకున్న రాయ్ పూర్ లా మారిపోతుంది ఏపీ తలరాత. స్పిరిట్ ఉండి… ఆలోచనుండి… అవకాశాలుండి కేవలం మన మానసిక బలహీనలతతో రాష్ట్రానికి స్పీడ్ బ్రేకర్లు వేస్తామా ? తెలంగాణ కావాలనుకుంటే… రాజకీయంగా అక్కడా ఎదగాలనుకుంటే… ఎన్నికల ముందో మరో రకంగానో ప్రయత్నం చేసుకోవాలని గానీ… ఏపీ ప్రయోజనాల్ని పణంగా పెట్టి కాదు.

కొత్తగా మిగిలిపోయిన పాత రాష్ట్రం. రాజధాని లేదు. రాబడి లేదు. అని సరిపెట్టుకుంటాం. ఏదో ప్రయత్నం చేస్తున్నారు కదా ఎందుకులే అని కొంత వరకూ ఊరుకుంటాం ! ఏడాది గడిచినా చలనం లేకపోతే ఏం చేయాలి ? నిలదీయాలి. నీకు ఇందుకేనా అధికారం అప్పగించిందని మఖం మీద అడగాలి. అదే పనిచేస్తోంది కోస్తాలైఫ్. హైద్రాబాద్ మీద మక్కువ తీరకపోవచ్చు. తెలంగాణ మీద మమకారం ఉండొచ్చు. కానీ…అది ఏపీకి కొరివి కారం పూసినట్టు ఉండకూడదు. చంద్రబాబు ఆ విషయం ఎంత తొందరగా తెలుసుకుంటే అంత మంచిది. చంద్రబాబూ… మీకు రెండు కళ్లేమో ! కానీ… ఏపీకి నువ్వే రెండు కాళ్లూ ! అందుకే అడుగులు వేయడానికి అవస్థలు పడుతున్న రాష్ట్రాన్ని ఇంకాస్త కడుపులో పెట్టుకో ! జపాన్ వెళ్లి పెట్టుబడులు పోగేసుకొస్తానని చెబుతున్నాం సరే… అంతకంటే ముందు మనం పోగేయాల్సింది ఆత్మభిమానం, గుండె నిబ్బరం. టైటానిక్ లా మునిగిపోయిన ఏపీకి ఆదే టానిక్.

– అభి

Comments

comments

Article Categories:
Anything Everything

Comments

Menu Title